ఎలా?


Sun,August 25, 2019 01:48 AM

Ella
“మీ లాంటి తెలివైన వాడిని అగ్నిప్రమాదాన్ని సృష్టించి మోసం చేయలేనని నాకు మొదటినించీ తెలుసు. అందుకని అక్కడ కావాలని గైగర్‌ కౌంటర్‌ను ఉంచాను. ఓ పొడవైన కొవ్వొత్తి, దాని కింద కాగితాలతో ఆ అగ్నిప్రమాదాన్ని సృష్టించాను. ఆ విధంగా మీ అనుమానం మొత్తాన్ని గైగర్‌ కౌంటర్‌ మీదకి మళ్ళించి మిగిలినవి పట్టించుకోకుండా చేయగలిగాను.”

రెండేండ్ల తర్వాత అబ్రహాం తిరిగి తన స్వగ్రామానికి వచ్చేసాడు. భార్య పోయాక ఆయనకి ఇక అక్కడ పనేం లేదు. బెన్సన్‌ ఓచోట తారస పడ్డప్పుడు ఆయన చిరునవ్వుతో చెప్పాడు. “నా క్లెయిమ్‌ని పాస్‌ చేసినందుకు థాంక్స్‌. ఆ డబ్బుతో తన జీవితంలోని ఆఖరి రెండేళ్ళు మా ఆవిడ ఆనందంగా గడిపింది.” “మీరు కోరుకున్నది జరిగింది. ఇప్పటికైనా మీరు ఆ గైగర్‌ కౌంటర్‌తో అగ్నిప్రమాదాన్ని ఎలా సృష్టించారో దయచేసి చెప్తారా?” “సరైన సమయంలో” ఆయన మృదువుగా నవ్వి చెప్పాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇన్సూరెన్స్‌ కంపెనీ బాస్‌ బెన్సన్‌కి ఫోన్‌ చేసి చెప్పాడు.


- మల్లాది వెంకట కృష్ణమూర్తి

ఫర్‌ దుస్తుల వ్యాపారంలో ఉన్న అబ్రహాం గురించి ఎవరిని అడిగినా ఆయన మానవత్వం గల మనిషనే చెప్తారు. ఫర్‌ వ్యాపారంలో గొంతులు కోసుకునే వ్యాపార పోటీ ఉంటుంది. కానీ, అబ్రహాం మాత్రం తన వ్యాపారాన్ని అలా చేసేవాడు కాదు. అందువల్ల అతి త్వరలో ఆయన దివాలా తీయబోతున్నాడని విన్న ఎవరూ ఆశ్చర్యపోలేదు.
అదే సమయంలో ఆయన ఫ్యామిలీ డాక్టర్‌ ఆయన భార్య ఆరోగ్యం గురించి ఓ హెచ్చరిక చేసాడు.
“ఆవిడ ఆరోగ్యం పుంజుకోవాలంటే వేడి వాతావరణంలోకి మారాలి. ఫ్లోరిడాకి వెళ్ళమని నా సలహా.”
నలభై ఏళ్ళ వైవాహిక జీవితం తర్వాత కూడా అబ్రహాం, ఆయన భార్య అప్పుడే పళ్ళున వాళ్ళల్లా ఒకర్నొకరు ప్రేమించుకోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. మెచ్చుకునేలా కూడా చేస్తుంది. దాంతో తన భార్య కోలుకోవడం అబ్రహాం ప్రాధాన్యాల్లో మొదటిదైంది.
* * *

బెన్సన్‌ ప్రైవేట్‌ డిటెక్టివ్‌. ఫైర్‌మేన్‌గా కొన్ని సంవత్సరాలు పనిచేసిన అతను అగ్నిప్రమాదాలు ఎలా మొదలయ్యాయో కనుక్కోవడంలో దిట్ట. అతను కొన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీలకి వచ్చే అగ్నిప్రమాదాల క్లెయిమ్స్‌ నిజమైనవా లేక కావాలని చేసినవా అన్నది పరిశోధిస్తుంటాడు.
ఆ రోజు అతనికి ఓ ఇన్సూరెన్స్‌ కంపెనీనించి ఏభై వేల డాలర్ల ఓ క్లెయిమ్‌ని పరిశోధించమని అభ్యర్థన వచ్చింది. అది ఓ ఫర్‌ దుస్తుల గోడౌన్‌. బెన్సన్‌ ప్రతీది అనుమానపు కళ్ళతోనే చూస్తాడు. అది అతని వృత్తికూడా. న్యాయం వైపు ఎంతగా ఉంటాడంటే తన అమ్మమ్మని కూడా జైలుకి పంపడానికి వెనుకాడడు. ఐతే, ఆవిడని కటకటాల వెనక్కి నెట్టాక కొంత మానవత్వంతో నెలకోసారి ఆవిడ దగ్గరకి, ఆవిడకి ఇష్టమైన బిస్కెట్లతో వెళ్తుంటాడు.
అబ్రహాం వేర్‌హౌస్‌ కాలిపోయిన కేసు అందాక బెన్సన్‌ మొదటగా అబ్రహాం గురించి విచారించాడు. అతనికి కొన్ని ఎజెండాలు కనిపించాయి. మొదటిది ఆయన దివాలాకి సిద్ధంగా ఉన్నాడు. రెండోది ఆయన త్వరలో తన భార్య ఆరోగ్యం దృష్ట్యా ఫ్లోరిడాకి వెళ్ళిపోతున్నాడు. మూడోది క్లెయిమ్స్‌కి ఉపయోగించే ఆయన కంపెనీ ఎకౌంట్‌ పుస్తకాలు కాలిపోలేదు. ఆయన చాలా మంచివాడని, నీతిపరుడని ప్రతీ వాళ్ళు చెప్పారు. ఆయన్ని చూసాక బెన్సన్‌కి కూడా అదే అభిప్రాయం కలిగింది.
బెన్సన్‌ కాలిన ఆయన గోడౌన్‌ తాలూకు ఫైర్‌మెన్‌ రిపోర్ట్‌ని చదివాడు. అందులో ఓ గైగర్‌ కౌంటర్‌ (రేడియో యాక్టివిటీని కొలిచే పరికరం) కనిపించిందని ఉంది. ఆ సమయంలో అబ్రహాం రోజున్నర రైలు ప్రయాణ దూరంలోని సెయింట్‌ లూయిస్‌లో ఉన్నాడు. బెన్సన్‌కి ఆ సమాధానంలో నాలుగో ఎజెండా కనిపించింది. డబ్బుకోసం అగ్నిప్రమాదం సృష్టించే వాళ్ళు సాధారణంగా ఆ సమయంలో చాలా దూరంగా ఉంటారని అతనికి అనుభవ పూర్వకంగా తెలుసు.
అంత దూరం నించికూడా అనేక తెలివైన పద్ధతుల ద్వారా అగ్నిప్రమాదాలని సృష్టించచ్చు. ఓ టెలీఫోన్‌ కాల్‌ద్వారా ధ్వని తరంగాలతో ఒకరు అగ్నిప్రమాదాన్ని సృష్టించడాన్ని అతను ఋజువు చేసాడు. మరో కేసులో ఆ గోడౌన్‌లో గంటన్నరలో నాలుగు నల్లటి మసిబారిన గోడలు, నల్లటి నీళ్ళుగల నేల మాత్రమే మిగులుతుంది. ఆ నీళ్ళని బక్కెట్లలో బయటకి తెచ్చి వడపోస్తే, వారికో నల్లగా మాడిన వస్తువు కనిపించింది. అది గైగర్‌ కౌంటర్‌ అని నిపుణులు చూసి చెప్తే కాని ఫైర్‌మెన్‌కి తెలీలేదు. తడి, వేడి దాని మెకానిజాన్ని పాడు చేసేసాయి. దాంతో బెన్సన్‌ అగ్నిప్రమాదాన్ని అబ్రహాం సృష్టించాడని నమ్మాడు. అది ఋజువు చేస్తే అబ్రహాంకి కనీసం ఐదేళ్ళ జైలు శిక్ష పడుతుంది.

అబ్రహాంని కలిసి బెన్సన్‌ గైగర్‌ కౌంటర్‌ గురించి ప్రశ్నించాడు.
“నా బావమరిది నాకు ఫోన్‌ చేసేదాకా ఆ ప్రమాదం గురించి నాకు తెలీదు. తెలీగానే వెంటనే ఇక్కడికి వచ్చాను” అబ్రహాం జవాబు చెప్పాడు.
“అది చాలా పెద్ద అగ్నిప్రమాదం మిస్టర్‌ అబ్రహాం. మొత్తం కాలిపోయింది.”
“అవును.”
“మీరా పని చేయకుండా ఉండాల్సింది. ముఖ్యంగా మీ వయసులో జైలుకి వెళ్ళడం బాధాకరం.”
“నా గోడౌన్‌ని నేను కాల్చానని అనుకుంటున్నారా?” అబ్రహాం చిత్రంగా చూస్తూ ప్రశ్నించాడు.
“అది మీ పనని నాకు తెలుసు.”
“మీరు ఋజువు చేయగలరా?”
“సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను.”
“ఆ సమయం వస్తుందని నేను అనుకోను. ఒకవేళ వస్తే ఫ్లోరిడాలో నా ఫోన్‌ నంబర్‌ నా క్లెయిమ్‌ ఫారంలో మీకు కనిపిస్తుంది. వెంటనే వస్తాను.”

“మీకా గైగర్‌ కౌంటర్‌ అవసరం ఏమొచ్చింది?” బెన్సన్‌ ప్రశ్నించాడు.
“ఎవరో క్రిస్మస్‌కి బహుమతిగా ఇచ్చారు. అది నిరుపయోగం కాబట్టి ఇంట్లో ఉంచుకోలేదు.”
బెన్సన్‌ ఫైర్‌మెన్‌ స్వాధీనంలో ఉన్న ఆ గైగర్‌ కౌంటర్‌ను ఆసక్తిగా పరిశీలించాడు. దాని భాగాలన్నీ విడదీసి నిప్పుని పుట్టించే విధానం కోసం వెదికాడు. దాన్ని నిపుణుల దగ్గరకి తీసుకెళ్ళి వారి అభిప్రాయాలను కోరాడు. గైగర్‌ కౌంటర్‌ డయాగ్రంలని పరిశీలించి అది పని చేసే విధానాన్ని అర్థం చేసుకున్నాడు. ఓ ఔత్సాహికుడు తనమీద విజయం సాధించడం, పరిష్కారం లభించక పోవడం బెన్సన్‌ని బాధించింది.
భార్య వేడి వేడి బ్లాక్‌ కాఫీలని ఇస్తూంటే తాగుతూ ఆ సమస్యమీద వరుసగా పధ్నాలుగు గంటలు ఆ డయాగ్రంలని చూస్తూ ఆలోచించాడు. చివరికి అతని భార్య మృదువైన కోపంతో చెప్పింది.
“దీన్ని ఇంతటితో మర్చిపో బెన్సన్‌.”
కాని అతను వదలదలచుకోలేదు. బెన్సన్‌ దాన్ని తయారు చేసిన ఫేక్టరీకి వెళ్ళాడు. గైగర్‌ కౌంటర్‌తో నిప్పుని ఎలా సృష్టించవచ్చని అక్కడి ఇంజినీర్లని, మెకానిక్‌లని, కార్మికులని అడిగాడు.
“మీకు తెలిస్తే దయచేసి మాకు చెప్పండి” అంతా చెప్పారు.
ఓ రాత్రి భార్య అతని పక్కటెముకల్లో పొడవడంతో మెలకువ వచ్చింది.
“బెన్సన్‌! నాలుగు వారాలుగా నీకు పీడకలలు వస్తున్నాయి. కలవరిస్తున్నావు. ఎప్పుడూ లేనిది నువ్వు మన అబ్బాయిమీద అరిచావు. నన్ను చాలాసార్లు తిట్టావు. నువ్వా సమస్యని మర్చిపోవడం మంచిది. లేదా అది నీకు, ఇంట్లోని వాళ్ళందరికీ మన:శ్శాంతి లేకుండా చేస్తుంది.”

“గైగర్‌ కౌంటర్‌తో నిప్పుని సృష్టించడం ఎలా? సమాధానం చాలా తేలికైంది. ఎందుకంటే, నిపుణుడు కాని అబ్రహాం దాన్ని కనుక్కో గలిగినప్పుడు దాన్ని తయారు చేసిన నిపుణులే ఎందుకు కనుక్కోలేక పోయారు? నేను అది తెలుసుకుంటే అబ్రహాంకి చెల్లించాల్సిన ఏభై వేల డాలర్ల క్లెయిమ్‌ని చెల్లించవద్దని నేను ఆపగలుగుతాను” బెన్సన్‌ భార్యతో చెప్పాడు.
కొన్ని రోజుల తర్వాత అబ్రహాం తన భార్యతో ఫ్లోరిడాకి వెళ్తూ తన క్లెయిమ్‌ చెక్‌ని పంపాల్సిన చిరునామాని ఇన్సూరెన్స్‌ కంపెనీకి తెలియచేసాడు. అక్కడికి చేరుకున్నాక కొత్త ఫోన్‌ నంబర్‌ను కూడా తెలియచేసాడు.
బెన్సన్‌ తన ఆఫీస్‌ గదిలో గైగర్‌ కౌంటర్‌ని ఉంచుకుని ఎవరితో మాట్లాడుతున్నా సరే, అకస్మాత్తుగా దాన్ని అందుకుని అనేక కోణాల నించి పరిశీలిస్తూ మౌనంగా, బాధగా దాని వంకే చూసేవాడు.
“అబ్రహాంకి చెల్లించేసాం. ఇంక ఆ కేసు గురించి మర్చిపో” అని తెలిసిన ఇన్సూరెన్స్‌ కంపెనీలోని బాస్‌ ఓ రోజు బెన్సన్‌తో చెప్పాడు.
“ఎలా మర్చిపోగలను? దానికి పరిష్కారం దొరికే దాకా నాకు మన:శాంతి లేదు. లేదా చాలామంది గైగర్‌ కౌంటర్‌తో అగ్నిప్రమాదాన్ని సృష్టించచ్చు” అతను నిస్సారంగా చెప్పాడు.
* * *

రెండేండ్ల తర్వాత అబ్రహాం తిరిగి తన స్వగ్రామానికి వచ్చేసాడు. భార్య పోయాక ఆయనకి ఇక అక్కడ పనేం లేదు. బెన్సన్‌ ఓచోట తారస పడ్డప్పుడు ఆయన చిరునవ్వుతో చెప్పాడు.
“నా క్లెయిమ్‌ని పాస్‌ చేసినందుకు థాంక్స్‌. ఆ డబ్బుతో తన జీవితంలోని ఆఖరి రెండేళ్ళు మా ఆవిడ ఆనందంగా గడిపింది.”
“మీరు కోరుకున్నది జరిగింది. ఇప్పటికైనా మీరు ఆ గైగర్‌ కౌంటర్‌తో అగ్నిప్రమాదాన్ని ఎలా సృష్టించారో దయచేసి చెప్తారా?”
“సరైన సమయంలో” ఆయన మృదువుగా నవ్వి చెప్పాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత ఇన్సూరెన్స్‌ కంపెనీ బాస్‌ బెన్సన్‌కి ఫోన్‌ చేసి చెప్పాడు.
“అబ్రహాం హాస్పిటల్‌లో క్రిటికల్‌ కండిషన్లో ఉన్నాడు. మిమ్మల్ని ఓసారి చూడాలని అనుకుంటున్నాని నాకు సమాచారం పంపాడు.”
బెన్సన్‌ క్షణం ఆలస్యం చేయకుండా హాస్పిటల్‌కి వెళ్ళాడు.
“మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో చూడాలని అనుకుంటున్నానని పట్టుపట్టబట్టి వెళ్ళనిస్తున్నాను. ఆయన గుండె బాగా బలహీనపడింది. నిమిషం మించి మాట్లాడకండి” డాక్టర్‌ బెన్సన్‌తో చెప్పాడు.
అబ్రహాం అతికష్టం మీద శ్వాస పీలుస్తున్నాడు.
“మిమ్మల్ని ఇలా చూడటం నాకు బాధగా ఉంది” బెన్సన్‌ చెప్పాడు.
“ఓ రోజంతా పని చేసాక బలహీన పడతాం. అలాగే జీవితకాలం పనిచేసాక కూడా బలహీనపడతాం. సరైన సమయం వచ్చింది.”
“దేనికి?”

“ఆ రోజు నేను మీకు చెప్పినట్లుగా ఆ అగ్నిప్రమాదం గురించి చెప్పడానికి. నా ఇన్సూరెన్స్‌ కంపెనీ నించి డబ్బు అక్రమంగా తీసుకున్నందుకు బాధగా ఉంది.”
దిండు కిందనించి ఓ కవర్‌ను తీసిచ్చాడు.
“మీ లాంటి తెలివైన వాడిని అగ్నిప్రమాదాన్ని సృష్టించి మోసం చేయలేనని నాకు మొదటినించీ తెలుసు. అందుకని అక్కడ కావాలని గైగర్‌ కౌంటర్‌ను ఉంచాను. ఓ పొడవైన కొవ్వొత్తి, దాని కింద కాగితాలతో ఆ అగ్నిప్రమాదాన్ని సృష్టించాను. ఆ విధంగా మీ అనుమానం మొత్తాన్ని గైగర్‌ కౌంటర్‌ మీదకి మళ్ళించి మిగిలినవి పట్టించుకోకుండా చేయగలిగాను.”
“చాలాకాలం తర్వాత ఈ రాత్రి నాకు బాగా నిద్ర పడుతుంది” బెన్సన్‌ చిన్నగా నవ్వి చెప్పాడు.
బెన్సన్‌ బయటికి వచ్చాక చూస్తే ఆ కవర్‌లో ఏభై వేల డాలర్లలోని ఆయన పెట్టిన ఖర్చు ఎకౌంట్‌, మిగిలిన పధ్నాలుగు వేల రెండు వందల ఎనిమిది డాలర్ల ఏభై మూడు రెట్లకి ఇన్సూరెన్స్‌ కంపెనీ పేరు మీద చెక్‌ ఉన్నాయి.
ఆ తెల్లారు ఝామున అబ్రహాం నిద్రలో మరణించాడు.
(జేమ్స్‌ రోనాల్డ్‌ కథకి స్వేచ్ఛానువాదం)

214
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles