గ్లోబల్ వార్నింగ్


Sun,October 20, 2019 05:06 AM

INNER
పెరుగుతున్న భూతాపం పెనువిపత్తుకు కారణం అవుతున్నది. రోజురోజుకూ రెట్టింపవుతున్న ఉష్ణోగ్రతలు ప్రపంచాన్నే కలవర పెడుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భూమి మీద జీవుల మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ఇప్పటికే ఈ ఉష్ణోగ్రతల వల్ల భూమిమీద మంటల్లో ఉన్నట్టు అవుతున్నదని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఇట్లా గ్లోబల్ వార్మింగ్‌తో మనమంతా సామూహిక విధ్వంసం ముందున్నామని హెచ్చరిస్తున్నారు. ఇట్లాంటి హెచ్చరికలు ఏండ్లుగా వినిపిస్తున్నాయి. అయినా రోజులు గడిచే కొద్ది పరిస్థితి చేయి దాటిపోతుందనే సంకేతాలు స్పష్టం అవుతున్నాయి. పెరుగుతున్న భూతాపం ప్రపంచం ముందు సవాల్‌గా మారుతున్న నేపథ్యంలో, హెచ్చరిస్తున్న నివేదకలను గుర్తు చేస్తూ ఈ వారం కవర్ స్టోరీ.

ప్రపంచం ఇప్పుడు పెను సవాల్‌ను ఎదుర్కొంటున్నది. గ్లోబల్ వార్మింగ్ రోజురోజుకూ అధికమవుతున్నది. మానవుని విచక్షణా రహిత చర్యలు జీవుల మనుగడకే ఆటంకంగా మారుతున్నట్టు పర్యావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగి, భూమి వేడెక్కుతున్నది. మంచు పర్వతాలు కరుగుతున్నాయి. నదుల ప్రవాహం పెరుగుతున్నది. సముద్రాలు విషతుల్యం అవుతున్నాయి. సముద్రమట్టం పెరిగి నగరాలు ప్రమాదపు అంచున ఉన్నాయి. అడవులు తగ్గి, భూమి నాశనం అవుతున్నది. ఇప్పటికే 70శాతం భూభాగం మనిషి వల్ల ప్రభావితం అవుతున్నది. మేల్కోకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాలు ఎవరో చెబుతున్నవి కాదు. స్వయాన ఐక్యరాజ్యసమితికి చెంది ఐపీసీసీ (ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ ైక్లెమెట్ చేంజ్) చెపుతున్నది. ఈ ప్యానెల్ ఇచ్చిన రిపోర్టులు ఇలాంటి ఎన్నో ఆలోచించాల్సిన విషయాలను ప్రపంచం ముందుంచింది.
INNER1

పలు దేశాల్లో చర్యలు ఇలా..

మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఉద్గారాలను తగ్గించడం ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న కర్తవ్యం. 2050 నాటికి అధిక భూతాపాన్ని తగ్టించే శక్తి మానవాళికి ఉందనీ, తలుచుకుంటే సాధ్యం అవుతుందని ఐరాస అధ్యక్షుడు ఆంటోనియో గుటెరస్ స్పష్టం చేశారు. అంటే నీటిని సంరక్షించడం, చెట్లను నాటడం, శిలాజ ఇంధనాలను నిషేధించడం, ఆహార ఉత్పత్తులను మార్చడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, నేలలను మెరుగుపరచడం, వాతావరణం వేడెక్కడానికి దోహదపడే వాయు కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా ఈ విపత్తు నుంచి తప్పుకోవచ్చు. అనేక ఉత్తర యూరోపియన్ నగరాలు ఈ సవాల్‌ను స్వీకరించి, భూతాప నివారణకు కృషి చేస్తున్నాయి. డీజిల్, పెట్రోల్ తవ్వడం, కార్లు, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించే వైపు అడుగులు వేస్తున్నాయి. కార్బన్ జీరో అని లక్ష్యంగా పెట్టుకున్నాయి. సియోల్ నగరం 30 మీటర్లకో చెట్టును నాటి పచ్చదనాన్ని విస్తరిస్తున్నది. ఆస్ట్రేలియలోని మెల్‌బోర్న్‌తో పాటు అనేక నగరాలు ప్రతిష్ఠాత్మకంగా వీధిచెట్ల పెంపకం కార్యక్రమాల ద్వారా ప్రయోజనాలు పొందుతున్నాయి.
INNER2
-యూరోపియన్ దేశాల్లో అత్యంత పెద్ద నగరమైన డెన్మార్క్ 2030 కల్లా 70శాతం ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
-బ్రెజిల్‌లోని సావోపాలో నగరం తక్కువ నీటిని, విద్యుత్‌ను ఉపయోగించేందుకు కృషి చేస్తున్నది.
-టాంజానియాలోని డార్ ఎస్ సలాం నగరంలో వరద ప్రాంతాల్లో ఉండే ప్రజలకు పునరావాసం కల్పిస్తూ, ఇండ్లను నిర్మించే కార్యక్రమాలు చేపట్టింది. చిత్తడి నేలల్లో నిర్మాణాలను పూర్తిగా నిషేదించింది.
-లండన్‌లో జనాభాకు తగ్గట్టు భారీ వర్షాలను ఎదుర్కోవడానికి నీటి పారుదల వ్యవస్థను సరిచేస్తున్నారు.
-బంగ్లాదేశ్ వంటి పేద దేశాలు కూడా ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను మెరుగు పరుచుకున్నాయి.
పట్టణ పునరుద్ధరణను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాయి.

INNER3

ముప్పులో మన దేశం..

కర్బన ఉద్గారాలను వీలైనంత తగ్గించకపోతే కొన్ని దశాబ్దాల వ్యవధిలోనే వేడిగాలులు గంగ, సింధు నధుల బేసిన్లపై తీవ్ర ప్రభావం చూపుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దక్షిణ భాగంపై వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. రానున్న కాలంలో వేడిగాలుల ముప్పు ఎదుర్కొనే ప్రాంతాల్లో ఉత్తరభారతదేశం రెండో స్థానాన్ని ఆక్రమిస్తుందనీ, పర్షియన్ గల్ఫ్ రెండో స్థానంలో, తూర్పు చైనా మూడో స్థానంలో ఉంటుందని చెప్తున్నారు. 2100 నాటికి ఈ ప్రాంతంలోని 64 శాతం హిమనీ నదాలను మానవాళి కోల్పోయే మహా విషాదం కనుచూపుమేరలోనే ఉన్నట్లు ఐపీసీసీ ప్రత్యేక నివేదిక హెచ్చరించింది.
INNER5
గంగా, యమునా, బ్రహ్మపుత్ర వంటి పెద్ద నదులతోపాటు చిన్న నదులన్నీ ప్రవాహాలను పెంచుకుంటున్నాయి. సముద్ర మట్టానికి చేరువలో ఉన్న నగరాలను సముద్ర జలం ముంచేయనున్నది. దీంతో తరచూ వరదలు ముంచెత్తవచ్చు. ఇప్పటికే మాయమవుతున్న మంచు సహా పలు ప్రాంతాల్లో వ్యవసాయ దిగుబడులపై దుష్ప్రభావాన్ని చూపుతున్న విషయాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. పర్వతశ్రేణులు, అత్యంత ఎత్తయిన టిబెట్ పీఠభూమి ప్రపంచంలోనే అత్యధిక తాజా జలసంపదకు ఆలవాలంగా ఉన్నాయి. సింధూ, గంగా, బ్రహ్మపుత్ర నదీ పరీవాహకప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండవచ్చంది. ఇట్లా అత్యధిక భూతాపం నమోదైన సంవత్సరాల జాబితాలో కిందటి ఐదేండ్లు ఉన్నాయి. ఇది విస్మయానికి గురి చేస్తుంది. 2018లో ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 10 లక్షల మంది విపత్తుల బారినపడ్డారు. వీరిలో వరదల వల్ల ప్రభావితులైనవారు 3 కోట్ల 54 లక్షల మంది ఉన్నారు. వీరిలో 2 కోట్ల 30 లక్షల మంది గత ఏడాది కేరళలో సంభవించిన వరదల ప్రభావానికి గురైనవారే.

ఐపీసీసీ హెచ్చరిక

-2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 970 నగరాల్లో నివసిస్తున్న 1.6 బిలియన్ల మంది క్రమం తప్పకుండా అధిక ఉష్ణోగ్రతలకు గురవుతారు.
-సముద్ర నీటిమట్టాలు 40 సెం.మీ వరకు పెరుగుతాయి. 570 నగరాల్లో మరో 800 మిలియన్ల మంది సముద్రమట్టం పెరగడం వల్ల తీరప్రాంతాల్లో వరదలను ఎదుర్కొంటారు.
-వాతావరణ సంక్షోభం కారణంగా 1600 నగరాల్లో 2.5 బిలియన్ల ప్రజలు ఆహార సరఫరా, ఉత్పత్తి సమస్యలను ఎదుర్కొంటారు. అంటే నలుగురిలో ఒకరు దీన్ని అనుభవిస్తారు.
-2030 నాటికి 12 కోట్ల మంది పేదరికంలో ఉంటారు. భూతాపం వల్ల ఏటా 1 లక్షా 50వేల మరణాలు సంభవిస్తాయని అంచనా. 50లక్షల మంది అనారోగ్యం పాలవుతారని లెక్కకట్టారు.
-భూతాపం 2 డిగ్రీల సెల్సీయస్ అధికమైతే ఆస్ట్రేలియాలోని మియామి సౌత్ బీచ్ పరిస్థితి ఇది.

INNER6

మనమేం చేయగలం?

భవిష్యత్‌లో గ్లోబల్ వార్మింగ్ పర్యవసానాలు తీవ్రంగా మారొద్దంటే సుదీర్ఘకాలపు మార్పులు ఇప్పటి నుంచే చేయాలని ఐపీసీసీ చెప్తున్నది. మనం చాలా మామూలుగా చేసే పనుల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు, భూతాపాన్ని చాలావరకూ పరిమితం చేయవచ్చని శాస్త్రజ్ఞులు అంటున్నారు. రోజువారీ కార్యకలాపాల్లో తేవాల్సిన కొన్ని మార్పులను వారు సూచించారు.
-గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణం వాహనాలను విచ్చల విడిగా వాడడం. రోజూవారీ జీవితంలో వాహనాల వాడకాలను తగ్గించాలి. కార్ల వినియోగం తగ్గించాలి. ప్రజారవాణను మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే కర్బన ఉద్గారాల విడుదల తగ్గుతుంది.
-శిలాజ ఇంధనాలను, విద్యుత్‌ను ఆదా చేయాలి.
-కొన్ని విద్యుత్ అవసరాలకు సోలార్ సిస్టమ్‌ను ఉపయోగించవచ్చు.
-ఆహారాన్ని వృథా చేయొద్దు. భూమి వేడెక్కడంలో వృథా ఆహారం వాటా 8 నుంచి 10శాతం అని ఐపీసీసీ శాస్త్రజ్ఞులు అంటున్నారు.
-మాంసం వల్ల 14.5శాతం భూతాపం ప్రభావితం అవుతుందని చెప్తున్నారు.
INNER7
-అడవుల నరికివేత, రసాయనాల సాగు పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా 495 కోట్ల ఎకరాల భూమి విధ్వంసమైంది.
-పొలాల్లో చెట్లు నాటి చిన్నపాటి అడవులను పెంచితే నేలను సారవంతం చేయవచ్చు. దీన్నే ఆగ్రోఫారెస్ట్రీ అంటారు.
-వర్షపు నీటిని సేకరించాలి. సంరక్షించాలి.
-ఈ విపత్తులపై అందరూ కలిసి చర్చించుకోవాలి. షేర్డ్ నెట్‌వర్క్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలి.
-ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఇలాంటి చిన్న చిన్న నియంత్రణలు పాటిస్తే జీవుల సంక్షేమంపై మెరుగైన ప్రభావం చూపుతుంది. భూతాపం తగ్గించి రాబోవు తరాలకు సురక్షితమైన భవిష్యత్‌ను అందించడానికి సాయపడుతుంది.

INNER8

ఇలాగే కొనసాగితే..

ఉష్ణోగ్రతలు 1.5 నుంచి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు పెరిగితే సముద్రమట్టాలు 10 సెంటీమీటర్లు పెరిగి భూమి మీది చాలా ప్రాంతాలు నీట మునిగిపోతాయి. అదే ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కే పరిమితం చేయగలిగితే కనీసం కోటి మంది జనాభాను ముప్పు నుంచి బయటపడేయొచ్చు. ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ మేర భూతాపం పెరిగితేనే మనం ముప్పులో పడతాం. ధ్రువాల్లో మంచు కరిగే ప్రవాహ వేగం మరింత పెరుగుతుంది. ఇప్పుడు మనం భూమ్మీద వేసవిలో చూస్తున్న వేడిమి ఒక మోస్తరుది మాత్రమే. అప్పుడు పూర్తిగా మంటల్లో ఉన్నట్లుంటుంది అంటూ కైసా కోసోనెన్ అనే శాస్త్రవేత్త భవిష్యత్తును కళ్ల ముందుంచారు.

అధిక భూతాపం- ప్రమాదాలు

-భూతాపం తీవ్రమైతే కరువు, కార్చిచ్చు, వరదలు లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.
-వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమి వేడెక్కుతుంది. అది సాధారణ స్థాయిని దాటితే అధిక భూతాపం అవుతుంది.
-అలాంటప్పుడు సముద్రాలు వేడెక్కుతాయి. ధృవ ప్రాంతాల్లోని మంచు కరుగుతుంది. నీటి మట్టాలు పరుగాయి. దీంతో తీర ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుంది.
-అప్పుడు జలచరాలకు నష్టం కలుగుతుంది.
-వేడి అధికంగా అవడం వల్ల తేమ శాతం పెరిగి సముద్రాలమీద సంచరించే విమానాలకు ప్రమాదాలు జరగవచ్చు.
-గ్లోబల్ వార్మింగ్‌కు ఓషియన్ వార్మింగ్ కూడా తోడై వాతావరణంలో భారీ మార్పులు వచ్చి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయి.
-వేడి అధికమైతే సముద్రాల ఆకారంలో మార్పులు సంభవించి తుఫాన్లు, సునామీలు విరుచుకుపడే అవకాశం ఉంది.
-పర్యావరణ మార్పు కారణంగా ఆహార అభద్రత పెరిగిపోతుంది. ధరలు పెరిగిపోతాయి. ప్రజలు జీవనోపాధిని కోల్పోతారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వలసలు పెరుగుతాయి.
-భూతాపం 2 డిగ్రీలకు చేరితే భారత్‌లోని కోల్‌కతా, పాకిస్థాన్‌లోని కరాచీలో పెను వడగాల్పులు తప్పవు.
-1.5 డిగ్రీల సెల్సియస్ మేర భూతాపం వల్ల దక్షిణాసియాలో ముఖ్యంగా భారత్, పాకిస్థాన్‌తో పాటు చైనాకూ ముప్పులు పొంచి ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ సహారా ఎడారికి దిగువన ఉన్న ఆఫ్రికా దేశాలు, మధ్య, తూర్పు ఆసియాకు ఇవి విస్తరిస్తాయి.
-ఆఫ్రికా ఖండంలోని చాలా మేర, ఆగ్నేయాసియా, భారత్, బ్రెజిల్, మెక్సికోలో జీడీపీ తలసరి వృద్ధి రేటు తగ్గొచ్చు.
-సముద్రాలు తీర ప్రాంతాన్ని ముంచెత్తడం వల్ల ఏటా వందల కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లుతుంది.
-భారత్, చైనా, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేసియా, జపాన్, తదితర దేశాల్లో కనీసం 50 కోట్లమందిపై సముద్ర మట్టం పెరుగుదల ప్రభావం చూపుతుంది.
-భూతాపం 2 డిగ్రీలకు చేరితే మలేరియా, డెంగీ, గున్యా జికా వైరస్‌ల తాకిడి పెరుగుతుంది. మలేరియా తాకిడికి ఎక్కువ మంది గురవుతారు. వ్యాధి సీజన్, భౌగోళిక విస్తృతి నిడివి పెరుగుతాయి.
-సముద్రాల్లో పేరుకున్న ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల
తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల అవి కరిగి విషతుల్యం
అవుతాయి.
భూతాపం తీవ్రమైతే జొన్న, గోధుమ పంటలపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.

అధిక భూతాపం వల్ల భూమి మీదున్న దాదాపు 33 పెద్ద దేశాల్లో వివిధ జాతుల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. ఇప్పటికే రేడియేషన్‌తో అంతరిస్తున్న జాతులు అధికం అవుతున్నాయి. దీనికి తోడు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎన్నో జీవులు మనుగడను కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా అమెజాన్, మడగాస్కర్ ఇతర జీవ వైవిధ్య ప్రాంతాలలో 25 నుంచి 50 శాతం వరకు స్థానిక జీవజాతులు దశాబ్దాల కాలంగా కనుమరుగవుతున్నాయని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ విడుదల చేసిన తాజా నివేదిక పేర్కొంది. మనం చేయవలసింది చేయకపోతే రానున్న శతాబ్ద కాలంలో ప్రపంచ వ్యాప్తంగా జీవ వైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటుందని తెలిపింది. ఈ గ్రూపు తన విశ్లేషణను సైన్స్ జర్నల్ క్లైమాటిక్ చేంజ్ లో ప్రచురించింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న సగటు ఉష్ణోగ్రతలను సాధ్యమైనంత వరకు కనీస స్థాయికి తగ్గించేందుకు కృషి చేయాలని పేర్కొంది. అత్యంత ప్రాధాన్యం కలిగిన 33 ప్రదేశాలపై ఈ నివేదిక దృష్టి పెట్టింది.

INNER10

ఆగుతున్న ఊపిరి...

అమెజాన్ అడవిలో కార్చిచ్చు ప్రపంచాన్నే భయాందోళనకు గురి చేసింది. ప్రపంచ ఊపిరితిత్తులుగా పిలుచుకొనే ఈ మహారణ్యం తగులబడిపోతుండటం భూగోళానికే భారీ ముప్పుగా పరిణమించింది. ఈ అడవులు దాదాపు 135 కోట్ల ఎకరాల్లో, దాదాపు తొమ్మిది దేశాల పరిధిలో విస్తరించాయి. ఇందులో 60 శాతం బ్రెజిల్‌లోనే ఉన్నది. భూమిపై విడుదలవుతున్న ఆక్సిజన్‌లో 20 శాతం ఈ అడవి నుంచే వస్తున్నది. ఇప్పుడు ఆ ఊపిరితిత్తుల పరిస్థితి విషమంగా మారుతున్నది. కార్చిచ్చు కారణంగా ఇక్కడి నుంచి వెలువడుతున్న పొగ అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుండటం గమనార్హం. ఈ పొగ ఇప్పటికే దాదాపు 3500 కి.మీ. మేర ప్రయాణించిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అడవికి 3,200 కి.మీ. దూరంలో ఉన్న బ్రెజిల్‌లోని సావోపోలో నగరంపై నల్లని పొగ కమ్ముకున్నది. శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు మొదలు సామాన్య పౌరుల వరకు ప్రతి ఒక్కరూ అడవి తల్లి దుస్థితిని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. అమెజాన్‌తో భూగోళానికి కలుగుతున్న ప్రయోజనాలు, ఇప్పుడు చెలరేగిన కార్చిచ్చుతో పర్యావరణానికి జరుగనున్న నష్టం ఇప్పటికే ముంచుకొస్తున్న గ్లోబల్ వార్మింగ్ ముప్పు మరింత పెరుగడం వంటి ఎన్నో కారణాలు దీనిని ప్రపంచ సమస్యగా మార్చాయి. ఇప్పటికైనా మేలుకోకుంటే మానవాళి సరిదిద్దుకోలేని తప్పుగా ఇది మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

INNER12

ఏ స్థాయిలో పెరుగుతున్నదంటే..

1750లో మానవ ఆవాసాల ద్వారా ప్రతి చదరపు మీటర్‌కు 0.57 యూనిట్ల వేడి విడుదల కాగా, అది 1980 నాటికి 1.25 యూనిట్లకు పెరిగి 2011 నాటికి 2.29 యూనిట్లకు చేరుకుంది. కార్బన్ డై ఆక్సైడ్ ప్రతి చదరపు మీటర్‌కు 1.68 యూనిట్ల్లు, మిథేన్ వాయువులు 0.97 యూనిట్ల వేడిని పుట్టిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. స్థిరంగా ఉండే మీథేన్ వాయువులు 1750-2011 మధ్య కాలంలో 150 శాతం పెరిగితే అదే విధంగా కార్బన్ డై ఆక్సైడ్ 40 శాతం వేడి పెరగడానికి కారణమయ్యాయి. ఫలితంగా తెలుగు రాష్ర్టాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటుతున్నాయి. అందుకే రుతువులు గతి తప్పుతున్నాయి.

INNER11

ప్రమాదంలో చాక్లెట్

గ్లోబల్ వార్మింగ్ ప్రపంచ చాక్లెట్ ప్రియులనూ ఆందోళనలో పడేస్తున్నది. 2050 నాటికి కోకో ఉత్పత్తులు అన్నీ తగ్గిపోనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాక్లెట్ సంక్షోభం నెలకొనబోతున్నది. చాక్లెట్ కోకో నుంచి తయారవుతుంది. కోకో చెట్లు ఉష్ణమండల తడి వాతావరణంలో పెరుగుతాయి. దీనికి చిత్తడి అడవుల నీడ అవసరం అవుతుంది. అందుకే వీటిని పండించే ప్రాంతం పరిమితంగా ఉంటుంది. కోకోను ముఖ్యంగా పశ్చిమ ఆఫ్రికాలో ఉత్పత్తి చేస్తారు. దాని మొత్తం ఉత్పత్తిలో సగ భాగం ఐవరీ కోస్ట్, ఘనా నుంచే వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో కోకో వ్యవసాయ రంగం కుంచించుకుపోతున్నది. దీనికి అవసరమైన తేమ, నీడ ఏర్పాటు చేయడం రైతులకు కష్టమైపోతున్నది. కోకో పండించడానికి అనువైన వాతావరణం తగ్గుతున్నది. దీంతో కోకో పంట అంతకంతకూ తగ్గిపోతున్నది. ఒక అంచనా ప్రకారం కోకో మొక్కలకు వచ్చే వ్యాధుల వల్ల ప్రతి ఏటా 30 నుంచి 40 శాతం కోకో పంట నాశనం అవుతున్నది. దీనికి కారణం కొన్ని తెగుళ్లు అయితే ఇంకోటి వాతావరణ సమస్యలు కూడా అని ఐవరీ కోస్ట్ ప్రకటించింది. చాక్లెట్‌ను ఉత్పత్తి చేసే దేశాలు దానిని కాపాడడానికి చేతులు కలుపుతున్నాయి. అమెరికాలోని చాక్లెట్ తయారీదారు మార్స్ రిగ్లే కన్ఫెక్షనరీ, వేడిలో కూడా పెరిగే కోకో మొక్కలను అభివృద్ధి చేసేందుకు ఒక బిలియన్ డాలర్ల ఫండ్ ఏర్పాటు చేశారు. మాండేలేజ్ ఇంటర్నేషనల్ కూడా కోకోను కాపాడాలని ప్రయత్నిస్తున్నది. కోకో రైతులకు సాయం చేసేందుకు కోకో లైఫ్ క్యాంపెయిన్ ప్రారంభించింది.
-వినోద్ మామిడాల, సెల్: 07660066469

575
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles