గణపతి బప్పా మోరియా!


Sun,September 1, 2019 04:09 AM

GanapathiBanner
విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. ముళ్లోకాలకు ప్రీతిపాత్రుడు. గంభీరమైన రూపం అతనిది. ఘనమైన పూజలందుకొని.. గణాధిపతిగా కొలువుదీరి.. విఘ్ననాయకుడై వర్ధిల్లుతున్నాడు. ప్రతీ సంవత్సరం.. సకల జనులతో కీర్తింపబడి.. సర్వ భజనలతో స్తుతించబడి.. ముక్తిని పంచుతూ.. భక్తిని పెంచుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలకు కారణభూతుడవుతున్నాడు. అలాంటి గణేషుడి గురించి.. వినాయక చవితి గురించి.. గణేషుడితో సంబంధించిన ఆసక్తికర అంశాల గురించి.. పూజ గురించి.. నిమజ్జనం గురించి వివరంగా తెలుసుకొని వినాయక ఉత్సవాలు జరుపుకొందాం. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఎకో ఫ్రెండ్లీ గణపతికి ప్రాధాన్యమిద్దాం. గల్లీకో గణేషుడు.. ఇంటికో వినాయకుడు కాకుండా.. ఊరికొక వినాయకుడిని ప్రతిష్ఠించి పూజిద్దాం.

వక్రతుండ మహాకాయ.. కోటిసూర్య సమప్రభాయ అంటే ఆర్థులను అక్కున చేర్చుకొని నిండు ధైర్యాన్ని ఇచ్చేవాడు అని అర్థం. కార్యం నిర్విఘ్నంగా జరిగేందుకు వినాయకుడు ఎల్లవేళలా తోడుంటానని అభయమిస్తాడు. అందుకే ఏ పని ప్రారంభించాలన్నా వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తాం. బుద్ధిబలంతో పనిచేస్తే విజయం సాధ్యమని చెప్పడానికి వినాయకుడి జీవితమే ఉదాహరణ. ఆయన రూపమే భక్తకోటికి పెద్ద పాఠం.
గణపతి.. ప్రథమ దేవుడు.. ఏ కార్యానికైనా అవరోధాలను తొలగించి సిద్ధినీ.. బుద్ధినీ ప్రసాదించే దివ్యశక్తినే గణపతిగా ఉపాసించడం వేద ప్రమాణం. పూజగానీ.. యజ్ఞంగానీ లోకకల్యాణం కోసం చేస్తారు. ఆరాధించే దేవతా గణానికీ.. మంత్ర సమూహానికీ.. యాజ్ఞికుల బృందానికీ ప్రభువై.. ఫలప్రదాతయై అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతిగా చెప్పుకుంటారు. సమస్త చేతన.. అచేతన వర్గాలకు ఆయనే అధిపతి. ప్రతి కార్యారంభంలోనూ విఘ్నేశ్వరపూజ జరిపినప్పటికీ భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రత్యేకంగా పూజిస్తారు. ఆ రోజే ఎందుకంటే.. అది వినాయకుడు పుట్టినరోజు.. ఇంకా విఘ్నరాజత్వం సంప్రాప్తించిన రోజు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మహదాదితత్తాలకు ఆయన అధిపతి కాబట్టి గణపతి అయ్యాడు.

తర్పణ ప్రియుడు

సూర్యుడు నమస్కార ప్రియుడు. విష్ణువు అలంకార ప్రియుడు. గణపతి తర్పణ ప్రియుడు. గణపతికి ప్రియమైన చతురావృత్తి తర్పణం చేయడం వల్ల ఆయుష్షు, బుద్ధి, యశస్సు, ఐశ్వర్యం, బలం, భుక్తి, ముక్తి, యుక్తి చేకూరుతాయని భక్తుల నమ్మకం. గణేషుడి దేహం విలక్షణం. బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్న అని ఆయన రూపం బోధిస్తుంది. వ్రతకథ చదివి లేక విని అక్షింతలు తలపై వేసుకుంటే ఆ రాత్రి చంద్రుడిని చూసినా నీలాపనిందలు కలుగవని భక్తుల నమ్మకం.


ఊరికి ఒక్కడే వినాయకుడు

ఊరంతటికీ ఒక్కడే వినాయకుడు. అదీ కూడా మట్టి వినాయకుడు. చాలా విచిత్రంగా ఉంది కదూ? విచిత్రమే అయినా.. ఇదొక మంచి కార్యక్రమం. ఇప్పుడు కచ్చితంగా జరుగాల్సిన మార్పు. అందరూ కలిసి ఒకే వినాయకుడికి పూజ చేస్తే ఎంత బాగుంటుంది? ఊళ్లో సోదరభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇదెక్కడో ఉత్తరాదిన జరుగుతున్న మార్పు కాదు. తెలంగాణ పల్లెల్లో ఇప్పుడిప్పుడే చేతులు కలుపుతూ.. అడుగులు ముందుకు పడుతున్న ఉద్యమం. మాజీ మంత్రి హరీష్‌రావు పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామం మొదటగా స్పందించింది. యువత.. మహిళలు.. రైతులు.. ప్రజా ప్రతినిధులు అందరూ అన్ని వర్గాలూ ఒక్కటయ్యారు. సంఘాలు.. యూనియన్లు కూడా ఏక వినాయకుడికే జై కొట్టాయి. ఏకాభిప్రాయంతో ఈయేడు మిట్టపల్లి గ్రామంలో ఒకే వినాయకుడిని ప్రతిష్టించి సరికొత్త మార్పునకు నాంది పలుకుతున్నారు గ్రామ ప్రజలు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని రాంపూర్.. మాచపూర్ బండ.. చెర్లపల్లి.. నారాయణరావు పేట.. కోదండపల్లి గ్రామాల ప్రజలు కూడా తమ ఊళ్లో ఒకే వినాయకుడిని ప్రతిష్టిస్తామని తీర్మానం చేశారు. అంతేకాదు.. వీటికి సంబంధించిన రాతపూర్వక హామీని కూడా ఇచ్చారు. నిజానికి వినాయక ఉత్సవాల ఉద్దేశం ఏంటి? అని ఆలోచిస్తే.. ఛత్రపజి శివాజీ కాలంలో సంప్రదాయంలో భాగంగా వినాయక ఉత్సవాలను నిర్వహించేవారు. తర్వాత లోకమన్య తిలక్.. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు గణేశ్ ఉత్సవాలు కచ్చితంగా జరగాల్సిందిగా పిలుపునిచ్చారు. అప్పటి నుంచి ప్రతీ ఊరు.. ప్రతి పల్లె.. ప్రతి వాడలో వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపనలు.. ఉత్సవాలు.. ఊరేగింపులు జరుగుతూ వస్తున్నాయి. అయితే తిలక్ ఉద్దేశం ఏంటి? వర్గాలు.. గ్రూపులుగా ఉన్న ప్రజలు ఐకమత్యంగా ఉండాలి అనే కదా? కానీ రానురాను గల్లీ గల్లీకి.. ఇంటింటికీ వినాయక విగ్రహాలు ప్రతిష్టించడం మొదలైంది. దీంతో పర్యావరణంపై దుష్ప్రవాలు పడ్డాయి. పర్యావరణ ప్రేమికులు ఎకో గణేశుడు ముద్దు.. రసాయనాల వినాయకుడు వద్దు అని అవగాహన కల్పిస్తూ పర్యావరణం, పండుగలపై మంచి అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. మార్పు మొదలైంది కానీ.. ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు కావాల్సింది మట్టి వినాయకుడు ఒక్కటే కాదు.. వినాయక విగ్రహాలను తగ్గించాలి. దాంట్లో భాగమే ఈ ఊరికొక వినాయకుడు. అందరూ ఇలా ఆలోచిస్తే పర్యావరణం బాగుంటుంది.. పండుగలూ బాగుంటాయి!

గణాధిపతి

ఆయనకు గజాననుడు అనే పేరు పెట్టారు. తర్వాత గణేశుడు.. విఘ్నాధిపత్యం స్వీకరించి భక్తుల మెప్పు పొందాడు. నైవేద్యంగా పెట్టిన కుడుములు.. ఉండ్రాళ్లు ఆరగించేవాడు. వినాయకుడి మహిమలు ముల్లోకాలకు విస్తరించి సర్వజనులతో కీర్తింపబడ్డాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటివాడే వినాయకుడిని పూజించేవాడంటే వినాయకుడి శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మనసులో తలిచిన కార్యాలను వినాయకుడు నెరవేరుస్తాడని దేవతలు నమ్మేవారు. ఈ గొప్పదనం వల్లనే గణపతిని సిద్ధి వినాయకుడు అని పిలిచారు.

ఆరోగ్యం కోసం పూజ

వినాయక చవితికి మనం చేసే పూజలో నమ్మకమే కాదు, ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయి. మామూలుగా ఏ దేవుడినైనా పువ్వులతోనే పూజిస్తాం. వినాయకుడిని పువ్వులతో పాటు పత్రాలతోనూ పూజిస్తాం. వినాయకుని మండపానికి కట్టే పాలవెల్లికి నేరేడు, మారేడు, సీతాఫల, జామ వంటి కాయలే గాక మొక్కజొన్న వంటివి కూడా వేలాడదీస్తాం. అలాగే, మనం పూజ చేసే ఆకుల సువాసనతో శ్వాస సంబంధమైన వ్యాధులు నయమవుతాయి. విఘ్నేశ్వరుని పూజించడానికి మనం పాటించే నియమనిష్ఠలు కూడా మనకు ఆరోగ్యాన్ని చేకూర్చేవే. గణపతికి నువ్వులతో కూడిన లడ్డూలంటే కూడా ఎంతో ఇష్టమట. ఆంజనేయుడిలాగే విఘ్నేశ్వరుడికి కూడా సింధూరం అంటే ఇష్టం. దీనితో పూజిస్తే కోరిన కోర్కెలన్నీ నెరవేరతాయని ప్రతీతి.

బావిలో.. కాణిపాక వినాయకుడు

కాణిపాకం క్షేత్ర సమీపంలో బహుదానది ప్రవహించేది. దాని ఒడ్డున ఓ బావి ఉండేది. దాంట్లో వినాయకుడు వెలిశాడనీ.. బావిలో నుంచి దినదిన ప్రవర్దమానంగా పెరుగుతున్నాడని భక్తుల నమ్మకం. అప్పుడు చోళరాజుల ఏలుబడిలో ఉండేది ఈ ప్రాంతం. ఆ ఊరిపేరు విహారపురి. ఆ గ్రామంలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు ఉండేవారు. వారు పుట్టుకతో మూగ.. చెవుడు.. గుడ్డివారు. ఇన్ని వైకల్యాలున్నా వారు చక్కగా వ్యవసాయం చేసేవారు. స్వయంగా బావి తవ్వి మోట కొట్టి సాగుచేసుకునేవారు. ఒకసారి వర్షాభావం కారణంగా బావిలో నీళ్లు తగ్గాయి. దీంతో బావి మరింత తవ్వాలని నిర్ణయించుకున్నారు. తవ్వుతున్నప్పుడు ఠంగ్‌మనే శబ్దం వినిపించింది. పరిశీలిస్తే బావిలో పెద్ద రాయి. దానిని తొలగించడానికి గడ్డపార దెబ్బ వేయగా దాంట్లో నుంచి రక్తం పైకి ఎగిసింది. రక్తం ఆ ముగ్గురి స్నేహితులపై పడగానే వారి వైకల్యం పోయిందట. ఆ నోటా.. ఈ నోటా విషయం ఊరంతా తెలియడంతో బావిని మరింత లోతుకు తవ్వారు. అప్పుడు గణనాథుడి విగ్రహం బయల్పడింది. భక్తి పారవశ్యంతో ప్రజలు కొబ్బరికాయలను సమర్పించారు. వీటిలో విశేషంగా పగిలిన కొబ్బరికాయల నీటి ద్వారా ఆ ముగ్గురు సోదరులు నిలుచున్న భూమి అంతా ప్రవహించింది. అలా ఈ స్థలానికి కాణి పారడం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అదే కాణిపాకంగా మారింది. కుళత్తుంగ చోళుడనే రాజు ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఇక అప్పటి నుంచి బావిలోని వినాయకుడు పెరుగుతున్నాడని భక్తులు అంటున్నారు. దీనికి సాక్ష్యంగా వినాయకుడు ధరించిన వెండి కవచాలు సరిపోకపోవడమే. ఇప్పటికి మూడుసార్లు వెండి కవచాలు మార్చినట్లుగా ప్రజలు చెప్తున్నారు. ఈ ఆలయం సత్యప్రమాణాలకు నెలవుగా భాసిల్లుతున్నది. వరసిద్ధి వినాయకుడే ఇక్కడ న్యాయ నిర్ణేత. ఎలాంటి వివాదాలు వచ్చినా.. నేరారోపణలు జరిగినా నిర్ధోషిత్వ నిరూపణకు ఈ క్షేత్రమే కేంద్రం అనేది ప్రజల ప్రగాఢ నమ్మకం. బ్రిటీష్ కాలంలో కూడా ఇక్కడ సత్య ప్రమాణాలు చేసే ఆనవాయితీ కొనసాగింది. ప్రతియేటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు వినాయకచవితి రోజే ప్రారంభమవుతాయి. అంకురార్పణతో ప్రారంభించి 21 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు.
GanapathiBanner2

అవంచలో ఏకశిలా గణపతి

నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో ఏకశిల వినాయకుడు కొలువుదీరి భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతున్నాడు. వినాయక ఉత్సవాల సందర్భంగా మండపాల్లో కొలువుదీరే గణపయ్యల సందడి చాలా ఎక్కువగా ఉంటుంది. వైవిధ్య రూపాల్లో గణనాథుడిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. మండపాలనూ ఆకర్షణీయంగా అలంకరిస్తారు. స్వయంభుగా వెలిసిన ఆలయాల్లో కూడా భిన్న వినాయకులు కొలువుదీరి ఉంటారు. అలాంటి అరుదైన ఓ గణపతి దేవుడు నాగర్ కర్నూల్ సమీపంలో కొలువయ్యాడు. ఈ గణపతి భారీ ఏకశిలా విగ్రహం కావడం విశేషం. భక్తులు ఐశ్వర్య గణపతిగా కొలిచే ఈ గణనాథుడి ఎత్తు 30 అడుగులు. దేశంలో ఇంత ఎత్తైన ఏకశిలా విగ్రహం మరెక్కడా లేదు. గుల్బర్గా రాజధానిగా పాలించిన పశ్చిమ చాళుక్య రాజైన తైలంపుడు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడట. అవంచ గ్రామంలో ఉన్న ఏకశిలను అందమైన వినాయకుడి విగ్రహంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక శిల్పిని నియమించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. పని జరుగుతుండగానే తైలంపుడు అనారోగ్యానికి గురై అకస్మాత్తుగా చనిపోయాడు. గణపయ్య శాపంతోనే ఇలా జరింగిందని స్థానికంగా ప్రచారంలో ఉన్నది. ఇంతటి అరుదైన చారిత్రక సంపద.. ఏకశిలా గణపతి ఇంకా అభివృద్ధి చెందాలనీ.. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఆరుబయటే ఉందనీ భక్తులు కోరుతున్నారు.

గణపతి బప్పా మోరియా ఎందుకంటారు?

వినాయకుడు అంటేనే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపం. తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో పయనించేందుకు మార్గ నిర్దేశనం చేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాంటి ప్రత్యేకతలు వినాయకుడిలో చాలా ఉన్నాయి. ఇప్పటి మోర్గాం ప్రాంతంలో జరిగిన కథ ఇది. ఇది పుణేకు 79 కిలోమీటర్ల దూరంలో పుణెజిల్లాలోని బారమతీ తాలుకాలో ఉంది. పూర్వం ఇక్కడి గండిక రాజ్యాన్ని చక్రపాణి అనే రాక్షసరాజు పాలించేవాడు. అతని భార్య ఉగ్ర. పిల్లలు లేనందువల్ల శానక మహాముని సూచనమేరకు సూర్యోపాసన చేయగా సూర్యుడి అనుగ్రహం వల్ల రాణి గర్భవతి అయ్యింది. సూర్యుడి వంటి వేడితో పిల్లవాడు జన్మించడం వల్ల అతడిని సముద్రంలో పడేస్తారు. అతడిని చేరదీస్తారు అక్కడి వారు. సముద్రంలో దొరకడం వల్ల ఆ పిల్లాడిని సముద్ర లేదా సింధురాసురుడు అని పిలిచేవారు. సింధు పెద్దోడై సూర్యోపాసకుడిగా సుదీర్ఘకాలం తపస్సు చేస్తాడు. తపస్సు ఫలితంగా సూర్యుడు అతనికి అమృతం ప్రసాదిస్తాడు. అది ఉన్నంతకాలం సింధుకు మృత్యుభయం ఉండదు. ఈ ధైర్యంతో సింధు తన పరాక్రమంతో ముల్లోకాలను జయించాలని సంకల్పించాడు. దేవతలపై కూడా దాడి చేశాడు. తర్వాత కైలాసం.. వైకుంఠంపై దండెత్తాడు. పార్వతీ పరమేశ్వరులు మేరు పర్వతం వద్ద తలదాచుకున్నారు. మహా విష్ణువును కూడా గండికా రాజ్యంలోనే ఉండాలని సింధురాసురుడు ప్రకటించాడు. దేవ గురువైన బృహస్పతి ఈ పరిస్థితిని పరిశీలించి వినాయకుడిని ప్రార్థిస్తే ఈ గండం నుంచి బయటపడతారని సలహా ఇచ్చాడు. వారి శరణు విన్న వినాయకుడు సాక్షాత్కారమై.. తాను పార్వతీ దేవికి కుమారుడిగా జన్మించి సింధురాసురుడిని హతమొందిస్తానని వారితో చెప్పాడట. పన్నెండేండ్లు మేరుపర్వతంపై గణేషుడి మంత్రం జపించారట. అలా భాద్రపద శుద్ధ చతుర్థినాడు గణపతి పార్వతికి కొడుకుగా పుట్టాడట. ఒకసారి సింధురాసురుడి మిత్రుడైన కమలాసురుడు శివునిపై యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు గణపతి నెమలి వాహనధారియై కమలాసురునితో యుద్ధం చేశాడట. సింధురాసురునిపై బాణమేసి ఉదరం చీల్చాడట. అప్పుడు సింధురాసురుడి ఉదరంలోని అమృతం బయటకొచ్చి అతడు మరణిస్తాడు. దేవతలు ఆనందంతో గణపతిని పూజిస్తారు. అప్పటి నుంచి మోర్గాం గణపతి పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్నది. మోర్ అంటే నెమలి. యుద్ధానికి నెమలి వాహనమేసుకొని వచ్చి సింధురాసురుడిని హతం చేశాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని మోర్గాం అని.. అక్కడి గణపతి పుణ్యక్షేత్రంలో గణపతి బప్పా మోరియా అని భక్తులు కొలుస్తుంటారు. అది క్రమంగా అంతటా వ్యాపించి గణపతి బప్పా మోరియా అని పిలువబడుతుంది.

రంగులు మార్చే వినాయకుడు

తమిళనాడులోని నాగర్‌కోయిల్ జిల్లా కేరళపురంలో ఓ అద్భుతమైన దేవాలయం ఉంది. అక్కడ వెలసిన వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది. గుడి చాలా చిన్నదిగా కనిపించినప్పటికీ దానికున్న ప్రత్యేకత విశిష్టమైంది. అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం. మూలవిరాట్టు అయిన వినాయకుడు ఆర్నెళ్లకోసారి రంగు మార్చుకుంటాడు. ఉత్తరాయన కాలం అనగా మార్చి నుంచి జూన్ వరకు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలం అనగా జూలై నుంచి ఫిబ్రవరి వరకు తెల్లని రంగులోకి మారుతాడు. ఇలా జరుగడం దేవుని మహత్యం అని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ప్రాంగణంలోని బావినీరు కూడా ఆర్నెళ్లకోసారి రంగు మారుతుందట. వినాయకుడు తెలుపురంగులో ఉంటే నీళ్లు నలుపు రంగులోకి.. వినాయకుడు నలుపు రంగులో ఉంటే నీళ్లు తెలుపు రంగులోకి మారుతాయి. సాధారణంగా శిశిర రుతువులో చెట్ల ఆకులు రాలిపోతాయి కదా? కానీ ఇక్కడి అరణ్యానికి ఇది వర్తించదు. ఆలయంలోని ఉన్న మర్రిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి.. ఉత్తరాయనంలో చిగురిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయగర్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉండటం వల్ల ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని కూడా అంటారు.

సర్వమత సమ్మేళన గణపతి

విఘ్న నాయకుడు వినాయకుడి వేడుకలు ఓ ప్రత్యేకత. కనిగిరిలో ఈ వేడుకలు మరింత ప్రత్యేకం. గణనాథుడిని అందరూ కొలవడం విశేషం. వినాయక చవితి వేడుకలను కొందరు ముస్లిం సోదరులే అన్నీ తామై నిర్వహిస్తారిక్కడ. గత అయిదేళ్లుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందిరా కాలనీకి చెందిన పోలిచెర్ల రహీంబాషా ఆధ్వర్యంలో అయిదారేళ్లుగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆయనకు తోడుగా యోగయ్య, రసూల్, నాయబ్రసూల్, సద్దాం, అనిల్, ప్రతాప్, వెంకటేశ్వర్లు ఏటా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. సత్యహరిశ్చంద్ర నాటకం, కోలాటాలు, భజనలు నిర్వహిస్తుంటారు. మట్టిబొమ్మలను తయారు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకూ ఏటా అందిస్తున్నారు. అందరితో కలిసిమెలిసి పండగ నిర్వహించడం వల్ల మనమంతా ఒకటే అనే భావన పెరుగుతుందని.. అందుకే గడిచిన నాలుగేళ్లుగా వినాయక ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. చిన్నారులతో మట్టి విగ్రహాలను తయారు చేయించి వారి తల్లిదండ్రులకు పంపిణీ చేస్తున్నట్టు కూడా తెలిపారు.
గణపతి.. ప్రథమ దేవుడు.. ఏ కార్యానికైనా అవరోధాలను తొలగించి సిద్ధినీ.. బుద్ధినీ ప్రసాదించే దివ్యశక్తినే గణపతిగా ఉపాసించడం వేద ప్రమాణం.

-పూజగానీ.. యజ్ఞంగానీ లోకకల్యాణం కోసం చేస్తారు. ఆరాధించే దేవతా గణానికీ.. మంత్ర సమూహానికీ.. యాజ్ఞికుల బృందానికీ ప్రభువై.. ఫలప్రదాతయై అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతిగా చెప్పుకుంటారు.

-విఘ్న నాయకుడు వినాయకుడి వేడుకలు ఓ ప్రత్యేకత. కనిగిరిలో ఈ వేడుకలు మరింత ప్రత్యేకం. గణనాథుడిని అందరూ కొలవడం విశేషం. వినాయక చవితి వేడుకలను కొందరు ముస్లిం సోదరులే అన్నీ తామై నిర్వహిస్తారిక్కడ. గత అయిదేళ్లుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.

629
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles