గూఢచారుల స్టయిల్‌


Sun,August 25, 2019 01:42 AM

Spy
శత్రుదేశాల రహస్యాలను, వారు చేసే కుట్రలను తెలుసుకోవడానికి రష్యా, అమెరికా వంటి దేశాలు గూఢచారులను నియమించుకునేవి. కొన్ని రాజ్యాలు, దేశాల మధ్య జరిగిన యుద్ధాలకు గూఢచర్యం వహించిన పాత్ర ఎంతో కీలకం. సమాచార చేరవేతలోనూ, పరిశోధనలోనూ శత్రువులకు పట్టుబడి ఎంతోమంది గూఢచారులు ప్రాణాలు కోల్పోయారు. శత్రువుల నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి, సమాచార సేకరణకు గూఢచారులు పలురకాల పరికరాలను వినియోగించేవారు.
Spy1
Spy2

బల్గేరియన్‌ గొడుగు

గూఢచారులు సమాచార సేకరణలో అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. అన్ని రకాల పరిస్థితులను చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. కాబట్టి అందుకోసం కేజిబి సంస్థకు చెందిన గూఢచారులు బల్గేరియన్‌ గొడుగును ఉపయోగించేవాళ్లట. ఈ గొడుగులో ఉండే ఓ బటన్‌ను నొక్కుతారు. అలా నొక్కిన వెంటనే సిలెండర్‌ యాక్టివేట్‌ అయి యంత్రం బయటికొచ్చి శత్రువుల శరీరంలోకి చొచ్చుకెళ్తుంది. ఈ యంత్రంలో విషాన్ని నింపి ఉంచడం వల్ల అది గుచ్చుకున్న వెంటనే ప్రాణాలు కోల్పోతారు.
Spy3

బాండ్‌ కార్‌

జేమ్స్‌బాండ్‌ సినిమా గోల్డ్‌ఫింగర్‌(1964)లో బాండ్‌ వాడే కారు ఆస్టన్‌ మార్టిన్‌ డీబీ 5కు ఇది నకలు. మెషిన్‌ గన్‌లు, టైర్‌ స్లాషర్లు, బుల్లెట్‌ ప్రూఫ్‌ షీల్డ్‌, ఆయిల్‌ జెట్‌లు, డాష్‌బోర్డు రాడార్‌ స్క్రీన్‌, రొటేటింగ్‌ లైసెన్స్‌ ప్లేట్‌, ఎజెక్టర్‌ సీటు వంటి అనేక సౌకర్యాలు ఈ కారులో ఉండేవి. బాండ్‌ కారు అంటే అప్పట్లో సంచలనం.
Spy4

ఎనిగ్మా మెషిన్‌

రెండో ప్రపంచయుద్ధంలో రహస్య సందేశాల్ని అందించేందుకు నాజీలు వాడిన పరికరమే ‘ఎనిగ్మా మెషిన్‌ ’. ఓ చిన్న బ్రీఫ్‌ కేసులా మార్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూఢచారులకు అందించింది నాజీ సైన్యం. దీని గుట్టు విప్పేందుకు బ్రిటిష్‌ నిఘా వ్యవస్థ గణితవేత్తలు, భాషావేత్తలు, కళాకారులు, మేధావులతో ఓ రహస్య స్థావరంలో చర్చలు కూడా జరిపింది. ప్రఖ్యాత కంప్యూటింగ్‌ శాస్త్రవేత్త అలన్‌ ట్యూరింగ్‌ నేతృత్వంలో సాగిన పరిశోధనల్లో బొంబా, కలోసల్‌ అనే మరో వ్యవస్థ ద్వారా ఎనిగ్మా మెషిన్‌ కోడ్‌ను బట్టబయలు చేశారు. ఈ రహస్యాన్ని 30 ఏండ్ల పాటు ఎవరికీ తెలియనివ్వలేదు.
Spy5

పావురం కెమెరా

తొలి ప్రపంచయుద్ధ సమయంలో పావురాలకు చిన్న కెమెరాలను కట్టి శత్రువుల వ్యవహారాలను రికార్డు చేసేందుకు వాడేవారు. శత్రువుల వద్ద ఉన్న ఆయుధాలు, భద్రతా వ్యవస్థల తీరు తెలుసుకుని వ్యూహాలు మార్చేవారు. రూటు మ్యాపులు రూపొందించడంలో కూడా ఇవి ఎంతో కీలకంగా ఉపయోగపడేవి.
Spy6

సైనైడ్‌ కండ్లద్దాలు

అమెరికాకు చెందిన ఓ గూఢచర్య సంస్థ 1975-77ల మధ్య సైనైడ్‌ కండ్లద్దాలను వాడింది. ఈ అద్దాల్లో సైనైడ్‌ పిల్లెట్‌ను అమర్చేవారు. పట్టుబడిన గూఢచారుల నుంచి రహస్యాలు తెలుసుకోవడానికి శత్రువులు విపరీతంగా హింసించేవాళ్లు. వారి నుంచి సమాచారాన్ని సేకరించిన తర్వాత చంపేసేవాళ్లు. అందుకోసమే శత్రువులకు పట్టుబడిన వెంటనే రహస్యాలు చెప్పకుండా కండ్లద్దాల కొసల్ని నోటికి కరుచుకుని ప్రాణాలు విడిచేవాళ్లు.

లిప్‌స్టిక్‌ పిస్టల్‌

రష్యాకు చెందిన ఓ గూఢచర్య సంస్థ లిప్‌స్టిక్‌ పిస్టల్‌ను ఉపయోగించిందట. ఈ బుల్లి తుపాకీలో ఉండే 4.5 మిల్లీమీటర్ల బుల్లెట్‌ను వదిలేవారు. ఒక్క బుల్లెట్‌తోనే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి.

237
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles