తెలంగాణ తిరుపతి వెంకన్న కురుమూర్తి స్వామి


Sun,August 18, 2019 02:18 AM

temple
ఆకాశరాజు కుమార్తె పద్మావతిని పెండ్లాడేందుకు కుబేరుని వద్ద అప్పు చేసి, దానిని తీర్చడంలో మాట తప్పానని మనస్థాపం చెందాడు మహావిష్ణువు. స్వామి కృష్ణానదీ తీరం వెంట వెళ్తూ జూరాల వద్ద గల గుండాల జలపాతం వద్ద స్నానం చేశాడు.
అక్కడి నుంచి ఉత్తర దిశగా వెళ్తున్న సమయంలో లక్ష్మీదేవి కోరిక గుర్తొచ్చిందట. ఆ మేరకు అక్కడి ‘కురుమూర్తి గిరుల’పై విశ్రమించాడు. గిరులపై నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు తమ ప్రతిరూపాలను మాత్రం ఇక్కడే వదిలి వెళ్ళారని అలా ‘కురుమూర్తి స్వామి’ క్షేత్రం వెలసిందని స్థలపురాణం. ఈ క్షేత్రం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చిన్న చింతకుంట మండల పరిధిలోని అమ్మాపురం గ్రామానికి చేరువలో ఉంది.


తిరుపతి ఏడుకొండల స్వామి క్షేత్రానికి, ఈ దేవస్థానానికి మధ్య విశేషమైన పోలికలు కనిపిస్తా యి. అందుకే ఈ క్షేత్రాన్ని తెలంగాణ తిరుపతి అనికూడా పిలుస్తారు. తిరుమలలోని ఏడుకొండలపై వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామికి ‘అలిపిరి మండపం’ ఉండగా ఇక్కడ కురుమూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ‘ఉద్దాల మండపం’ ఉంది. తిరుపతిలో దర్శనానికి వెళ్ళేటప్పుడు ‘మోకాళ్ళ గుండు’ పేరుతో ఎత్తయిన కొండ ప్రదేశం వంటిది ఇక్కడా ఉంది. తిరుమలలోనూ, కురుమూర్తిలోనూ ‘పాద చిహ్నాలు’ ఉండటం మరో విశేషం. తిరుమలలో శ్రీవారు నిలుచున్న భంగిమలోనే భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ కూడా అదే భంగిమలో స్వామి సాక్షాత్కారం లభిస్తుంది. తిరుపతిలో ‘ఏడు కొండల’పై స్వామి వెలిశాడు. కురుమూర్తిలోనూ ‘ఏడు కొండలు’ ఉండటం విశేషం. ఇక్కడి ఏడుకొండల ప్రస్తావన 1878 లో నరసింహ దీక్షితులు రచించిన చెంచుకథలో పేర్కొన్నారు. ఈ ఏడు కొండలను శ్వేతాద్రి- బొల్లిగట్టు, ఏకాద్రి - ఒంటిగట్టు, దుర్గాద్రి- కోటగట్టు, ఘనాద్రి- పెద్దగట్టు, భల్లూకాద్రి- ఎల్గులగట్టు, పతగాద్రి- చీపర్లగట్టు, దైవతాద్రి- దేవునిగట్టుగా పోలుస్తారు. దేవునిగట్టుగా పిలిచే కొండమీద కురుమూర్తి స్వామి కొలువై ఉన్నాడు. జానపదులు ఈ క్షేత్రాన్ని కురుమతి, కురుమూర్తి, కుర్మతి, కుర్మూర్తి అని పిలుస్తారు. ఇక్కడి స్వామిని కురుమన్న స్వామిగా, కురుమతిరాయుడిగా కొలుస్తారు. ప్రతి ఆలయంలోనూ గణపతి విగ్రహం తప్పక ఉంటుంది. కానీ, తిరుపతి, కురుమూర్తి ఆలయ ప్రాంగణాలలో మాత్రం ఆ విఘ్ననాయకుడు కనిపించడు. ఈ రెండు క్షేత్రాల పోలికల నేపథ్యంలో ‘తిరుపతిలోని ఆనందగిరి శిఖరం’లోని కొంత భాగమే ‘కురుమూర్తిగిరి’ అని స్థల పురాణం వివరిస్తున్నది.
temple1
బ్రహ్మోత్సవాలు : శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు కొని శుక్ల సప్తమి వరకు 45 రోజుల పాటు జరుగుతాయి. పాడ్యమి నుండి సప్తమి వరకు వరుసగా మయూర, హంస, గజ, శేష, హయ, హనుమంత, గరుత్మంత వాహనాలపై స్వామివారి ఊరేగింపు ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. తెలంగాణ ప్రాంతంలో జరిగే అతిపెద్ద తిరునాళ్ళ (జాతర)లో కురుమూర్తి కూడా ఒకటి.
temple2
దళిత పూజారులు : కన్నుల పండుగగా జరిగే ‘కురుమూర్తి స్వామి ఉద్దాల ఉత్సవం’ లో వివిధ వృత్తుల వారు భక్తితో సహకరించడం ద్వారా ‘భిన్నత్వంలో ఏకత్వానికి’ ప్రతీకగా నిలుస్తున్నది. ఉద్దాల ఉత్సవంలో స్వామివారి పాదుకలను తీసుకువెళ్ళేందుకు వడ్డేమాన్‌కు చెందిన మేదరులు ప్రత్యేక చాటను తయారు చేస్తారు. దీపావళి అమావాస్య రోజు చాట తయారీ ప్రారంభిస్తారు. ఉత్సవం నాటికి పూర్తి చేసి దళితులకు అందజేస్తారు. అమావాస్య రోజు వడ్డేమాన్‌ ఉద్దాల కర్మాగారంలో ఇసుకపై కనిపించే పాదుకల గుర్తుల ఆధారంగా స్వామివారి పాదుకలు (ఉద్దాల) తయారు చేస్తారు. వారం పాటు కఠోర ఉపవాస దీక్షలతో, నియమ నిష్ఠలతో వడ్డేమాన్‌ దళితులు స్వామివారి పాదుకల తయారీలో పాల్గొంటారు. స్వామివారి పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లమర్రి మేదరులు తయారు చేసిన ప్రత్యేక చాటలో తిర్మలాపురం చేరుస్తారు. అక్కడి నుండి కురుమూర్తి కొండపై ఉన్న ఉద్దాల మండపంలో భక్తుల దర్శనార్థం వాటిని ఉంచుతారు. ఉద్దాల మండపంలో దళితులే పూజారులుగా ఉండటం ప్రత్యేకత. స్వామివారి పాదుకలతో వీపుపై కొట్టించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
temple3
తలియకుండ : కురుమూర్తి స్వామి సన్నిధిలో మరో ఆచా రం మట్టికుండ. అప్పంపల్లికి చెందిన కుమ్మరులు దీనిని తయారుచేస్తారు. ఆ మట్టికుండను ‘తలియకుండ’ మండపంలో ఉంచి, నెల్లి వంశస్థులు పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో భారీగా బాణసంచా కాలుస్తారు. డప్పు వాయిద్యాలతో మట్టికుండను ఉద్దాల మండపం వద్దకు చేరుస్తారు. ఈ ఉద్దాల వేడుకను తిలకించడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఉద్దాల ఉత్సవం సందర్భం గా అప్పంపల్లి వాగు పరిసరాలు జన సంద్రమతాయి.

సుదీర్ఘ చరిత్ర

ముక్కెర వంశానికి చెందిన గోపాల్‌రెడ్డి మొదలుకొని (క్రీ.శ. 1268) సంస్థానాలు విలీనమయ్యే నాటికి అధికారంలో ఉన్న భాగ్యలక్ష్మీ దేవి (1948) దాకా మొత్తం 28 తరాల వారు అందరూ తమ ఇలవేల్పు అయిన ఇక్కడి ‘కురుమూర్తి స్వామి’ ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నది చారిత్రిక సమాచారం. అమరచింత (అమ్మాపూర్‌) సంస్థానాధీశుల ఇలవేల్పు అయిన కురుమూర్తి స్వామికి ముక్కెర వంశస్థులైన రాజా సోంభూపాల్‌ 15వ శతాబ్దంలో బంగా రు ఆభరణాలను సమర్పించారు. శంఖుచక్రాలు, కిరీటం, మకర కుందనాలు, భుజ కిరీటాలతో సహా వివిధ ఆభరణాలు ఈ స్వామి వారికి బహుకరించా రు. నాటి నుండి నేటి వరకు ఆ ఆభరణాలను స్వామివారి ఉత్సవాల సందర్భంగా అలంకరించడం ఆనవాయితీగా వస్తున్నది.

233
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles