ఇవి చాలా Costly గురూ..


Sun,October 27, 2019 01:56 AM

కుక్క, పిల్లి, ఎలుక, పావురం, పిచ్చుక, గుర్రం, కుందేలు, పులి, సింహం.. ఆఖరికి కీటకాలు కూడా పెంపుడు జంతువులుగా మారిపోయాయి. ఏ ప్రాణినైనా పెంచుకునేందుకు మక్కువ చూపుతున్నారు జంతు ప్రేమికులు. తమ ఆసక్తి, ఆర్థిక స్తోమతను బట్టి ఆయా జంతువులను ప్రేమగా పెంచుకుంటూ సంరక్షిస్తున్నారు. కొందరికి అవే స్టేటస్ సింబల్‌గా మారిపోయాయి. అంతేనా.. పెంపుడు జంతువులపై ప్రేమతో యజమానులు తమ కోట్ల రూపాయల ఆస్తిని వాటి పేరుమీద రాసేస్తున్నారు కూడా. ఆ లిస్టులో ఖరీదైన
జంతువులు ఏమేం ఉన్నాయో తెలుసా?

-డప్పు రవి

గంథర్-IV ఆస్తి రూ.26వేల కోట్లు

జర్మన్ షెపర్డ్‌కి చెందిన ఈ గంథర్-4 శునకం జర్మనీలో 375 మిలియన్ డాలర్ల లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నది. ఈ కుక్క తండ్రి గంథర్-III నుంచి డబ్బును వారసత్వంగా పొందింది. దాని యజమాని పేరు కార్లోటా లీబెన్‌స్టెయిన్. 1991లో చనియిన కార్లోటా తన పెంపుడు జంతువు, దాని సంతానం ఖరీదైన జీవితం గడపాలని 106 మిలియన్లను గంథర్‌పేరున రాసింది. ఆ డబ్బుకు ధర్మకర్తలుగా ఉన్న వ్యక్తులు పెట్టుబడి పెట్టారు. వాటి విలువ దాదాపు 357 మిలియన్లు.. అంటే 26 వేల కోట్ల రూపాయలపైనే ఉంది.
HugeMoney

చౌపెట్టీ ఆస్తి రూ.14వేల కోట్లు

ఫ్యాషన్ ప్రపంచానికి ఐకాన్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ డిజైనర్ కార్ల్ లాగర్ ఫెల్డ్ (85) అందరికీ సుపరిచతమే. ఆయన ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు కూడా. అయితే ఆయన మరణం.. ఓ పిల్లికి వరంగా మారింది. ఆయన మరణానికి.. పిల్లి వరానికి లింకేంటని ఆశ్చర్యపోకండి. ఆయన ప్రేమతో పెంచుకున్న పిల్లే.. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనిక పెంపుడు జంతువుగా మారింది. కారణం.. ఆ పిల్లికి ఆయన సగం ఆస్తిని రాసివ్వడమే. అతను చనిపోయిన తర్వాత చౌపెట్టీ ఏకాకి కాకూడని, కేవలం దాని బాగోగుల కోసం తన మొత్తం ఆస్తి 28 వేల కోట్లలో సగభాగం రూ.14వేల కోట్లు చౌపెట్టీకి అందాయి. దీంతో ప్రపంచంలోనే అంత్యంత ధనికురాలైన పిల్లిగా చౌపెట్టీ నిలిచింది.
HugeMoney1

సోషల్ మీడియా స్టార్ జిఫ్‌పోమ్

ఈ కుక్కపిల్ల పేరు జిఫ్‌పోమ్ పొమేరియన్ జాతికి చెందిన కుక్కపిల్ల. దీని యజమాని ఎవ్వరో ఇప్పటికీ రహస్యమే. అయితే ఈ కుక్కపిల్ల పేరుతో పెట్టే ఒక్కో పోస్టుకు 20 లక్షల రూపాయలు వస్తున్నాయి. రోజుకు ఎన్ని పోస్టులు పెడతారో ఇక మీరే ఆలోచించుకోవాలి. ఈ వార్త తెలిసిన వారంతా లక్షణమైన కుక్క పిల్ల అంటూ తెగ పొగిడేస్తున్నారు. మరికొంతమందైతే.. కుక్క పిల్ల అంత సంపాదిస్తుందా! అని కుల్లుకుంటున్నారు కూడా. జిఫ్‌పోమ్‌కు ఇంతగా పేరు ప్రఖ్యాతులు, సంపాదన రావడానికి ముఖ్య కారణం సోషల్ మీడియా. అందం, అభినయం, చలాకీతనం చూసి లక్షలాది మంది అభిమానులయ్యారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో జిఫ్‌పోమ్‌కు 9.2 మిలియన్ మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు.
HugeMoney2

ఆ కోటు ఖరీదు రూ.36 వేలు

బాలీవుడ్ స్టార్ ప్రియాంకచోప్రా కుక్కపిల్ల పేరు డయానా చోప్రా. ఈ పెంపుడు జంతువుపై ప్రియాంకకు ఎంత ప్రేముందో ఒక్క ఫొటోలోనే చెప్పేసింది. ఈ కుక్కపిల్ల చలికోటు ఖరీదు రూ.36వేలు. ఇటీవల షూటింగ్ నిమిత్తం లాస్ ఏంజెల్స్ వెళ్లిన ప్రియాంక.. డయానాను కూడా వెంట తీసుకెళ్లింది. అక్కడ చలి ఎక్కువగా ఉండడంతో అంత ఖరీదుపెట్టి జాకెట్ కొనుగోలు చేసింది. ఆ జాకెట్ డయానాకు తొడిగి ఆ ఫొటోలు సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేసింది. తన పెంపుడు జంతువుపై ఆమె చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అయ్యారు.
HugeMoney3

ఆర్మాండో కింగ్ ఆఫ్ పిజియన్స్..

ఈ విలువైన పావురం పేరు అర్మాండో. వయస్సు ఐదేళ్లు. ఇది దాదాపు రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉంది. ఈ పావురం విలువ ఎంతో తెలుసా? మన కరెన్సీలో దాదాపు పది కోట్ల రూపాయలు. ఇంతకీ ఆ పావురానికి ఎందుకంత ధర పెట్టారంటే..? ఇది వేల పావురాలను సైతం వెనక్కి నెట్టి ఎన్నో పోటీల్లో విజేతగా నిలిచింది. దాని రెక్కల వేగం.. రాకెట్‌తో సమానం. వేల కిలోమీటర్లను సైతం అవలీలగా ఛేదించగలదు. ఈ పావురం చైనాలో కోటీశ్వరుడైన ఓ అజ్ఞాతవ్యక్తి దగ్గర పెరుగుతున్నది. రోజూ 12 గంటల పాటు పావురం పోషణకు సమయం కేటాయిస్తాడు. ఈ పావురం పావురాల పందేలల్లో గంటకు 177 కి.మీల వేగంతో దూసుకెళ్తుంది.
HugeMoney5

కలూ ఆస్తి రూ.5 వేల కోట్లు

కలూ ఒక చింపాంజీ. దీనిని 1985లో ఒలింపిక్ మాజీ స్విమ్మింగ్ స్టార్ ఫ్రాంక్ ఓ నీల్ భార్య ప్యాట్రిసియా కాపాడింది. చిన్నతనంలో చాలా ముద్దుగా అల్లరిచేసిది కలూ. 2000వ సంవత్సరంలో కలూపై బాగా ప్రేమ పెరిగింది. కేప్‌టౌన్‌లో ఓ ఎస్టేట్‌ను కలూ పేరుమీద రాసింది ప్యాట్రిసియా. దాని విలువ ఎంతో తెలుసా? 80 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో రూ.5వేల కోట్ల పైమాటే. ఇప్పటికీ ఫ్రాంక్ ఓ నీల్ సిగరెట్లు, బీరు అతనికి తెలియకుండా కల్లూ తాగుతుందని చెబుతుంది ప్యాట్రిసియా.
HugeMoney4

రూ.7 వేల కోట్ల గ్రాంపీ క్యాట్

అమెరికాకు చెందిన తబతా బుండెసేన్ అనే యువతి తన పెంపుడు పిల్లిని ఫొటో తీసి తన సోషల్ మీడియా ఖాతాల్లో అప్‌లోడ్ చేసింది. ఆ ఫొటో కొద్దిరోజుల్లో వైరల్ అవడం, హాలీవుడ్ సినిమా అవకాశం రావడం జరిగిపోయాయి. కొంచెం క్రోధస్వభావం కలిగిన ఈ పిల్లి గ్రాంపీ క్యాట్స్ వరస్ట్ క్రిస్టమస్ ఎవర్ అనే హాలీవుడ్ సినిమాలో నటించింది. దీని అసలు పేరు టార్దార్‌సాస్. గ్రాంపీగా ఎక్కువ పాపులర్ అవడంతో అదే పేరును కొనసాగిస్తున్న తబతా. ఇప్పుడీ గ్రాంపీ ఆస్తి రూ.7 వేల కోట్ల పైమాటే.
HugeMoney6

రూ.వంద కోట్లపైనే గిగూ ఆస్తి

చాలాకాలంగా పిల్లులు, కుక్కలే పెంపుడు జంతువులుగా ఉంటున్నాయి. ఈ జాబితాలో కోడి కూడా చేరింది. ఇంగ్లండ్‌కు చెందిన మైల్స్ బ్లాక్వెల్‌కు దంపతులకు గిగా అనే కోడిపెట్ట పెంపుడు జంతువు. వీరికి పిల్లలు లేకపోవడంతో గిగాను సొంతబిడ్డలా చూసుకున్నారు. కొన్నాళ్లకు బ్లాక్వెల్ భార్య చనిపోయింది. ఆ తర్వాత బ్లాక్వెల్ చనిపోతూ గిగా పేరున 15 మిలియన్ డాలర్ల ఆస్తిని రాశాడు. ఇప్పుడు గిగా బాగోగులు
ఓ చారిటీ చూసుకుంటుంది.
HugeMoney7

బార్ట్ ది బేర్-II ఆస్తి రూ.42 కోట్లు

ఇది చాలా ఫేమస్ ఎలుగుబంటు. ఎందుకంటే హాలీవుడ్‌లో ఈ ఎలుగుబంటికి చాలామంది అభిమానులున్నారు. గతంలో హాలీవుడ్ సినిమాల్లో అలరించిన బార్ట్ ది బేర్ చనిపోయిన రోజునే.. బార్ట్ ది బేర్-2 జన్మించింది. దీంతో దాని యజమానులు డగ్, లెన్నీ సీస్‌లు సినిమాల్లో నటించేలా తర్ఫీదునిచ్చారు. అలా బార్ట్ ది బేర్ 2.. డాక్టర్ డూలిటిల్ 2, ఇవాన్ ఆల్మైటీ, ఇంటు ది వైల్డ్, వి బాట్ ఎ జూ, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి చిత్రాల్లో నటించింది. దీంతో బార్ట్ ది బేర్2 ఆస్తి అమాంతం పెరిగింది.
HugeMoney8

ఫైస్టార్ హోటల్‌లో బర్త్‌డే పార్టీ!

చైనాకు చెందిన ప్రముఖ ధనవంతుల్లో వాంగ్ జియన్లిన్ ఒకరు. ఆయన కుమారుడు వాంగ్ సికాంగ్‌కు సముద్రాల్లో నివసించే ఓ సీల్ అంటే చాలా ఇష్టం. పేరు సీల్ లయన్. దాని బాగోగులు చూసుకోవడానికి ముగ్గురు సిబ్బందిని నియమించాడు. ఆ సీల్ మొదటి పుట్టినరోజును ప్రపంచమంతా తెలిసేలా చేయాలనుకున్నాడు వాంగ్‌సికాంగ్. చైనాలో అత్యంత ఖరీదైన ఓషన్ స్ప్రింగ్ అనే ఫైవ్ స్టార్ హోటల్ మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు. హోటల్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో సీల్ ఆడుకునేందుకు ఏర్పాట్లు చేయించాడు. ఈ సౌకర్యాలకు తోడు హాటల్‌లోని ఖరీదైన భోజనం ఆర్డర్ చేసి సీల్‌కు స్వయంగా తినిపించాడు. తన పుట్టిన రోజు ఏర్పాట్లను ఘనంగా చేసిన యజమానిపై ముద్దుల వర్షం కురిపిస్తూ.. ఆ రోజంతా సీల్ లయన్ పండగ చేసుకుంది.
HugeMoney9

616
Tags

More News

VIRAL NEWS