ఒంటరిగా లక్ష కిలో మీటర్లు!


Sun,August 25, 2019 01:26 AM

photography
అమ్మాయిలు ఎక్కడికైనా ఒంటరిగా ప్రయాణించవచ్చని నిరూపించాలనుకున్నది. దేశ, విదేశాలు పర్యటించి లక్ష కిలో మీటర్ల ప్రయాణం పూర్తి చేసింది. మహిళలు ఒంటరిగా ప్రయాణించడం సురక్షితం కాదనే వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసిందీమె.

మహిళలంటే ఎప్పుడూ ఇంటికే పరిమితమవ్వాలా? ప్రకృతి అందాలను ఆస్వాదించకుండా ఆగిపోవల్సిందేనా? లేనిపోని కట్టుబాట్ల మధ్య నలిగిపోయే మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఢిల్లీకి చెందిన కైనత్‌ కాజి అనే మహిళ శ్రీకారం చుట్టింది. అందుకోసం వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. కైనత్‌ కాజి తండ్రి అరాహత్‌ అలీ మత ప్రబోధకుడు. తల్లి గృహిణి. కాజి కుటుంబాల్లో అమ్మాయిలకు ఎన్నో పరిమితులుండేవి. తండ్రి మాత్రం ఆమెను బాగా చదివించాడు. డిగ్రీ తరువాత ఆగ్రా వెళ్లి పీజీ, పీహెచ్‌డీ చేసింది. కొన్నాళ్లకు నోయిడాలో మాస్‌ కమ్యునికేషన్‌లో పీజీ డిప్లొమా చేసింది. ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపన. దాంతో ఫొటోగ్రఫీపై ఆసక్తితో ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ ఒ.పి.శర్మ వద్ద శిక్షణ తీసుకున్నది. ఆ ఇష్టంతోనే రకరకాల ప్రాంతాలకు వెళ్లి ఫొటోలు తీసేది. వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ కొత్త ప్రదేశాల్ని చూడటం, ఆయా ప్రాంతాల్లోని వివిధ కట్టడాల చారిత్రక విశేషాల్ని తెలుసుకోవడం అలవాటుగా మారింది. ఆ విశేషాల్ని పత్రికలకు పంపుతుండేది. ఫొటోగ్రాఫర్‌గా, యాత్రా స్థలాల రచయితగా కైనత్‌కు మంచి పేరొచ్చింది. కొన్నాళ్లు పత్రికలకు కథనాలు పంపడమే వృత్తిగా పెట్టుకున్నది. ఆ ఆసక్తి క్రమంగా పెరిగింది. మరిన్ని ప్రాంతాలు తిరగాలని అనిపించింది. మొదట్లో కొత్త ప్రాంతాలకు వెళ్లడం, అక్కడ ఉండటం కాస్త ఇబ్బంది అనిపిస్తే స్నేహితులనో, బంధువులనో తీసుకెళ్లేది. క్రమంగా ఒంటరిగా వెళ్లడం అలవాటు చేసుకున్నది. ఓసారి కైనత్‌ స్నేహితురాలిని తనతోపాటు విదేశాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమయింది. అప్పుడు ఆ స్నేహితురాలి తండ్రి ఆమెను బయటకు పంపడానికి నిరాకరించాడు. ఎందుకంటే వారి కట్టుబాట్ల ప్రకారం ఆడవాళ్లు ఒంటరిగా బయటకు వెళ్లకూడదు. అది తెలుసుకున్న కాజి అనవసరమైన దురాచారాలతో మహిళల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని భావించి అటువంటి వారికి విముక్తి కలిగించాలనుకున్నది.

టెక్నాలజీని వాడింది...

దేశ, విదేశాలు పర్యటించి లక్ష కిలోమీటర్లు ఒంటరిగా ప్రయాణించింది. మహిళలు ఒంటరిగా వెళ్ల్లడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి సమస్యలుండవని నిరూపించింది. ఎక్కడికైనా వెళ్లేముందు ఆ ప్రాంత వివరాలను, మార్గాన్ని గూగుల్‌ ద్వారా తెలుసుకునేది. మార్గ మధ్యంలో ఏయే ప్రాంతాల మీదుగా ప్రయాణించాలో పేపరుపై రాసుకునేది. ఆమె ప్రయాణిస్తున్న వాహనం నంబరును ముందుగానే కుటుంబ సభ్యులకు పంపేది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నదీ కూడా వారికి ఎస్‌ఎంఎస్‌ చేసేది. స్మార్ట్‌ఫోన్లలో లొకేషన్‌'ను కూడా షేర్‌ చేస్తే ఏ క్షణంలో ఎక్కడున్నారన్నది కూడా వారికి తెలిసిపోతుంది. కైనత్‌ బస చేసే హోటల్‌ స్థాయి కూడా ఆన్‌లైన్లో తనిఖీ చేసుకుని ఏ ఇబ్బందీ లేదనుకుంటేనే అక్కడ దిగేది. మూడేండ్ల కాలంలో అనుకున్నట్లుగా లక్ష కిలోమీటర్లు పూర్తిచేసింది కైనత్‌ కాజి. ప్యారిస్‌, స్వీడన్‌, ఆమ్‌స్టర్‌డామ్‌, భారతదేశంలో నాగాలాండ్‌, అసోం, మిజోరాం, కర్ణాటక మినహా అన్ని రాష్ర్టాల్లోని ముఖ్య ప్రాంతాలనూ సందర్శించింది. గర్భిణిగా ఉన్నప్పుడు కూడా పలు ప్రాంతాలు తిరిగింది. అలా లక్ష కిలో మీటర్లు ఒంటరిగా ప్రయాణించింది. ‘లక్ష కిలోమీటర్లు ఒంటరిగా ప్రయాణించడం నాకు ఆనందంగా ఉంది. మహిళలు ఒంటరిగా వెళ్లడం సురక్షితం కాదు అనే అపోహల నుంచి ప్రతి ఒక్కరూ బయటపడాలి’ అని కైనత్‌ చెబుతున్నది. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నా’నని అంటున్నది కాజి. సరైన ప్రణాళికతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఎక్కడికైనా వెళ్లొచ్చు అనేది ఆచరణలో చూపించి దేశంలోని మహిళలకు ఆదర్శమయింది.

మార్పు తీసుకొస్తున్నది.....

భారత్‌లోని రాష్ర్టాల్లోనూ పర్యటిస్తూ కాజి మహిళలకు ఒంటరిగా ప్రయాణించే సమయంలో తలెత్తే అపోహలు, అనుమానాలపై అవగాహన కల్పిస్తూ వారిని చైతన్య పరుస్తున్నది. మహిళా పర్యటన, భద్రత గురించి పలు ప్రాంతాల్లో వర్క్‌షాపులు, సదస్సులు నిర్వహిస్తున్నది. భారత పర్యాటక నిర్వాహకుల సంఘం ఆధ్వర్యంలో జరిగే అవగాహనా కార్యక్రమాల్లో కైనత్‌ పర్యటన అనుభూతులను వివరిస్తున్నది. జాతీయ స్థాయిలో జరిగే అనేక సమావేశాలకు కైనత్‌ కాజి ముఖ్యాతిధిగా హాజరవుతూ తన ప్రసంగాల ద్వారా మహిళల్లో సరికొత్త మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. కైనత్‌ అందించిన సేవలకు ఎన్నో జాతీయ పురస్కారాలు లభించాయి.

220
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles