ముక్కు - ముక్కుపుడక


Sun,September 15, 2019 01:01 AM

Mukku-pudaka
ఒకగ్రామ భూస్వామి మహాకవి, మహా భక్తుడు అయిన తులసీదాస్‌ని తమ గ్రామానికి పిలిపించాడు. తులసీదాస్ రామచరిత మానస్‌ని తమ గ్రామస్థుల ముందు గానం చేసి వాళ్ళని తరింప చేయమని ప్రార్థించాడు. ఆ గ్రామంలో అందమైన రామాలయం ఉంది. గుడి ముందు ఎత్తుగా కట్టిన అరుగు ఉంది. దాని ముందు పచ్చిక బయలు ఉంది. అరుగుపై చక్కగా మెత్త అమర్చి మహాకవి అనుకూలంగా కూర్చోవడానికి ఏర్పాట్లు సమకూర్చారు. గ్రామస్థులందరూ పచ్చిక బయల్లో ప్రశాంతంగా కూర్చొని మహాకవి తులసీదాస్ వినిపించే రామచరిత మానస్ వినడానికి సంసిద్ధులయ్యారు.
వాతావరణం ప్రశాంతంగా ఉంది. జనం నిశ్శబ్దంగా ఉన్నారు. తులసీదాస్ భగవన్నామస్మరణ చేసి రామచరిత మానస్ గానం చెయ్యడం మొదలు పెట్టారు. అందరూ తన్మయత్వంతో విన్నారు. తమని తాము మరచిపోయారు. తులసీదాస్ రాముని సన్నిధానంలో ఉన్నంత పరవశంగా రామచరిత మానస్ గానం చేశాడు.

అప్పటికే బాగా చీకటి పడింది. తన రామచరిత మానసగానం పూర్తయ్యాక మంగళచరితం చేసి ఆ రోజుకి పఠనం ముగించాడు.జనం చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చారు. ఇక ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి సమాయత్తమయ్యారు. అందరూ ఒకరి తరువాత ఒకరు తులసీదాస్‌కు పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
చివరగా భూస్వామి తులసీదాస్‌కు పాదాభివందనం చేసి స్వామీ! మీకు కూడా బాగా ఆలస్యమైంది. మీరు స్నాన పూజాదులు ముగించి కానీ భోజనం చెయ్యరు కదా! మీరు కూడా బయల్దేరండి అని సెలవు తీసుకున్నాడు.
తులసీదాస్ బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. అయితే దూరంగా ఒకరెవరో తన దగ్గరికి రావడానికి సందేహిస్తూ ఉన్నట్లు తులసీదాస్‌కు అనుమానం కలిగింది. అటువైపు చూశాడు. ఆమె ఒక స్త్రీ. సందేహిస్తూ కనిపించింది. సిగ్గుపడుతూ జంకుతూ ఉన్నట్లనిపించింది. తులసీదాస్ అటువైపు చూసి అమ్మా! ఎందుకు అంత దూరంగా ఉన్నావు. దగ్గరగారా అని పిలిచాడు. మహాకవి పిలుపుతో ఆ స్త్రీ దగ్గరికి వచ్చి తులసీదాస్‌కు పాదాభివందనం చేసింది. దీర్ఘాయుష్మాన్‌భవ! అని తులసీదాస్ ఆశీర్వదించాడు.

ఆశీర్వాదం అందుకున్న తరువాత కూడా ఆమె వెళ్ళకుండా నిలుచుంది. ఆమెకు ఇరవై ఏళ్ళు ఉంటాయి.
ఆమె స్వామీ! మీరు నా ముఖం చూశారు కదా! ఎలా ఉంది? అంది. అమ్మా! నీ ముఖం చాలా బాగుంది. అందంగా, ఆనందంగా కనిపిస్తున్నావు అన్నాడు.
స్వామీ! నా ముఖంలో ఇంకేమీ కనిపించడం లేదా? అంది.
నీ ముఖం కాంతితో వెలుగుతోంది అన్నాడు.
అది కాదు స్వామీ! నా ముక్కెర చూశారా? అది వజ్రం పొదిగింది. మా ఆయన వద్దన్నా వినకుండా చాలా డబ్బుపోసి కొన్నాడు. చాలా బాగుంది కదా స్వామీ అంది.
తులసీదాస్ అవును. అందుకనే అది ధగధగ లాడుతోంది అన్నాడు.
నేను వద్దన్నాను స్వామీ! కానీ మా ఆయన నాకు చాలా బాగుంటుందని కొన్నాడు. అందుకే అది దీపంలా వెలుగుతోంది అంది గర్వంగా.
తులసీదాస్ అమ్మా! నిజమే! అది మెరుస్తోంది. ఇంకో విషయం గమనించు. ముక్కర, అందమైందే. కానీ ఆ ముక్కెర, నువ్వు పెట్టుకున్నావు. నీ ముక్కెర చాలా అందమైందని గర్వపడుతున్నావు. ఆ ముక్కెర నిలబడడానికి కారణమైన ముక్కును చూసి గర్వపడు. అంతేకాదు అటువంటి ముక్కును ఇచ్చిన భగవంతుడికి నువ్వు తలవంచు అన్నాడు.
వజ్రం కన్నా విలువైన మాట చెప్పిన తులసీదాస్ పాదాలపై ఆమె తలవాల్చింది.
-సౌభాగ్య

- ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్ నంబర్‌లో తెలియజేయండి.

279
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles