చేనేత.. రంగుల కళబోత!


Sun,August 4, 2019 12:59 AM

sarees
నూలు వడికే ఇండ్లళ్లో ఇప్పుడు.. బియ్యం ఉడుకడం లేదు! మగ్గం నేసిన చేతులు ఇప్పుడు.. చీకట్లో మగ్గుతున్నాయి.. ఆ చేనేత కళకు మునుపటి జీవం పోయాలి.. అప్పుడే చేనేత కళాకారుడు బతుకుతాడు.. మనం నిండుగా కప్పుకొనేందుకు బట్ట నేస్తాడు.. మర యంత్రాల జీవితానికి చరమగీతం పాడి.. చేనేతకు చేయూతనిద్దామనే నినాదాన్ని పెంచుదాం.. ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం.. మన పోచంపల్లిని తలుచుకుంటూ.. వస్త్రం అస్త్రమైన ఆ రోజును పురస్కరించుకొని.. వివిధ ప్రాంతాల కళనేత గురించి చర్చించుకుందాం..

- సౌమ్య పలుస

sarees1
sarees2

గోవా కున్బి

ఇక్కడ జీవించే ఒక తెగ పేరు మీద ఈ ఫ్యాబ్రిక్ వచ్చింది. చెక్స్ ప్యాటర్న్‌తో వచ్చిన ఈ చీరలను మోకాళ్లకు కాస్త కిందకు కట్టి పొలాల్లో పని చేసేవారు ఆ తెగ ఆడవాళ్లు. 20వ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ల వల్ల ఈ చీరలు కనుమరుగయ్యాయని అంటారు. ఈ మధ్యకాలంలో వెండిల్ రాడ్‌రిక్స్ అనే డిజైనర్ ఈ చీరలను మళ్లీ నేసేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి.
sarees3

అరుణాచల్‌ప్రదేశ్ అప్తానీ

అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఒక గిరిజన తెగ పేరు అప్తానీ. వీవింగ్ టెక్నిక్స్‌లో వీరిని బెస్ట్‌గా చెప్పొచ్చు. ఆ కాలంలోనే మిగతా రాష్ర్టాల్లోని తెగల కంటే వీరి వీవింగ్ చాలా అద్భుతంగా ఉండేది. జామెట్రిక్ ప్యాటర్న్, జిగ్‌జాగ్‌గా ఉండే డిజైన్‌లు ఈ బట్టల మీద అదనపు ఆకర్షణ అనే చెప్పొచ్చు. లేత రంగుల కలబోతను ఈ బట్టల్లో చూడొచ్చు.
sarees4

బిహార్ భాగల్‌పురీ సిల్క్

సిల్క్ సిటీగా ఈ ప్రాంతాన్ని చెబుతారు. శతాబ్దకాలం క్రితమే నేతకారులంతా బిహార్ నుంచి భాగలపుర్‌కి వెళ్లిపోయారు. భాగల్‌పురి వెరైటీ అయిన టస్సర్ సిల్క్ ఇక్కడి నుంచే వస్తుంది. టస్సర్ అనే కాయ నుంచి దారాన్ని వేరు చేసి రంగు రంగుల డైలతో కలర్‌ఫుల్ చీరలను, దుస్తులను నేస్తారు. దేశమంతా ఈ సిల్క్‌కి ఫ్యాన్స్ ఉన్నారు.
sarees5

త్రిపుర పచ్రా

ఇక్కడ గిరిజనులు ప్రత్యేకంగా నేసే బట్ట పేరే పచ్రా. చాలా పెద్దగా ఈ క్లాత్‌ని నేస్తారు. అక్కడి ఆడవాళ్లు మోకాళ్ల వరకు ఈ చీరలను కడుతారు. కింది వైపు గీతలు, దాని పైన ఫుల్‌గా ఎంబ్రాయిడరీ రావడం ఈ డిజైన్‌లకి ఉన్న ప్రత్యేకత. ఎక్కువగా ముదురు రంగుల్లో ఈ వస్ర్తాలు లభ్యమవుతాయి.
sarees6

మేఘాలయ ఎరీ సిల్క్

ఈశాన్య భారతదేశంలో ఈ సిల్క్ చాలా ప్రాముఖ్యమైంది. ఇతర సిల్క్‌లతో పోలిస్తే ఈ సిల్క్‌లో ఫైబర్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఈ సిల్క్‌ని జాగ్రత్తగా దాచుకోవాలి. లేత రంగుల్లో ఈ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది. పట్టచిత్ర ఆర్ట్, కాంతా ఎంబ్రాయిడరీ ఈ సిల్క్ మీద కనిపిస్తుంది. బౌద్ధ మత గురువులు ఎక్కువగా ఈ సిల్క్‌ని వాడుతారు. ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్షనే దీనికి ప్రధాన కారణం.
sarees7

నాగాలాండ్ నాగా శావల్స్

ఈ ప్రాంతంలో ప్రధాన వృత్తిగా ఉన్నది నేతనే! ఎరుపు, నలుపు ఊల్‌తో ఈ శాలువాలను తయారు చేస్తారు. అయితే ఆ ప్రాంతం ప్రత్యేకతను బట్టి ఈ శాలువల మీద బొమ్మలను వేస్తారు. యుద్ధ వాతావరణాన్ని తలపించే బొమ్మలు, జంతువుల బొమ్మలు, మనుషుల తలలు.. ఇలా పలు రకాల డిజైన్లు వీటి మీద దర్శనమిస్తాయి.
sarees8

ఉత్తరాఖండ్ పాంచచౌలీ వీవ్

హిమాలయ ప్రాంతాల్లో ఈ బట్టలను ఎక్కువగా నేస్తుంటారు అక్కడి గిరిజనులు. అక్కడ కనిపించే గొర్రెల నుంచి సేకరించిన ఉలెన్‌తో ఈ బట్టలను నేస్తారు. ఈ బట్టతో శాలువాలు, స్టోల్స్‌ని కూడా తయారుచేస్తారు. 1990 నుంచి ఈ వస్ర్తాలు విదేశాలకు ఎగుమతి అయి మరింత ప్రాచుర్యం పొందాయి.
sarees9

హిమాచల్ ప్రదేశ్ కుల్లు శాలువా

హిమాచల్ ప్రదేశ్‌లో ఉండే గొర్రెల నుంచి సేకరించిన ఉన్నితో ఈ ఫ్యాబ్రిక్ తయారవుతుంది. శాలువాలను ఇక్కడ ప్రత్యేకంగా నేస్తారు. ఇంతకుముందు ప్రత్యేక ప్యాటర్న్‌లతో డిజైన్‌లు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు జామెట్రిక్ డిజైన్లు, ముదురు రంగులను వాడుతూ ప్రత్యేకమైన శాలువాలను నేస్తున్నారు. ఈ శాలువాలకు భారతదేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం మంచి గిరాకీ ఉంది.
sarees10

జార్ఖండ్ కుచాయ్ సిల్క్

జార్ఖండ్‌లోని ఖరస్వాన్- కుచాయ్ పరిసర ప్రాంతాల్లో ఈ సిల్క్‌ని ఎక్కువగా నేస్తారు. ఆర్గానిక్ రంగులతో ఈ ఫ్యాబ్రిక్ తయారవుతుంది. ఈ ప్రాంతంలో ఈ నేత మీద ఆధారపడి సుమారు మూడు లక్షల మంది నివసిస్తున్నారు. కాబట్టి ఈ సిల్క్‌ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా దేశ, విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది.
sarees11

ఛత్తీస్‌గఢ్ కోసా సిల్క్

కోసా అనేది.. దేశీ టస్సర్‌కి సంస్కృత పదం. ఈ సిల్క్ కోసం ఉపయోగించే దారాన్ని.. అరుదుగా కనిపించే ఓ పురుగు నుంచి తీస్తారు. ఈ దారాన్ని సేకరించడం చాలా కష్టమైన పద్ధతి కూడా. కాస్త దారానికే మూడు నుంచి ఐదు రోజుల కాలం పడుతుందట. ఛత్తీస్‌గఢ్‌లోని చంపా జిల్లా నుంచి వచ్చే సిల్క్ చాలా నాణ్యమైందిగా చెబుతారు.
sarees12

హర్యానా పంజా డుర్రీస్

అత్యంత గొప్ప చేనేత సంప్రదాయంగా పంజా డుర్రీస్‌ని చెబుతారు. హర్యానాలోని పానిపట్ నగరంలో ఈ చేనేత ఉత్పత్తి జరుగుతుంది. నేతలో వాడే ఒక సాధనం పేరు నుంచి ఈ నేతకు ఆ పేరు వచ్చింది. ఇది ముందుగా ఇంటి ముందు కాళ్లు తుడుచుకొనే పట్టాలని నేసేవారు. రగ్గులను కూడా ఇప్పుడు నేస్తున్నారు. మందమైన దారాలతో, సంక్లిష్టమైన డిజైన్‌లతో ఈ కలనేతను చూడొచ్చు.
sarees13

ఉత్తరప్రదేశ్ చికన్‌కారీ

ఈ డిజైన్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో కూడా చాలా ఫేమస్. లక్నోలో ఈ డిజైన్‌ని వేస్తారు. నూర్జహాన్ కాలంలో దీనికి ఎక్కువ ఆదరణ ఉండేది. కాటన్ వస్ర్తానికి బ్లాక్ ప్రింట్ వేయించి.. దాని మీద నుంచి దారంతో వేసే అల్లిక బట్టలకు ఆకర్షణగా నిలుస్తుంది. పేస్టల్, ముదురు రంగుల్లో వచ్చే వర్క్ మరింత అందంగా కనిపిస్తుంది.

642
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles