అతడే ఒక సైన్యం


Sun,September 29, 2019 01:53 AM

పోలీసులు రక్షిస్తారు. కానీ, వారు ఎప్పుడూ మన వెంట ఉండరు. మనమే ఒక పోలీస్ ఎందుకు కాకూడదు. మనల్ని మనమే ఎందుకు రక్షించుకోకూడదు. ఆపదలో ఉన్న ఎదుటి వారిని ఎందుకు రక్షించకూడదు అనే ఆ ఒక్కడి ఆలోచనే రెండు లక్షల మందిలో ఆత్మైస్థెర్యాన్ని నింపింది. నా రక్షణ నా చేతుల్లోనే అనే నినాదం పల్లెపల్లెనా కొంత మంది కరాటే చాంపియన్స్‌ను తయారు చేసింది.
అది 2012 డిసెంబర్ 16. ఢిల్లీ నగరం ప్రశాంతంగా నిద్రపోతున్నది. నగర పొలిమేరల్లో ఓ బస్సులోంచి ఆడబిడ్డ ఆర్తనాదాలు మార్మోగుతున్నాయి. ఆమె అరుపులు ఏ ఒక్క చెవినీ చేరలేదు. నలుగురి క్షణికానందానికి ఆమె ఈ లోకాన్నే విడిచి వెళ్లింది. చివరికి ఆమె నిర్భయగా చరిత్రలో మిగిలిపోయింది. అప్పుడు ద్రవించిన ఆ యువకుడి హృదయమే ఓ సైన్యాన్ని తయారు చేసింది. అప్పుడతడు కాల్చిన కన్నీటి చుక్కలు మరే ఆడబిడ్డ కంట్లో కనబడొద్దనే అతడు కలలు కన్నాడు. ఆత్మ రక్షణే ఆపదకు విరుగుడు అని నిర్ణయించుకున్నాడు. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా తన కళను ధారబోశాడు. ఇప్పుడా కళే రెండు లక్షల మంది మగువలకు అండగా నిలుస్తున్నది.
Aditya

నా రక్షణ నాచేతుల్లోనే:

గోరఖ్‌పూర్‌కు చెందిన అభిషేక్ యాదవ్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో మంచి పట్టుంది. తన కళ ద్వారా సమాజంలో మార్పు తీసుకు వద్దామనే ఆలోచనతో ఉచితంగా కరాటే నేర్పించడం ప్రారంభించాడు. 2012 నుంచి బాలికలు, యువతులు, గృహిణులకు మొత్తం 2 లక్షల మందికి పైగా కరాటేలో ఉచితంగా శిక్షణ ఇచ్చాడు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ఓ సంస్థను సైతం ప్రారంభించాడు. అభిషేక్ ప్రొటెక్షన్ ట్రస్ట్‌గా దానికి నామకరణం చేశాడు. ఈ ట్రస్టు ద్వారా నా రక్షణ నా చేతుల్లోనే అనే నినాదంతో గ్రామీణ విద్యార్థులకు, మహిళలకు ఆత్మరక్షణ కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నా.

ఎవరీ అభిషేక్:

28 ఏండ్ల అభిషేక్ కరాటేలో ఇంటర్నేషనల్ లెవెల్‌లో గోల్డ్‌మెడల్ సాధించాడు. ఉత్తరప్రదేశ్‌లో ట్రైనీ పోలీసులకు మెలకువలు నేర్పిస్తూ ఉండేవాడు. 2007 నుంచి వరుసగా ఐదేండ్లు 12 ట్రెయినీ బ్యాచ్‌లకు మార్షల్‌ఆర్ట్స్‌ను పరిచయం చేశాడు. ఉదయం సాయంత్రం పిల్లలకు ఉచితంగా కరాటే నేర్పించేవాడు. 2012లో నిర్భయ ఘటన అనంతరం తనసేవల్ని మరింత ముం దుకు తీసుకెళ్లాలనుకున్నాడు. అభిషేక్ ప్రొటెక్షన్ ట్రస్ట్‌ను స్థాపించి బాలికలు, యువతులకు శిక్షణ ఇస్తున్నాడు.

రికార్డుల్లోకెక్కాడు:

అభిషేక్ తరచూ నిర్వహించే శిబిరాల్లో వేలాది మంది పాల్గొంటారు. 2016లో 5700 మందితో శిబిరం నిర్వహించినందుకు గాను అభిషేక్‌కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ప్రతి శిబిరంలోనూ 12 మంది సూచకులు ఆయనకు సహాయం చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని అన్ని నగరాల్లో, పట్టణాల్లో అభిషేక్ సంస్థకు చెందిన వలంటీర్లు ఉన్నారు. వీరంతా స్థానికంగా విద్యార్థులకు కరాటే నేర్పిస్తుంటారు. నేర్పించినందుకు గాను ఒక్క రూపాయి కూడా తీసుకోరు. వందల కొద్ది ఉచిత కరాటే శిబిరాలు నిర్వహించినందుకుగాను అభిషేక్‌ను అనేక సంస్థలు ఎన్నో అవార్డులతో సత్కరించాయి.

పల్లెపలెనా కరాటే కిరణాలు:

ఉత్తరప్రదేశ్‌లోని 6100 ప్రభుత్వ పాఠశాలల్లో కరాటేలో రాణించే విద్యార్థులుంటారు. ఇందుకు కారణం అభిషేక్ ప్రొటెక్షన్ ట్రస్ట్ అని చెప్పవచ్చు. అభిషేక్ గత ఏడేండ్ల నుంచి ప్రతీరోజు ఒక పాఠశాలకు వెళ్తాడు. జిల్లాల వారీగా కరాటే క్లాస్‌లు నేర్పిస్తాడు. అక్కడ ఏ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లినా అభిషేక్ అంటే తెలియని విద్యార్థులుండరు. ఎంతోమంది మహిళలు సైతం అభిషేక్ ప్రొటెక్షన్ ట్రస్ట్ ద్వారా ఆపదల్ని ఎదుర్కొన్నారు. అభిషేక్ ఇప్పుడు ఒక్కడు కాదు. రెండు లక్షల మంది ఆడబిడ్డల సైన్యమున్న అన్నయ్య.
Aditya1

ఎవరికి వారే రక్ష

2012లో పారామెడికల్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం నన్ను కలచివేసింది. ఆరోజు టీవీలో వార్త చూశాక రెండ్రోజులు కన్నీళ్లు ధారగాపోసాగాయి. ఎవరో వస్తారని ఆడపిల్లలు ఎదురు చూడకుండా వాళ్లకు వాళ్లే రక్షణ కల్పించుకోవాలని నిర్ణయించుకున్నా. మార్షల్ ఆర్ట్స్‌లో నాకు ప్రావీణ్యం ఉండడంతో నా కళను ఉచితంగా నేర్పించడం మొదలుపెట్టా. 2012లో మొదట గోరఖ్‌పూర్ సమీపంలోని బాహ్‌రాంపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కరాటే నేర్పించా. అప్పటి నుంచి 2 లక్షల మందికి పైగా కరాటే నేర్పించా. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా హర్యానా, ఢిల్లీల్లోనూ సంస్థ సేవల్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నా.
- అభిషేక్ యాదవ్, కరాటే శిక్షకులు

470
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles