నేస్తమా.. అందరి లోకం ఒకటేలే!


Sun,August 4, 2019 01:48 AM

friends
ఏ స్వార్థం లేనిది.. ఏ హాని తలపెట్టనిది స్నేహం. అందుకే స్నేహానికి ప్రాణమిచ్చే స్నేహితులూ ఉంటారు. ఏ రిలేషన్‌షిప్‌కు లేని అడ్వాంటేజ్.. కంఫర్టబులిటీ ఫ్రెండ్‌షిప్‌కు ఉన్నది. ఎందుకంటే స్నేహితుడు కేవలం సంతోషాల్లో మాత్రమే ఉండడు. మనకు సమస్యలున్నప్పుడు కూడా భుజం మీద చెయ్యేసి తోడుగా ఉంటాడు. అలాంటిఫ్రెండ్‌షిప్ ఇప్పుడు సోషల్‌మీడియాలో కూడా దొరుకుతున్నది. మెసేజ్‌లే కావచ్చు.. బాగున్నా అని నవ్వుతూ చెప్పినా.. సర్లే ఇప్పుడు నిజమేంటో చెప్పు అంటూ అభయమిస్తూ.. అండగా నిలుస్తూ కొత్త స్నేహ ప్రపంచాన్ని నిర్మిస్తున్నారు. నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా సామాజిక నేస్తాల గురించి ముఖచిత్ర కథనం.
friends1
ఫ్రెండ్‌షిప్‌కు షరతులుండవు.. నిబంధనలుండవు. విశాలమైన మైదానం లాంటిది ఇది. ఎవరో ఒకరు.. ఏదో ఒక సందర్భంలో పరిచయమై ప్రాణ నేస్తాలుగా మారిపోతారు. పరిచయమనే విత్తనంతో మొదలై మొక్కై.. మానై.. ఏపుగా పెరిగి ఎన్నేండ్లు దాటినా పూస్తూ.. కాస్తూ ఉండేదే స్నేహం. ఒకప్పుడు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్.. స్కూల్‌ఫ్రెండ్స్.. కాలేజ్ ఫ్రెండ్స్.. వర్కింగ్ ఫ్రెండ్స్ మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు సోషల్‌మీడియా ఫ్రెండ్స్ కూడా కనిపిస్తున్నారు.. వినిపిస్తున్నారు.. సమ్మేళనాలు ఏర్పాటు చేసుకొని సందడి చేస్తున్నారు.

ఇప్పుడంతా ఆన్‌లైన్లోనే స్నేహించుకుంటున్నారు. సాయం కావాలన్నా.. సంతోషాలు పంచుకోవాలన్నా.. సోషల్ మీడియా ద్వారానే జరుగుతున్నది. గ్రూపులుగా ఏర్పడి.. దూరంగా ఉండి.. మరింత దగ్గరవుతూ కొత్త ప్రపంచంలో విహరిస్తున్నారు. విడదీయలేని.. మర్చిపోలేని స్నేహసామ్రాజ్యంలో సంచరిస్తున్నారు. ఒక దగ్గర చదువుకోకపోయినా.. ఒక దగ్గర పెరగకున్నా.. ఏదో ఒక కారణంతో స్నేహితులుగా మారి మరింత మందిని చేర్చుకుంటున్నారు. సోషల్ మీడియా స్నేహం వాకిట్లో సేద తీరుతున్నారు. దాంట్లో నువ్వున్నావు.. నేనున్నాను.. మనం ఉన్నాం.!!
friends2

పరిజ్ఞానం పెంపొందించుకోవచ్చు

సోషల్‌మీడియా విభిన్న ఆలోచనల వేదిక. దాంట్లో ఫేస్‌బుక్ ఇంకా ఎక్కువ. పరిచయం లేని వ్యక్తులు, సామాజిక మాధ్యమాల ద్వారా స్నేహాన్ని పెంచుకోవడం, ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకోవడం మంచిదే. కుల, మత, ప్రాంత, వర్గ విబేధాలతో విమర్శించకుండా అర్థవంతమైన చర్చలు చేయడం వల్ల, అవతలి వాళ్ల అభిప్రాయాలను గౌరవించడం ద్వారా విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవచ్చు. నాకు సోషల్‌మీడియా వల్లే తెలంగాణ భావజాలం ఉన్న వ్యక్తులతో ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడి.. ఒక గ్రూప్‌ను నడిపించేదాక తీసుకెళ్లాయి. మా స్నేహ ప్రపంచం సేకరించిన పదాలతో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పుస్తకం వేస్తా అని మమ్మల్ని పిలిపించడం సోషల్‌మీడియా గడిగోలు ఫ్రెండ్స్‌గా మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం.
- సుధీర్‌కుమార్ తాండ్ర

To the world you may be just one person, but to one person you may be the world.

ప్రపంచంలో మీరు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కావచ్చు. కానీ ఒక వ్యక్తికి మీరే ప్రపంచం అయి ఉండొచ్చు

friends3
నరేష్, ధనుంజయ్, ప్రత్యూష, సాయి, కిరణ్మయి కలిసి చదువుకున్నారు. దాదాపు 40 మంది క్లాస్‌మేట్స్ ఉన్నప్పటికీ ఈ ఐదుగురే బాగా క్లోజ్ అయ్యారు. ప్రత్యూష పెండ్లి అయింది. ఆస్ట్రేలియాలో ఉంటున్నది. కిరణ్మయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జాబ్ చేస్తున్నది. నరేశ్‌కు ఎస్సై ఉద్యోగం వచ్చింది. ధనుంజయ్, సాయి వ్యాపారాల్లో సెటిల్ అయ్యారు. చదువు పూర్తికావడంతో వీళ్ల ఫ్రెండ్‌షిప్‌కు గ్యాప్ ఏర్పడింది. ఒకరు లేనిదే ఇంకొకరు క్షణం కూడా ఉండని పరిస్థితి నుంచి నెల రోజులకోసారి కూడా పలకరించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇలా అయితే కష్టం అని భావించి క్లోజ్ బడ్డీస్ అనే వాట్సప్‌గ్రూప్ క్రియేట్ చేశాడు సాయి. ఇప్పుడు గుడ్‌మార్నింగ్ బడ్డీస్ అంటూ ప్రారంభమై స్వీట్ డ్రీమ్స్ అనే మధురమైన సందేశం పంపేదాక రోజంతా ఆన్‌లైన్లో పలకరించుకుంటున్నారు. బాగోగులు.. కెరీర్.. ఆరోగ్యం.. వంటి అన్ని విషయాలు చర్చించుకుంటున్నారు. చూసేవాళ్లకు వీళ్లకేం పనిలేదా? అనిపిస్తుండొచ్చు.. కానీ వీళ్లకు ఈ బడ్డీస్ స్నేహమే ఓ ప్రపంచంగా అనిపిస్తుందట.
ఇదొక్కటే కాదు.. ఇప్పుడు సోషల్‌మీడియా వేదికగా అనేక రకాల దోస్తాన్‌లు చిగురిస్తున్నాయి. టెన్త్‌క్లాస్ ఫ్రెండ్స్.. ఇంటర్ ఫ్రెండ్స్.. డిగ్రీ ఫ్రెండ్స్.. కొలీగ్ ఫ్రెండ్స్ అంతా కలిసి సోషల్‌మీడియా ఫ్రెండ్స్ అనే గొడుగు కిందికి వస్తున్నారు.

Truly great friends are hard to find, difficult to leave, and impossible to forget.

గొప్ప స్నేహితులను గుర్తించడం.. వారిని వదులుకోవడం కష్టం. మర్చిపోవడం అసాధ్యం


కొందరు స్నేహమంటే ప్రాణమిస్తారు. ఫ్రెండ్స్ కూడా సొంతవాళ్లు అనే భావిస్తారు. పృథ్వి.. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్. స్పోర్ట్స్ బైక్‌పై కాలేజీకి వెళ్తుంటాడు. బైక్ లవర్స్ వాట్సప్ గ్రూప్‌లో అతను మెంబర్. తన జిమ్ ఫ్రెండ్ సంజయ్ అడ్మిన్‌గా ఈ గ్రూప్ నడుస్తున్నది. ఒకరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఐ మెట్ యాక్సిడెంట్.. ప్రజెంట్ ఔటర్ రింగ్‌రోడ్ అని మెసేజ్ పెట్టాడు పృథ్వి. అందరూ షాకయ్యారు. సంజయ్ మియాపూర్‌లో ఉన్నాడు. మిగిలిన స్నేహితుల్లో మురళి అంబర్‌పేట్‌లో ఉన్నాడు. కల్యాణ్ ఊరెళ్లాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోచోట ఉన్నారు. మురళికి తెలిసిన అబ్బాయి ఒకతను బొంగ్లూర్‌లో ఉన్నాడు. అరే.. మా ఫ్రెండ్‌కు ఔటర్ దగ్గర యాక్సిడెంట్ అయింది. నేను అంబర్‌పేట్‌లో ఉన్నాను. నేనొస్తున్నాను. ఆ లోపు అంబులెన్స్‌కి ఫోన్‌చేసి పరిస్థితి ఏంటో చూడు. హాస్పిటల్‌కి తీసుకెళ్దాం అని వెళ్లాడు. కట్‌చేస్తే అతన్ని ఎల్బీనగర్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్పటికే బైక్ లవర్స్ గ్రూప్ మిత్రులు అక్కడకు వచ్చేశారు. బ్లడ్ కావాలంటే మురళి ఇచ్చాడు. సమయానికి ట్రీట్‌మెంట్ అందటంతో మూడు నెలలకు పృథ్వి కోలుకున్నాడు. అప్పటి నుంచి మురళితో పృథ్వి విడదీయలేని స్నేహాన్ని ఏర్పరచుకున్నాడు.
ఆ తర్వాత మురళి అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్తే పృథ్వి ఎంతో బాధపడ్డాడు. జీవితంలో మర్చిపోలేని విధంగా సర్‌ప్రైజ్ చేస్తూ సెండాఫ్ పార్టీ ఇచ్చాడు. వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతిరోజూ టచ్‌లో ఉంటున్నారు.
నిజమే కదా? గొప్ప స్నేహితులను గుర్తించడం.. వదులుకోవడం.. మర్చిపోవడం అంత ఈజీ కాదేమో?!
friends4
Friendship is like a glass ornament, once it is broken it can rarely be put back together exactly the same way.

స్నేహం ఒక గాజు గ్లాసులాంటిది. ఒకసారి పగిలిందనుకోండి ఎలా ఉందో అలా అతికించడం చాలా అరుదు


పుట్టినప్పటి నుంచి స్నేహితులుగా ఉండి.. ఇప్పటికీ కలిసి ఉండే స్నేహాల్లోనూ మనస్పర్థలు.. మోసాలకు అవకాశం ఉంది. అయితే ఇది చాలా తక్కువ. అలాంటి ఎవరు ఎలాంటివారో పూర్తిగా తెలియకున్నా అతి తొందరగా ఏర్పడే సోషల్‌మీడియా స్నేహంలో మనస్పర్థలు, మోసాలు ఉండటం కామన్. ఇలా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. అర్జున్ (పేరు మార్చాం) సోషల్‌మీడియాలో యాక్టివ్ మెంబర్. చాలా గ్రూపుల్లో ఉన్నాడు. అందరితో చాలా చక్కగా ఉండేవాడు. మంచి సందేశాలు పోస్ట్ చేస్తూ మంచోడు అనే ముద్ర వేసుకున్నాడు. జగదీశ్ (పేరు మార్చాం)కు ఫొటోగ్రఫీ అంటే ప్యాషన్. లక్ష రూపాయలతో కెమెరా కొనుక్కొని మంచి ఫొటోలు చిత్రీకరిస్తుండేవాడు. వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుండేవాడు. అర్జున్ ఒకసారి జగదీశ్‌ను కలిసి నేను తిరుపతి వెళ్తున్నా. కెమెరా అవసరం ఉంది. ఇవ్వవా? మూడ్రోజుల్లో తిరిగి ఇచ్చేస్తా అన్నాడు. వారం రోజులు గడిచాయి. జగదీశ్ ఎంత ప్రయత్నించినా అర్జున్ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. మోసపోయాడని స్పష్టంగా అర్థమైంది.
అందరూ కాకపోవచ్చు.. ఎవరో ఒకరు ఉంటారు. వారిపై లోతైన అవగాహన ఉండదు. గాజుగ్లాసులాంటి స్నేహం ఒకసారి పగిలిపోతే అతికించడం అంత ఈజీ కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
friends6

కొత్త సంప్రదాయం

జిందగీ ఇమేజెస్ కాన్సెప్ట్ వేరే. కానీ అంతర్గతంగా ఈ వేదిక ద్వారానే మేం ఫ్రెండ్స్ అయ్యాం. ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారో మా సమ్మేళనాలు చూస్తే అర్థమైంది. ఇప్పుడు రెండున్నర లక్షల మంది సభ్యులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. వారి అందరినీ ప్రత్యక్షంగా కలుసుకోలేదు. అందరితో చర్చించే అవకాశమూ లేదు. కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం దాదాపు అందరితో మాట్లాడుతున్నాం. కలిసి చదువుకుంటేనే ఫ్రెండ్స్ కాదు. కలిసి ఆడుకుంటేనే ఫ్రెండ్స్ కాదు. కలిసి తమ భావాలను పంచుకునేవాళ్లు కూడా ఫ్రెండ్సే అనే కొత్త సంప్రదాయానికి మేం స్వాగతం పలికాం. ఈ పనిలో విజయవంతం అయ్యాం.
- చంద్రశేఖర్ చేగొండి
friends5
True friendship comes when the silence between two people is comfortable.

ఇద్దరు వ్యక్తుల మధ్య నిశ్శబ్దం సౌకర్యంగా ఉన్నప్పుడు నిజమైన స్నేహం ఏర్పడుతుంది


కానీ.. నిశ్శబ్దం ఎప్పుడు బలీయంగా ఉంటుంది? ఆ ఇద్దరూ ఒకరికొకరు దూరంగా ఉన్నప్పుడే. దూరంగా ఉండి స్నేహంగా ఉండటమంటే కొత్తగానే ఉండొచ్చు. కానీ ఇప్పుడు అంతా ఇదే జరుగుతుంది. అదే సోషల్‌మీడియా ఫ్రెండ్‌షిప్.
ఒక దగ్గర చదువుకున్నవాళ్లు కాదు.. ఒక దగ్గర ఉద్యోగం చేసేవాళ్లు కాదు.. ఒక ఊరు వారు కాదు.. కానీ వాళ్లు సోషల్‌మీడియా వేదికగా మంచి ఫ్రెండ్స్.
తమ అభిప్రాయాలను.. ఆలోచనలను.. భావాలను.. భావోద్వేగాలను పంచుకుంటారు. పరిశీలనలు చేస్తారు. సామరస్యంగా చర్చించుకుంటారు. సమయం చూసుకొని కలుస్తుంటారు. అది ఫేస్‌బుక్ కావచ్చు.. వాట్సప్ కావచ్చు.. ఇన్‌సా్ర్టగామ్ కావచ్చు. ఒక్కచోటుకు చేరి స్నేహానికి సరికొత్త నిర్వచనం చెప్తున్నారు.

మహేందర్‌కు 21 జూలైన క్రిటికల్ కేస్. అర్జెంట్లీ నీడ్ 4 యూనిట్స్ ఆఫ్ O+ve బ్లడ్ ఫర్ బైపాస్ సర్జరీ పేషెంట్.. నిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ అనే మెసేజ్ వచ్చింది. మెసేజ్ చేసింది వాళ్ల స్నేహితుడు సునీల్. అతనికి వాళ్ల స్నేహితుడు నరేందర్ నుంచి వచ్చిందట. వాస్తవానికి అది ఫార్వర్డెడ్ మెసేజ్. ఎవరో చేస్తే ఇలా అన్ని వాట్సప్ గ్రూపులల్లో సర్కులేట్ అవుతున్నది. ఏం చేయాలి? అని ఆలోచించాడు మహేందర్. కొన్ని గ్రూపలకు షేర్ చేశాడు. మెసేజ్ స్ప్రెడ్ అవుతుంది కానీ ఎలాంటి రిజల్ట్ లేదు. బ్లడ్‌గ్రూప్ ఫ్రెండ్స్ అనే గ్రూపులో ఇటీవలే జాయిన్ అయ్యాడు మహేందర్. ఏమీ ఆలోచించకుండా దాంట్లో వేసేశాడు. ఐదు నిమిషాల్లోనే టకా టకా మెసేజ్‌లు వచ్చాయి. మేమిస్తాం అంటే మేమిస్తాం అని ముందుకొచ్చారు కొందరు. వాస్తవానికి వాళ్లు మహేందర్ ఫ్రెండ్సే కానీ సందేశాన్ని ఫార్వర్డ్ చేసినవాళ్ల ఫ్రెండ్స్.. చుట్టాలు కాదు. రక్తం కావాల్సిన వ్యక్తితో కూడా ఎలాంటి రిలేషన్‌షిప్ లేదు. కానీ తమ స్నేహితుడు మహేందర్ నుంచి మెసేజ్ వచ్చింది కాబట్టి రక్తం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఒక్క మహేందరనే కాదు.. ఆ గ్రూప్‌లో ఎవరి నుంచి మెసేజ్ వచ్చినా.. ఏ రాత్రి వచ్చినా 250 మంది కాకపోయినా అందులో కనీసం 20 మంది అయినా వెంటనే స్పందించి రక్తదానం చేస్తున్నారు. ఫ్రెండ్‌షిప్ చేయాలంటే కలిసి చదువుకోవాలి.. కలిసి పెరగాలనే నిబంధనలేమీ ఉండవనీ.. మంచి మనసు ఉంటే సరిపోతుంది అని నిరూపిస్తున్నారు బ్లడ్‌గ్రూప్ ఫ్రెండ్స్ వాట్సప్ మిత్రులు. ఇంతకంటే మంచి మిత్రులు ఎవరుంటారు చెప్పండి?

Be slow to fall into friendship; but when thou art in, continue firm & constant.

స్నేహం ఏర్పరచుకోవడానికి నెమ్మదిగానే ఉండండి. కానీ ఒకసారి స్నేహం ఏర్పడ్డాక స్థిరంగా.. దృఢంగా ఉండండి


సోషల్‌మీడియా ఫ్రెండ్స్‌ను చూస్తే ఇదే అనిపిస్తుంది. అంతకంటే ముందు వారికి ఎలాంటి పరిచయం కూడా ఉండదు. మ్యూచువల్ ఫ్రెండ్స్‌ను.. గ్రూపు ప్రాధాన్యాన్ని బట్టి ఎవరో ఒకరు స్నేహం కోసం రెక్వెస్ట్ చేస్తారు. అప్పుడు వెంటనే యాక్సెప్ట్ చేసే స్నేహితులు చాలా తక్కువ. ఆచితూచి చేస్తుంటారు. వాళ్లు పెట్టే పోస్టులు ఎలాంటివి? వారి మనస్తత్వం ఏంటి? మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు వంటి విషయాల గురించి ఆలోచించి నెమ్మదిగా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఒకసారి ఫ్రెండ్స్ అయ్యాక వారి బంధాన్ని విడదీయడం ఎవరి తరమూ కాదు. దీనికి ఉదాహరణే ఫేస్‌బుక్ పేజీ జిందగీ ఇమేజెస్. ఈ గ్రూపులో రెండు లక్షలన్నరకు మంది సభ్యులు ఉన్నారు. వాస్తవానికి ఇది ఫ్రెండ్‌షిప్ గ్రూప్ కాదు. కానీ ఫ్రెండ్స్‌గానే కొనసాగుతున్నారు. ఫొటో పిక్చరైజేషన్‌ను దృష్టిలో ఉంచుకొని చేగొండి చంద్రశేఖర్ ఈ గ్రూపును క్రియేట్ చేశాడు. దీని ద్వారా పలు సేవా.. స్నేహ కార్యక్రమాలు చేస్తున్నారు. తొలుత గల్ఫ్‌లో ఉండేవారి సాధకబాధకాల్లో భాగస్వామ్యం అయ్యే కార్యక్రమాలు చేశారు. స్నేహానికి దూరం.. దేశం.. వర్గం అవసరం లేదనీ.. వాళ్లు ఆపదలో ఉంటే ఆదుకోవడం.. సంతోషంలో ఉంటే వారితో ఆనందాన్ని పంచుకోవడమే స్నేహం అనే కొత్త నిర్వచనాన్ని ఈ గ్రూప్ ద్వారా ఇస్తున్నారు.

తెలంగాణ పల్లె సోయగాలను.. కులవృత్తులను.. కళలను.. మట్టిని ప్రతిబింబించేలా అందర్నీ చైతన్యం చేసేందుకు ఈ ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. ఇప్పుడు వీరు అన్నా.. తమ్ముడు.. అక్కా.. చెల్లి.. బాబాయ్.. మామా అంటూ పలకరించుకునేంతగా క్లోజ్ అయ్యారు. ఆన్‌లైన్లోనే కాదు.. ఆఫ్‌లైన్లోనూ కలుసుకోవాలి అని భావించి ఇప్పటివరకు పన్నెండుసార్లు ములాఖత్ అయ్యారు. దీన్నిబట్టి చెప్పేదేంటంటే.. కొందరితో స్నేహం ఏర్పడటానికి ఆలస్యం కావచ్చేమో.. కానీ ఒకసారి ఏర్పడ్డాక దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. అందరూ అన్నిసార్లు స్పందించినా.. స్పందించకపోయినా మొత్తానికి ఒక వేదికగా రెండున్నర లక్షల మంది స్నేహితులు అవ్వడం అంటే ఇదొక కొత్త ప్రపంచమే అనుకోవాలి కదా?

Friendship is the only cement that will ever hold the world together.

స్నేహం అనేది ప్రపంచాన్ని కలిపేసే ఒక సిమెంట్ లాంటిది


ప్రపంచమంతా ఎలా కలుస్తుంది? ఒకే ఆలోచనా విధానం ఉన్నప్పుడు.. ఒకే అభిలాష ఉన్నప్పుడు.. ఒకే రకమైన వ్యక్తిత్వం ఉన్నప్పుడు. కొంతమందికి సినిమానే ప్రపంచం. ఏ ఒక్క బిట్టు మిస్ అయినా తట్టుకోలేనంత ప్రేమ వాళ్లకు. అలాంటి సినిమా ప్రేమికులంతా ఒక్కచోట కలిస్తే అదే.. The Movie Searcher-సినిమా అన్వేషి అనే సోషల్‌మీడియా గ్రూప్. దీంట్లో ఉన్నవాళ్లకు సినిమా ప్రేమ అనేకంటే పిచ్చి అంటే బెటరేమో. కొంతమంది సినిమాలను ఇష్టపడటమే కాకుండా దానిద్వారా ఏదో ఒకటి నేర్చుకోవాలి.. దానిని పదిమందికి తెలియజేయాలి అనుకుంటారు. ఫేస్‌బుక్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ చాలామందికి తెలియని సినిమాలను పరిచయం చేస్తూ మంచి వినోదం పంచుతున్నది ఈ మిత్రబృందం.
ప్రతివారికి తమ భాషలో మాత్రమే కాక.. పరభాషలోని మంచి సినిమాలు కూడా చూడాలనే ఆసక్తి ఉంటుంది. అయితే అందులో ఏ చిత్రాలు ఎంచుకోవాలి? అనే దగ్గర ఆగిపోతారు. మంచి సినిమాలు చూసినవాళ్లు తమ అనుభవాలను పంచుకుంటే ఏ చిత్రాలు ఎంచుకోవాలి? అనే దగ్గర ఆగిపోయిన వాళ్లకు ఉపయోగం ఉంటుంది. ప్రపంచంలోని వివిధ భాషల్లో విడుదలయిన సినిమాల సమీక్షలు, దర్శకుల పరిచయాలు, చిత్ర విశేషాలు, సినిమా సాహిత్యం అందరికీ చేరవేస్తూ సినిమా ప్రేమికులను స్నేహితులుగా మార్చి ఒక్కచోటుకు చేర్చింది The Movie Searcher- సినిమా అన్వేషి.

ఒకే అభిరుచి ఉన్నవాళ్లం ఈ గ్రూపు ద్వారా ఒక్కచోటుకు చేరాం. దాదాపు మూడువేల మంది మిత్రులు దీంట్లో ఉన్నారు. సినిమా అనేదే ఒక ప్రపంచం. ఆ ప్రపంచం గురించి చర్చించుకోవడం.. సినిమా పరిజ్ఞానం పెంపొందించుకోవడం, ఫ్రెండ్‌షిప్‌కు సిమెంట్‌లాంటి బాండింగ్ ఏర్పరుస్తూ ప్రపంచానికి చాటడమే కొత్త నిర్వచనం చెప్పడమే మా అన్వేషి లక్ష్యం అంటున్నారు The Movie Searcher- సినిమా అన్వేషి అడ్మిన్ శ్రీనివాస్ తిప్పల.
నరేందర్‌గౌడ్ నాగులూరి అడ్మిన్‌గా లెట్స్ ఫిల్మ్ తెలంగాణ అనే ఫేస్‌బుక్ నడుస్తున్నది. తెలంగాణ సినిమాను ప్రేమించే స్నేహితులంతా దీంట్లో యాక్టివ్ మెంబర్లు.

No person is your friend who demands your silence, or denies your right to grow.

మీ నిశ్శబ్దాన్ని కోరేవారు.. మీ ఎదుగుదల హక్కును తిరస్కరించేవాళ్లు మీ స్నేహితులు కారు


తెలంగాణ పదకోశాన్ని విస్తరింపజేయాలనేది సుధీర్‌కుమార్ తాండ్ర ఆలోచన. కానీ ఎలా చేయాలి? అనే దగ్గర ఆగిపోయారు. సోషల్‌మీడియా మిత్రులతో తన ఆలోచన పంచుకున్నారు. మంచి ఆలోచన. సైలెంట్‌గా ఉండకు. తెలంగాణ పదకోశాన్ని విస్తృతం చేసేటంత గొప్ప ఆలోచన వచ్చింది కాబట్టి దీనినొక యజ్ఞంగా చేసి నేటి తరానికి అందించు అని మిత్రులు సలహా ఇచ్చారు. సుధీర్‌కు నిశ్శబ్దంగా ఉండటం ఇష్టం లేదు. పైగా వారు ఆయన ఉన్నతిని కోరుకున్నారు. కట్ చేస్తే వీళ్లంతా సోషల్‌మీడియా ఫ్రెండ్సే. సోషల్‌మీడియా ద్వారానే తెలంగాణ పదాలను విస్తరింపజేసేందుకు తనలాంటి ఆలోచన ఉన్న కొంతమందితో గడిగోలు ఫేస్‌బుక్ గ్రూప్ ఏర్పాటుచేశారు. మంచి ఆదరణ లభిస్తున్నది. ఇంకా కొత్తవాళ్లెంతోమంది చేరుతున్నారు. పాతవాళ్లతో స్నేహం ఏర్పాటుచేసుకుంటున్నారు. కనుమరుగు అవుతున్న తెలంగాణ పదాలు, వస్తువులు, ఫొటోలతో సహా సేకరించడం మిగతా వారితో పంచుకోవడం ఇక్కడ జరిగే నిత్య కృత్యం. తెలంగాణ పదకోశం మీద మంచి పట్టున్న నలిమెల భాస్కర్, పెన్నా శివరామకృష్ట, శ్రీరామోజు హరగోపాల్, అన్నవరం దేవేందర్, నర్సర్ బద్రి, పెద్దింటి అశోక్‌కుమార్, ఘంటా చక్రపాణి, కేవీ నరేందర్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. ఇలా పదకోశం ద్వారా కొత్త స్నేహప్రపంచాన్ని పరిచయం చేశారు. మన పదాలను సోషల్‌మీడియా వేదికగా ప్రమోట్ చేస్తున్నారు. తెలంగాణ పదకోశం ఉంటుంది. దీనిని పలికితే ఎంతో ఒరిజినాలిటీతో మాట్లాడినట్లు అనిపిస్తుంది. దీనిని ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? మిత్రులుగా ఏర్పడాలి అనే ఆలోచనతో నడుస్తున్నది గడిగోలు సోషల్‌మీడియా గ్రూపు.

అంటే వీరంతా సామాజిక అవసరం కలిపిన స్నేహితులన్నమాట.
ఇవే కావు.. కవులు.. రచయితలు కూడా ఆన్‌లైన్‌లో పలకరించుకుంటూ కవి సంగమం.. కవి సాయంత్రం.. కొత్త తెలంగాణ చరిత్ర.. ఫేస్‌బుక్ రచయితల సంఘం.. కవి హృదయం.. వంటి గ్రూపులను ఏర్పాటుచేసి స్నేహితులుగా మారుతున్నారు. వీటిలో ప్రతి నెలకు.. ఆర్నెళ్లకు.. సంవత్సరానికి అని గడువు పెట్టుకొని సమ్మేళనాలు ఏర్పాటుచేస్తున్నారు. ఈ మధ్య టిక్‌టాక్ ఫ్రెండ్స్ గెట్ టు గెదర్ పెట్టడానికి కూడా ఏర్పాట్లు చేశారు కొందరు. తెలంగాణ వంటకాలను పరిచయం చేసేందుకు సంవత్సరం క్రితం ఏర్పాటైన తలకాయకూర పార్టీ ఇటీవల రాచకొండ కోట దగ్గర వార్షికోత్సవ సభ ఏర్పాటు చేశారు. చెడును వదిలేసి మంచిని పెంచుతూ చేసే ఏదైనా మంచి ఫలితాన్నే ఇస్తుంది. అది ఫేస్‌బుక్ స్నేహమైనా కావచ్చు.. వాట్సప్ స్నేహమైనా కావచ్చు.. ఇంకేదైనా కావచ్చు.!!

దాయి శ్రీశైలం, సెల్: 8096677035

675
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles