వాగ్గేయ వైభవం


Sun,September 15, 2019 01:09 AM

Eloquence
మనిషిని మనిషిగా రూపొందించే లక్ష్యంతో భారతీయ తాత్విక చింతనలో మొగ్గతొడిగిన సంగీత సాహితీ.. ప్రదర్శనా ప్రక్రియే వాగ్గేయం. వాగ్గేయంలోరెండు ప్రధాన అంశాలు ఒకటిగా కలిసిపోయి దేహాత్మలాగా ఒక్కటిగా కనిపిస్తాయి. వాక్కు అంటే సాహిత్యం. గేయం అంటే సంగీత బద్ధమైన రాగయుక్త ఆలాపన. వాక్కు దేహమైతే.. గేయం ఆత్మ. అంటే ఒక భావనని పండిత, పామర జనరంజకంగా మలచడంలో, పునఃస్మరణ చేయడంలో, మననం చేయడంలో ఈ ‘వాగ్గేయం’ అంతకు ముందటి ఎన్నెన్నో సాహితీ ప్రక్రియలకన్నా ప్రజానుకూలంగా ఉండి ఆదరణ పొందింది. వైభవమైన ఈ వాగ్గేయం నాటి నుంచి నేటి వరకు ఏం చెప్పింది? మనం ఏం నేర్చుకున్నాం? దీనితో భాషా.. సాంస్కృతిక వైభవం ఎలాంటిది? వంటి విషయాల గురించి ఈ వారం ముఖచిత్ర కథనం.

- మామిడి హరికృష్ణ, సెల్‌:80080 05231
డైరెక్టర్‌, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ


వాగ్గేయం ఎలా ఉంటుంది? అనే సందేహం ఉన్నవారూ ఉండొచ్చు. దాని లక్షణాలేంటో తెలుసుకుందాం. వాగ్గేయం సంగీత సాహిత్యాల సమ్మిళిత రూపం. భక్తి, ఆధ్యాత్మిక చింతన, తాత్విక దర్శనం దీనిలోని ప్రధాన వస్తువులు. దేవుడు - మానవుడు మధ్య సంబంధాలను, అనుబంధాన్ని బలోపేతం చేయటం. పారభౌతిక, పారలౌకిక ఆలోచనాధారకు పట్టం కట్టడం. మనిషిని సన్మార్గంలో నడిపించడం, భూతదయ, కరుణ, సాటిమనిషి పట్ల గౌరవం కలిగించడం, పరస్పర విశ్వాసం వంటి అనుకూల ఆలోచనలను పాదుకొల్పడం. సాహిత్యానికి తగిన రాగాలను ఎన్నుకోవడం, ఆ రాగంలో ఆలపించడం ద్వారా భక్తి భావనకు విస్తృత వ్యాప్తిని చేయడం జనాలను ఆకట్టుకోవడం. రాగాలాపన ద్వారా శ్రోతలు / ప్రేక్షకులలో భక్తి భావనను, ఆధ్యాత్మిక స్ఫూర్తిని రగల్చడం. ‘వాగ్గేయం’ ద్వారా మనన పునఃస్మరణాలు సులభతరం అవుతాయి. కనుక సాహిత్యానికి శాశ్వతత్వం అందించడం. ‘శ్రుత సంపద్రాయం’ లోకి తీసుకొచ్చి ప్రజల నాల్కల మీద నిరంతరం, తరంతరం నడయాడేలా చేయడం. మరో తరానికి అందించడం, లోకరీతిని, లౌకిక జ్ఞానాన్ని, ప్రస్తుత మానవుడి వెంపర్లాటని, దానిలోని అసంగతత్వాన్ని ఉదాహరణల ద్వారా రాగయుక్తంగా అందించడం. మహోన్నత సత్యాన్ని ఆవిష్కరించడం. అంతిమంగా మనిషి జీవితానికి ఆధ్యాత్మిక ప్రాతిపదికగా ‘ఆనందమార్గం’ ను చూపించడం. మనిషిలోని జంతువాంఛలను, స్వార్థకాంక్షను, హింసాప్రవృత్తిని, ధ్వంస వ్యక్తిత్వాన్ని తగ్గించి, మనిషిని ఉదాత్త మానవీయ విలువలతో కూడిన సమున్నత మానవునిగా ఎదిగేందుకు తొవ్వ చూపించడం. భౌతిక, దైహిక వాంఛలలోని డొల్లతనాన్ని తాత్కాలికత్వాన్ని సహేతుకంగా వివరించి ‘శాశ్వత ఆనందం’ (Eternal Bliss) దిశగా మానవ ప్రస్థానాన్ని నడిపించడం.

ఎవరు వాగ్గేయకారులు?

స్థూలంగా చెప్పాలంటే త్రికరణాలను ఆచరణలో చూపించే వారిని వాగ్గేయకారులు అనవచ్చు. ఎందుకంటే ‘వాగ్గేయకారంః’ అనే పదం మూడు సంస్కృత పదాల కలయిక. అవి:
వాక్‌: సాహిత్యం-వాక్కు
గేయం: రాగతాళస్వరాలు కూర్చిన సంగీతం-మనస్సు
కార: పైరెండింటిని చేసేది - కర్మ
శాస్త్రీయ సంగీత శాస్త్రానికి మూల భూమికను ఏర్పరచిన ప్రాచీన గ్రంధాలలో ఒకటైన ‘సంగీత రత్నాకరం’లో కూడా వాగ్గేయకారునికి సంబంధించిన విశ్లేషణలు, వివరణలు మనకు కనిపిస్తాయి. భారతీయ సంగీత శాస్త్రానికి ప్రాతిపదికను కూర్చిన సారంగదేవుడు సంస్కృతంలో రాసిన ఈ గ్రంథంలో ఇలా చెపుతాడు.
Speech and song are called matu and dhatu respectively (in musical texts and terminology); and he, who creates both speech (shabda Brahma) and song (Nada Brahma) is verily a vaaggeyakara.
అదే కావ్యంలో సారంగదేవుని మాటల్లో వాగ్గేయకారుని గురించి చెప్పాలంటే

వాఙ్మాతురుచ్యతే గేయం - ధాతురిత్యాభిధీయతే!
వాచం గేయంచ కురుతే - యఃస వాగ్గేయకారకః!


‘మాతువు (సాహిత్యం-మాట); ధాతువు (సప్తస్వరబద్ధమైన సంగీతం) లను రెండింటినీ సమపాళ్ళలో కూర్చగలిగిన వారే వాగ్గేయకారులని దీనిభావం.
అందుకే ‘శోధ్‌గంగ’ అనే ప్రామాణిక గ్రంథంలో కూడా A vaaggeyakara is the perfect embodiment of shabda Brahma and nada Brahma par excellence అని చెప్పారు. అదే గ్రంథంలో మరింత వివరంగా ఇలా చెప్పారు.
A vaaggeyakara in true sense is a mystic musician who as a perfect singer gives sweet and scintillating, full and faithfull expression to shabda Brahma and nada Brahma.
దక్షిణ, ఉత్తర భారతదేశంలోని వాగ్గేయకార సంప్రదాయాన్ని విశదంగా, కూలంకషంగా ప్రస్తావించిన ‘శోధ్‌గంగ’ గ్రంథంలో మరోచోట వాగ్గేయకారునికి సంబంధించి మరో చక్కని వివరణను ఇచ్చారు.
A Vaaggeyakara is a reservoir of known music as well as riverine releaser of new music, a sea as well as a source of music sublime and supreme.
అలాగే భారతీయ దర్శనం, తాత్త్వికతల మీద సాధికారిక ప్రసంగాలను, రచనలను ఎన్నింటినో చేసిన దార్శనికుడు, భారత మాజీ రాష్ట్రపతి డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 1965లో చేసిన ఓ ప్రసంగంలో ఇలా వర్ణించారు.
The Vaaggeyakara is a creative innovator and not merely a repititive traditi -onal For as a devotee of music, he is at once the worshipper of goddess Saraswathi who holds in her hands the book and the veena -Veena Pustak Dharini!
అంటే సరస్వతీదేవి ధరించిన ‘వీణ’ సంగీతాన్ని, ‘పుస్తకం’ సాహిత్యానికి సంకేతాత్మక అంశాలన్నమాట.

హిందుస్థానీలో

మన దేశంలో వాగ్గేయకార సంప్రదాయం ప్రధానంగా కర్ణాటక సంగీత రీతిలోనే కనిపించినప్పటికీ, హిందుస్థానీ సంగీతరీతిలో కూడా ఇది ఉందని కొంచెం లోతుగా విశ్లేషిస్తే అవగతం అవుతుంది. జయదేవుడు (1170- 1245), భక్త కబీర్‌దాసు (1440-1518), వంటి వారి కృతులలో ఈ ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇక ఆధ్యాత్మిక భక్తి తత్వానికి ఉత్తర భారతంలో పేరెన్నికగన్న తులసీదాసు (1511-1623), సూరదాసు (14, 15 శతాబ్దకాలం) వంటివారు రాసిన రచనలు అన్నీ వాగ్గేయ సంప్రదాయంలోనే కనిపిస్తాయి. హిందుస్థానీ రీతిలో వాగ్గేయకార సంప్రదాయాన్ని స్థిరీకరించిన వారిలో ఉస్తాద్‌ అదారంగ్‌, ఉస్తాద్‌ సదారంగ్‌లను చెప్పుకోవచ్చు. మెహబూబ్‌ ఖాన్‌ ‘దరస్‌పియ, ఫైయాజ్‌ ఖాన్‌ ‘ప్రేమ పియా’, విలాయత్‌ హుస్సేన్‌ ఖాన్‌ ‘ప్రాణ్‌ పియా’, జగన్నాధ్‌బువా పురోహిత్‌ ‘గుణిదాస్‌' అల్లాదియాఖాన్‌ గురించి కూడా చెప్పవచ్చు.
Eloquence1

1 రాకమచర్ల వెంకటదాసు (1808-1859)

తెలంగాణలో వాగ్గేయకార సంస్కృతి

తెలంగాణ ప్రాంతంలో వాగ్గేయకార సంప్రదాయం ఒక సంస్కృతిగా ఎదగడం ఓ ప్రత్యేకత. భద్రాచల రామదాసు (1620-1680) కాలంనుంచి ఈ వాగ్గేయకార సంప్రదాయం తెలంగాణలో స్థిరపడిందని చెప్పవచ్చు. తెలంగాణలో వాగ్గేయకార సంస్కృతి ప్రధానంగా మనకు మూడు రూపాలలో కనిపిస్తుంది.

1) శాస్త్రీయ వాగ్గేయకారం: శాస్త్రీయ సంగీత బాణీలు, స్వరాలు ఆధారంగా రూపొందినవి.
2) భజన వాగ్గేయకారం: శాస్త్రీయ సంగీతంతోపాటు లలిత సంగీతం ప్రాతిపదికగా రూపొందినవి.
3) ప్రజా వాగ్గేయకారం: ప్రజలలో వాడుకలో ఉన్న ప్రజా గేయ రీతులలో రూపొందినవి. వీటిలో శాస్త్రీయ, లలిత బాణీల కన్నా సామాన్య ప్రజలను ఆకట్టుకునే రీతులే ప్రధానం.
తెలంగాణలో వాగ్గేయకార సంప్రదాయాన్ని బలోపేతం చేసినవారిలో హిందూ వాగ్గేయకారులే కాక, ముస్లిం వాగ్గేయకారులూ ఉన్నారు. ఇలా ఘనతకెక్కిన కొందరు తెలంగాణ వాగ్గేయకారులను ప్రస్తావించుకుందాం.

నేటి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని అచ్చంపేట మండలం పెద్దాపురం గ్రామంలో జన్మించిన రాకమచర్ల వెంకటదాసు వేలాది కీర్తనలు రాసినప్పటికీ వాటిలో ప్రస్తుతం దాదాపు 50 వరకు మాత్రమే ప్రచారంలో ఉన్నవి. ఆయన తాను రాసిన ఒక కీర్తనలో..
‘నీవైన దయజూడవమ్మ లోకపావని నను బ్రోవవమ్మ
యేవేళ మీ పాదేవ జేసినవారి
కావరించి బ్రోవవమ్మ దయాంబుధి’ అని సీతాదేవికి విన్నపాన్ని ఆట తాళంలో అందించారు. అలాగే
“చూడరమ్మ రాముల గూడరమ్మా
చూడు చూడు మీ చూడ్కలలర
గురితోడ త్రికూటము జూడదెలసిమరి” అని శ్రీరాముని వైభవాన్ని ఏకతాళంలో రాసిన కీర్తనలో వర్ణించారు.
Eloquence2

2 మన్నెంకొండ హనుమద్దాసు (1814-1874)

మహబూబ్‌నగర్‌ జిల్లాలో శ్రీ వేంకటేశ్వరుడికి రెండో నివాసంగా పేరుపొందిన మన్నెంకొండ ప్రాంతానికి చెందిన హనుమద్దాసు దాదాపు 150కి పైగా కీర్తనలు రాసి గానం చేసి శ్రీరామునికి అంకితమిచ్చారు. వాటిలో శుద్ధసావేరి రాగం-ఆట తాళంలో ఆయన రచించిన..
“దయశాలివనియంటి రామ - నా దైవమె నీవంటి రామ
దయశాలివని యంటి - దరిజేర్చె వనుకుంటి
నయము జెందుచునంటి - నా తండ్రి నీవంటి” అనే కీర్తన
రేగుప్పి రాగం ఏక తాళంలో
“చూచేనురా రామ - చూచేనురా -
నీ సుందర నగుమోము చూచేనురా
దాచావెందుకు నీ దండీ సంస్థానము
గాచినందుకు నిన్ను కనుగొన్నదేచాలు” అని రాసిన కీర్తన ప్రఖ్యాతి చెందినవి.

3 దున్న ఇద్దాసు 1811-1919

భక్తికన్నా తాత్వికతను, దేవుని కన్నా పారమార్థిక దార్శనికతను ప్రధానంగా చేసిన తత్వగీతాలను రచించిన దున్న ఇద్దాసు చెప్పుకోదగిన ప్రజా వాగ్గేయకారుడు. సాహిత్యం-సంగీతజ్ఞానం ఉన్నత వర్గాలలో మాత్రమే పుడతాయనే సూత్రీకరణను బద్దలు చేసి తాత్వికతకు పుట్టుక కన్నా, ఆలోచన దృక్పథమే హేతువు అవుతుందని నిరూపించిన జ్ఞాని ఈయన.
అందుకే ఆయన..
“వాననబువ్వు పూసేనమ్మా నర అడవిలో సు
వాసాన జ్ఞాన మానెనమ్మా” అని జ్ఞానానికి కిరీటం పెట్టారు. మరోవైపున “దాటరా మాయను దాటరా ఈ కర్మబంధము” అంటూ
“మాయ మనకు కన్నతల్లి - దాటనివ్వదు మనోకాంత
సందు జేసుక మనో కాంతను - బంధమేసి అల్లవాలికి” అని భోధిస్తాడు.
Eloquence3

4 వేపూరి హనుమద్దాసు 1852-1947

దైవస్తుతి, ఆత్మప్రబోధ తత్వాలను రచించిన పాలమూరు వాగ్గేయకారుడు వేపూరి హనుమద్దాసు దాదాపు 477 కీర్తనలు రచించి తెలంగాణ సంప్రదాయాన్ని పరిపుష్టం చేసారు. ఆయన రాసిన కీర్తనలలో.. “రామ రామ సుశామ సుజనలలామ రామ నమో నమోప్రేమతో నను బ్రోవుమా శ్రితకామ రామ నమో నమో” అనే ఆట తాళంతో మార్చిన కీర్తన, అలాగే

“ఏదయా రామ నీదయా వైకుంఠవాసాఏదయా నీ కరుణ నాపై రాదయా నేనెంత వేడిన
లేదయా కరినేలినటు నీ యాదరణ అని శంబుజూడగ” అనే మరో కీర్తన హనుమద్దాసు సంకీర్తనా చాతుర్యానికి మచ్చు తునకలు.
Eloquence4

5 ఉప్పరిపల్లి కృష్ణదాసు 1866-1952

మహబూబ్‌ నగర్‌ జిల్లా ఘనపురం మండలం ఉప్పరిపల్లి గ్రామంలో జన్మించిన కృష్ణదాసు ‘సోలీపురం గురుభజన కీర్తనలు’ పేరిట దాదాపు 250 పద్యాలు, కీర్తనలు రచించారు.
“మాధవునకు మరుపుదోచె మగువ యేమందునే
మానసమున మరులు గలిగె మా హరినెట్లుగందునే”
అని రూపకరాగంలో ఒక కీర్తనను,

“దత్తాత్రేయ మిము దలంచువారలు సత్తామాత్రులై యున్నారుగా
హత్తుగాను నడనెత్తి బగులయా మిత్తినణ మేల్లన్నారుగా”
అని ఏకతాళంలో మరో కీర్తనను రాసి గానం చేసి ఇహపర జీవితాలలో సగుణమార్గాన్ని ప్రతిపాదించారు.

పద్యాలల్లుతూ, భక్తిగీతాలు రాస్తూ, భజన బృందాలను తయారుచేస్తూ జీవితమంతా ఆధ్యాత్మిక మార్గంలోనే గడిపిన పోచయ్యదాసు ఒకవైపు చేనేతను, మరోవైపు వాగ్గేయ కలనేతను తాత్విక దారంతో నేసాడు. నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ మండలం తిమ్మాపురం గ్రామంలో జన్మించిన ఈయన ఆటతాళంలో రాసిన“రామ యననినాడు భూమిలోనున్న కీడుపామరమా యనమిడు క్షేమము తుదకుజూడు” అని శ్రీరామునిపై కీర్తన ఎంత ఆదరణ పొందిందో, అదే ఆటతాళ రాగంలో.. “పండరి విఠలేశ - దండమె దీనపోష రండిటు రుక్మిణేశ - భండనరిపువినాశ” అనే పాండురంగ విఠలేశ్వరస్వామిపై రాసిన కీర్తనకూడా అంతే ప్రచారాన్ని సాధించింద

పురాణాలలో సంగీతజ్ఞులు

భారతీయ ఇతిహాసాలు, పురాణాల ప్రకారం సరస్వతీదేవి వాగ్గేయ కారత్వానికి అధిదేవతగా, వాగ్దేవిగా పూజలందుకోవడం మనకు తెలిసిందే. అయితే సరస్వతీదేవి మాత్రమే కాక, మరెంతో మంది పురాణ దేవతలు, రుషులు ఈ వాగ్గేయతత్వానికి, సంగీత సాధనకు ప్రతినిధులుగా మనకు కనిపిస్తారు. దీని గురించి ఆర్‌. రంగరామానుజ అయ్యంగార్‌ History of South Indian (carnatic) Music (1972) అనే గ్రంథంలో ఇలా వివరిస్తారు.
“శివుడు, బ్రహ్మ, భరతుడు, కశ్యప మహాముని, మాతంగుడు, యష్టికుడు, దుర్గాశక్తి, శార్దూల కోహల, విశాభిల, దంతిల, కంబాల, అశ్వతార, తుంబుర, శారద, ఆంజనేయ, మాతృగుప్త, రావణుడు, నందీశ్వరుడు, బిందురాజా, క్షేత్రరాజు, రాహులుడు, సోమేశుడు, అభినవ భట్ట, లొల్లాటుడు మొ॥వారు సంగీతానికి, వాగ్గేయానికి ప్రతినిధులుగా ప్రస్తుతించబడ్డారు.”
ఇలాంటి పౌరాణిక, భక్తి నేపథ్యమే వాగ్గేయకార సంప్రదాయంగా చివరికి పరిణమించింది. ఇదే సందర్భంలో చాలామందిలో చర్చకు వచ్చే అంశం ఏమిటంటే వాగ్గేయకార సంప్రదాయం లౌకిక, తార్కిక మార్గంలో ఉండదా? కేవలం భక్తి - ఆధ్యాత్మిక మార్గాలలోనే ఉంటుందా? అనేది.
ఈ విషయమై ఎంతో మేధోమథనం చేసిన సంగీత పరిశోధకులెందరో వాగ్గేయకార సంప్రదాయానికి సంగీతం-సాహిత్యం దేహమైతే, దాని ఆత్మనే భక్తి అని చెపుతారు. అలాంటపుడు ఆత్మలేని జీవాన్ని ఉహించలేము అని కొట్టివేసారు. ఇదే విషయాన్ని “శోధ్‌గంగ” అనే గ్రంథంలో ఇలా వివరిస్తారు -
Music may be sacred or Secular. But a secular music has never produced any Vaaggeakara worth the name. Vaaggeyakara is sole product of Soulful realisation of the Brahman in its two fold aspect of Shabda Anubhava and Nada Anubhava.
దీన్నిబట్టి వాగ్గేయకార సాంప్రదాయం, మతం, ఆచారాలు, విశ్వాసాల ఆధారంగా రూపొందిన భక్తితత్వాన్ని అనుసరించే ఉంటుంది తప్ప, విడిగా ఉండలేదనేది వెల్లడవుతున్నది.

మనదేశంలో వాగ్గేయ ప్రస్థానం

భక్తి, ఆధ్యాత్మిక, ఆత్మిక పారమార్థిక పరమైన చింతనే పునాదిగా సంగీతం, సాహిత్యం, తత్వం, సత్యం అనే నాలుగు స్తంభాలపై నిర్మితమైందే వాగ్గేయ సౌధం. మనదేశంలో ఈ వాగ్గేయ సంప్రదాయం ఒక్కరోజులోనో, ఒక్క తరంతోనో స్థిరపడింది కాదు. వందలాది సంవత్సరాల జ్ఞానసముచ్ఛయం ఒకవైపు, వందలాది సంగీత తాత్వికుల సామూహిక కృషి మరోవైపు కలిసి ఈ వాగ్గేయకార సంప్రదాయం రూపొందింది. అయితే 13వ శతాబ్దినాటి భక్తి ఉద్యమానికి ఆదిశంకరాచార్య, రామానుజాచార్య వంటి దక్షిణాది తాత్వికులు ఎలా ఊపిరులూదారో, ఈ వాగ్గేయకార సంప్రదాయానికి కూడా దక్షిణాది సంగీత తాత్వికులే బాటలు వేయడం యాధృచ్ఛికమే. అదీ ముఖ్యంగా కర్ణాటక సంగీత రీతిలోనే ఈ వాగ్గేయకార సంప్రదాయం రూపొందడం విశేషం. ఇలా సంగీత చరిత్రకారుల పరిశోధనల ప్రకారం మన దేశంలో కర్నాటక సంప్రదాయ రీతిలో వాగ్గేయ ప్రస్థానం నాలుగు దశలలో కనిపిస్తుంది.

ప్రాక్‌ సంగీత త్రయ కాలం: భాష, పదాలు, సామూహిక మానవ అనుభవాల నుంచి పుట్టిన తత్వాలు అన్నీ స్మరణానికి, మననానికి, పునరుత్పాదనకు వీలుగా ఉండాలంటే అవి గానయోగ్యంగా ఉన్నపుడే సాధ్యమని, అప్పుడు మాత్రమే ఒకతరం నుంచి మరో తరానికి అందించబడతాయని అర్థమయింది. దానికితోడు మొదట్లో భాషకు లిపి కానీ లిఖితంగా గ్రంధస్థం చేయగలిగే సదుపాయం కానీ లేకపోవడం వల్ల ఈ విధంగా ప్రజల నాల్కలమీద గుర్తుంచుకోవడం తప్ప మరో మార్గం లేకపోయింది. స్థిత లిఖితరూపంలోకి, తాళపత్ర గ్రంధాలుగ క్రోడీకరించే దశకు చేరిన తర్వాత ఈ వాగ్గేయకార సంప్రదాయం నిర్దిష్ట రూపాన్ని సంతరించుకునే ప్రస్థానాన్ని ఆరంభించింది.. ఈ ప్రస్థానానికి 12వ శతాబ్ధంలోని బసవేశ్వరుడి వచనాలే శ్రీకారం చుట్టాయని చెప్పాలి. కన్నడ భాషలో ప్రధానంగా కళ్యాణి రాగంలో మరితర రాగాలలో కూర్చబడినందువల్ల శ్రోతలను త్వరగా ఆకట్టుకోగలిగాయి. తెలుగులో రాసిన తాళ్ళపాక అన్నమాచార్య (1408-1503) దాదాపు 36వేలకు పైగా కీర్తనలను రాసి పదకవితా పితామహుడిగా వాసికెక్కడమే కాక, దాదాపు 1000కి పైగా రాగాలలో ఈ కీర్తనలకు స్వరాలు కూర్చారు. మువ్వగోపాల పదాలు రాసిన క్షేత్రయ్య (1600-1680) దాశరథి శతకం, ఇంకా ఎన్నెన్నో కీర్తనలను రాసిన భద్రాచల రామదాసు (1620-1688), ‘కృష్ణలీల తరంగిణి’ వంటి ప్రసిద్ధ కావ్యాలను రచించిన నారాయణ తీర్థులు (1650-1745) తొలినాటి నవవర్ణ కృతులను రచించిన ఊట్టుక్కాడు వెంకటకవి (1700-1765), దేశిత్రిపదిరీతిని, సువ్వాలి తత్వాన్ని ప్రచారం చేసిన జగన్నాథ దాసుడు (1728-1809) వంటి వారు ఈ కాలంలో ప్రముఖ వాగ్గేయ కారులు.

సంగీత త్రయ కాలం: కర్నాటక సంప్రదాయ సంగీతం, దానితోపాటే వాగ్గేయకార సంప్రదాయం విశిష్ఠరూపాన్ని పూర్థి స్థాయిలో సంతరించుకొని స్థిరపడ్డ కాలం ఇది. ఈ కాలంలోని శ్యామశాస్త్రి, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు తెలుగు, సంస్కృతం, తమిళ భాషలలో స్వరాలుకూర్చి గానం చేసిన కీర్తనలు శాశ్వత కీర్తిని సముపార్జించాయి. ఈ కాలానికే చెందిన ఇరైయమ్మన్‌ తంపి (1782-1856), తిరువారూర్‌ రామస్వామి పిైళ్లె (1798-1852), కవి కంజర భారతి (1810-1896) వంటివారు చేసిన రచనలు, స్వరాలు వాగ్గేయకార సంప్రదాయాన్ని మరింత సుసంపన్నం చేశాయి. ఇక మలయాళ, కన్నడ, తెలుగు, తమిళ్‌ వంటి దక్షిణాది భాషల్లోనే కాక సంస్కృతంలోనూ, ఉత్తరాది భాషలైన హిందీ, వ్రజ్‌ భాషల్లోనూ కీర్తనలను రచించిన స్వాతి తిరునాళ్‌ (1813-1846) వాగ్గేయ కార సంప్రదాయాన్ని మరింత విస్తృతీకరించారు.

సంగీత త్రయ అనంతర కాల తొలిదశ: 19వ శతాబ్దం నాటికి భారతదేశంలోనూ, దక్షిణాదిలోనూ సామాజికంగా, చారిత్రకంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎన్నెన్నో మార్పులు పొడచూపాయి. బ్రిటిష్‌ పాలన, పాశ్చాత్య భావజాలం, స్వాతంత్య్ర కాంక్ష వంటి సామాజిక అంశాలు కూడా తోడై ఈ కాలం నాటి వాగ్గేయకారుల ఆలోచనా సరళిని ప్రభావితం చేసాయి. అయినా భారతీయతకు ఆలంబనగా నిలిచిన ఆధ్యాత్మికత, భక్తి భావనలు మాత్రం అదే విధంగా కొనసాగాయి. ఈ కాలంలో వచ్చిన ఎందరో మహానుభావులు తమ రచనాస్వరాలతో వాగ్గేయకార సంప్రదాయానికి సమకాలీన సొబగులను అద్దారు. వారిలో మహాకవి సుబ్రహ్మణ్య భారతి (1882-1921), తెలుగు జావళీలు రాసిన ధర్మపురి సుబ్బారాయుడు, 72 మేళకర్త రాగాలను సృజించిన కోటీశ్వర అయ్యర్‌ (1870-1940), మహావైద్యనాధ్‌ అయ్యర్‌ (1844-1893), మోహన రాగ వర్ణమ్‌ ‘నిన్నుకోరి’ వంటి ఎన్నెన్నో తెలుగు కృతులను రచించిన పూచి శ్రీనివాస అయ్యంగార్‌ (1860-1919), 90 రాగాలలో గీతమాలికను తెలుగులో అందించిన ఆదిభట్ల నారాయణదాసు (1864-1945) వంటివారు చెప్పుకోదగినవారు.

సంగీత త్రయ అనంతర కాల మలిదశ: ఈ కాలంనాటి వాగ్గేయకారులు పూర్తిగా భక్తి, ఆధ్యాత్మిక, తాత్విక, పౌరాణిక భావనలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కాలంనాటి వాగ్గేయకారులలో దండపాణి దేశికర్‌ (1908-1972), మహారాజపురం సంతానం (1928-1992), నల్లాన్‌ చక్రవర్తుల కృష్ణమాచార్యులు (1925- 2006), లాల్గుడి జయరామన్‌ (1930-2013), మంగళంపల్లి బాలమురళీకృష్ణ (1930- 2016) మొదలగువారు ప్రముఖులు.
Eloquence7

7 గొల్లపల్లి వెంకటదాసు

భక్తి, వైరాగ్యం, తత్వం, జ్ఞానం అనే నాలుగు స్తంభాలపై ఆధ్యాత్మిక చింతన ఉందని భావించిన వెంకటదాసు ప్రస్తుత నాగర్‌కర్నూల్‌ జిల్లా గోపాల్‌పేట మండలం గొల్లపల్లి గ్రామంలో జన్మించి, పారమార్థిక మార్గంలో దాదాపు 238 కీర్తనలను రచించారు. ఈయన శ్రీరాముని మీదనేగాక, నరసింహస్వామి, శ్రీకృష్ణుడు వంటి దేవతల మీదకూడా రచనలు చేసాడు. వాటిలో ఆట తాళంలో రాసిన
“నరసింహ్మ దేవా గోవిందా - నిన్నూ నమ్మీతి పాహి ముకుందా
క్రూరాహరణా నిత్యానందా - నిన్నూ గోరీతి నతభక్త బృందా”
అనే కీర్తన అదే ఆట తాళంలో రాసిన
“ఇంతా పంతామేల దేవా కృష్ణా చెంతా జేరగ ఇందు రావా”
అనే కీర్తన చెప్పుకోదగినవి.
Eloquence8

8 యోగి పరమేశ్వరదాసు

బిక్షాటన చేసుకుంటూ ఊరూరూ తిరుగుతూ శృతిబద్ధంగా గానంచేస్తూ తాను రచించిన దాదాపు 250కి పైగా తత్వగీతాలను ప్రజల్లో ప్రచారం చేసిన పరమేశ్వరదాసు ఆదిలాబాద్‌ జిల్లావాసి. ఆయన రాసిన వాటిలో
“చారీ ఆచారి జగములో నెవరొయి బ్రహ్మచారీ
సారరహిత సంసారంబులో-పరబ్రహ్మజ్ఞాన పరిపక్వ మొనర్చిన
నరుడే బ్రహ్మచారి యీ జగములో’ అనే తత్వగీతం
“కర్మ దాటతరమా నరుడా కర్మదాట తరమా
కర్మచే నిర్మితకాయ సృష్టియిదే
మర్మ మెరిగితే యేమూలము లేనిదే
నిర్మితమాయెను సృష్టివింతలు
కర్మతొ వెలుబడె కారణకారుడు” అనే తాత్విక రచన ప్రసిద్ధాలు.
Eloquence9
ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం బండల నాగాపురం గ్రామానికి చెందిన నాగదాసు భగవంతుని ఎంత కీర్తించారో, తాత్విక చింతననుకూడా అంతే ప్రస్తుతించారు. ఆయన రాసిన కీర్తనలో
“సత్యము సర్వంబులోనా సందులేక యున్నదీ
గుట్టు తెలిసిన వారికి అది బట్టబయలైయున్నదీ”
సత్యావిష్కారణతో మరో కీర్తనలో భగవంతుడి ఉనికిని ప్రశ్నిస్తూ...
“కనపడవేమిరా భగవంతా - కనుబడు చున్నది జగమంతా
కనబడేదెల్ల కలిమాయెయని - వినుచుంటిరనే భగవంతా” అని సృష్టిలోని వైచిత్రిని భగవంతుని వేర్వేరు రూపాలలో దర్శింపచేస్తాడు.
ఇంకా షర్రాఫ్‌ అమృతదాసు (1897-1959), దాయపంతులపల్లి చెన్నదాసు (1904-964), వెలివర్తి రామదాసు (1905-1941), పొన్నలూరి హనుమద్దాసు (1911-1986), మామిడిపల్లి సాంబకవి (1920-1980) వంటి మరెందరో తెలంగాణ వాగ్గేయకారులు తమ కృతులతో వాగ్గేయ సంప్రదాయాన్ని సుసంపన్నం చేశారు.
Eloquence10

ముస్లిం వాగ్గేయకారులు :

తెలంగాణ ప్రాంతంలో 14వ శతాబ్దం నుండి గోల్కొండ కుతుబ్‌షాలతో మొదలై 1724లో ఆసఫ్‌జాహీల పాలనతో మళ్ళీ పుంజుకొని 1948 వరకు మొత్తం 6 శతాబ్దాలపాటు ముస్లింలు పరిపాలించారు. దీనివల్ల హిందూ-ముస్ల్లింల మధ్య వైరుధ్యాలతోపాటు ఆధ్యాతిక వినిమయం, తాత్విక మార్పిడి కూడా జరిగిందని చెప్పాలి. మరో మాటలో చెప్పాలంటే హిందువులు నిష్కామకర్మ భావన, తాత్విక చింతన ముస్లింలను, ముస్లింల నిరాకార నిర్గుణ ఉపాసన హిందువులను కూడా ఆకర్షించింది.
ఇలా జరుగుతున్న క్రమంలో కొంతమంది ముస్లిం చింతనాపరులు భారతీయ దార్శనికతకు స్పందించి తాముకూడా వాగ్గేయ కారులుగా కీర్తనా సాహిత్య సంగీతాలను సృష్టించారు. వారిలో ప్రముఖంగా ప్రస్తావించదగినవారు - అబ్దుల్‌ అజీం దడాఖా, ఖ్వాజా అహ్మదుద్దీన్‌ వంటివారు.

11 అబ్దుల్‌ అజీం దడాఖా 1869-1965

జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్‌లో జన్మించిన దడాఖా దాదాపు 238కి పైగా కీర్తనలు తెలుగులో 114 కీర్తనలను హిందీలో రచించి భక్తితత్వాన్ని తనదైన రీతిలో ప్రచారం చేసారు.
“గమనించి చూడు మనసా ఘటమందు ఓం శబ్దం
అమనస్కమైతె మనసా ఘటమందు ఓం శబ్దం”
అని భీంప్లాస్‌ రాగంలో ఆదితాళంలో రాసిన కీర్తన తత్వభోధన చేయగా, తోడిరాగం ఆదితాళంలో ఆయన రాసిన “మనమది శ్రీహరి గదిరా - సుజ్ఞానులకే తెలియునురా అనే మరో కీర్తన ఆత్మ - పరమాత్మల భావనను, తత్వాతీతంగా వ్యక్తీకరించింది.

12 ఖ్వాజా అహ్మదుద్దీన్‌ 1905-1970

‘అహ్మదుద్దీన్‌ ఆత్మతత్వాలు’ అనే పేరుతో ఐదు భాగాల గ్రంథాన్ని ప్రచురించిన ఖ్వాజా ప్రస్తుత నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో వసంతాపురం గ్రామంలో జన్మించారు. ఆటతాళంలో ఆయన రాసిన
“ఆటలాడుదమా శ్రీహరి పైన పాట పాడూదామా
సాటిలేని గురుడు నోట జెప్పినమాట పాటి దప్పక నిలిపి
కోటలేడును దాటి ఘట్టి గమనలోన పుట్టుగిట్టుక దెలిపి” అని ప్రభోదించారు. అలాగే ఆటతాళంలో
“త్యాగమెందుకురా మనకు భోగమెందుకురా రాగద్వేషములన్ని మాని యోగిగావలెరా” అని పారమార్థిక తత్వాన్ని పాడారు.

తెలంగాణ వాగ్గేయం - భజన సంకీర్తనా సంప్రదాయం :

తెలంగాణ మట్టిమీద ప్రభవించిన ఎంతోమంది వాగ్గేయకారులు తమ రచనలతో గొప్ప తాత్విక భూమికను, ఆధ్యాత్మిక స్పృహను గ్రామీణ, పల్లె ప్రాంతాలలోసైతం కల్పించారు. అయితే తెలంగాణా వాగ్గేయకార సంప్రదాయంలో మరొక విశేషమేంటంటే ఈ వాగ్గేయ కారులలో రామదాసు వంటివారు మినహా ఇతరులు రాసిన కీర్తనలు అన్నీ శిష్ట సాంప్రదాయం కన్నా దేశీ సంప్రదాయంలో ‘భజన సంకీర్తనల’ పేరిట ప్రజలలో విపరీతంగా వాడుకలోకి వచ్చాయి. శాస్త్రీయ సంగీత కచేరీలలోనూ, సాంప్రదాయ నృత్య రీతులలోనూ ఈ భజన సంకీర్తనలు చొచ్చుకు పోకపోయినప్పటికీ, రాష్ట్రం నలుమూలలో ఉన్న ఆలయాలలో మాత్రం ప్రధాన సంగీత ఉపాసనలుగా జనాదరణ పొందాయి. స్థాయి భేదాలు, ఉన్నత-నిమ్న వర్గాల వివక్షకు అతీతంగా ఇవి ప్రజలందరికీ చేరువై స్వతంత్రంగా, స్వేచ్ఛగా భజన సంకీర్తనలను నేర్చుకొని, పాడి అలరించే సౌలభ్యాన్ని కలిగించాయి. వాగ్గేయకార సంప్రదాయంలో తెలంగాణ ప్రాంతంలో కనిపించే ఈ విశిష్ట భజనసంకీర్తనా ప్రక్రియే తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖను విపరీతంగా ఆకర్షించింది. సామాన్యులకు చేరువై వారిలో ఆధ్యాత్మిక, భక్తి తత్వాన్ని విత్తనాలుగా నాటుతున్న ఈ భజన సంకీర్తన సంప్రదాయానికి తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఇలాంటి సామూహిక వాగ్గేయ వైభవానికి నీరాజనం పట్టాలనీ సంకల్పించింది.

తెలంగాణ వాగ్గేయ వైభవం :

విస్మృత వాగ్గేయకారులను, వారి రచనలను సమీకరించి వారు రాసిన కీర్తనలను భజన సంప్రదాయంలో నేటికీ చిరంజీవిగా నిలిపిన భజన కళాకారులతో సదస్సును నిర్వహించాలనే కార్యాచరణ ప్రణాళికను భాషా సాంస్కృతిక శాఖ చేపట్టింది. ఈ కార్యాన్ని సక్రమంగా నిర్వహించడానికి ఓ నిపుణుల కమిటీని కొంతమంది ప్రముఖులతో ఏర్పాటు చేసింది. వారు..
జమాల్‌పురి శివప్రసాద్‌, సుధారాణి, డా॥ కసిరెడి వెంకటరెడ్డి, డా॥ టి. గౌరి శంకర్‌, జె.బి. వెంకటరెడ్డి.
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, ఒక్కో జిల్లాలో విసిరేయబడినట్లుగా ఉన్న భజన కళాకారులందరినీ ఒక్క చోటుకు తీసుకువచ్చి రవీంద్రభారతిలో తెలంగాణ వాగ్గేయ వైభవ కీర్తిని చాటిచెప్పే బృహత్‌ కార్యక్రమానికి “తెలంగాణ వాగ్గేయకార వైభవమ్‌” పేరుతో శ్రీకారం చుట్టింది. భాషా సాంస్కృతిక శాఖ అపూర్వంగా నిర్వహించిన ఈ వాగ్గేయ వైభవ దీప్తులను నమోదు చేయాలని, ఆ మహనీయ వాగ్గేయకారుల కీర్తనలను కనీసం రెండింటినైనా పొందుపరుస్తూ, వారి కృషిని గ్రంథస్థం చేయాలని ఆశించి ‘తెలంగాణా వాగ్గేయ వైభవం’ పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించింది. ఇది కేవలం పరిచయం మాత్రమే. వీరి కృషిని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

723
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles