చలో మైసూరు భలే హుషారు


Sun,September 29, 2019 02:16 AM

కన్నుల నిండుగా దసరా వైభవాన్ని చూడాలన్నా, మనసు నిండుగా ఆ ఆనందాన్ని నింపుకోవాలన్నా మైసూరు వెళ్లాల్సిందే. దసరా అంటేనే మైసూరు, మైసూరు అంటే నే దసరా అన్న స్థాయిలో అక్కడి దసరా పండుగకు గుర్తింపు వచ్చింది. అక్కడి దుర్గా నవరాత్రులు వివిధ కార్యక్రమాలు, ఏర్పాట్లతో దేశ విదేశీ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. మైసూరు దసరా మహోత్సవం భారత దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జరిగే దసరాలతో పోలిస్తే విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఉత్సవాలు అలనాటి రాచరిక వైభవాన్ని గుర్తుకు తెస్తాయి. ఒక వైపు సంప్రదాయాన్ని పాటిస్తూనే మరోవైపు అధునిక సంగీత, నాట్యాల మేళవింపుగా ఈ ఉత్సవాలు సాగుతాయి. ఈ ఉత్సవాలను తిలకించడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ప్రపంచంలోని నలువైపుల నుంచి కూడా పర్యాటకులు మైసూరుకు వస్తుంటారు.

-మధుకర్ వైద్యుల

నాలుగువందల ఏండ్ల క్రితం మైసూరు ప్రాంతంలోని శ్రీరంగ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని విజయనగర రాజులు పరిపాలించేవారు. శ్రీరంగపట్టణంలో తొలిసారి 1610లో దసరా వేడుకలు నిర్వహించినట్టు ఆధారాలు ఉన్నాయి. అనంతరం వారి సామ్రాజ్యం పతనమయ్యాక ఒడయార్ వంశస్థులు సింహాసనమెక్కారు. వారు శ్రీరంగపట్టణం నుంచి మైసూరుకు రాజధానిని మార్చి... ఏటా క్రమం తప్పకుండా దసరా వేడుకలను కోటలో నిర్వహించడం మొదలుపెట్టారు. ఆనాటినుండి నేటివరకు దసరా వేడుకల వైభవం ఏమాత్రం తగ్గకుండా ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు. బంగారు అంబారీలో చాముండీ దేవి విగ్రహం, బంగారు సింహాసనంపై కూర్చుని రాజా వారు నిర్వహించే సభ, గజరాజులపై జంబూ సవారీ, వివిధ కళారూపాల ప్రదర్శనలు, కోట విద్యుద్దీపాలంకరణ అన్నీ చూడాల్సిన ఘట్టాలే. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత మైసూర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేశారు. ఇప్పటికీ మైసూరు దసరా వేడుకలు రాజకుటుంబం వారి చేతుల మీదుగానే జరుగుతున్నాయి.
Mysore

అంబారీ ఏనుగునెక్కి..

దసరా నవరాత్రులలో మైసూరు కోటను లక్ష విద్యుత్ బల్బులతో అలంకరిస్తారు. మహారాజు సింహాసనం కూడా పెద్ద ఆకర్షణే. దానిని అంజూర చెట్ల కలపతో తయారుచేసి, ఏనుగు దంతాలు, బంగారం పూతతో రూపొందించారు. సింహాసనానికి బంగారు కోళ్లను ఏర్పాటు చేశారు. దసరా నవరాత్రులూ ఈ బంగారు సింహాసనాన్ని ప్రజలు తిలకించే అవకాశం ఉంటుంది. ఈ బంగారు సింహాసనంపై కూర్చుని మైసూరు మహారాజా దర్బారు నిర్వహిస్తారు. కోటలోని ప్రముఖులు, మంత్రుల సమక్షంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇవి చూడడానికి ప్రత్యేక టికెట్ కొని వెళ్లాల్సి ఉంటుంది. చాముండేశ్వరీ దేవిని ఊరేగించే అంబారీని 750 కిలోల బంగారంతో తయారు చేశారు. దానిపై వీధుల్లో అమ్మవారిని ఊరేగిస్తారు. అంబారీ ఎల్లప్పుడు రాజవంశస్థుల పర్యవేక్షణలోనే ఉంటుంది. నాగరహోళే అనే అటవీ ప్రాంతంలో ఉండే ఏనుగులను ప్రత్యేకంగా దసర ఉత్సవాల కోసం తీసుకొస్తారు. వాటి బాగోగులు చూసుకునేందుకు నాగరహోళెలోనే ఉద్యోగులు ఉంటారు. వీటిని మంగళవాయిద్యాలతో మైసూరు రప్పిస్తారు. చాముండేశ్వరీ దేవికి చెందిన బంగారు అంబారీని బలరామ, అభిమన్యు, గజేంద్ర, అర్జున, రేవతి, సరళ అనే ఏనుగులు బృందంగా వెళ్లి తీసుకువస్తాయి. మిగతా ఏనుగులు మరో బృందంగా ఉంటాయి.
Mysore1

పది రోజుల పండుగ

సాధారణంగా భారతదేశం మొత్తం మీద దసరా ఉత్సవాలు ఒకటి నుంచి మూడు రోజులు మాత్రమే జరుగుతాయి. అయితే మైసూరు దసరా ఉత్సవాలు మాత్రం పది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకూ ఈ ఉత్సవాలను జరుపుతారు. రాచనగరి మైసూరులో చాముండి హిల్స్ మొదలుకొని ఆడిటోరియం, మైసూరు ప్యాలెస్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ తదితర అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా మైసూరు ప్యాలెస్‌ను లక్ష బల్బులతో అలంకరిస్తారు. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకూ ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ దసరా ఉత్సవాల సందర్భంగా అప్పటి వరకూ భద్రపరిచిన బంగారు సింహాసనాన్ని బయటికి తీస్తారు.

నెలరోజుల సందడి

మైసూరు దసరా ఉత్సవాల సందడి నెల ముందు నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడ దసరా ఉత్సవాలను కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. బాలల దసరా, రైతుల దసరా, మహిళల దసరా, యువకుల దసరా... ఇలా మైసూరులో ఎవరి దసరా వాళ్ళు వేరువేరుగా చేసుకుంటారు. మైసూర్ పరిసరాల్లో, పరిసర గ్రామాల్లో అత్యంత వైభవోపేతంగా దసరాను నిర్వహిస్తారు. ఆటలు, పాటల పోటీలు, ప్రదర్శనలు, యువజనోత్సవాలు, ఆహారోత్సవాలు... ఒక్కటేమిటి... దసరా సందర్భంగా అనేక వేడుకలు నిర్వహిస్తారు.
Mysore2

ప్యాలెస్ అలంకరణ

దసరాకు ముందు తొమ్మిది రోజులపాటు శక్తిమాతకు పూజలు జరుగుతాయి. దుర్గ, లక్ష్మీ, సరస్వతి, కాళీ, చాముండేశ్వరీ రూపాలను పూజిస్తారు. జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించడం, వాటి ఆకులను పరస్పరం పంచుకోవడంతోపాటు నవమినాడు ఆయుధ పూజ చేస్తారు. ఆయుధపూజ రోజున అన్ని వృత్తుల వారు తమ తమ పనిముట్లను, వాహనాలను శుభ్రంగా కడిగి వాటికి పూజలు చేయడం, మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీ. దసరా రోజున మైసూరు మహారాజా ప్యాలెస్‌ను లక్షలాది విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా అలంకరిస్తారు. మైసూర్ మహారాజుల నివాసం అయిన ఈ ప్యాలెస్‌లోనే ఉత్సవాలకు సంబంధించిన విలువైన వస్తువులను భద్రపరుస్తారు. ప్యాలెస్‌లోని అత్యంత విలువైన బంగారు సింహాసనాన్ని దసరా వేడుకలు జరిగే పది రోజుల పాటు ప్రజలకు తిలకించే అవకాశాన్ని కల్పిస్తారు.

మూడు నెలల ఎగ్జిబిషన్

మైసూరు ప్యాలెస్‌కు ఎదురుగా ఉండే గ్రౌండ్స్‌లో నిర్వ హించే ఎగ్జిబిషన్ దసరా వేడుకల్లో మరో ప్రత్యేక ఆకర్షణ. దసరా సందర్భంగా మొదలయ్యే ఈ ఎగ్జిబిషన్ డిసెంబర్ నెల వరకు సాగుతుంది. బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు, వంటపాత్రలు, అలంకరణ సామాగ్రి, తిను బండారాలు విక్రయించే దుకాణాలు ఇందులో ఉంటాయి.

పర్యాటకుల కోసం..

ప్యాలెస్ ఆన్ వీల్స్ పేరుతో ఒకరోజు మొత్తం పర్యటనకురూ.999 వసూలు చేస్తుంది. లలిత్ మహల్ ప్యాలెస్‌లోనే భోజన సదుపాయం కూడా ఉంటుంది. ఇక ఏరియల్ వ్యూ కోసం హెలిక్యాప్టర్‌కూడా సిద్ధంగా ఉంటుంది. 10 నిమిషాల పర్యటన కోసం రూ.2,300 వసూలు చేస్తారు. గోల్డెన్ చారియట్ కూడా ఈసారి అందుబాటులోకి తీసుకువచ్చారు. భారతీయులకు టికెట్ ధర రూ.25 వేలు కాగా, విదేశీయులకు రూ.40 వేలు. ఇందులోనే సైట్ సీయింగ్‌తోపాటు భోజన ఖర్చులు కూడా ఉంటాయి. జంబూసవారితో సహా అన్ని ఉత్సవాలను తిలకించడానికి గోల్డెన్ పాస్ తీసుకుంటే సరి. మన బడ్జెట్ హోటల్స్ నుంచి స్టార్ హోటల్స్ వరకూ మనకు ఇక్కడ ఉండటానికి వసతి ఉంటుంది. ఇక చుట్టు పక్కల తిరగడానికి ట్రిన్ ట్రిన్ సైకిల్ అందుబాటులో ఉంటుంది. ఒక్క రోజుకు రూ.50, వారానికి రూ.150 అద్దె వసూలు చేస్తారు.

జంబూ సవారి

జంబూ సవారిపై మైసూరు రాజకుటుంబానికి చెందిన రాజు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. కేవలం దసరా ఉత్సవాల సందర్భంగా మాత్రమే చూడటానికి వీలవుతుంది. ఇక మైసూరు దసరా ఉత్సవాల సందర్భంగా ప్రధాన ఆకర్షణ జంబూసవారి. ఇది ఉత్సవాల చివరి రోజున జరుగుతుంది. జంబూసవారి మైసూరు ప్యాలెస్ నుంచి బన్ని మంటపం వరకూ సాగుతుంది. ఈ సందర్భంగా చాముండి మాతను అందంగా అలంకరించిన ఏనుగుపై ఊరేగిస్తారు. ఒకే చెట్టు కలపతో, 750 కిలోల బంగారం తాపడం చేసిన అంబారీ ఈ ఉత్సవాల్లో మరో ప్రధాన ఆకర్షణ. విజయదశమి నాడు ఈ అంబారీ రాజసం ఉట్టిపడేలా లక్షలాది మందికి కన్నుల పండుగ చేస్తూ మైసూర్ ప్రధాన వీధులగుండా సాగుతుంది. ఈ అద్భుత కార్యక్రమాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు మైసూరుకు తరలి వస్తుంటారు. అంతేకాకుండా నాట్యాలు, సంగీత కచేరీలతో ఆ ప్రాంతం మొత్తం కొత్త కాంతులను సంతరించుకొంటుంది. ఇక చివరిగా టార్చ్ లైట్ పెరెడ్ (దీనిని పంజిన కవాయితు)తో కాగడాలు పట్టుకొని చేసే విన్యాసాలను చూడాల్సిందే.అదే విధంగా మోటార్ సైకిల్ స్టంట్స్, లేజర్ షో కూడా ప్రత్యక్ష ఆకర్షణ. ఇక యువ దసరా కూడా ప్రధాన ఆకర్షణ.
Mysore3

618
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles