అందమైన పొదరింటికి.. అనువైన ఐడియాలు!


Sun,September 15, 2019 01:08 AM

house-designs
మీ మూడ్‌ బాగాలేదా? అయితే మీ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పరికించి చూడండి.. సరైన వెలుతురు లేని ఇల్లు.. చిందరవందరగా ఉన్న గదులు.. ఇవన్నీ మీ మానసిక స్థితి మీద ప్రభావం చూపుతాయి.. ఇవి మేం చెప్పిన మాటలు కాదు.. ఒక పరిశోధనలో తేలిన నిజాలు.. అందుకే మీ కుటుంబం ఎప్పుడూ నవ్వుతూ.. నూతన ఉత్తేజంతో మెరిసిపోవాలంటే.. చీకటిగా ఉన్న గదులను వెలుతురుతో నింపాలి.. దానికోసం ఇంట్లో ఎలాంటి మార్పులు చేయాలో.. ఎలా చేస్తే మరింత ప్రకాశవంతంగా ఇల్లు మెరుస్తుందో.. ఈ విషయాలు తెలియడానికి ఈ జంట కమ్మ చదువండి..
house-designs1
house-designs2

అద్దాల ప్రభావం..

గది మొత్తం చీకటిగా అనిపిస్తున్నదా? అయితే గదంతా వెలుతురుతో నిండిపోవాలంటే చిన్న ట్రిక్‌ పాటిస్తే చాలు. గదిలో వీలైనన్ని అద్దాలు పెట్టాలి. ఫ్లోర్‌ నుంచి సీలింగ్‌ వరకు ఇలా అక్కడక్కడా అద్దాలతో నింపేయాలి. దీనివల్ల చిన్న లైట్‌ వేసినా అది అద్దం వల్ల పది రెట్ల వెలుతురు గది అంతా పరుచుకుంటుంది. పెద్ద పెద్ద అద్దాలు పెట్టినప్పుడు వాటిచుట్టూ ఉండే ఫ్రేమ్స్‌ కూడా కాంతులీనితే గది మరింత అందంగా కనిపిస్తుంది. ఇలా అద్దాలు పెట్టడం వల్ల ఇరుకుగా ఉన్న గది కూడా చాలా విశాలంగా కనిపిస్తుంది.
house-designs3

మెరుపుల్‌.. మెరుపుల్‌..

నేచురల్‌ బ్యాక్‌గ్రౌండ్స్‌ ఎప్పుడూ బాగుంటాయి. కాబట్టి ముదురు రంగు గోడలు ఉన్నప్పుడు లైట్‌ కలర్‌ వాల్‌ ఆర్ట్స్‌తో నింపేయొచ్చు. చిన్న చిన్న ఫొటో ఫ్రేములు తగిలించొచ్చు. నియాన్‌ కలర్‌ ఫర్నీచర్‌ కూడా డార్క్‌ రూమ్‌లకి కరెక్ట్‌గా సూటవుతాయి. ఇక గోల్డ్‌ కలర్‌ టేబుల్‌, గ్లాసీ ఫినిషింగ్‌ కార్పెట్‌లు, మెటాలిక్‌ ఫినిష్‌ వాల్‌ హ్యాంగింగ్స్‌ గది అందాన్ని రెట్టింపు చేస్తాయి. వీటన్నిటినీ డార్క్‌ ఎక్కువ ఉన్న స్థలాల్లో ఉంచాల్సి ఉంటుంది. ముఖ్యంగా గది మూలాల్లో ఈ రంగులు ఉండేలా చేస్తే గది మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
house-designs4

నో గజిబిజి..

ఏవేవో సామగ్రి తీసుకొచ్చి ఇంటిని నింపకండి. చిందరవందరగా ఉండే ఇల్లు ఇరుకుగా ఉంటుంది. అందుకే కావాల్సిన సామాన్లను మాత్రమే కొనుగోలు చేయండి. గది మూలల్లో ఎలాంటి సరంజామా లేకుండా చూడాలి. మూలల్లో కేబినెట్లు, సొరుగులు పెట్టొద్దు. గది మూలల్లో కూడా డిఫరెంట్‌ షేప్‌లో, సైజులో ఉన్న లైట్లతో డెకరేట్‌ చేయండి. మీ ఫేవరెట్‌ ఐటమ్స్‌ మీద ఎక్కువ లైటింగ్‌ పడేలా ఏర్పాటు చేయడం వల్ల కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. లైట్లతో గదిని మీ క్రియేటివ్‌ మైండ్‌తో అలంకరించండి. దీంతో కచ్చితంగా గదితో పాటు, మీ మూడ్‌ చక్కబడుతుంది.
house-designs5

తెల్లని తెలుపే

ఫర్నీషింగ్‌.. డెకరేటివ్‌ ఐటమ్స్‌ కూడా ఇంటిని చిందరవందరగా చూపిస్తాయి. కాబట్టి వీటిమీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. గది చిన్నగా ఉన్నప్పుడు డార్క్‌ కలర్స్‌.. డీప్‌ కలర్స్‌ని ఎంచుకోకపోవడమే ఉత్తమం. లేత రంగుల ఫర్నీచర్‌, ఇతర సామగ్రి ఉండేలా చూసుకోండి. అందులోనూ తెలుపయితే మరింత మంచిది. కర్టెన్లు, బెడ్‌షీట్స్‌, ఫ్లవర్‌వాజ్‌ల్లాంటివి తెల్లవి ఎంచుకుంటే మీరు మరింత రిలాక్స్‌డ్‌ వాతావరణంలో ఉన్నట్టనిపిస్తుంది. పైగా లైట్‌ పడినప్పుడు ఈ తెల్లని రంగు గది అంతా వ్యాపించేలా చేస్తుంది.
house-designs6

ముదురు రంగులు వద్దు..

గది నిండా ఫర్నీచర్‌లతో నింపొద్దు. అలా చేస్తే గది మరింత ఇరుకుగా కనిపిస్తుంది. అందులోనూ వాటిని ముదురు రంగులు కాకుండా, లేత రంగుల్లో ఉండేలా ఫర్నీచర్‌ని ఎంచుకోండి. గది చిన్నగా ఉన్నప్పుడు చెక్క ఫర్నీచర్‌ కాకుండా, ఫైబర్‌లాంటివి తీసుకోండి. గోడలకు ఫ్రేములు కూడా ఎక్కువ పెట్టకండి. దీనివల్ల గోడ మూసుకుపోయిన భ్రాంతి కలుగుతుంది.
house-designs

బ్యాలెన్స్‌ చేయాలి

చీకటిని.. వెలుతురును బ్యాలెన్స్‌ చేసినప్పుడు ఇల్లు విశాలంగా అనిపిస్తుంది. మీ ఇల్లే మీ సామ్రాజ్యం. దాన్ని చక్కగా తీర్చిదిద్దుకొనే బాధ్యత మీదే. మీ గదిని బట్టి మీ పర్సనాలిటీని చెప్పేయొచ్చంటున్నారు నిపుణులు. అందుకే జాగ్రత్తగా గదిని డెకరేట్‌ చేయాలి. ముదురు రంగులతో గోడలు ఉంటే.. ఫర్నీచర్‌, బెడ్‌ లేత రంగులో ఉండాలి. కార్పెట్‌లు కూడా ముదురు ఉండకూడదు. ఎర్తీ కలర్స్‌, లైట్‌ యెల్లో, క్రీమ్‌ కలర్స్‌లాంటివి గది డెకరేషన్‌కి బాగా సూటవుతాయి.
house-designs8

కర్టెన్స్‌ కరెక్ట్‌..

కొందరు చిన్న, చిన్న కర్టెన్లు.. అవి కూడా మందంగా ఉన్నవి వేస్తారు. దీనివల్ల ఇంట్లో దుమ్ము చేరదని వారి అభిప్రాయం. కానీ అలా ఉన్నా కూడా దుమ్ము వచ్చేది వస్తూనే ఉంటుంది. కాబట్టి చిన్న గదులు ఉన్నప్పుడు మందమైన కర్టెన్లు వేయకూడదు. షీర్‌, ఇతర లైట్‌ ఫ్యాబ్రిక్స్‌ని కర్టెన్లుగా ఎంచుకోవాలి. ముఖ్యంగా షీర్‌ ఫ్యాబ్రిక్‌ గదిలోకి ఎక్కువ వెలుతురు ప్రసరించేలా చేస్తుంది. గది విశాలంగా కనిపించేలా భ్రాంతి కలుగచేస్తుంది. అంతేకాదు.. గోడ పొడవుగా, వెడల్పుగా ఉండే కర్టెన్లు వేయడం మంచిది.
house-designs9

ఆకుపచ్చందం..

మనసుకు ఆహ్లాదంగా ఉండాలంటే చిక్కటి వెలుతురే కాదు.. చక్కటి గాలి కూడా ఉండాలి. దానికి చుట్టుపక్కలే కాదు.. ఇంట్లో కూడా పచ్చందనం కావాలి. ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెంచడం వల్ల ఇల్లు మరింత బ్రైట్‌గా కనిపిస్తుంది. అలా అని పెద్ద చెట్లు కాకుండా.. పాకేలా ఉండే చెట్లు, చిన్న బోన్సాయ్‌ మొక్కలను పెంచండి. ఇలాంటి వాటికి పెద్దగా సూర్యరశ్మితో పని ఉండదు. అలాగే ఎక్కువగా డార్క్‌ ప్రదేశాల్లో ఈ మొక్కలు పెడితే ఆ మూలలు చూడచక్కగా కనిపిస్తాయి.
- సౌమ్య పలుస

681
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles