శ్రావణ పర్యాటకం రామగిరి ఖిల్లా


Sun,August 25, 2019 02:03 AM

khilla
ప్రకృతి పచ్చచీర కట్టుకున్న అందాలు, అత్యద్భుత శిల్పకళకు ఆనవాళ్లు, ప్రాచీన సంస్కృతికి, వారసత్వ సంపదకు సజీవసాక్ష్యమై నిలుస్తున్నది రామగిరిఖిల్లా. కాకతీయుల శిల్ప కళాపోషణకు దర్పణంగా రామగిరి దుర్గంపై వారు నిర్మించిన అపురూప కట్టడాలు నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. శత్రు దుర్బేధ్యమైన రక్షణ స్థావరంగా, సొరంగ మార్గాలు, అలనాటి ఫిరంగులు.. పురాతన ఆలయాలతో చారిత్రక ప్రసిద్ధి గాంచి నేటికీ పర్యాటకులను అలరిస్తున్నది. వందల ఏళ్ల చారిత్రాత్మక నేపథ్యంతో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకొని, తెలంగాణ ప్రాంతంలో విశిష్ఠమైన పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. శ్రావణమాసమంతా పర్యాటకులతో అలరించే రామగిరి ఖిల్లాపై మనమూ విహరిద్దాం రండి.
khilla1
క్రీ.శ. ఒకటో శతాబ్ధంలో ఈ ఖిల్లా రూపుదిద్దుకున్నట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఎత్తైన రాతి కట్టడాలు, బురుజులు, కోటలు, బావులు, జలపాతాలతో కూడుకుని ఉన్న ఈ ఖిల్లా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దుర్గం పటిష్ఠంగా ఉండి శత్రు దుర్బేధ్యమైనది. శ్రావణ మాసంలో ప్రతీ సోమ, శనివారాలలో యువకులు, ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు రామగిరిఖిల్లా అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున వస్తుంటారు.
khilla3

కోట చరిత్ర

ఈ ప్రాంతాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి, పులోమావి పాలించినట్లు పెద్దబొంకూర్‌, గుంజపడుగు గ్రామాల్లో పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడిన ఆధారాలు తెలుపుతున్నాయి. చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు ఈ దుర్గాన్ని అభివృద్ధి చేసినట్లు చరిత్ర చెబుతున్నది. క్రీ.శ 1158లో చాళుక్య గుండరాజును ఓడించి కాకతీయులు రామగిరి దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. రామగిరిఖిల్లాను ప్రతాపరుధ్రుడు 1195 వరకూ పాలించినట్లు ఓరుగల్లు మంత్రకూటముల శాసనాలు తెలియజేస్తున్నాయి. అనంతరం 1442లో బహమనీ సుల్తానులు ఆక్రమించుకోగా, వారి నుంచి రెడ్డి రాజులు స్వాధీనం చేసుకొన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఆ తర్వాత 1595లో మొఘలాయిల స్వాధీనంలోకి వెళ్లింది. 1606లో గోల్కొండ నవాబులు ఈ దుర్గాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. వారి నుంచి మహమ్మదీయులు వశపర్చుకొని నైజాం కాలం దాకా పాలించినట్లు చరిత్ర చెబుతున్నది. రామగిరి కోటలో ఇరువైపుల తొమ్మిది ఫిరంగులు, నలభై తోపులు ఉన్నట్లు, వాటిలో నుంచి ఆరు తోపులు చెన్నూర్‌ దేశ్‌ముఖ్‌లు తీసుకువెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
khilla4

రాముడు నడయాడిన నేల

శ్రీరామచంద్రుడు వనవాసం సమయంలో వచ్చి తపస్సు చేసి ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కొద్ది రోజులు కుటీరం ఏర్పరుచుకొని సీతాలక్ష్మణులతో ఇక్కడ ఉన్నాడని పెద్దలు చెబుతారు. ఈ ఖిల్లాపై సీతారామలక్ష్మణులు సంచరించినట్లు చెబుతున్న కొన్ని ఆనవాళ్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా పర్యాటకులకు దర్శనమిస్తాయి. ఖిల్లాపైన గల బండపై శ్రీరాముని పాదాల ముద్రలు, సీతాదేవి స్నానమాచరించిన కొలనుతో పాటు శ్రీరామునితో సంచరించిన ఆంజనేయుడి విగ్రహం కూడ ఉన్నది. దీంతో రామగిరి పర్యాటక కేంద్రంగానే కాక ఆధ్యాత్మిక కేంద్రంగాను భాసిల్లుతున్నది. 200 రకాలకు పైగా వనమూలికలు కలిగివున్న ఈ ఖిల్లా ఆయుర్వేద వైద్యానికి మూల కేంద్రంగా విలసిల్లుతున్నది.
khilla5

అడుగడుగునా పురాతన ఆనవాళ్లు

రామగిరి ఖిల్లా ప్రాచీన కళా సంపదకు, నాటి శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే కట్టడాలతో శోభిల్లుతున్నది. రామగిరిపై 20కిలోమీటర్ల దూరం వరకూ కనబడే బురుజు, రామగిరి కోట, జైలుఖానా, అశ్వశాల, సాలుకోట, సింహాల కోట, జంగేకోట, ప్రతాపరుద్రుల కోట, మొఘల్‌శాల, సింహాలకోట, గజశాల, భజనశాల, సభాస్థలి, పసరు బావి, సొరంగ మార్గాలు వంటి వాటితో పాటు పలు రాతి కట్టడాలతో అలరారింది. శత్రువును మట్టు పెట్టడానికి దేశంలోనే అత్యంత పెద్ద ఫిరంగుల్లో ఒకటైన 25 గుళ్లను నింపే ఫిరంగి ఉంది. దీని వేగం 3 కిలోమీటర్ల వరకూ దూసుకు వెళ్లేదని అంటారు. ఇక్కడి కొండ చరియలో శ్రీ రాముని మూల విగ్రహాలు ఉన్నాయి. భక్తులు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. గుట్టపైన దాదాపు ౬ కిలోమీటర్లు అడవిలో నడస్తూ కోటలు, శిల్పకళాను చూస్తూ పర్యాటకులు మైమరిచిపోతారు. కోటపై నుంచి చూస్తే కాళేశ్వరం వరకూ కనిపించే వ్యూపాయింట్‌, రామలింగాలు ఉన్నాయి. శ్రీరాముడు, సీతా, లక్ష్మణ, ఆంజనేయులతో వనవాస కాలంలో అడుగిడిన నేలగా ప్రజలు భావించే ఆధ్యాత్మిక కేంద్రం గా రామగిరి ఖిల్లా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.
khilla2

శ్రావణమాసంలో పర్యాటకుల సందడి..!

ప్రతి శ్రావణ మాసంలో రామగిరిఖిల్లాపై పర్యాటకుల సందడితో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. రామగిరి దుర్గంపై ప్రకృతి అందచందాలను తిలకిస్తూ పర్యాటకులు మైమరిచిపోతారు. ఆయుర్వేద వైద్యులు ఈ ఖిల్లాపై విలువైన వనమూలికలను సేకరిస్తారు. తెలంగాణ ప్రాంతంలో ప్రాచీన కళాసంపదకు నిలయమైన రామగిరిఖిల్లా అభివృద్ధికి పర్యాటక శాఖ మరింతగా కృషి చేయాల్సి ఉంది.

ప్రయాణం ఇలా...

పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి తూర్పు దిశగా మంథని వెళ్లే రహదారిలో 22 కిలో మీటర్ల దూరంలో రామగిరి ఖిల్లా ఉంటుంది. రామగిరి మండలంలోని నాగెపెల్లి (బేగంపేట అడ్డరోడ్డు) నుంచి బేగంపేట మీదుగా వెళితే రామగిరిఖిల్లాకు చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా వచ్చే పర్యాటకులు కాజీపేట-బల్లార్షా మార్గంలోని పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో దిగి బస్సు ద్వారా మంథని మార్గంలోని బేగంపేటకు చేరుకోవచ్చు.
khilla6

642
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles