పద్య రత్నాలు-17


Sun,August 25, 2019 01:13 AM

poetry

గొప్పవారి గంభీరత

గంగ పాఱు నెపుడు కదలని గతితోడ
ముఱికివాగు పాఱు మ్రోతతోడ
పెద్ద పిన్న తనము పేరిమి యీలాగు
విశ్వదాభిరామ వినురవేమ!

- వేమన శతకం

తాత్పర్యం:
గొప్పవారి గంభీరతను తెలిపే నీతిపద్యమిది. గంగానది ప్రవాహంలో పెద్దగా హడావుడి వుండదు. కానీ, మురికికాల్వ మాత్రం చప్పుళ్ల మోతతో ప్రవహిస్తుంటుంది. ఇదే మాదిరిగా పెద్ద-చిన్నల మధ్య తారతమ్యాలు కూడా ఉంటాయి. పెద్దవారిలో అనుభవం వల్ల ఆర్భాటాలు పెద్దగా కనిపించవు. కానీ, పిన్న వయస్కుల్లో అదే లోపిస్తుంది.
poetry1

నీతిమంతుడే బలవంతుడు!

లావుగల వానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటి వాడెక్కినట్లు మహిలో సుమతీ!
- సుమతీ శతకం

తాత్పర్యం:
సమాజంలో నీతిపరులే నిజమైన బలవంతులు. శారీరకంగా ఎంత లావుంటే ఏం లాభం? నీతి లేని జీవితం వృథా. పెద్ద కొండవంటి ఏనుగునైనా సరే, చిన్నవాడైన మావటివాడు చక్కగా వశపరచుకొంటాడు. ఇదే మాదిరిగా, మనుషుల్లోనూ దేహబలం కన్నా బుద్ధిబలం గొప్పదని తెలుసుకోవాలి.
poetry2

అంతటి కరుణ కావాలి!

హరి నీవె దిక్కు నాకును
సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్‌
బరమేష్ఠి సురలు బొగడగ
కరి గాచిన రీతి నన్ను గావుము కృష్ణా!
- కృష్ణ శతకం

తాత్పర్యం:
భక్తుడు మనసారా వేడుకొన్నాక భగవంతుడు రక్షించకుండా ఉంటాడా! మొసలి బారిన పడిన ఏనుగును రక్షించడం కోసం శ్రీహరి దేవతలంతా పొగిడే రీతిలో ఎలా సర్వం వదిలివేసి వచ్చేశాడో అలాగే, నిన్నే నమ్ముకొన్న భక్తులను కాపాడలేవా! నాపైన కూడా అంతటి కరుణను చూపించు స్వామీ!
poetry3

వారి పాదధూళి సాక్షిగా..

సపరమ దయానిధే పతిత పావననామ హరే యటంచు సు
స్థిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా
శిరమున దాల్తు మీరటకు జేరకుడంచు యముండు కింకరో
త్కరముల కానబెట్టునట దాశరథీ కరుణాపయోనిథీ!
- దాశరథీ శతకం

తాత్పర్యం:
నిన్నే నమ్మిన వారిపట్ల అత్యంత దయను కురిపించే వాడవు. పాపులను ఉద్ధరించే వాడవు. చెదరని మనసుతో, సుస్థిరంగా, భక్తిమీరా ‘హరీ’ అంటూ భజనలు చేసే మహాత్ముల పాదధూళిని నా తలపై వేసుకొంటాను. ఆ యమధర్మరాజు భటులను మాత్రం నా వైపు రావద్దని ఒక్కసారి ఆజ్ఞాపించు స్వామీ!

ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్‌ నంబర్‌లో తెలియజేయండి.

175
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles