నెట్టిల్లు


Sun,August 11, 2019 02:01 AM

చిన్న చిన్న అవసరాలకు అడ్డం రాని కులం, మతం.. ప్రేమ, పెండ్లి విషయానికి వచ్చే సరికి ప్రధాన సమస్యగా మారుతున్నది. ఇలాంటి నేపథ్యం, సందేశం ఉన్న కథలే ఈమధ్య యూట్యూబ్‌లో లఘుచిత్రాలుగా వస్తున్నాయి. ఇంకా చుట్టూ జరుగుతున్న పరిస్థితులను లఘుచిత్రాలుగా మల్చుతున్నారు. అవి కొన్ని ప్రశ్నలను సందిస్తాయి. సందేశాన్ని ఇస్తాయి. అవగాహనను పెంచుతాయి. ఇలాంటివే కిందటి వారం కూడా వచ్చాయి. చూడండిసయ్యద్ సీత

దర్శకత్వం: అశోక్ లోక్‌నాథ్
నటీనటులు : నాగ్, మానస హారిక

సీత, రఫీ... ఇద్దరు వేర్వేరు మతాలకు చెందిన వారు. రఫీ వాళ్ల ఇంట్లో సీత వాళ్లు అద్దెకు ఉండడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. కానీ పెండ్లికి మతం అడ్డం వస్తుందనుకుంటారు. ఇద్దరి కుటుంబాల మధ్య స్నేహం ఉండడంతో పెద్దలను ఒప్పిద్దాం అనుకుంటారు. కానీ చివరికి సీత వాళ్ల నాన్నకు వీళ్ల ప్రేమ విషయం తెలుస్తుంది. రఫీ వాళ్ల అమ్మ కూడా సీరియస్ అవుతుంది. ఇద్దరి మతాలు వేరు కాబట్టి పెండ్లికి ఒప్పుకోరు. ఇప్పటి వరకూ సామరస్యంగా ఉండడానికి అడ్డురాని మతం ఇప్పుడు ప్రేమ విషయంలో ఎందుకు అడ్డం వచ్చిందని రఫీ పెద్దలను నిలదీస్తాడు. ఇన్ని రోజులు కలిసి మెలిసి ఉన్నాం కదా మతం అడ్డు రాలేదా అని ప్రశ్నిస్తాడు. పెండ్లి విషయంలో మతాన్ని తీసుకురావొద్దు, మేమిద్దరం ఇష్టపడ్డాం పెండ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మీ మీద గౌరవంతో బయటకెళ్లలేదు అంతే అంటాడు. చివరకు రఫీ,సీత ల ప్రేమను పెద్దలు అంగీకరిస్తారు. ఇలా చెందిన ప్రేమికులను ఒక్కటి చేయడమే ఈ కథ సందేశం.

Total views 98,106+ (ఆగస్టు 02 నాటికి)
Published on July 26, 2019కౌముది 360

దర్శకత్వం: సర్వోత్తం అలోక్
నటీనటులు : సమీర్ మల్ల, జాన్ కొటోలి

ఈ అనంత విశ్వం కొన్ని కోట్ల జీవరాశుల సమూహం. అందులో మనిషి ప్రత్యేకం. ఈ భూమి మీద మానవుని ఉనికి మొదలైనప్పటి నుంచి నేటి వరకూ టెక్నాలజీని మెరుగుపరుచుకొంటున్నాడు. ఇంతటి టెక్నాలజీ, మానవుని తీరు జీవరాశుల వినాశనానికి దారి తీస్తున్నది. మరి ఈ ప్రాణులన్నీ మనుగడ కోల్పోయాక మళ్లీ ఆవిర్భవించాలంటే ఏం చేయాలి? ఈ లఘుచిత్రంలో సైంటిస్ట్ విక్రాంత్ టైం కాప్సుల్ అనే ప్రాజెక్ట్ చేస్తాడు. దీనికి ప్రపంచ శాస్త్రవేత్తల ఆర్గనేజేషన్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది. భూమి మీది అన్ని జీవుల డీఎన్‌ఏలను, కణాలను స్పేస్‌లోకి పంపి కొన్నేండ్ల తర్వాత అటోమేటిక్‌గా భూమి మీదకు వచ్చేలా చేసి, జీవరాశులు మళ్లీ ఆవిర్భవించేలా చేయడం ఈ ప్రాజెక్ట్ సారాంశం. ఈ టైం కాప్సుల్‌లో అన్ని జీవరాశుల డీఎన్‌ఏలను ఉంచుతాడు విక్రాంత్. కానీ మనిషి డీఎన్‌ఏను మాత్రం చివర్లో తీసేస్తాడు. అది లేకుండానే టైం కాప్సుల్‌ను స్పేస్‌లోకి పంపుతాడు. ఎందుకు తొలగించాడో అర్థం కావాలంటే లఘుచిత్రం చూడండి. మేకింగ్, డీఓపీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ఆసక్తికరంగా సాగే లఘుచిత్రం.

Total views 3,898+ (ఆగస్టు 02 నాటికి)
Published on Aug 2, 2019సైరా బాను లవ్స్ ఆనంద్

దర్శకత్వం: వంశీ పోస

ఆనంద్, బాను ప్రేమికులు. ఆనంద్ విదేశాలకు వెళ్లే రోజే ఒకరికి రక్తం అవసరం ఉందని తెలుసుకుంటాడు. బిజీగా ఉన్న సమయం చూసుకొని ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేసి వస్తాడు. అక్కడే బానును చూసి ప్రేమలో పడతాడు. తర్వాత ఆమె గురించిన వివరాలు కనుక్కొని ఓ రోజు ప్రేమ సంగతి చెప్తాడు. తనను కొంత కాలంగా ప్రేమిస్తున్నట్టు చెప్తాడు. అప్పుడు బాను స్పందిస్తూ ఆ రోజు ఆనంద్ రక్తం ఇచ్చింది ఆమె తండ్రికే అని చెప్తుంది. అప్పుడే కృతజ్ఞతగా ఆనంద్ అడ్రస్‌కు ఓ గిఫ్ట్‌కూడా పంపిస్తుంది కానీ ఆనంద్ చూసుకోడు. సీన్ కట్ చేస్తే ఆనంద్ ప్రేమను బాను ఒప్పుకుంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంట్లో చెప్పాలనుకుంటారు. కానీ ఇద్దరి మతాలు వేరు. బాను ముస్లిమ్ అమ్మాయి. ఆనంద్ గురించి ఇంట్లో చెప్పడానికి భయపడుతుంది. మతం మార్చుకోవాలని కోరుతుంది. కానీ దానికి ఒప్పుకోడు. బాను ఫీలవుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ అప్పుడే అనుకోకుండా ఓ ప్రమాదం జరుగుతుంది. ఇదంతా బాను మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రమాదం ఏంటో? ఏం జరుగుతుందో యూట్యూబ్‌లో చూడండి.

Total views 7,856+ (ఆగస్టు 02 నాటికి)
Published on July 27, 2019భూదేవి

దర్శకత్వం: శ్రీధర్‌గౌడ్
నటీనటులు : శ్రీధర్‌గౌడ్, సిరి, శ్రీజ

సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఇంటిపెద్ద సరిగ్గా లేకపోతే ఇల్లాలు ఎలాంటి ఇబ్బందులు పడుతుందో చెప్పే లఘుచిత్రమిది. కథలోకి వెళ్తే ఇంటాయన రోజూ కూలీ పని చేసి, మద్యం తాగి ఇంటికొస్తాడు. భార్య సునితను కొడుతూ ఉంటాడు. బయట అంతలా పని చేస్తున్నా.. తాగితే తప్పేంటి అంటాడు. కానీ సునీత అవ్వన్నీ ఓర్చుకుంటుంది. భర్తమీదకు ఎదురు తిరగకుండా భరిస్తుంది. పూర్తిగా మద్యానికి అలవాటవడంతో అతని ఆరోగ్యం చెడిపోతుంది. అప్పుచేసి చికిత్స చేయిస్తుంది సునీత. కొన్ని రోజులు బాగానే ఉన్నా మళ్లీ అతను అదే తంతు కొనసాగిస్తాడు. దీన్ని ఎలాపైనా ఎదుర్కోవాలని సునీత ప్లాన్ వేస్తుంది. దాని మూలంగా భర్త ఆలోచన మారుతుంది. మహిళకు ఉండే ఓపిక ఎలాంటిదో భర్తకు అవగాహన కల్పిస్తాడు. ఆడదానికి భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుందనే సందేశం దీంట్లో చక్కగా చూపించారు. కొంచెం కామెడీ కూడా జోడించారు. కథకు తగ్గ వాతావరణం, పాత్రల ఎంపిక బాగున్నాయి.

Total views 3,057+ (ఆగస్టు 02 నాటికి)
Published on Aug 2, 2019

- వినోద్ మామిడాల, సెల్: 7660066469

149
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles