నెట్టిల్లు


Sun,September 15, 2019 12:45 AM

అవకాశాలుంటే తామేంటో నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది ఈతరం యువకులు. అందుకే చిత్రకళలో వారి ప్రతిభను నిరూపించుకొనేందుకు షార్ట్‌ఫిలిమ్‌ల బాట పట్టారు. ఆకట్టుకొనే కథా-కథనాలతో, చక్కటి నిర్మాణ శైలితో ఔరా అనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కిందటి వారంలో యూట్యూబ్ వేదికగా కొన్ని లఘుచిత్రాలు వచ్చాయి. అవే ఇవి..

నీ కోసందర్శకత్వం: పవన్ ఎనగందుల
నటీనటులు : రవితేజ, శిరీష
సూరజ్, నేహా.. ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తుంటారు. సూరజ్‌కు నేహా అంటే ఇష్టమే కానీ ఎప్పుడూ చెప్పడు. ఓ రోజు నేహాకు శాశ్వతంగా ఢిల్లీకి బదిలీ అవుతుంది. విషయం తెలుసుకున్న సూరజ్ నేహాతో కలిసి కాఫీ తాగాలనుకుంటాడు. ఎందుకంటే ఢిల్లీకి వెళ్లే ముందు తనతోనే చివరి కాఫీ కావాలని సూరజ్ కోరుకుంటాడు. ఇలా నేహాను కాఫీకి ఆహ్వానిస్తాడు. విమానానికి ఐదు గంటల సమయమే ఉన్నప్పటికీ నేహా కాఫీకి వస్తుంది. అక్కడ నేహాకు అసలు విషయం చెపుతాడు. తనంటే ఇష్టమనీ, ఎప్పటినుంచో చెప్పాల్సింది అనీ అంటాడు. కానీ సూరజ్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో ఆమెకు అర్థం కాదు. అప్పుడు సూరజ్ స్పందిస్తూ చాలామంది ధైర్యం చేసి ఇష్టమైన వాళ్లమీద అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు. నువ్వంటే ఇష్టం అనే ఫీలింగ్‌ను నేను తెలియజేయాలనుకున్న, నీకు ఇష్టమైతే చెప్పు లేదంటే వద్దు అంటాడు. నేహా ఆలోచనలో పడుతుంది. అతను అమెను ప్రేమిస్తున్నట్టు తెలుసుకుంటుంది. సూరజ్ సరైన వ్యక్తే అనే అభిప్రాయం ముందు నుంచే ఉండడంతో అంగీకరించేందుకు సిద్ధం అవుతుంది. అంగీకరించడానికి ఆలస్యం చేస్తూ అతన్ని వేచి ఉంచడానికి ఇష్టపడదు. వెంటనే తనకూ ఇష్టమని చెపుతుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, వాతావరణంతో ఆకట్టుకునేలా తీశారు. మీరూ చూడండి.

Total views
127,821+
(సెప్టెంబర్ 7 నాటికి)
Published on
Sep 4, 2019

లేఖదర్శకత్వం: చైతన్య
నటీనటులు : ప్రత్యూష భరద్వాజ్, మోహన్
ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ఉండే స్నేహాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇద్దరి మధ్య ఉండే బంధం పట్ల చాలా రకాల మాటలు వినబడతాయి. కానీ వాళ్ల మధ్య ఉన్న బంధుత్వం ఏంటీ? అని అర్థం చేసుకునే ప్రయత్నం చాలా తక్కువ మందే చేస్తారు. కొందరు ఎవరితోనో సన్నిహితంగా ఉంటున్నారనీ, దాన్ని తప్పుగా అర్థం చేసుకొని కొందరైతే విడిపోతారు కూడా. ఇలా ఎందుకు జరగాలి? అమ్మాయి, అబ్బాయి మధ్య ఉన్న బంధాన్ని ప్రేమ అనో, ఇంకేదో అనో ఎందుకు అనుకోవాలి? అని చెప్పేదే లేఖ లఘు చిత్రం. కథ విషయానికి వస్తే.. లేఖ అనే అమ్మాయి చిన్నప్పటి నుంచి అబ్బాయిలతో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆ జ్ఞాపకాలను డైరీలో రాసుకుంటుంది. ఆ డైరీ చూసిన ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆమెను తప్పుగా అర్థం చేసుకొని దూరం పెడతాడు. కానీ లేఖ ఓ రోజు అతన్ని కలిసి విషయం అంతా చెపుతుంది. దీంతో ఆ అబ్బాయి చేసిన తప్పు తెలుసుకుంటాడు.. ఆ డైరీ చూసి లేఖను అంతలా తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధపడతాడు. ఇదీ కథ. అమ్మాయి, అబ్బాయి మధ్య ఉన్న స్నేహాన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు అనే సందేశంతో ఈ కథ ముగుస్తుంది.

Total views
1,364+
(సెప్టెంబర్ 7 నాటికి)
Published on Sep 5, 2019

మాటే వినదుగ మనసే..దర్శకత్వం: సిద్ధు
నటీనటులు : సిద్ధు, హర
సిద్ధు, హర పరిచయం యాదృచ్చికంగా అవుతుంది. ఓ రోజు సిద్ధు కొత్తబైక్ వేసుకొని ఆఫీస్‌కు వెళ్తుంటాడు. ఇదే క్రమంలో హర కూడా బైక్‌పై హడావుడిగా వస్తుంది. ఇలా సిద్ధు బైక్‌ను హర ఢీకొడుతుంది. దీంతో కోపం తెచ్చుకున్న సిద్ధు హరను చివాట్లు పెడతాడు. మధ్యలో ఓ ఫ్రెండ్ వచ్చి కలుగజేసుకుంటాడు. ఈ క్రమంలోని హరకు సిద్ధు ఇంప్రెస్ అవుతాడు. ఈ యాక్సిడెంట్ టైంలోనే నంబర్లు కూడా మార్చుకోవడంతో ఇద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ కూడా చిగురిస్తుంది. కానీ పెండ్లి విషయానికి వచ్చేసరికి ఇద్దరి మధ్య కులం అడ్డు వస్తుంది. హర వాళ్ల ఇంట్లో చెప్పినా అబ్బాయిది ఒకే కులం కాకపోవడంతో పెండ్లికి ఒప్పుకోరు. ఈ క్రమంలోనే హరకు పెండ్లి సంబంధాలు రావడం, నిశ్చితార్థం కూడా అవుతుంది. సిద్ధు కొన్ని రోజులు టైం అడిగినా హర వినకుండా నిశ్చితార్థానికి ఒప్పుకుంటుంది. దీంతో ఆవేదన చెందుతాడు సిద్ధు. హరను తిట్టి ఇంక చాలు అంటాడు. ఇంతటితో కథ ముగుస్తుంది.

Total views
774+
(సెప్టెంబర్ 7 నాటికి)
Published on
sep 05, 2019

ప్రేమ ఎంత మధురందర్శకత్వం: విజయ్
నటీనటులు : రామకృష్ణ, శంకర్, పావని, నివాస్
తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఉన్నతంగా చదివించి, మంచి భవిష్యత్తును కాంక్షిస్తారు. కానీ పిల్లల ప్రవర్తన దానికి భిన్నంగా ఉంటుంది. అలా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఈ లఘు చిత్రంలో చూపించారు. కథలోకి వస్తే.. శ్రీరాంకు స్వప్న, శ్రీను పిల్లలు. డిగ్రీ చదువుతుంటారు. చదువుతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తాడు. ఏది అడిగినా కాదనకుండా సర్దుబాటు చేస్తాడు. కానీ పిల్లలు మాత్రం తండ్రి కష్టాన్ని అర్థం చేసుకోకుండా అడ్డదారుల్లో వెళ్తారు. కొన్ని ఘటనల తర్వాత ఇద్దరు పిల్లలూ కలిసి ఓ నిర్ణయానికి వస్తారు. తండ్రి వారి జీవితాలకు అడ్డంపడుతున్నాడనీ, వారి ఆస్తిని వీలైనంత త్వరగా దక్కించుకుంటే ఇష్టమైనట్టు చేయొచ్చనుకుంటారు. ఈ మాటలు విన్న తండ్రి తీవ్రంగా బాధపడతాడు. ఇంటి నుంచి వెళ్లిపోతాడు. మిత్రుని ద్వారా ఆస్తిని పిల్లలకు అందేలా చూస్తాడు. ఆర్నెళ్ల తర్వాత ఆ పిల్లలు తండ్రిని కలుస్తారు. అప్పుడే వాళ్లు చేసిన తప్పేంటో తెలుసుకుంటారు. శ్రీను జీవితంలో, స్వప్న ప్రేమలో చేసిన తప్పేంటో తెలుసుకుంటారు. అదేంటో యూట్యూబ్‌లో చూడండి.

Total views
736+
(సెప్టెంబర్ 7 నాటికి)
Published on Sep 6, 2019

వినోద్ మామిడాల,
సెల్: 7660066469

228
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles