మహిమాన్విత దేవాలయం జైనాథ్ లక్ష్మీనారాయణస్వామి


Sun,September 15, 2019 01:00 AM

అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఒక్కటైన శ్రీ జైనాథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం శిల్పకళకు నిలువెత్తు నిదర్శనం. ఈ ఆలయం ఉన్నత శిఖరంతో శోభిళ్లుతున్నది. ప్రాచీన కాలంలో జైనాథ్, జైన బసదుగా ఆలయం జీర్ణాలయంగా ఉన్నట్లు పూర్వీకులు చెబుతారు. సంతాన సాఫల్యత, కోరిన కోర్కెలు తీర్చే దేవుడని భక్తులు నమ్ముతారు. అందుకే ఇక్కడి గ్రామాల్లో అందరికీ నారాయణ స్వామి, నారాయణ మూర్తి, శ్రీ, లక్ష్మి అంటూ లక్ష్మీనారాయణుడి పేరువచ్చేలా పెట్టుకోవడం ఆనవాయితీ. ఈ దేవాలయాన్ని శ్రీముఖ శాతవాహనుడు నిర్మించినట్లు చెబుతారు.
JAINATH
ఆలయ మూలవిరాట్టు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి. ఇది మహిమాన్విత ఆలయంగా వెలుగొందుతున్నది. ఇక్కడి శిలాశాసనాలను బట్టి, ఆలయ గోడలపై చెక్కిన దాదాపు 20 శ్లోకాలను బట్టి ఈ ఆలయాన్ని పల్లవ రాజులు నిర్మించారు. పల్లవులు క్రీ.శ.4 నుండి 9వ శతాబ్దం వరకు దక్షిణ భారతావనిని దాదాపు 500 ఏళ్ళు పరిపాలించారు. వారు పరాక్రమ వీరులే కాక రాతిని చెక్కి అందమైన శిల్పాలుగా మార్చే కళలో ప్రసిద్ధులు. వారి కాలంలో అనేక ఆలయాలు నిర్మితమవ్వగా వాటిలో ఈ జైనాథ్ ఆలయం ఒకటి. ప్రకృతి సిద్ధంగా లభించే నల్ల రాతితో ఈ ఆలయం నిర్మితమైంది. అయితే కోటిలింగాల ప్రాంతాన్ని గణతంత్రరాజ్యంగా చేసుకుని పాలించిన శాతవాహన వంశపు తొలి రాజు, జైన మతస్థుడు శ్రీముఖ శాతవాహనుడు దీన్ని నిర్మించినట్లు కూడా చెబుతారు. అతడు ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని పశ్చిమ దిశలో మహారాష్ట్ర ప్రాంతాన్ని జయించాడు. జైన మతస్తుడు కనుక జైనాథ్, జైనాలయం నిర్మించినట్లు పూర్వీకులు చెబుతున్నారు. శాతవాహన కాలంలో జైనాథ్ జైన మత కేంద్రంగా వర్ధిల్లిందని చెబుతుంటారు. శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయ అంతరాల మండపాన పగిలి పోయిన శిలాఫలకంపై దేవనాగరి లిపితో ఉన్న శాసనం సూర్యాయ నమఃతో ప్రారంభమైంది.

అద్భుత శిల్పకళ

ఈ ఆలయం 11-13 శతాబ్దాల్లో మహారాష్ట్రలో వేవత్‌మాలవంత్ రాతితో నిర్మితమైంది. జైనాథ్ పరిసర ప్రాంతాల్లో ఈ ఆలయానికి వాడిన శిల(రాయి) లభించదు. ఈ రాయిని మహారాష్ట్రలోని పాండ్రకవడ నుంచి తెప్పించి ఆలయాన్ని నిర్మించారు. అత్యంత మనోహరంగా అధిష్ఠానం, వర్గములు ఆగమ శాస్ర్తానికి అనుగుణంగా ఉన్నాయి. ఈ ఆలయం బాదామి చాళుక్యుల శిల్పకళతో వర్థిల్లుతున్నది. 60 చదరపు గజాల ఎత్తు, 40 గజాల వైశాల్యం ఉన్న అష్టకోణాకార మండపంపై ఉన్న గర్భగుడిలో సూర్యనారాయణ స్వామి విగ్రహం ప్రతిష్టితమైంది. ఇదే లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం. స్వామి విగ్రహానికి దక్షిణ దిశలో లక్ష్మీదేవి, అల్వారుతో పాటు వివిధ దేవతామూర్తుల విగ్రహలు ఉన్నాయి. మండప అంతర్భాగంలో స్తంభంపై హనుమంతుడు, రంభ, అప్సరసల శిల్పాలు ఉన్నాయి. ఆలయం ముందు గరుడ స్తంభం ఉన్నది. ఆలయం ఇరువైపులా శృంగార భంగిమల చిత్రాలు ఉన్నాయి.

స్వామి పాదాలను తాకే సూర్యకిరణాలు

ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో సూర్యకిరణాలు శ్రీలక్ష్మీనారాయణ స్వామి విగ్రహ పాదాలను తాకుతూ ప్రసరిస్తాయి. అందుకే ఈ ఆలయాన్ని సూర్యనారాయణ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. సంతాన సాఫల్యత, కోరిన కోర్కెలు తీర్చే దేవుడని నమ్మే ఇక్కడి ప్రజలు తమ సంతానానికి నారాయణ స్వామి , నారాయణ మూర్తి, శ్రీ, లక్ష్మి అని పేర్లు పెట్టుకుంటారు.

JAINATH2
బ్రహ్మోత్సవాలు: ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక బహుళ పంచమిని పురస్కరించుకొని స్వామి వారి కల్యాణం, బ్రహ్మోత్సవాలు, రథోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనారాయణ స్వామి జాతర నిర్వహిస్తారు. ఈ జాతరకు మహారాష్ట్రతోపాటు నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు.

JAINATH5
ఎక్కడ ఉంది? జైనాథ్ ఆలయం అదిలాబాద్‌కు 21 కిలోమీటర్ల దూరంలో జైనాథ్ గ్రామంలో వుంది. హైదరాబాదు నుండి కామారెడ్డి, నిర్మల్, అదిలాబాద్ మీదుగా 315 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.

233
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles