వేలిముద్రలు


Sun,August 18, 2019 12:40 AM

Vellimudrallu
“చాలా తేలిక. మీరు ఎప్పుడు సరే అంటే అప్పుడు నేను చేతికి అంటుకునే ఓ ప్రత్యేక పొడిని తెస్తాను. దాని ప్రత్యేకత అది అంటుకున్నాక ఇక ఇరవై నాలుగు గంటలదాకా, నీళ్ళతో కడిగినా సరే పోదు. చీకట్లో మెరుస్తూ కనిపిస్తుంది. మనం అనేక గ్లవ్‌ బాక్స్‌ల మీద దాన్ని పూసి మీ ఉద్యోగస్థులకి అందుబాటులో ఉండే బాత్‌రూమ్‌లలో, మంచినీళ్ళ యంత్రం దగ్గర, ఇతర చోట్ల ఉంచుతాం. ఆఫీస్‌ పనివేళలు అయ్యాక అందరినీ ఓ చీకటి గదిలోకి తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్ని పరీక్షిస్తే ఎవరు దొంగో తెలుస్తుంది. దొంగని వెదికితే దొంగిలించిన సొత్తు బయట పడతుంది. దానివల్ల దొంగ ఒకడా లేక చాలామందా అన్నది కూడా మనకి రూఢీగా తెలుస్తుంది.”

- మల్లాది వెంకట కృష్ణమూర్తి


నియంతృత్వం దాని బాధితులని దగ్గర చేస్తుంది. స్టాక్‌పోల్‌ గ్లవ్స్‌ కంపెనీలో ఇది నిజమైంది. అక్కడ పనిచేసే వాళ్ళందరికీ దాని ప్రెసిడెంట్‌ రాల్ఫ్‌ స్టాక్‌పోల్‌ అంటే ద్వేషం. స్టాక్‌పోల్‌కి ఇది తెలుసు. కానీ దాన్ని లక్ష్యపెట్టడు. ఏభై ఏళ్ళ అతను గత ముప్ఫై ఏళ్ళుగా గ్లవ్స్‌ తయారు చేసే వ్యాపారాన్ని నడుపుతున్నాడు. అతను పాటించే గోల్డెన్‌ రూల్‌ ‘ఇతరులు నిన్ను బాధించే ముందు నువ్వు వాళ్ళని బాధించు.’
ఆ ఉదయం స్టాక్‌పోల్‌కి తన ఆఫీస్‌లో ఓ దొంగ ఉన్నాడన్న సంగతి తెలిసింది. అతను మైలు దూరంలోని తన ఇంటినించి ఆఫీస్‌కి ఎప్పటిలా నడిచి వచ్చాడు. ఆ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ దగ్గర భార్యతో, ఉత్తరాలు తెచ్చిన సెక్రటరీతో మర్యాదగా ప్రవర్తించాడు. తన ఆఫీస్‌ మేనేజర్‌ను చూసి చిరునవ్వు నవ్వాడు కూడా. వాటి అర్థం అతనికా రోజు ఫైల్స్‌ బాధ లేదు.
మేనేజర్‌ అతని గదిలోకి వెళ్ళి చెప్పాడు.

“మిస్టర్‌ స్టాక్‌పోల్‌. నాకు అర్థం కావడం లేదు. మన ఫేక్టరీ ఇక్కడికి డజను గ్లవ్స్‌ని పంపించింది. ఇప్పుడు చూస్తే పదకొండే ఉన్నాయి.”
“ఐతే నేనేం చేయను?” స్టాక్‌పోల్‌ నవ్వుతూ అడిగాడు.
“మీకు అర్థం కాలేదా? గ్లవ్స్‌ జతల్లో ఒకటి పోయింది. అంతేకాక ఈమధ్య మన ఆఫీస్‌లోని చాలా వస్తువులు పోతున్నాయి. అంటే దాదాపు మన ఆఫీస్‌లో ఓ దొంగ ఉన్నట్లు.”
తక్షణం స్టాక్‌పోల్‌ మొహంలోని చిరునవ్వు తుడిచి పెట్టుకుని పోయింది. గట్టిగా ఊపిరి తీసి వదిలి అడిగాడు.
“మన ఆఫీస్‌లో దొంగా? ఎవరది?”
“ఎవరైనా కావచ్చు. మన ఆఫీస్‌నిండా అనేక జతల గ్లవ్స్‌ ఉన్నాయి. కోట్‌ జేబులోనో, బ్రీఫ్‌కేస్‌లోనో వాటిని ఉంచుకుని ఎవరైనా తీసుకెళ్ళి ఉండచ్చు” మేనేజర్‌ చెప్పాడు.
వెంటనే స్టాక్‌పోల్‌ లేచి నిలబడ్డాడు. కోపంతో అతని మొహం జేవురించింది.
“ఎవరూ నావి దొంగిలించకూడదు. అర్థమైందా? ఈరోజే ఆ దొంగ ఎవరో కనుక్కో” స్టాక్‌పోల్‌ ఆజ్ఞాపించాడు.
“నేనా? నాకు ఆఫీస్‌ వ్యవహారాలు చూడటం తప్ప దొంగల్ని పట్టుకోవడం చేతకాదు అనుకుంటాను” మేనేజర్‌ నమ్రతగా చెప్పాడు.
“ఆ ఒక్క జతేనా? లేక ఇంకేమైనా పోయాయా?”
“చాలా పోయి ఉంటాయి. కానీ, మొదటిసారి నేను గమనించింది ఈ జతనే.”

“స్టేషనరీ, పేపర్‌ క్లిప్స్‌, పెన్స్‌, నా సిగార్లు...”
ఆయన వెంటనే తన సిగార్స్‌ పెట్టెని తెరచి చూసాడు.
“ఈ గదిలోంచి నేను బాత్‌రూంకి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి వీటిని దొంగిలించవచ్చు.”
“మీరు బాత్‌రూంకి వెళ్ళినప్పుడు మీ గదిలోకి ఎవరూ రాకూడదని నేను మన ఉద్యోగస్థులకో మెమోని రాస్తాను” మేనేజర్‌ చెప్పాడు.
“మెమోలతో చక్కబడే వ్యవహారం కాదిది. దీన్ని నాకు వదులు. ఇంక నువ్వు వెళ్లొచ్చు” స్టాక్‌పోల్‌ చెప్పాడు.
ఆ సమస్యని ఆయన సూటిగా ఎదుర్కోదలచుకుని వెంటనే సెంపెల్‌ అనే ప్రైవేట్‌ డిటెక్టివ్‌కి ఫోన్‌ చేసి పిలిపించి, ఆ సమస్యని వివరించాడు. చాలా కంపెనీల ప్రెసిడెంట్ల రకరకాల సమస్యలని పరిష్కరించిన సెంపెల్‌ చెప్పాడు.
“ఆ గ్లవ్స్‌ ధర పది డాలర్లు? మహా ఐతే పదిహేను. దాని కోసం నా సేవని వినియోగించుకుంటారా? నా ఫీజ్‌...”
“అది నాకు తెలుసు. ఇది ప్రిన్సిపల్‌కి సంబంధించింది. నేను జీతం ఇచ్చే ఎవరూ నావి దొంగిలించకూడదు.”
“సరే. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా?” సెంపెల్‌ అడిగాడు.
“ఇది నా ఉద్యోగస్థుల్లో ఎవరి పనైనా కావచ్చు. అందరివీ దొంగచూపులే. నా సెక్రటరీ అవచ్చు. లేదా ఆ వెధవ కాటర్‌ అవచ్చు.”
“ఎవరు?”

“కాటర్‌. మా గ్లవ్స్‌ డిజైనర్‌. చక్కటి డిజైన్స్‌ చేస్తాడు. తన విద్యలో నిపుణుడు. బ్రహ్మచారి. చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు. నాకు వాడంటే ఇష్టం లేదు.”
“మరి, అతన్ని ఉద్యోగంలో ఇంకా ఉంచారే?”
“వాడు తన పనిలో బెస్ట్‌ కాబట్టి. ఆఫీస్‌లో సగం రోజే ఉంటాడు. మిగిలిన సగం రోజు స్టూడియోకి వెళ్తూంటాడు. వాడు దొంగై ఉండచ్చు. లేదా నా ఉద్యోగస్థుల్లో అనేకమంది దొంగలేమో? మీరు కనుక్కోవాలి.”
“నేనైతే అంత త్వరగా మనుషుల్ని చెడ్డవాళ్ళుగా నిర్ణయించను. దొంగని పట్టుకోవడానికి మనం ఓ బోనుని అమర్చాలి,” సెంపెల్‌ చెప్పాడు.
“బోనా? ఎలాంటి బోను?” స్టాక్‌పోల్‌ ఆసక్తిగా అడిగాడు.
“ఈ బోనుని నేను చాలా పెద్ద కంపెనీల్లో ఉపయోగించాను. ఎన్నడూ అది ఫెయిలవలేదు. అది దొంగల్ని ఖచ్చితంగా పట్టుకుంటుంది, రెడ్‌ హేండెడ్‌గా.”
“అది ఎలా పనిచేస్తుందో చెప్పండి.”
“చాలా తేలిక. మీరు ఎప్పుడు సరే అంటే అప్పుడు నేను చేతికి అంటుకునే ఓ ప్రత్యేక పొడిని తెస్తాను. దాని ప్రత్యేకత అది అంటుకున్నాక ఇక ఇరవై నాలుగు గంటలదాకా, నీళ్ళతో కడిగినా సరే పోదు. చీకట్లో మెరుస్తూ కనిపిస్తుంది. మనం అనేక గ్లవ్‌ బాక్స్‌ల మీద దాన్ని పూసి మీ ఉద్యోగస్థులకి అందుబాటులో ఉండే బాత్‌రూమ్‌లలో, మంచినీళ్ళ యంత్రం దగ్గర, ఇతర చోట్ల ఉంచుతాం. ఆఫీస్‌ పనివేళలు అయ్యాక అందరినీ ఓ చీకటి గదిలోకి తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్ని పరీక్షిస్తే ఎవరు దొంగో తెలుస్తుంది. దొంగని వెదికితే దొంగిలించిన సొత్తు బయట పడతుంది. దానివల్ల దొంగ ఒకడా లేక చాలామందా అన్నది కూడా మనకి రూఢీగా తెలుస్తుంది.”
వెంటనే స్టాక్‌పోల్‌ మొహం వికసించింది.
“ఇదేదో బావున్నట్లుంది. ఆ పొడిని ఎప్పుడు తెస్తావు?” అడిగాడు.
“మీరు సరే అంటే ఈ మధ్యాహ్నమే తెస్తాను.”
“ఒక్క నిమిషం” చెప్పి ఆయన ఇంటర్‌కంలో మేనేజర్‌ను అడిగాడు.
“రేపు మన సిబ్బంది అంతా సెలవు పెట్టకుండా వస్తున్నారా?”
“వస్తున్నారు సర్‌. రేపు ఎవరూ సెలవులో లేరు.”

“ఆ కాటర్‌ గాడు?”
“వస్తున్నాడు సర్‌.”
“సరే... రేపు ఎవరికీ సెలవు మంజూరు చేయకు...”
తర్వాత డిటెక్టివ్‌వైపు తిరిగి స్టాక్‌పోల్‌ చెప్పాడు.
“ఈ సిగార్‌ పెట్టెమీద కూడా కాస్త ఆ పొడి చల్లు.”
***

మర్నాడు ఉదయం అందరికన్నా ముందుగా స్టాక్‌పోల్‌, సెంపెల్‌ ఆఫీస్‌కి వచ్చారు. సెంపెల్‌ చాలా వాటిమీద కంటికి కనిపించని తెల్లటి పొడిని బ్రష్‌తో రాసాడు. స్టాక్‌పోల్‌ మేనేజర్‌ను పిలిచి అడిగాడు.
“సిబ్బంది అంతా వచ్చారా?”
“వచ్చారు. ఫైల్‌ క్లర్క్‌కి పంటి నొప్పిగా ఉన్నా వచ్చాడు.”
ఆఫీస్‌ దొంగెవరో తెలిసిపోతుందని సాయంత్రం నాలుగుదాకా స్టాక్‌పోల్‌కి ఎంతో ఎక్సయిటింగ్‌గా గడిచింది. నాలుగుకి ఆఫీస్‌ మేనేజర్‌ను పిలిచి ఓ కాగితం ఇచ్చి చెప్పాడు.
“ఈ కాగితంలో సూచించిన ప్రదేశాల్లో గ్లవ్‌ బాక్స్‌లు అన్నీ ఉన్నాయో లేవో చూసి చెప్పు. మొత్తం ఇరవై మూడు ఉండాలి.”
“అలాగే సర్‌.”
ఐదు నిమిషాల తర్వాత వచ్చిన మేనేజర్‌ చెప్పాడు.
“ఒకటి లేదు సర్‌. ఎకౌంట్స్‌ సెక్షన్‌లో ఫైల్‌ రేక్‌మీద ఉంచిన లేడీస్‌ సిల్క్‌ గ్లవ్స్‌ పెట్టె మాయమైంది.”
“జాగ్రత్తగా చూసావా?”
“చూసాను సర్‌. ఇరవై రెండే ఉన్నాయి.”
దొంగ ఈ రోజు నిజాయితీగా ఉంటాడేమోనని భయపడ్డ స్టాక్‌పోల్‌ ఆనందంగా నవ్వాడు.
“అంతా ఆఫీస్‌లోనే ఉన్నారుగా?”
“ఉన్నారు సర్‌.”
“మంచిది. అందరినీ నాలుగూ ఏభైకి కాన్ఫరెన్స్‌ గదిలోకి రమ్మను. ఎవరూ హాజరు కాకుండా ఉండకూడదు. అర్థమైందా?”
“ఐంది సర్‌.”
నాలుగూ ఏభైకి కాన్ఫరెన్స్‌ గదిలోకి వచ్చిన సిబ్బంది మొహాలు సీరియస్‌గా ఉన్నాయి. అంతమందిని పిలిస్తే సాధారణంగా కంపెనీ లాభాలు తగ్గినందుకు చివాట్లో లేదా ఒకరిద్దరిని ఉద్యోగంలోంచి తీసేసే ముందు వాళ్ళ తప్పిదాలమీద లెక్చరో ఐన సందర్భాల్లో మాత్రమే స్టాక్‌పోల్‌ తమనా గదిలోకి పిలుస్తాడని వాళ్ళందరికీ తెలుసు.
“మిమ్మల్ని అందరినీ ఇక్కడకి రమ్మనడానికి కారణం మీలో గ్లవ్స్‌, ఇతర చిన్న వస్తువులని ఎత్తుకెళ్ళే దొంగ ఎవరో తెలుసుకోవడానికి” స్టాక్‌పోల్‌ వాళ్ళతో చెప్పాడు.
వెంటనే అంతా మొహమొహాలు చూసుకున్నారు.

“మీరంతా దయచేసి మీ చేతులని ఇలా ముందుకి చాపండి” చాపి చూపించాడు.
వాళ్ళంతా చాపాక స్టాక్‌పోల్‌ మేనేజర్‌ వంక చూసి చెప్పాడు.
“లైట్‌ అవుట్‌.”
వెంటనే మేనేజర్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో వెలిగే ఒకే లైట్‌ని ఆపేసాడు. కిటికీకి తెరలు ఉండటంతో బయటనించి వెలుగుపడని ఆ గది వెంటనే చీకటైంది. ఆ గదిలోని రెండు చేతులు చీకట్లో వెలుగుతూ కనిపించాయి. వెంటనే స్టాక్‌పోల్‌ ఆ చేతులని పట్టుకుని అరిచాడు.
“లైట్‌ ఆన్‌.”
లైట్‌ వెలగగానే కాటర్‌ తన చేతిని పట్టుకున్న స్టాక్‌పోల్‌ వంక చూస్తూ అడిగాడు.
“ఏమిటిది?”
“నువ్వన్న మాట ఆ దొంగ. నేను ముందే నిన్ను అనుమానించాను.”
“దేని గురించి మీరు మాట్లాడేది?”
“మేనేజర్‌. కాటర్‌ జేబులని, బ్రీఫ్‌ కేస్‌ని వెదకండి” స్టాక్‌పోల్‌ ఆజ్ఞాపించాడు.
బ్రీఫ్‌ కేస్‌లోంచి మేనేజర్‌ గ్లవ్స్‌ పెట్టెని బయటికి తీసాడు.

“సరే. ఈరోజు దాకా ఇతని జీతం చెక్‌ని రాసివ్వండి. ఈరోజుతో ఈ దొంగ ఉద్యోగం ఊడింది.”
కాటర్‌ వెంటనే తల వంచుకున్నాడు.
“ఇందాక ఇతను స్టూడియోకి వెళ్తూ బ్రీఫ్‌కేస్‌ కోసం వెదికాడు. మీ సూచన ప్రకారం దాన్ని దాచేయడంతో దొంగతనం బయటపడింది. లేదా ఆ రెండు గంటల్లో వాటిని ఎక్కడో దాచేసి వచ్చేవాడు” మేనేజర్‌ చెప్పాడు.
“గుడ్‌ నైట్‌” స్టాక్‌పోల్‌ అందరికీ చెప్పి బయటకి నడిచాడు.
ఆ రాత్రి భోజనం దగ్గర స్టాక్‌పోల్‌ తన భార్యకి కాటర్‌ దొంగతనం, అతన్ని తను ఎలా పట్టుకుందీ వివరించాడు.
“ఛ! అతను అలాంటి వాడు అనుకోలేదు” ఆమె ఆశ్చర్యంగా చెప్పింది.
ఆ రాత్రి ఇద్దరూ పడుకున్నాక స్టాక్‌పోల్‌ బెడ్‌ లేంప్‌ స్విచ్‌ని ఆపేసాడు. అటువైపు తిరిగి పడుకున్న భార్య వీపుమీద మనిషి రెండు అరచేతుల ముద్రలు వెలుగుతూ కనిపించాయి.
(హెన్రీ సీసర్‌ కథకి స్వేచ్ఛానువాదం)

477
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles