పరాయిపాలనపై గర్జించిన ఛత్రపతి వీర మరణం


Sun,August 4, 2019 01:07 AM

Chhatrapati-Shivaji
భారతదేశం పై విదేశీ పాలకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించిన వీరుడు. యుద్ధతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్ఠమయిన గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేసినవాడు.ప్రజలకోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి, వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటు పడినవాడు. పరాయి మహిళను తల్లిగా గౌరవించినవాడు. అన్ని మతాలను గౌరవించి అన్ని మతాల ప్రజలను బాగా చూసుకున్నవాడు. హిందూ దేవాలయాలతో సమానంగా అనేక మసీద్‌లు నిర్మించిన హిందూ పాలకుడు. గెరిల్లా యుద్ధనీతిలో ఆరితేరినవాడు. ధైర్యం, శౌర్యం, దేశభక్తి, ధర్మ నిష్ఠతో పరిపాలన సాగించి అనారోగ్యంతో మరణించిన మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ చివరిపేజీ.


మధుకర్ వైద్యుల, సెల్: 9182777409


ఒక చిన్న బాలుడు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. అతని సిపాయిలు ఒక గ్రామాధికారిని పట్టుకొచ్చారు. అతను చేసిన నేరం ఒక అనాథ వితంతువుపై అత్యాచారం చెయ్యడం. గ్రామాధికారి కాళ్ళు, చేతులు బంధించబడి వున్నాయి. తీర్పు చెప్పే సమయం ఆసన్నమైంది. దృఢ స్వరంతో ఆ బాల రాజ కుమారుడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇతని రెండు కాళ్ళు, చేతులు నరికివేయండి అని. అందరూ నిశ్చేష్ఠులయ్యారు. రాజ కుమారుని న్యాయ ప్రియ త్వం చూసి ప్రజలు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. ఆయనే మన వీర శివాజీ. ఈ సంఘటన జరిగే నాటికి ఆయన వయస్సు పధ్నాలుగు సంవత్సరాలే.

శివాజీ తండ్రి షాజీ బీజాపూరు సుల్తాను కొలువులో ఒక సేనాధిపతి. ఒకసారి షాజీ తన కుమారుని బీజాపూరు సుల్తాను కొలువుకు తీసుకెళ్ళాడు. షాజీ వంగి సుల్తానుకు సలాము చేశాడు. తన కుమారుని కూడా అలాగే సలాం చెయ్యమని చెప్పాడు. నేను పరాయి పాలకుల దగ్గర ఎప్పుడూ తల వంచను. అని ఏ మాత్రం బెరుకు లేకుండా చెప్పాడు బాల శివాజీ. ఆ బాలుని ధైర్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్య చకితులైనారు. ఇంత చిన్న వయస్సులోనే శివాజీలో ఇంత ధైర్యం, శౌర్యం ఏర్పడడానికి కారణం ఆయన తల్లి జిజియాబాయి. శివాజీ చిన్నవాడుగా ఉన్నప్పటి నుండి ఆమె అతనికి రామాయణ, మహాభారత పురాణాలలోని వీరులు మహనీయుల వీర గాథలు బోధించేది. శివాజీ మనస్సులో తాను కూడా రాముని వలె, కృష్ణుని వలె, అర్జునుడు, భీముని వలె మహా వీరునిగా, ధర్మ నిష్ఠా గరిష్ఠునిగా తయారు కావాలనే ఆలోచన ఏర్పడడానికి ఆ వీరమాత చెప్పిన గాథలే కారణం.

శివాజీ క్రీ. శ. 1630లో శివనేరి దుర్గంలో జన్మించాడు. దాదాజీ ఖోండ్ దేవ్ వద్ద శస్త్ర, శాస్త్ర విద్యలు నేర్చాడు. భక్త తుకారాం బోధనలతో ఆధ్యాత్మిక భావధార, సమర్థ రామదాసు మార్గదర్శనంలో నైతికత, రాజనీతితో కూడిన ధార్మి క భావధార,తల్లి పెంపకంలో సాంస్కృతిక భావధారను త్రివేణీ సంగమంగా కలిగివున్నవాడు శివాజీ.పన్నెండేళ్ళ చిరు ప్రాయంలోనే సహ్యాద్రి పర్వత సానువులలోని మావ ళీ తెగవారిని సమీకరించి వారిలో దేశభక్తిని నింపి స్వాతంత్య్ర పోరాటాన్ని కొనసాగించాడు. అఫ్జల్ ఖాన్, సిద్ది జౌహార్, షయస్తఖాన్, ఇనాయత్ ఖాన్, దిలేర్ ఖాన్ వంటి ధర్మ ద్రోహులతో పోరాడి ధర్మ రక్షణ గావించాడు శివాజీ. కేవలం పదహారు సంవత్సరాల వయస్సులోనే మొట్టమొదటిగా తోరణ దుర్గమనే కోటను జయించి మంగళ తోరణం కట్టాడు. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా దుర్గాలను జయించసాగాడు. ప్రతాప్‌గఢ్, సింహగఢ్, పన్హాల్‌గఢ్, విశాల్‌గఢ్, రాయగఢ్ వంటి దుర్గాలను జయించి హిందూ సామ్రాజ్య స్థాపన చేశాడు.

మోరోపంత్ పింగళే, తానాజీ మాల్సురే, సూర్యాజీ మాల్సురే, నేతాజీ ఫాల్కర్, ఆబాజీ సోనదేవ్, భాజీ ప్రభు దేశపాండే వంటి యోధానుయోధులైన వ్యక్తులను రాష్ట్ర కార్యానికి అంకితులయ్యే ధ్యేయ నిష్ఠా దురంధరులుగా తీర్చిదిద్దాడు. పర స్త్రీని తల్లిగా భావించే హిందూ సంస్కృతికి ప్రతిరూపంగా నిలచి కళ్యాణ దుర్గం సుబేదారు అహ్మద్ ఖాన్ కోడల్ని ఇంటి ఆడపడుచును పంపినట్లుగా అత్తవారింటికి పంపాడు. బుందేల్‌ఖండ్ రాజు రాజా ఛత్రసాల్‌కు ప్రేరణగా నిలిచి తగిన మార్గదర్శనం చేశాడు. ఆలయ విధ్వంసకుడిగా పేరుగాంచిన ఔరంగజేబును అడుగడుగునా ప్రతిఘటిస్తూ హిందూ వీరుల శక్తి సామర్థ్ధ్యాలను అటు సుల్తానులకు, ఇటు మొఘలాయిలకు ఏక కాలంలో చూపిన పౌరుష పరాక్రమ మూర్తి శివాజీ.

శివాజీ విజయ వార్తలు ఔరంగజేబుకు సహింపరానివయ్యాయి. సింహాన్నెదుర్కోవాలంటే సింహమే కావాలని నిశ్చయించుకున్నాడు. ఈ కార్యానికి మీర్జా రాజా జయసింహుని ఎన్నుకున్నాడు. జయసింహుడు గొప్ప యో ధుడే కాక చాలా తెలివైన సేనాధిపతి కూడా. పెద్ద సైన్యంతో వచ్చిన జయసింహుడు బిజాపూరు సుల్తానుతో సహాయ సంధి చేసుకుని శివాజీపై దాడి చేశాడు. శివాజీ ఒక లేఖ ద్వారా జయసింహునితో సంధి ప్రస్తావన చేసి ఔరంగజేబుతో సంప్రదింపులు జరపడానికి అంగీకరించాడు. శివాజీకేమాత్రమూ అవమానం, అపకారం జరగదని, గౌరవ పూర్వకంగా చూసుకుంటామని జయసింహుడిచ్చిన మాట నమ్మి ఆగ్రా కోటలో అడుగు పెట్టిన శివాజీకి అక్క డ అవమానం ఎదురైంది. పట్టరాని ఆగ్రహంతో రాజసభ వదిలి బైటకొచ్చాడు శివాజీ. ఇచ్చిన మాటను విడిచి శివాజీని బంధించి శిరచ్ఛేదనం చేయమని ఆజ్ఞాపించాడు ఔరంగజేబు. కానీ శివాజీ అక్కడి నుంచి ఉపాయంతో తప్పించుకుని కాశీ, గయ క్షేత్రాల మీదుగా రాయగఢ్ చేరుకున్నాడు.
చుట్టూ ఉన్న విదేశీ శత్రురాజుల దాడులను తప్పించుకుంటూ తనకోసం దుర్భేద్యకోటలను నిర్మించుకుంటూ పోరాటం సాగించాడు. తనను తాను రాజుగా ప్రకటించుకోవాలనే ఆలోచన ఆయనకు ఎన్నడు లేదు. శివాజీ భవానీమాత భక్తుడు. అందుకే ఆమె ఆజ్ఞతో పోరాటం చేస్తున్నాననే భావించేవాడు. శివాజీ ఒక కోట తర్వాత మరొక కోట జయిస్తున్నాడని తెలిసిన ఔరంగజేబు కోపోద్రిక్తుడై ఆయనపై దాడిని ప్రకటించాడు. ఈ విషయం తెలిసి శివా జీ 1670లో తానే శత్రువులపై దాడికి దిగాడు. అలా బయలుదేరి సింహఘడ్, లోహఘడ్‌ను జయించి సూరత్‌ను లూటీ చేశాడు. శివాజీ వీరోచిత పోరాటాన్ని తెలుసుకున్న హిందూరాజులు ఆయన వెంట నడిచేందుకు ముందుకు వచ్చారు. అయితే శివాజీ స్వరాజ్యం ప్రకటించకపోవడం ఆయనను కేవలం సుల్తాన్ దగ్గర పనిచేసే సర్దార్ పుత్రుడు మాత్రమేనని శత్రురాజులు ప్రసారం చేశారు.

రాయగఢ్‌లో రాజసభా మందిర నిర్మా ణం చేసి ఆనందనామ సంవత్సరం జూన్ 6 క్రీ.శ. 1674లో గాగాభట్టు అనే కాశీ పండితుడు శాస్ర్తానుసారంగా శివాజీకి రాజ్యాభిషేకం గావించాడు. గాగాభట్టు శివాజీ శిరస్సుపై ఒక బంగారు ఛత్రాన్నుంచి ఛత్రపతి అని ఘోషించాడు. పరమ పవిత్రమైన తన తల్లి చరణాలను స్పృశించి, ఆశీర్వాదం పొంది రత్న ఖచిత సువర్ణ సింహాసనంపై ఆసీనుడయ్యాడు శివాజీ. దుర్గాలన్నిటిలోకి శ్రేష్ఠమైన రాయగఢ్ దుర్గాన్ని శివాజీ రాజధానిగా చేసుకున్నాడు.

దీంతో రాయగఢ్‌లో రాజసభా మందిర నిర్మా ణం చేసి ఆనందనామ సంవత్సరం జూన్ 6 క్రీ.శ. 1674లో గాగాభట్టు అనే కాశీ పండితుడు శాస్ర్తానుసారంగా శివాజీకి రాజ్యాభిషేకం గావించాడు. గాగాభట్టు శివాజీ శిరస్సుపై ఒక బంగారు ఛత్రాన్నుంచి ఛత్రపతి అని ఘోషించాడు. పరమ పవిత్రమైన తన తల్లి చరణాలను స్పృశించి, ఆశీర్వాదం పొంది రత్న ఖచిత సువర్ణ సింహాసనంపై ఆసీనుడయ్యాడు శివాజీ. దుర్గాలన్నిటిలోకి శ్రేష్ఠమైన రాయగఢ్ దుర్గాన్ని శివాజీ రాజధానిగా చేసుకున్నాడు. శత్రువులను ఓడించి రాజ్య స్థాపన చేయడంతోనే శివాజీ పొంగిపోలేదు. ప్రజల సుఖ సంతోషాల కోసం అనేక విధాలుగా ప్రయత్నించాడు. వారిని విద్యావంతులను చెయ్యాలని శివాజీ అభిలషించాడు. నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం, తాను చేస్తున్న పనిపట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులు ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్పరాజుని చేసాయి.
Chhatrapati-Shivaji1
మరాఠా సామ్రాజ్యం ముగిసేవరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ నిలిచి ఉండేలా పటిష్ఠమయిన నౌకా దళాన్ని, ఆశ్వికదళాన్ని ఏర్పాటు చేసాడు. ఎనిమిది నెలలు పంటలు పండించే రైతులు కూడా నాలుగు నెలలు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడం శివాజీ విధానాలకు అద్దం పడుతుంది. కేవలం సైనికులే కాక సంఘంలోని అన్ని వర్గాలవారు కోటను పరిరక్షించేవారు. మరణించే నాటికి శత్రువులందరూ వెనుకాడే విధంగా లక్ష సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు శివాజీ.
శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ సైన్యంలో మూడొంతులు ముస్లిములు. వారిలో చాలామంది ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ ఆలీ ఆయుధాల విభాగానికి, ఇబ్రహీం ఖాన్ నావికాదళానికి, సిద్ధి ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్ ఖాన్, సిద్ధిక్ అనే ఇద్దరు ముస్లింలు! శివాజీ అంగరక్షకులలో అతిముఖ్యుడూ, అగ్రా నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తి మదానీ మెహ్తర్ కూడా ముస్లిమే!

అనేక కోటలను జయించి స్వరాజ్యానికి వచ్చిన శివాజీ తన రాజ్యాన్ని సుభిక్షంగా పాలించాడు. అయితే ఆయన పాలన ఎక్కువకాలం సాగలేదు. అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యాడు. అదే సమయంలో ఆయన రెండవ భార్య సాయరాబాయి కొడుకు రాజారాం వివాహం మార్చి 1680లో అయింది. అప్పటికీ అనారోగ్యంతోనే ఉన్న శివాజీ ఆరోగ్యం మరింత క్షీణించింది. విపరీతమైన జ్వరం విరోచనాలతో మంచానికే పరిమితమయ్యాడు. పదిహేను రోజులపాటు వివిధ రకాల చికిత్సలు చేసినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. మూడురోజుల పాటు ఆగని విరోచనాలతో 53 సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 2, 1680న తుదిశ్వాస విడిచాడు.

శివాజీమీద రెండవభార్య విషప్రయోగం చేయించిందన్నది ఆరోపణ. తన కొడుక్కు సింహాసనం దక్కాలనే ఉద్దేశంతో కుట్ర పన్ని శివాజీని చంపించిందని చెబుతారు.అదే అనుమానంతో పెద్ద భార్య కుమారుడు శంభాజీ సవతితల్లిని, సోదరున్ని బంధించి పాలనా పగ్గాలు చేపట్టాడు. శివాజీ మరణించేనాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేధ్యమయిన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మితమైనాయి.

930
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles