మనతోనే గణేశుడు


Sun,September 1, 2019 02:22 AM

Ganesh
ఉదయం నిద్రలేవగానే బంకమట్టి తీసుకువచ్చి తండ్రికి అప్పచెబుతాం. ఆ మట్టి ఒక రూపానికి అంటే.. వినాయకుడిగా రూపుదిద్దుకుంటుంది. కండ్లకి గురిగింజలు. పళ్లు, బొట్టును సున్నంతో రాస్తారు. చిన్న కర్రపుల్ల తీసుకొని చేతులు, తొండం, కాళ్లను గీసి అచ్చు వినాయకుడి ఆకృతికి తీసుకువస్తారు. ఆ తర్వాతే పూజా కార్యక్రమం. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు మార్కెట్లో దొరికే కెమికల్ విగ్రహాలను కొనుగోలు చేసి పూజ మొదలు పెడుతున్నారు. వీటిని నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణానికి భారీగా నష్టం వాటిల్లుతున్నది. పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా గణేషుడిని తయారు చేయడం అన్ని విధాలా మంచిది. అలాంటి మరికొన్ని విగ్రహాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

బంకమట్టి గణేశం

బంకమట్టితో చేసిన వినాయకుడిని చూస్తే వచ్చిన అనుభూతి మార్కెట్లో దొరికే ఏ విగ్రహాన్ని చూసినా రాదు. మట్టి విగ్రహం కచ్ఛితంగా ఈ ఏడాది వేడుకులకు సంప్రదాయ ఆకర్షణను తెస్తుంది. ఈ విగ్రహానికి పదిరోజుల పాటు పూజలు చేయాలి. బాగా అలంకరించిన ప్రదేశంలో గణేశుడిని పెడితే అందంగా ఉంటుంది. అలాగే పండుగ ముగిసిన తర్వాత మట్టి విగ్రహాన్ని గార్డెన్‌లో ఉండే చిన్న బకెట్‌లో ముంచితే మట్టంతా కరిగిపోతుంది. దీంతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.

ఈ విగ్రహాన్ని నాటవచ్చు..

పేరు వినగానే ఆశ్చర్యపోకండి. నిజమే. ఈ విగ్రహాలు కరిగితే చాలు మొక్కలుగా మారుతాయి. పర్యావరణ సంస్థ, సీడ్ పేపర్ ఇండియా తులసి విత్తనాలతో గణేశుడి విగ్రహాలు తయారు చేస్తున్నారు. వేడుకలు పూర్తయిన వెంటనే విగ్రహాన్ని నదులలో ముంచడం కంటే కూడా వాటిని నాటడంతో ఏడాది పొడవునా గణేశుడి ఆశీర్వాదం పొందిన వారవుతారు. తోటలోని బకెట్‌లో ముంచితే విగ్రహం పూర్తిగా కరుగుతుంది. రెండు రోజుల తర్వాత తులసి మొక్కలు మొలకెత్తుతాయి.

ఉన్నదాంతోనే పండుగ

వినాయకచవితి రోజు ఇంటికి దగ్గర్లో గుడి ఉన్నా సరిపోతుంది. లేదు ఇంట్లోనే పూజ చేయాలి అనుకుంటే.. వినాయకుడి విగ్రహం, ఫొటోఫ్రేమ్ ఉంటే దానికి పందిరి వేసి పండ్లు, తోరణాలతో వేడుకను ఘనంగా చేసుకోవచ్చు. వేడుక ముగిశాక మరలా విగ్రహాన్ని యథాస్థానానికి మార్చవచ్చు. ఇలా చేయడం వల్ల ఖర్చు తగ్గుతుంది. మన వినాయకుడితోనే పూజ చేసినట్లు అనిపిస్తుంది.

మొక్కల పెరుగుదలకు విగ్రహాలు

విత్తనాలతో తయారు చేస్తే మొక్కలుగా మారుతాయి. మరి వాటి పెరుగుదల గురించి ఎవరు పట్టించుకుంటారనుకున్నారేమో ఎకో-ఎగ్జిస్ట్ ఎంటర్‌ప్రైజెస్. ఆవుపేడతో విగ్రహాలు తయారుచేస్తున్నారు. ఈ రకం విగ్రహాలను పండుగ తర్వాత గార్డెన్‌లో పెడితే సరిపోతుంది. వర్షానికి ఎరువుగా మారి మొక్కల పెరుగుదలకు దోహదపడుతుంది.

గుర్తుగా పెట్టుకోవచ్చు..

గణేశుని విగ్రహాలు పర్యావరణానికి హానిచేయని బంకమట్టితోనే కాదు, వ్యర్థంగా ఉన్న పాత ప్రాడక్ట్స్‌తో రూపొందించవచ్చు. వీటిని నీటిలో నిమజ్జనం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కష్టంతో కూడుకున్న పనిని ఇష్టంగా చేసిన విగ్రహాన్ని పండుగ తర్వాత ఇంట్లోని షెల్ఫ్‌లో పెట్టుకోవడానికి ఇదొక మంచి మార్గం.

వేడుక అనంతరం..

-ఏ పండుగకూ చేయని విధంగా కొన్ని పండుగలకు ఘనంగా లైటింగ్ ఏర్పాటు చేస్తారు. అవే వినాయకచవితి, దసరా, దీపావళి.
-ఈ అలంకణకు ప్లాస్టిక్‌ను నివారించి పర్యావరణానికి హాని చేకూరని విధంగా ఉండేలా చూసుకోవాలి.
-వినాయకుడి పూజకు ఉపయోగించిన పూలను నీటిలో పడేయకుండా వాటితో లిప్‌బామ్, శరీర సౌందర్యానికి వాడుకోవచ్చు.
-అలాగే గణేశుడికి వేసిన పందిరి కర్రలను గార్డెన్‌లోని మొక్కలకు సపోర్ట్‌గా పెట్టుకోవచ్చు.
-కుండీలలో మొక్కలునాటి వాటిని విగ్రహానికి అలంకరణగా పక్కన పెడితే పచ్చని తోరణంలా ఉంటుంది.
-పూజలో పెట్టిన పండ్లను పక్షులకు, తోటలోని మొక్కలకు కంపోస్ట్‌గా చేయవచ్చు.
-అలంకరణ అందంగా ఉండడానికి చాలామంది థర్మాకోల్ వాడుతుంటారు. దీనివల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుంది. వీలైనంత వరకు దీనికి దూరంగా ఉండడం మంచిది.
-ఈ వేడుకను పర్యావరణ హితంగా మార్చడానికి నెయ్యితో దీపాలు వెలిగించండి.

327
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles