అక్కినేని అనుకోని మరణం


Sun,August 11, 2019 01:23 AM

Akkineni-Nageswara-Rao
తెలుగు చిత్ర పరిశ్రమకు నందమూరి తారకరామారావు అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్లలాంటి వారంటారు. పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడడానికి వారిద్దరూ ఎంతో కృషి చేశారు. తన నివాసాన్ని కూడా హైదరాబాద్‌కు మార్చడంతో పాటు సినిమా షూటింగులకోసంసరైన సదుపాయాలు లేవన్న వారికి తానే స్టూడియో నిర్మించి వాడుకొమ్మని అందించినవాడు ఏఎన్నార్. జీవితాంతం క్రమశిక్షణ కలిగిన నటుడిగా, అద్భుతమైన పాత్రల్లో జీవించి జనం మెచ్చిన కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తాగుబోతుగా నటించినా, ఆడపాత్రల్లో చేసినా ప్రతిపాత్ర తనకోసమే పుట్టిందా అన్నంత సహజంగా నటించి ఒప్పించి మెప్పించిన హీరో ఏఎన్నార్. సినిమా పరంగా హైదరాబాద్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి ఆయన వేసిన తొలిఅడుగే పునాది అనడంలో సందేహం లేదు. అంతగా చదువుకోనప్పటికీ ఎన్నో జీవితాల్ని చదివిన విజ్ఞాన సర్వస్వం. 90 ఏళ్ల వయస్సులో 75 ఏళ్లపాటు సినిమా రంగానికే తన జీవితాన్ని అంకితం చేసిన దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు చివరిపేజీ.

- మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

2013 సంవత్సరం.
అక్కినేని నాగేశ్వరరావు తొంభై యేళ్ల వయసులో అడుగుపెట్టినప్పటికీ క్రమశిక్షణ కలిగిన జీవన శైలి కారణంగా చురుకుగా ఉండడంతోపాటు , ముఖం మీద ముడుతలు రాకుండా చూసుకోగలిగిన ఆయన వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అప్పటి వరకువిభిన్న పాత్రల్లో మెప్పించిన ఏఎన్నార్ ఈసారి మూడు తరాల కథానాయకుల కథను చేయడానికి సరేనన్నారు. ఇప్పటివరకూ రాజ్ కపూర్ కుటుంబానికే ఈ ఘనత ఉంది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్, రణధీర్ కపూర్ కలిసి హిందీలో కల్ ఆజ్ ఔర్ కల్ (నిన్న నేడు రేపు) అనే చిత్రంలో కలిసి నటించారు. అది 1971లో విడుదలైంది. దాని తర్వాత మూడు తరాల కథానాయకులు కలిసి నటించడం మళ్లీ ఇప్పుడే. ఆ సినిమా పేరు మనం. నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య అందులో ప్రధాన పాత్రధారులు. తమ తమ తరాల్లో నాగేశ్వరరావు, నాగార్జున అగ్ర కథానాయకులుగా సత్తా చాటారు. నేటి తరంలో స్టార్ హీరోగా ఎదగడానికి నాగచైతన్య కృషి చేస్తున్నాడు. ఈ ముగ్గురికీ సరిపోయే కథను దర్శకుడు విక్రమ్‌కుమార్ రెడీ చేశాడు. ఇష్క్, దానికంటే ముందు చేసిన 13బి సినిమాలతో విక్రమ్‌కుమార్ మంచి పేరు తెచ్చుకున్నాడు. అతని దర్శకత్వ ప్రతిభ నచ్చి, అతను చెప్పిన కథను నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ఓకే చేశారు.

నిజానికి అప్పటికే బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం చిత్రంలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు ఏ సినిమాలో నటిస్తారు అని అందరూ దురుచూశారు. కారణం సాధారణంగానే తనకు నచ్చిన, నలుగురికి మెచ్చిన కథలను ఎంచుకోవడం ఏఎన్నార్ తత్వం. సెలక్టివ్‌గా నటించే ఆయన 2000 సంవత్సరంలో చేసిన సకుటుంబ సపరివార సమేతం సినిమా తర్వాత మరో ఆరేండ్లకు గానీ కెమెరా ముందుకు రాలేదు. కారణం ఆయనకు నచ్చిన పాత్రలు దొరకకపోవడమే. 2006లో సిద్ధార్థ్ హీరోగా నటించిన చుక్కల్లో చంద్రుడులో అతనికి తాతయ్యగా నటించారు ఏఎన్నార్. ఆ సినిమాకి స్క్రిప్ట్ సమకూర్చింది స్వయంగా సిద్ధార్థే.

అదే ఏడాది విడుదలైన శ్రీరామదాసులో కబీర్‌దాస్ పాత్రకు జీవం పోశారు ఏఎన్నార్. కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ భక్తిరస ప్రధాన చిత్రంలో టైటిల్ రోల్‌ను అక్కినేని నాగార్జున పోషించారు. తన కొడుకు నాగార్జునతో నటించిన దాదాపు అన్ని చిత్రాల్లో ఆయనకు తండ్రిగా నటించిన నాగేశ్వరరావు...శ్రీరామదాసు సినిమాలో మాత్రం తండ్రి పాత్రలో కాకుండా వేరే క్యారెక్టర్లో నటించారు. అంతకు ముందు అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన రావుగారిల్లు సినిమాలో మాత్రం నాగార్జున..తన నిజ జీవిత పాత్రలో సినిమాలో కనిపించారు. ఆ తర్వాత మనం సినిమాలో మాత్రం ఏఎన్నార్‌కు నాగార్జున తండ్రిగా నటించడం విశేషం.శ్రీరామదాసు తర్వాత మళ్లీ ఐదేళ్లకు బాపు దర్శకత్వం వహించిన శ్రీరామరాజ్యం చిత్రంలో వాల్మీకి మహర్షి పాత్రలో కనిపించారు అక్కినేని. అప్పుడే అందరికీ వచ్చిన అనుమానం ఏఎన్నార్ తదుపరి చిత్రం ఏంటని? అదిగో అప్పుడే 2013 జూన్‌నెలలో మనం షూటింగ్ మొదలైంది.

తెలుగు చలన చిత్ర రంగంలో కథానాయకుడి దశలో ఉన్నప్పుడు అంతగా బయటి కార్యక్రమాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపని ఏఎన్నార్ తొమ్మిది పదుల వయస్సులో మాత్రం హుషారుగా సినిమాలు చేస్తూనే సమయం దొరికినప్పుడల్లా సినిమా కార్యక్రమాలతో పాటు రవీంధ్రభారతి, త్యాగరాయగానసభ వంటి వేదికలపై జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకూ హాజరయ్యేవారు. ఆ సమయంలోనూ సినిమా రంగానికి, తన వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను కూడా హస్యభరితంగా చెబుతూ సభికులను నవ్వించేవారు. ఆయనలోని చలాకీ తనాన్ని చూసి అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతుడు అనుకునేవారు. కానీ నిజానికి ఆయనకు అప్పటికే గుండెజబ్బు ఉందనే విషయం చాలా తక్కువమందికి తెలుసు. నిజానికి 2011 డిసెంబర్ 28న ఆయన భార్య అన్నపూర్ణ మరణించడంతో ఆయన కుంగిపోయారు. అయితే ఆ లోపం కనిపించకుండా ఆయన తన చివరి క్షణం వరకు నటించాలనుకునేవారు. అందుకే ఆయన 2013లో మనం కథ చెప్పగానే సరేనన్నారు. తమ స్వంత బ్యానర్ కావడంతో పాటు తన కొడుకు, మనవడితో కలిసి నటించడం ఆయనకు ఎంతో ఉత్సాహన్నిచ్చింది.అయితే ఆయన భార్య చనిపోయిన కుంగుబాటు మాత్రం కొంత అనారోగ్యానికి కారణమైంది.ఆరోగ్యం సహకరించనప్పటికీ మనం షూటింగ్‌లో రెగ్యులర్‌గా పాల్గొంటున్నారాయన.

సెప్టెంబర్ 30, 2013. మనం షూటింగ్ లొకేషన్.
షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అక్కినేనికి కడుపునొప్పి వచ్చింది. కొద్దిసేపు పెద్దగా పట్టించుకోని ఆయన నొప్పి ఎక్కువకావడంతో అక్కడి నుండే ఆసుపత్రికి వెళ్లారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా కనిపించే అక్కినేనికి ఏమవుతుందనుకున్నారో ఏమో డాక్టర్లు మాములుగా పరీక్షించి ఎసిడిటి వల్ల వచ్చిన నొప్పి అని తేల్చి మందులు ఇచ్చి పంపారు. మందులు వేసుకోగానే తగ్గిపోవడంతో ఎసిడిటినే అనుకున్నారంతా. అయితే మరో పదిరోజుల్లో నొప్పి మళ్లి వచ్చింది. తిరిగి ఆసుపత్రికి వెళ్లారు.
అప్పుడు డాక్టర్‌లు స్కానింగ్ చేయాలన్నారు. స్కానింగ్‌లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. కడుపులో కణితి ఏర్పడిందని, ఆపరేషన్ చేసి తొలగించారు. అయితే దాన్ని ల్యాబ్‌కు పంపించి టెస్ట్ చేయగా అది క్యాన్సర్ కణితి అని తేలింది. ఆపరేషన్ చేద్దామంటే ఆయన ఆరోగ్యం సహకరించదనే ఉద్దేశ్యంతో ఆపరేషన్ చేయాలో వద్దో డాక్టర్లు నిర్ధారించుకోలేకపోయారు. మరోవైపు మీడియాలో రకరకాల కథనాలు ప్రచారమవుతున్నాయి. ఆయన ఆనారోగ్యం పాలయ్యారని ఒక్కరు, వ్యాధి సోకిందని మరొకరు. ఇలా ఎవరికీ తోచినట్లు వారు పుకార్లు సృష్టించడం మొదలు పెట్టారు. దీనికి పుల్‌స్టాఫ్ పెట్టాలనుకున్నారు నాగేశ్వరరావు.
Akkineni-Nageswara-Rao1
అక్టోబర్19, 2013, అన్నపూర్ణ స్టూడియో, విలేకరుల సమావేశం.
అక్కినేని నాగేశ్వరరావు మరో చిత్రం ప్రకటిస్తారని అందరూ ఆసక్తిగా ఉన్నారు. కానీ ఆయన చేసిన ప్రకటన అక్కడున్న పాత్రికేయులనే కాకుండా యావత్ సినిమా అభిమానుల్ని మనోదేవనకు గురిచేసింది.అదేంటంటే తనకు క్యాన్సర్ సోకిందని, ఎంతకాలం బతుకుతానో తెలియదని ప్రకటించి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశారు. అయితే అభిమానుల దీవెనలతో కేన్సర్‌ను విజయవంతంగా అధిగమించి, నూరేళ్లు బతుకుతానని ఆయన ధీమాగా కూడా చెప్పారు. టీవీచానల్స్‌లో తన క్యాన్సర్ గురించి ప్రకటించినపుడు ఆయన తనలో ఎలాంటి భయం కానీ, బెరుకు కానీ లేకుండా గుండెనిబ్బరంగా చెప్పిన మాటలూ అందరినీ ఆశ్చర్యపరిచాయి. బతుకు, జీవితాన్ని సాధించు అంటూ అక్కినేని నాగేశ్వరరావు చెప్పిన మాటలు ఎందరో క్యాన్సర్ వ్యాధిన పడిన వారికి ఎంతో ఊరటతో పాటు ఉత్సాహాన్నిచ్చింది. ప్రాణాంతక కేన్సర్ ఉందని తెలిశాక ఎంతమంది అలా ధైర్యంగా, నిండుకుండలా, హుందాగా తనకు ఆ వ్యాధి ఉందని చెప్పగలుగుతారు! అక్కినేని అంటేనే ధైర్యానికి చిరునామా! ఆ సమయానికే ఆయన మనంలో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేశారు.
Akkineni-Nageswara-Rao2
నిజానికి ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆయనకు సంబంధించిన సన్నివేశాలు 2014 జనవరిలోనూ చిత్రీకరించాల్సి ఉంది. కానీ అక్కినేని పట్టుబట్టి తన సన్నివేశాల్ని ముందుగా పూర్తి చేయించారు. బహుశా తన మరణం సంగతి ముందుగానే ఆయనకు తెలిసిందేమో. ఇంట్లోనే తన పాత్రకు డబ్బింగ్ చెప్పారు ఏఎన్నారు. తండ్రి కోసం దానికి సంబంధించిన రికార్డింగ్ సౌకర్యాల్ని ఇంటికే తరలించారు నాగార్జున. మనంను ఆయన చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
షూటింగ్‌లో ఉన్నసమయంలోనే తీవ్రమైన కడుపునొప్పితో పడిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ తిరిగి స్కాన్‌చేస్తే క్యాన్సర్ ముదిరిందని చెప్పారు. ఇప్పుడు ఆపరేషన్ తప్ప మరో మార్గం లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఏఎన్నార్ కూడా ఆపరేషన్‌కు సిద్ధపడ్డారు. వ్యాధి ముదిరినందున ఆపరేషన్ చేసినంత మాత్రాన అది తగ్గతుందన్న నమ్మకంలేదు. అయినా ఆయన మాటను కాదనలేక ఆపరేషన్ చేశారు. అయితే అప్పటికే పూర్తిగా ముదిరిపోయింది. ఆయన ఎక్కవ రోజులు బతకడనే విషయాన్ని డాక్టర్లు నిర్దారించారు. అయినా ఆయన మనం చిత్రం షూటింగ్‌ను మరిచిపోలేదు. తన వర్క్ పూర్తి చేయించమని నాగార్జునకు చెప్పి ఆరు రోజుల పాటు షూటింగ్‌ను కానిచ్చారు. తన తండ్రికి మనం రూపంలో ఒక గొప్ప బహుమతిని ఇవ్వాలని నాగార్జున భావించారు.
Akkineni-Nageswara-Rao3
అందుకే చాలా శ్రద్ధగా దాన్ని తీర్చిదిద్దాలని దర్శకుడు విక్రమ్‌కుమార్‌కు సూచించారు. తండ్రి పుట్టిన రోజున మనం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దానికి అనూహ్యమైన స్పందన లభించింది. పాటలు మినహా మిగతా షూటింగ్ పూర్తయిన ఆ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయాలనుకున్నాడు.అప్పటికీ ఇంటిదగ్గరే ఆయన వైద్య చికిత్సలు పొందుతున్నారు.
Akkineni-Nageswara-Rao4
జనవరి 21, 2014
ఆ రోజు రాత్రి అక్కినేని తన కుటుంబసభ్యులందరితో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి పడుకున్నారు. ఆయన పక్కనే నాగార్జున చాలాసేపు కూర్చున్నారు. రాత్రి పదిగంటల సమయంలో ఆయన తన తండ్రికి గుడ్‌నైట్ చెప్పారు. తిరిగి గుడ్‌నైట్ చెప్పిన ఆయన వెళ్లి పడుకో రేపు కలుద్దాం అంటూ నాగార్జునతో అన్నారు. అవే ఆయన చివరి మాటలు. మరునాడు లేస్తాడనుకున్న ఆయన శాశ్వతంగా కన్నులు మూశారు. అర్థరాత్రి దాటిన తర్వాత ఆయన మరణించాడని వైద్యులు ధృవీకరించారు. జనవరి 22 ఉదయం ఆయన మరణాన్ని ప్రకటించారు. ఆయన ఎంతో ఇష్టపడి చేసిన మనంను కనులారా చూసుకోకుండానే, మరో రెండు నెలల్లో అది జనం మధ్యకు వస్తుందనగా ఆకస్మికంగా తనువు చాలించారు నట సామ్రాట్. అక్కినేని కన్నుమూసిన తర్వాత విడుదలైన మనం సినిమా తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్ హిట్‌గా నిలిచిపోయింది.

1108
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles