ఆర్టికల్‌ 370 ని వ్యతిరేకించిన శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ అనుమానాస్పద మరణం


Sun,August 18, 2019 01:19 AM

shyama-prasad
తను చదువుకున్న యూనివర్సిటీకి తనే రెండుసార్లు వైస్‌ చాన్స్‌లర్‌గా పనిచేసిన విద్యావంతుడు. హిందూ మహాసభతో రాజకీయాల్లోకి ప్రవేశించి హిందువులకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగాడు. రెండుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికవ్వడంతో పాటు కేంద్ర మంత్రిగాను విధులు నిర్వర్తించాడు. హిందూఏక్‌ దేశ్‌ మే దో విధాన్‌, దో ప్రధాన్‌ ఔర్‌ దో నిషాన్‌ నహీ చెలెంగే.. అంటూ 52 సంవత్సరాల వయసులో 14 ఏళ్ల రాజకీయ జీవిత కాలంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు. దేశం మొత్తానికి హిందువులు, ముస్లిములకు ఒకే విధమైన పౌర స్మృతి ఉండాలని ఉద్ఘాటించి, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 రాజ్యాంగ ప్రకరణపై కూడా వ్యతిరేకత చూపించాడు. ముస్ల్లిం లీగ్‌ ఆగడాలపై పోరాడుతూ ‘భారతీయ జనసంఘ్‌'ను స్థాపించాడు. తమ దేశంలో నివసించడానికి ఒక రాష్ట్రంలో అర్హత లేకపోవడానికి, గుర్తింపు చూపవలసి రావడం తదితర కారణాల వల్ల 1953 లో కాశ్మీర్‌ వెళ్ళి నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించి సరిహద్దు వద్ద అరెస్టు అయ్యాడు. పోలీస్‌ నిర్బంధంలోనే అనుమానాస్పదంగా మరణించిన డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ చివరిపేజీ.

మధుకర్‌ వైద్యుల,
సెల్‌: 9182777409


చిన్న వయసులోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ. విద్యారంగంలో రాణించి కలకత్తా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో అగ్రశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అంతేకాకుండా ఇంగ్లాండులో బారిస్టరు పూర్తిచేసి ఇంగ్లీష్‌ బార్‌ అసోసి యేషన్‌లో సభ్యులయ్యారు. అక్కడి యూనివర్సిటీల పనితీరును అధ్యయనం చేసి ఇరవై మూడు సంవత్సరాలకే సిండికేట్‌ ఆఫ్‌ కలకత్తా యూనివర్సిటీ సభ్యులయ్యారు. 33 ఏళ్లకే అసాధారణ స్థాయిలో రెండు పర్యాయాలు కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్‌ చాన్సలర్‌గా పనిచేశారు. 1939 ఆగస్టు - సెప్టెంబర్‌ మాసాల్లో ఆల్‌ ఇండియా హిందూ మహాసభ నాయకులు వినాయక దామోదర్‌ వీర సావర్కర్‌ బెంగాల్‌లో పర్యటించారు. అదే సమయంలో సావర్కర్‌తో ముఖర్జీకి పరిచయం ఏర్పడింది. సావర్కర్‌ ప్రభావంతో ఆయన హిందూ మహాసభలో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టారు.
article-370
డాక్టర్‌ ముఖర్జీ సామర్థ్యం పట్ల అపార విశ్వాసం ఉన్న గాంధీజీ ఒత్తిడితోనే ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ స్వతంత్ర హోదాతో మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారంటారు. ఆల్‌ ఇండియా హిందూ మహాసభ కార్యనిర్వాహక అధ్యక్షులుగా దేశమంతా విస్తృతంగా పర్యటించారు. భారత రాజకీయాల్లో నిబద్ధత కలిగిన విశ్వాస నాయకుడిగా పేరుతెచ్చుకున్న శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ బెంగాల్‌ ప్రభుత్వంలో ముస్లిం లీగ్‌ దురాగతాలపై పోరాడుతూనే తూర్పు బెంగాల్‌గా పిలువబడే నేటి బంగ్లాదేశ్‌లో విస్తృతంగా పర్యటించి హిందువులకు మనోధైర్యాన్ని కల్పించారు. ప్రధాని నెహ్రూ అనుసరిస్తు న్న హిందూ వ్యతిరేక విధానాలు, మైనారిటీ సంతుష్టీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం కలకత్తా చేరుకున్న శ్యాంప్రసాద్‌ ముఖర్జీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గురూజీ గోల్వల్కర్‌ డాక్టర్‌ ముఖర్జీ స్థాపించబోయే పార్టీకి పండిట్‌ దీనదయాల్‌ ఉపాధ్యాయ, అటల్‌ బిహారీ వాజపేయి కుశభావు ఠాక్రే, నానాజీ దేశ్‌ముఖ్‌, సుందర్‌ సింగ్‌ బండారి, జగదీష్‌ మాథూర్‌ లాంటి నాయకులను జతచేశారు. దేశంలోని అన్ని ప్రాంతాల మేధావులు, నాయకులతో జరిపిన చర్చలు , వచ్చిన ప్రతిపాదనలు , ఆలోచనలతో 1951 అక్టోబర్‌ 21న ఢిల్లీలోని రఘుమల్‌ ఆర్య కన్యా విద్యాలయంలో భారతీయ జనసంఘ్‌ పార్టీ ఆవిర్భవించింది. ఆవిర్భావ తొలినాళ్లలోనే భారతీయ జనసంఘ్‌ 1951-52 ఎన్నికల్లో మూడు లోకసభ స్థానాలలో విజయం సాధించింది.

అదే సమయంలో కశ్మీర్‌ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతూ వచ్చింది. ప్రతిపక్ష నాయకుడిగా కశ్మీర్‌ సమస్యపై న్యాయసమ్మతమైన, ప్రజా ఆమోదమైన పరిష్కారాన్ని డాక్టర్‌ ముఖర్జీ చూపించినప్పటికీ ప్రధాని నెహ్రు అబ్దుల్లా చెప్పినట్లు గానే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాడు. నెహ్రూ తీసుకున్న నిర్ణయంతో కశ్మీర్‌లో ప్రవేశించడానికి భారత రాష్ట్రపతి కూడా ప్రత్యేక అనుమతి పొందాలి. దీనిని తీవ్రంగా పరిగణించిన శ్యామ్‌ప్రసాద్‌ కశ్మీర్‌ సమస్యపై జాతీయవాద ఉద్యమాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాడు.

నెహ్రు విధానం ప్రకారం కశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి ఉంటారు. వారికి ప్రత్యేక జాతీయజెండా, రాజ్యాంగం ఉంటాయి. దీన్ని వ్యతిరేకిస్తూ ‘హిందూఏక్‌ దేశ్‌ మే దో విధాన్‌, దో ప్రధాన్‌ ఔర్‌ దో నిషాన్‌ నహీ చెలెంగే’.. అంటూ బలంగా నినదించాడాయన. ప్రజాపరిషత్‌ పార్టీ పండిట్‌ ప్రేమ్‌నాథ్‌ డోగ్రా నేతృత్వంలో షేక్‌ అబ్దుల్లాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఆందోళనకు శ్యామ్‌ప్రసాద్‌ సంపూర్ణ బహిరంగ మద్దతు తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకుల రూపంలో తనకు అందివచ్చిన యువ నాయకులు పండిట్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ, అటల్‌ బిహారీ వాజపేయిలకు కీలక బాధ్యతలు అప్పగించారు. డాక్టర్‌ ముఖర్జీ ఆరోజు తీసుకున్న నిర్ణయంతో భారతీయ జనసంఘ్‌ తదనంతరం భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. ఓవైపు పార్టీని విస్తరిస్తూనే ప్రధానంగా కశ్మీర్‌ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆనాడు జమ్ముకశ్మీర్‌లోప్రవేశించాలంటే రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాలన్న నిబంధన చేశారు. దీనిని జాతి, దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ రక్షణ శాఖ అనుమతి లేకుండానే జమ్ముకశ్మీర్‌లో పర్యటించాలని నిర్ణయించారు. అక్కడ కశ్మీర్‌ షేక్‌ అబ్దుల్లా ప్రభు త్వం అనుసరిస్తున్న నిర్బంధ వైఖరిని ప్రత్యక్షంగా పర్యటించి పర్యవేక్షించి పరిస్థితులను బాహ్య ప్రపంచానికి వివరిస్తూ నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు.

1953, మే 8న ఢిల్లీ నుండి ప్యాసింజర్‌ రైలులో గురుదత్త వైద్‌,టేక్‌ చంద్‌లతో కలసి డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ జమ్ముకశ్మీర్‌ పర్యటన ప్రారంభించారు. అంబాలా, పఠాన్‌కోట్‌, జలంధర్‌లో పెద్ద ఎత్తు న జాతీయవాదులు తరలివచ్చి డాక్టర్‌ ముఖర్జీతో చేతు లు కలిపి స్వాగతిస్తూ ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.

shyama-prasad1
దేశంలోని అన్ని ప్రాంతాల మేధావులు, నాయకులతో జరిపిన చర్చలు , వచ్చిన ప్రతిపాదనలు, ఆలోచనలతో 1951 అక్టోబర్‌ 21న ఢిల్లీలోని రఘు మల్‌ ఆర్య కన్యా విద్యాలయం లో జరిగిన సమావేశంలో భారతీయ జనసంఘ్‌ పార్టీ ఆవిర్భవించింది.

1953 మే 11న జమ్ముకశ్మీర్‌లో అడుగుపెట్టిన శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీని అనుమతి లేకుండా ప్రవేశించిన నేరానికి అరెస్ట్‌ చేశారు. ఆ రాత్రి బటోటెకు తరలించారు. మరుసటి రోజు ఉదయం శ్రీనగర్‌కు తరలించారు. ఆయన అరెస్ట్‌ గురించిన సమాచారం గానీ, ఆయన ఆరోగ్య విషయాలను కానీ బాహ్య ప్రపంచానికి తెలియనివ్వలేదు. నిర్మానుశ్యమైన చిన్న పాటి గదిని సబ్‌ జైలుగా మార్చి అసౌకర్యాల మధ్య నిర్బంధించారు. దీంతో ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఆయనను కలవడానికి బారిస్టర్‌ త్రివేది, ప్రేమ్‌నాథ్‌ డోగ్రాలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. జూన్‌ 19 - 20 మధ్యరాత్రి డాక్టర్‌ ముఖర్జీ వెన్నెముక, ఛాతి నొప్పి తీవ్రమవడంతో 22వ తేదీ వరకు పూర్తి అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఆసుపత్రికి తరలించాలని వారు ప్రాథేయపడినా పట్టించుకోలేదు. మరునాడు మధ్యాహ్నం వరకూ ఆయనకు వైద్యం అందలేదు. తరువాత జైలు వైద్యుడు ఆలీ మహమ్మద్‌ స్ట్రెస్టోమైసిన్‌ ఇంజక్షన్‌ ఇవ్వాలన్నారు. అయితే ఆయన శరీరానికి యాంటీబయాటిక్‌ పడదని చెప్పినా వినకుండా ఇంజిక్షన్‌ ఇచ్చారు. మరో రెండు రోజులు కూడా ఆయనను పట్టించుకోలేదు. సహాయకులు చేసే సపర్యలు తప్ప జైలు సిబ్బంది ఏమాత్రం సహకరించలేదు.

జూన్‌ 22, 1953
తెల్లవారుతుండగా ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. శరీర ఉష్ర్టోగత అంతకంతకు తగ్గుతూ వచ్చింది. ఆయన శరీరం చెమటతో తడిసిపోయింది. అయినా అధికారులు నిర్లక్ష్యం వహించారు. చివరికి జైలు వైద్యుడు చెప్పిన దాని ప్రకారం ఆయనను ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. అయితే దానికి అంబులెన్స్‌ కూడా ఏర్పాటు చేయకుండా పాతకారులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మరునాడు ఉదయం లాయర్‌ త్రివేది వెళ్లి శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీని చూశారు. ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు ధృవీకరించారు. మరునాడు ఆయనకు హైకోర్టులో బెయిల్‌ లభించే అవకాశం ఉందని వెల్లడైంది. ఆయనకు బెయిల్‌ రాగానే తీసుకు వెల్దామని లాయర్‌ త్రివేది ఆ రాత్రి దగ్గరలో ఉన్న హోటల్‌లో రెస్ట్‌ తీసుకున్నారు. కానీ, తెల్లవారుజామునే పిడుగులాంటి వార్త. ఆయనను వెంటనే ఆసుపత్రికి రమ్మన్న వైద్యులు శ్యాంప్రసాద్‌ ముఖర్జీ ఉదయం నాలుగున్నరకు మరణించారని చెబుతూ సర్టిఫికెట్‌ ఇచ్చారు.సాధారణంగా ప్రజాదరణ ఉన్న నాయకులు అదృశ్యమైనా, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినా విచారణ కమిషన్‌ వేస్తారు. అందుకు కమీషన్స్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ యాక్ట్‌ (1952) అవకాశం కల్పిస్తుంది. డాక్టర్‌ ముఖర్జీ మరణం భిన్నమైంది. సుప్రీంకోర్టు పరిధిలో లేని ప్రాంతంలో అనూహ్యంగా, అనుమానాస్పదస్థితిలో రహస్య ప్రాంతంలో మృతి చెందారు. అయినా ఎటువంటి విచారణ అక్కరలేదని, తను తెలుసుకున్న, విచారించిన దాన్ని బట్టి ఆయనది సహజమరణమేనని నిర్ధారణకు వచ్చినట్లు ప్రధాని హోదాలో జవహర్‌లాల్‌ నెహ్రు ప్రకటించారు.

782
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles