పద్య రత్నాలు-19


Sun,September 15, 2019 12:57 AM

నేర్పరితనం


Nerpaeithanam

ఆచార్యున కెదిరింపకు

బ్రోచిన దొర నిందసేయ బోకుము కార్యా లోచనము లొందజేయకు మాచారము విడువ బోకుమయ్య కుమారా!
- కుమార శతకం

తాత్పర్యం:

నేర్పరులైన వారి వ్యక్తిత్వం అత్యంత విలక్షణం. మన గురువును ఎప్పుడూ ఎదిరించకూడదు. అన్నం పెట్టే యజమానిపై ఎలాంటి నిందలూ వేయరాదు. చేసే పనులను గురించి అదే పనిగా ఆలోచిస్తూ వృథాగా కాలక్షేపం చేస్తూ కూచుంటే ఏ ప్రయోజనమూ ఉండదు. ఇటువంటి మంచి నడవడికలతో మెలిగే వారు నిజమైన నేర్పరులు.

ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్ నంబర్‌లో తెలియజేయండి.

అదృష్టవంతులు

Adrustavanthulu
ఊరక వచ్చు బాటుపడ కుండినవైన ఫలంబదృష్టమే
పారగగల్గువానికి బ్రయాసము నొందిన దేవదానవుల్
వారలటుడుండగా నడుమ వచ్చిన శౌరికి గల్గెగాదె శృంగా
రపుబ్రోవు లక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా!
- భాస్కర శతకం

తాత్పర్యం:

అదృష్టవంతులకు ఇతరుల ప్రయాసలకు అతీతంగా మంచి ఫలితాలు లభిస్తుంటాయి. ఎదుటివారి కష్టనష్టాల ప్రభావం వీరిపై ఏ మాత్రం పడదు. అందుకే, అదృష్టవంతులకు ఎప్పుడూ నిశ్చింతే. ఎందుకంటే, అన్నీ మంచి ఫలితాలే కనుక. ఎలాగంటే, దేవదానవులు పాలకడలిని చిలుకుతూ కష్టపడుతుంటే, శ్రీమహావిష్ణువుకు లక్ష్మీదేవి లభించినట్లు.

ఆలకింపవా స్వామీ!

Aala-kimpava-swamy
నిను నా వాకిలి గావు మంటినొ? మరున్నీ లాలకభ్రాంతి గుం
టెన పొమ్మంటినొ? యెంగిలిచ్చి తిను తింటేగాని కాదంటినో?
నిను నెమ్మిం దగ విశ్వసించు సుజనానీకంబు రక్షింప చే
సిన నా విన్నపమేల గైకొనవయా? శ్రీకాళహస్తీశ్వరా!
- కాళహస్తీశ్వర శతకం

తాత్పర్యం:

భగవంతుడు ఎవరి విన్నపాన్ని ఎప్పుడు వినాలో అప్పుడే వింటాడు. ఓపికతో ఎదురు చూడడం తప్ప భక్తులకు మరో దారి లేదు. బాణాసురునివలె ఇంటికి కాపలా వుండమనలేదు, దేవతా స్త్రీల దగ్గరకు రాయబారిగా వెళ్లమనలేదు, తిన్నడి భక్తిలా ఎంగిలే తినమనలేదు. అయినా, ఆ స్వామి ఆలకించడం లేదు. ఎందుకంటే, ఇవన్నీ వారికే చెల్లింది.

జ్ఞానోదయం ఎప్పుడు?

Gnanodayam-epudu
పసరంబు పంజైన బసులకాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన బ్రభుని తప్పు,
భార్య గయ్యాళైన బ్రాణనాథుని తప్పు, తనయుడు దుడుకైన దండ్రి తప్పు,
సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు,
అశ్వంబు దురుసైన నారోహకుని తప్పు, దంతి మదించ మావంతు తప్పు,
ఇట్టి తప్పు లెఱుంగక యిచ్చ వచ్చి
నటుల మెలగుదు రిప్పుడీ యవని జనులు
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!!
- నరసింహ శతకం

తాత్పర్యం:

పశువులు దారితప్పితే కాపరిది, ప్రజలు చెడ్డవారైతే రాజుది, భార్య గయ్యాళితనానికి భర్తది, కొడుకు దుడుకుతనానికి తండ్రిది, కూతురు చెడునడతకు తల్లిది, సైన్యం పిరికిదైతే సైన్యాధిపతిది, గుర్రం ఆగిపోతే రౌతుది.. తప్పవుతుంది. ఎవరికి వారు ఇలా తమ తప్పుల్ని తెలుసుకోక ఇష్టం వచ్చినట్లు వుంటే ఎలా? నీవైనా వారికి జ్ఞానోదయం కలిగించు స్వామీ!!

172
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles