మంత్రముగ్ధుల్ని చేసే.. మంచు సంగీతం!


Sun,September 29, 2019 12:53 AM

సంగీతం వినసొంపుగా ఉంటుంది. మనసుకు ప్రశాంతతను.. కండ్లకు సంబురాన్ని.. నలుగురికి ఆహ్లాదాన్ని పంచుతుంది. సాహిత్యానికి.. నృత్యానికి వారధిగా పనిచేస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. రకరకాల సంగీత వాద్యాలతో శబ్దాల్ని వినిపిస్తారు. ఐతే.. ఒక కళాకారుడు మంచు వాద్యాలతో మ్యూజిక్ మ్యాజిక్ చేస్తున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. మంచు సంగీతం.. నిజమే. ఇప్పుడు ఇదొక వెరైటీ మ్యూజిక్. సంగీత ప్రియులను హుషారెత్తిస్తున్న ఐస్ మ్యూజిక్ ఏంటో? అది ఎక్కడ వినిపిస్తుందో? తెలుసుకుందాం.

అమెరికా కళాకారుడు లిన్‌హర్ట్ మ్యూజిక్‌లో ఎన్నో మ్యాజిక్‌లు చేస్తున్నాడు. ప్రయోగాలు చేయడంలో దిట్ట అనిపించుకున్న అతడు ఇప్పుడు మంచుతో సంగీత సరిగమలు పలికిస్తున్నాడు. ఒకరోజు లిన్‌హార్ట్‌కు మంచుతో మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చిందట. అలా ఒకసారి మంచుగడ్డపై ఇనుపరాడ్‌తో కొట్టాడు. దాన్నుంచి వచ్చిన శబ్దం వింతగా అనిపించిందట. అదేంటో చూద్దాం అనుకొని మళ్లీ కొట్టాడు. శబ్దం వినసొంపుగా అనిపించింది. భలే ఉంది అనుకున్నాడు.
Ice-music

బృంద కచేరీ

మంచులో ఉన్న మహత్తును బయటకు తీసేందుకు గిటార్, డ్రమ్స్, వయోలిన్ వంటి సంగీత వాద్యాలను మంచుతో రూపొందించాడు లిన్‌హర్ట్. మామూలు సంగీత వాద్యాలతో పోలిస్తే మంచు వాద్యాలు నాణ్యమయిన శబ్దాన్ని ఇస్తున్నాయని గ్రహించాడు. ఐస్ మ్యూజిక్ గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఒక టీమ్‌ను ఏర్పాటుచేసుకున్నాడు. ఐస్ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను ఉపయోగించే విధానాన్ని తెలిపేందుకు వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు. స్వీడన్‌లో సంగీత కచేరి నిర్వహించాడు. ఈ కచేరికి జనం పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆయన బృందం అందించిన సంగీతంతో అందరూ మంత్రముగ్ధులయ్యారు. లిన్ నిర్వహించిన మొదటి కచేరితో ఐస్ మ్యూజిక్‌కు ఆదరణ మరింతగా పెరిగింది.

మంచు పర్వతాన్ని తొలచి...

కచేరి నిర్వహించిన ప్రతిసారీ మంచు వాద్యాలు కరిగిపోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. కొన్నిసార్లు ఇబ్బందులూ తప్పలేదు. డబ్బు కూడా బాగానే ఖర్చు అవుతున్నది. దీనికి పరిష్కారమేంటో కూడా తానే కనుక్కోవాలని అనుకున్నాడు. మంచుపర్వతాన్ని మ్యూజిక్ కస్సర్ట్ హాల్‌గా మారిస్తే బావుంటుందనే ఆలోచన వచ్చింది. ఎంత ప్రదేశం కావాలి? ప్రేక్షకులు కూర్చునేది ఎలా? మంచు వాద్యాలు కరిగిపోకుండా ఎలా నియంత్రించాలి? అని బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఇటలీలోని మంచు పర్వతాల శ్రేణిలోని ఒక మంచు పర్వతాన్ని తవ్వాడు. ఎన్నో ఏండ్లు శ్రమించి మంచు పర్వతంలో అద్భుతమైన భవనాన్ని నిర్మించాడు. సంగీత సాధనాలు కరిగిపోకుండా మైనస్ డిగ్రీల చలి ఉండేలా ఏర్పాటు చేశాడు. ప్రేక్షకులు చలికి తట్టుకునే విధంగా వసతులు కల్పించాడు. హాల్ లోపల రంగురంగుల కాంతులు విరజిమ్మే ఇంద్రధనస్సు లాంటి దీపాలను అమర్చాడు. ఈ వినూత్న సంగీతం అందరికీ నచ్చడంతో ఇక్కడికి వచ్చి ఐస్ మ్యూజిక్‌లో మునిగిపోతూ పరవశిస్తున్నారు.
Ice-music1

పెరుగుతున్న ఆదరణ

మొదట్లో లిన్‌హర్ట్ మ్యూజిక్ కాన్సెప్ట్ ఎవరికీ అర్థం కాలేదు. అందరికీ తన సంగీతం రుచి చూపించాలని ఉచిత ప్రవేశం కల్పించాడు. దీంతో ప్రజల నుంచి ఆదరణ మొదలైంది. లిన్‌హర్ట్ అందించే సంగీతం సరికొత్తగా ఉండటమే కాకుండా శ్రావ్యమైంది.. నాణ్యమైంది కావడంతో స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా సంగీత ప్రియులు తరలి రావడం ప్రారంభమైంది. రంగు రంగుల వెలుగుల్లో హుషారెత్తించే ఐస్ మ్యూజిక్‌ను వారు ఆస్వాదిస్తున్నారు. సంగీతం మనసుకు ఆనందాన్ని.. ఆహ్లాదాన్ని అందిస్తుంది. పిల్లల నుంచి వృద్ధుల దాకా అన్ని వయసుల వారూ దానిని ఆస్వాదిస్తుంటారు. సంగీతానికి మనుషులే కాదు జంతువులు.. చెట్లు సైతం పులకరిస్తుంటాయి అని లిన్‌హర్ట్ అంటున్నాడు. మంచుతో రూపొందించిన సంగీత వాద్యాలు ఇక్కడ కాకుండా మరెక్కడా లేకపోవడం విశేషం. ఇటువంటి అరుదైన అవకాశం తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందని లిన్‌హార్ట్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఎన్నో ఏండ్లు శ్రమించి మంచు పర్వతంలో అద్భుతమైన భవనాన్ని నిర్మించాడు. సంగీత సాధనాలు కరిగిపోకుండా మైనస్ డిగ్రీల చలి ఉండేలా ఏర్పాటు చేశాడు. ప్రేక్షకులు చలికి తట్టుకునే విధంగా వసతులు కల్పించాడు. హాల్ లోపల రంగురంగుల కాంతులు విరజిమ్మే ఇంద్రధనస్సు లాంటి దీపాలను అమర్చాడు.
Ice-music2

363
Tags

More News

VIRAL NEWS