మన జాతీయ రత్నాలు!


Sun,August 25, 2019 02:17 AM

ఆగస్టు 9.. న్యూఢిల్లీ.. శాస్త్రి భవన్‌ నుంచి.. 66వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించారు.. మొదటిసారి తెలుగు సినిమాకు.. సముచిత స్థానం దక్కిన సంవత్సరం ఇదే.. మహానటితో మరో మైలురాయిని పొందింది తెలుగు పరిశ్రమ.. అయితే ఈ సంవత్సరం మహిళామణులు.. అనేక కేటగిరీల్లో తమదైన ముద్ర వేశారు.. ఈసారి జాతీయ అవార్డులు దక్కించుకున్న.. నటీమణులు.. టెక్నీషియన్లు.. దర్శకుల లిస్ట్‌ ఇదే..
national-awards

కీర్తి సురేష్‌

మహానటి అంటే సావిత్రినే అని చెబుతారు. కానీ మహానటి సినిమాతో ఆ కీర్తి కిరీటం దక్కించుకుంది. తెలుగు, తమిళ, మలయాళంలో మహానటి ముందు వరకు ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. మహానటి తర్వాత.. నిజంగానే ఆ మహానటిని మరొకసారి గుర్తు చేసింది. ఈ అమ్మడు ప్రొడ్యూసర్‌ సురేష్‌, నటి మేనక కూతురు. తల్లిదండ్రులు ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో ఉండడంతో ఆమెకు కూడా సినిమా మీద ఆసక్తి కలిగి ఇటువైపు వచ్చింది. బాలనటిగా కూడా కొన్ని సినిమాలు చేసింది కీర్తి. ఎన్నో యేండ్ల తర్వాత కీర్తి వల్ల.. తెలుగు సినిమా నటికి జాతీయ అవార్డు దక్కింది.
national-awards1

ఇంద్రాక్షి పట్నాయక్‌

నడిగర తిలగం.. మహానటి సావిత్రి సినిమా మీద అంత అందంగా తయారవడానికి కారణం ఆమె కాస్ట్యూమ్స్‌ అంటే అతిశయోక్తి కాదేమో! వాటిని డిజైన్‌ చేసిన వారిలో ఒకరే ఇంద్రాక్షి. సావిత్రి అంటే ఎవరో తెలియకుండానే ఆ బయోపిక్‌కి కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేసి అవార్డును దక్కించుకున్నది ఇంద్రాక్షి. ఆమె ఒక్క దానికే కాదు.. కొన్నిసార్లు షూటింగ్‌లో 400మంది జూనియర్‌ ఆర్టిస్టులు ఉండేవారు. వారికి కూడా ఆ కాలం నాటి దుస్తులనే ఎంపిక చేసి.. స్క్రీన్‌ మొత్తాన్ని మరింత సుందరంగా చేసింది. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్‌ చేసిందట. కోల్‌కతా, చార్మినార్‌ ప్రాంతంలోనే ఎక్కువ షాపింగ్‌ చేసి ఆ కాలం లుక్‌ తీసుకొచ్చానంటున్నది ఇంద్రాక్షి.
national-awards2

అర్చనా రావు

మహానటి అందంగా కనిపించడంలో మరొక పాత్ర అర్చనారావుది. ఆమె పేరుతోనే స్పెషల్‌ బ్రాండ్‌ బట్టలను 2011లో లాంచ్‌ చేసింది. 2012లో మొదటిసారి ల్యాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో అడుగుపెట్టి తన సత్తాను చాటింది. ఆ తర్వాత యేడాది ఆమె దశ తిరిగింది. ‘ఓగ్‌ ఇండియా ఫ్యాషన్‌' నిర్వహించిన ఫ్యాషన్‌ వీక్‌ ఆమెకు మరింత ఫేమ్‌ తీసుకొచ్చింది. 2015లో హైదరాబాద్‌లో స్టోర్‌ ఓపెన్‌ చేసి తన కలెక్షన్‌ని మరింత పెంచింది అర్చన. ఈమెతో పాటు ఇంద్రాక్షి, గౌరంగ్‌ షా మహానటి కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌గా పనిచేశారు. ఈ ముగ్గురికి ఈ జాతీయ పురస్కారం దక్కింది.
national-awards3

బిందు మాలిని

మ్యూజిక్‌ డైరెక్టర్‌, కంపోజర్‌గా ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి బిందు మాలినికి. అరువి సినిమాతో ఈమె పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు కన్నడ ‘నాతిచరామి’ సినిమాలో పాటకుగాను ఈమెకు జాతీయ అవార్డు లభించింది. ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా చూడొచ్చు. ఈ సినిమాలోని పాటకే మంజునాథకి ‘బెస్ట్‌ లిరిసిస్ట్‌' అవార్డు రావడం విశేషం.
national-awards4

జ్యోతి డి తోమర్‌

పద్మావత్‌ సినిమాలోని గూమర్‌ పాట కొరియోగ్రఫీ చేసినందుకు కృతితో కలిపి ఈ జాతీయ అవార్డును పొందింది జ్యోతి. ఈవిడ చాలా సీనియర్‌ మోస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా బాలీవుడ్‌లో పేరు తెచ్చుకుంది. ఓ డ్యాన్స్‌ అకాడమీని కూడా ఈమె నడుపుతున్నది. గూమర్‌ పాట కోసం పన్నెండు రోజుల పాటు దీపికతో రిహార్సల్‌ చేయించారు. నాలుగు రోజులలో పాట పూర్తయింది. ఈ పాటలో సుమారు 60మంది కో-డ్యాన్సర్‌లకు ఈ పాటను నేర్పారు జ్యోతి. వారి కష్టమే.. ఆ పాటకు పట్టాభిషేకం జరిగేలా చేసింది.
national-awards5

రిమాదాస్‌

2018లో వచ్చిన విలేజ్‌ రాక్‌స్టార్‌తో ఈమె పేరు ప్రపంచమంతా వినిపించింది. ఆ సినిమాకి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. ఆ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును కూడా దక్కించుకుంది. ఈ సంవత్సరం రిమాదాస్‌ తీసిన బుల్‌బుల్‌ కెన్‌ సింగ్‌ సినిమా టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శితమైంది. ఈ సినిమాకి ‘బెస్ట్‌ అస్సామీ ఫీచర్‌ ఫిల్మ్‌'గా ఈసారి ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో స్థానం దక్కింది. అలా ఈ సినిమాతో మరొకసారి జాతీయ అవార్డుల్లో రిమాదాస్‌ పేరు వినిపించింది.
national-awards6

మంజు బొర్హ

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను అందుకున్నారు మంజు. ‘బెస్ట్‌ పంగ్‌చెన్పా ఫీచర్‌ ఫిల్మ్‌'గా ‘ద ల్యాండ్‌ ఆఫ్‌ పాయిజన్‌ ఉమెన్‌' సినిమాకు ఈ అవార్డు దక్కింది. ఈ సినిమాకు దర్శకురాలే మంజు. షార్ట్‌ స్టోరీ రైటర్‌గా కూడా ఈమెకు మంచి పేరుంది. గౌహతికి చెందిన ఈమె ఇండియన్‌ పనోరమా, ఐఎఫ్‌ఎఫ్‌ఐ 2007, మామి ఇంటర్నేషనల్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌, 55వ జాతీయ అవార్డుల జ్యూరీ మెంబర్‌లో ఈమె ఉంది. ఇవేకాదు.. మరికొన్ని అవార్డుల ప్రదానంలో కూడా ఈమె కీలక పాత్ర పోషించింది.
national-awards7

సురేఖ సిక్రి

బాలికా వధు అదేనండీ.. తెలుగులో చిన్నారి పెళ్లికూతురు చూశారు కదా! ఈ సీరియల్‌తో ఈ బామ్మగారు అందరికీ సుపరిచితురాలయ్యారు. అలాగే బాలీవుడ్‌లో ‘బదాయి హో’ అనే సినిమాలో ఈ బామ్మ ఒక ప్రధాన పాత్ర పోషించింది. ఆ పాత్రకుగాను ఈమెకు అవార్డు దక్కింది. ఈ సినిమా సీక్వెల్‌ కూడా అనౌన్స్‌ చేసింది ఈ చిత్ర యూనిట్‌. అయితే 74 యేండ్ల సురేఖకి ఈ మధ్యే స్ట్రోక్‌ వచ్చింది. ఆమె త్వరగా కోలుకోవాలని అందరం ఆశిద్దాం.
national-awards8

ప్రియా కృష్ణస్వామి

‘బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఇన్‌ తమిళ్‌'గా భారం ఎంపికయింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ప్రియా కృష్ణస్వామి. ఈ సినిమా కథని రెండు వారాల్లో, షూటింగ్‌ని 18 రోజుల్లో పూర్తి చేసింది ప్రియ. వృద్ధాశ్రమంలో ముసలివాళ్లు పడే అవస్థలు, వారి జీవనమే ఈ సినిమా కథ. బొంబై బాయ్స్‌, భూపాల్‌ ఎక్స్‌ప్రెస్‌ సినిమాకి ప్రియా ఎడిటర్‌గా వ్యవహరించింది. ‘ద ఐ అఫ్‌ ద ఫిష్‌' డాక్యుమెంటరీకి నేషనల్‌ అవార్డు లభించింది. ఈమె 2014, 17, 18 సంవత్సరాల్లో నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ జ్యూరీ మెంబర్‌గా కూడా వ్యవహరించింది.
national-awards9

కృతి మహేష్‌

డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌తో ఫేమ్‌ అయింది కృతి. 34యేండ్ల కృతి చాలా కష్టపడి బాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా ఎదిగింది. సంజయ్‌లీలా భన్సాలీ చెప్పేవరకు కూడా ఆమెకు తెలియలేదు. పద్మావత్‌ సినిమాలోని ‘గూమర్‌.. గూమర్‌..’ పాటను ఇద్దరు కొరియోగ్రఫీ చేశారు. అందులో ఒకరు కృతి. ఈ పాట కోసం బిల్‌ గిరిజనులు చేసే నృత్యాన్ని ప్రేరణగా తీసుకొని ఈ నృత్యానికి కొరియోగ్రఫీ చేశారు. పద్మావత్‌ సినిమాలో ఈ పాట రాజప్రాసాదంలో చేస్తుంది హీరోయిన్‌. అందుకే గిరిజనుల నృత్యాన్ని రాయల్‌ లుక్‌లో కనిపించేలా కొన్ని మార్పులు చేశారట.

- సౌమ్య పలుస

625
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles