ప్రాణం తీసిన లైఫో సెక్షన్‌ ఆర్తి అగర్వాల్‌


Sun,August 25, 2019 02:22 AM

Aarthi-Agarwal
అదృష్టం కొద్దిమందిని మాత్రమే కొన్ని సమయాల్లోనే వరిస్తుంది. ఆమె విషయంలో అదే జరిగింది. అనుకోకుండా వచ్చిన అవకాశం ఆమెను వెండితెరకు పరిచయం చేసింది. బాలీవుడ్‌లో చేసిన తొలిసినిమా అంతగా ఆడకపోయినా మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత ఆమె అడుగులు తెలుగు సినిమా వైపు పడ్డాయి. మొదటి చిత్రం సూపర్‌హిట్టు. అంతే వరుసగా ఆఫర్లు. తక్కువ సమయంలోనే స్టార్‌ హీరో యిన్‌గా మారింది. ఆ విజయాలు వేసిన బాటలో పైకెక్కాల్సిన సమయంలో ఒక యువహీరోతో ప్రేమలో పడింది. అది విఫలమై ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ తర్వాత పరాజయాలు పలుకరించాయి. సినిమాలు వదిలేసి కొత్త జీవితం ప్రారంభిద్దామనుకుని పెళ్లి చేసుకుంది. కానీ అది ఫెయిల్‌. సినిమా ఇండస్ట్రీలో రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. అయితే అడ్డూ అదుపూ లేకుండా పెరిగిన బరువు ఆమెకు శాపంగా పరిణమించింది. దాన్నుంచి బయటపడాలని లైఫో సెక్షన్‌ ఆఫరేషన్‌కు సిద్ధపడింది. అదే ఆమె జీవితాన్ని అందరాని దూరలకు తీసుకుపోయింది. చిన్నవయస్సులోనే అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి లైఫో ఆపరేషన్‌ వికటించి మరణించిన తెలుగు యువ హీరోయిన్‌ ఆర్తి అగర్వాల్‌ చివరిపేజీ.

- మధుకర్‌ వైద్యుల, సెల్‌: 9182777409


అది 2015. న్యూజెర్సిలోని అట్లాంటిక్‌ సిటీ ఆసుపత్రి.
లైఫో సెక్షన్‌ సర్జరీ చేయించుకున్న తర్వాత అప్పుడే తీసిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నది. 80 కిలోలకు పైగా బరువున్న యువతి 20 కిలోలకు పైగా తగ్గిందన్నది సారాంశం. అమెరికాలో పెద్దగా చూశారో లేదో కానీ ఇండియాలో అందులోను తెలుగురాష్ట్రంలో ఆ వీడియోను వందలాది మంది వీక్షించారు. అది కూడా లావు ఎలా తగ్గాలి అని తెలుసుకునేందుకు కాదు. ఆ వీడియోలో ఉన్న యవతిని పోల్చుకునేందుకు. అవును ఆమెను అప్పటికీ ఎంతోమంది చూసినవారే. ఇంతకీ ఎవరు? చాలామంది మళ్లీ మళ్లీ వీడియో చూశారు. ఎస్‌.. ఆమె ఆర్తీ...ఆర్తి అగర్వాల్‌ తెలుగు హీరోయిన్‌. ఆశ్చర్యం.. అంతలోనే విషాదం అందాల తారగా వెలుగొందిన ఆమె లావు తగ్గడం వరకు బాగానే ఉన్నా ఆపరేషన్‌ తర్వాత చాలా వీక్‌గా, ఎవరి సహాయం లేకుండా నడవలేని పరిస్థితికి వచ్చారు. ఈ వీడియో ఆర్తి అగర్వాల్‌ అభిమానులను విషాదానికి గురి చేసింది. లైఫో సెక్షన్‌ సర్జరీకి తర్వాత మళ్లీ అందంగా మారి సినిమా రంగంలో రాణిస్తుందని అందరూ ఆశించారు. కానీ...

నువ్వు నాకు నచ్చావు చిత్రం చూశాక తెలుగు ప్రేక్షకలోకం మరో అందాల హీరోయిన్‌ దొరికిందని సంబురపడిపోయారు. ఆలా ఒక్క సినిమాతోనే ఆర్తీ అగర్వాల్‌ తెలుగు తెరపై మెరిసిపోయింది. ఆమె తండ్రి శశాంక్‌ అగర్వాల్‌ వ్యాపారంలో స్థిరపడిన శ్రీమంతుడు. పద్నాలుగేళ్ల వయసు వచ్చే వరకు న్యూజెర్సీలోనే చెల్లెలు ఆదితి అగర్వాల్‌తో కలిసి చదువుకుంది ఆర్తి. నటుడు, నిర్మాత సునీల్‌ శెట్టి ఓసారి అమెరికా వెళ్లినప్పుడు ఆర్తిని చూసి... ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా నగరాల్లో ఆమెతో నృత్య ప్రదర్శనలు ఇప్పించాడు. ఆ కార్యక్రమాలకు బిగ్‌-బి అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సునీల్‌శెట్టితో పాటు బిగ్‌-బి కూడా ఆర్తి ప్రదర్శనకు ముచ్చటపడి బాలీవుడ్‌కు ఆహ్వానించారు. పదహారేళ్ల వయసులో భారతదేశానికి వచ్చింది ఆర్తి. అలా ఆర్తీ ముంబాయ్‌ కి వచ్చి, నట శిక్షణాలయంలో చేరింది. 2001లో రాజీవ్‌షా నిర్మాతగా, జోయ్‌ అగస్టీన్‌ దర్శకత్వంలో రూపొందిన బాలీవుడ్‌ సినిమా ‘పాగల్పన్‌'లో అయిదుగురు అన్నదమ్ముల గారాల చెల్లెలు రోమాగా నటించింది.ఈ సినిమాలో ఆర్తీ అద్భుతంగా నటించి, అందరి మెప్పు పొందింది.

సరిగ్గా ఇదే సమయంలో త్రివిక్రమ్‌ రచయితగా స్రవంతి కిషోర్‌, ఉదయభాస్కర్‌ దర్శకత్వంలో వెంకటేష్‌తో ఓ సినిమా చేయాలని స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకున్నారు. కొత్త హీరోయిన్‌ను తీసుకోవాలని చూస్తున్నారు. అలా డి.సురేష్‌ బాబు నిర్మించినా ‘నువ్వు నాకు నచ్చావ్‌' చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి కథానాయికగా పరిచయమయింది. ఈ చిత్రంలో కథానాయకుడు వెంకటేష్‌. ఆ సినిమా ఘన విజయం సాధించి ఆమెకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగు సినీరంగంలో 2000 దశకంలో అగ్ర కథానాయకులైన చిరంజీవి, వెంకటేష్‌, బాలకృష్ణ, నాగార్జునల సరసన నటించడమే కాక యువతరం కథానాయకులైన మహేష్‌ బాబు, జూనియర్‌ ఎన్టీయార్‌, ప్రభాస్‌, రవితేజ,ఉదయ్‌ కిరణ్‌, తరుణ్‌లతో నటించిన ఘనత ఆర్తీకి దక్కింది. బి.గోపాల్‌ దర్శకత్వంలో వరుసగా నాలు గు సినిమాలలో నటించింది (చివరిది అతిథి పాత్ర). వెంకటేష్‌ సరసన నటించిన మూడు చిత్రాలు నువ్వు నాకు నచ్చావ్‌, వసంతం, సంక్రాంతి ఘన విజయాలు సాధించాయి.
Aarthi-Agarwal1
వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలోనే ఒక యువహీరోతో ప్రేమలో పడిందంటారు. అప్పటికే ఆ విషయం ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపింది. అయితే ఆ హీరో ఈమె ప్రేమను నిరాకరించడం, ఆమెను మానసికంగా దెబ్బతీసింది. 2005 మార్చి 23న క్లీనింగ్‌ కెమికల్‌ తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో యువహీరోతో సంబంధం ఉన్నట్టుగా వస్తున్న వదంతులతో విసిగి ఆ పనిచేసినట్టు ఆర్తీ చెప్పింది.

చిరంజీవితో ఆమె నటించిన ఇంద్ర చిత్రం ఆర్తిని అగ్రతారగా నిలబెట్టింది. ప్రిన్స్‌ మహేష్‌తో బాబీ, బాలయ్యతో పల్నాటి బ్రహ్మ నాయుడు, విక్టరీ వెంకటేశ్‌తో వసంతం, రవితేజతో వీడే, నాగార్జునతో నేనున్నాను, ప్రభాస్‌తో అడవిరాముడు, జూనియర్‌ ఎన్టీఆర్‌తో నరసింహుడు, సునీల్‌తో అందాలరాముడు, రాజశేఖర్‌తో గోరింటాకు, వేణుతో దీపావళి, జెంటిల్‌మెన్‌ తదితర చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి.తమిళనాట కూడా ఆర్తీ తెరంగ్రేటం చేసి, బంబ్రా కన్నాలై చిత్రంతో తమిళ అభిమానులను సంపాదించుకుంది.

వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలోనే ఒక యువహీరోతో ప్రేమలో పడిందంటారు. అప్పటికే ఆ విషయం ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపింది. అయితే ఆ హీరో ఈమె ప్రేమను నిరాకరించడం, ఆమెను మానసికంగా దెబ్బతీసింది. 2005 మార్చి 23న క్లీనింగ్‌ కెమికల్‌ తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో యువహీరోతో సంబంధం ఉన్నట్టుగా వస్తున్న వదంతులతో విసిగి ఆ పనిచేసినట్టు ఆర్తీ చెప్పింది. కొన్ని రోజులకు బాధల నుంచి తేరుకుని సునీల్‌తో అందాల రాముడు సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా హిట్‌ అయినా ఆమెకు అవకాశాలు రాలేదు. ఒక ఇంటర్వ్యూలో ఆర్తి మాట్లాడుతూ ‘వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నప్పుడు, పిచ్చిగా ప్రేమలో పడి, పెళ్లి చేసుకోవాలనే ధ్యాసలో వచ్చిన అవకాశాలను కాలరాసుకున్నాను’ అని చెప్పింది. 2006 ఫిబ్రవరి 15న అనుమానాస్పద పరిస్థితుల్లో మెట్లపై నుండి జారిపడి ఆర్తి ఆసుపత్రి పాలైంది. అయితే సినిమా అవకాశాలు రాకపోవడం వల్లే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందనే పుకార్లు షికారు చేశాయి. ఇక ఇండస్ట్రీ తను అవసరం లేదనుకుని తల్లిదండ్రుల సలహా మేరకు అమెరికాలో బ్యాంక్‌ ఉద్యోగం చేస్తున్న ఉజ్వల్‌ కుమార్‌ను హైదరాబాద్‌ ఆర్యసమాజ్‌లో 2007 నవంబరు 21న వివాహమాడింది. ఆర్తి-ఉజ్వల్‌ వివాహ జీవితం ఎంతో కాలం నిలువలేదు. వివాహం తర్వాత అమెరికాలో కొంతకాలం ఉంది. అయితే వ్యక్తిగత కారణాలతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

తిరిగి ఇండియాకు వచ్చిన ఆర్తి రెండవ ఇన్నింగ్‌ ప్రారంభించాలని ప్రయత్నించింది. అయితే పెళ్లయ్యాక బాగా బరువు పెరిగింది. సినిమా అవకాశాలు రావడం మానేశాయి. ‘జంక్షన్‌ లో జయమాలిని’, ‘ఆమె ఎవరు ?’ సినిమాలు అంగీకరించింది. 2015 జూన్‌ 5న ఆర్తీ నటించిన ‘రణం 2’ విడుదలయింది. ‘ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌' విడుదలకావాల్సివుంది. శివనాగు దర్శకత్వంలో ’జంక్షన్లో జయమాలిని’ సినిమాలో ఆర్తి ద్విపాత్రాభినయం చేయాల్సి ఉంది. అప్పుడు భరత్‌ పారేపల్లి ‘నీలవేణి’ చిత్రంలో ఆర్తి నటిస్తోంది. ‘చూస్తుండండి. నేను జూన్‌ 20న స్లిమ్‌గా అమెరికా నుంచి వచ్చి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తా. షూటింగ్‌ పెట్టుకోండి‘ అని చిత్రబృందంతో చెప్పింది.

‘జంక్షన్‌లో జయమాలిని‘ హీరోయిన్‌ ప్రాధాన్య చిత్రం. ఈ సినిమాలో ద్వీపాత్రాభినయం ఉండగా, ఒక పాత్రలో మాస్‌ ఇమేజ్‌ కోసం ఆర్తి వెయిట్‌ తగ్గాల్సివచ్చింది. అప్పటికి 89 కేజీల బరువున్న ఆర్తి 63 కేజీలకు తగ్గింది. మరో మూడు కేజీల బరువు తగ్గడం కోసం లైఫో సెక్షన్‌ చేయించుకోవడానికి ఆమె తన జన్మస్థలమైన అమెరికాలోని న్యూజెర్సీ నగరానికి వెళ్లింది. లైఫో సెక్షన్‌ చేయించుకుంటే బరువు తగ్గడమే కాకుండా శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు దూరమవుతాయని భావించిన ఆమె... అమెరికా వెళ్లి న్యూజెర్సీలోని అట్లాంటిక్‌ సిటీ ఆసుపత్రిలో చేరి 2015 జూన్‌ 4 న ఆపరేషన్‌ చేయించుకుంది. అదే రోజు రాత్రి ఆర్తి నటించిన ’రణం-2’ సినిమా విడుదలైంది.

బరువు తగ్గడంతోపాటు శ్వాసకోశ సంబంధ ఇబ్బందులు తగ్గుతాయనుకున్న ఆమెకు ఆపరేషన్‌ తర్వాత మరిన్ని సమస్యలు చుట్టూ ముట్టాయి. స్వయంగా నడవలేని స్థితికి చేరుకుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది.

2015 జూన్‌ 6న ఎగ్‌ హార్బర్‌ టౌన్‌ షిప్‌ లోని తన స్వగృహంలో ఉన్న ఆమె గాలి పీల్చుకోలేక ఇబ్బంది పడసాగింది. వెంటనే వారి కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె గుండె ఆగిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.
అయితే చికిత్స వికటించడంతోపాటు గుండెపోటు వచ్చి ఇన్‌ఫెక్షన్‌ తలెత్తడంతో ఆమె కన్నుమూసిందని కుటుంబ సభ్యులు ప్రకటించారు. మరణించేనాటికి ఆమె వయస్సు కేవలం 31 సవంవత్సరాలే కావడం విషాదం.

Aarthi-Agarwal2
‘నువ్వు నాకు నచ్చావ్‌' చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి కథానాయికగా పరిచయమయింది ఆర్తీ. ఈ చిత్రంలో కథానాయకుడు వెంకటేష్‌. ఆ సినిమా ఘన విజయం సాధించి ఆమెకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగు సినీరంగంలో 2000 దశకంలో అగ్ర కథానాయకులైన చిరంజీవి, వెంకటేష్‌, బాలకృష్ణ, నాగార్జునల సరసన నటించడమే కాక యువతరం కథానాయకులైన మహేష్‌ బాబు, జూనియర్‌ ఎన్టీయార్‌, ప్రభాస్‌, రవితేజ, ఉదయ్‌ కిరణ్‌, తరుణ్‌లతో నటించిన ఘనత ఆర్తీకి దక్కింది.

20300
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles