ఇవి.. పిల్లలు రాసిన పుస్తకాలు


Sun,July 21, 2019 02:22 AM

books
నేటి బాలలే రేపటి పౌరులు అన్నది అందరమూ అంగీకరించేది. అలాగే నేటి బాలల సాహిత్యమే రేపటి భవిష్యత్తు సాహిత్యం అని కూడా అంగీకరించవలసి ఉన్నది. ఒక మంచి విత్తనం నాటకుండా మంచి ఫలా లను ఆశించలేం. అందుకే పిల్లలను అన్ని విధాలా తీర్చిదిద్దడంలో, సుందర భవిష్యత్తును నిర్మించడంలో బాల సాహిత్యం కీలకమైన పాత్ర వహిస్తున్నది. బాలసాహిత్యం బలంగా ఉంటేనే, అది దేశంలోని బాల బాలికలందరికీ విరివిగా అందితేనే దేశం నైతికంగా, విజ్ఞానపరంగా ముందుకు వెళుతుంది. అయితే ఒకప్పుడు బాలసాహిత్యం అంటే పెద్దలు పిల్లల కోసం రాసిన సాహిత్యంగా ఉండేది. కానీ కాలం మారింది. నేటి బాలల్లో సృజనశీలత పాలు కొంత ఎక్కువే. అందుకే తమ సాహిత్యాన్ని తామే సృష్టించుకుంటున్నారు. కథలు, పాటలు, కవితలు, పొడుపుకథలు ఒక్కటేమిటీ? సాహితీ ప్రక్రియలన్నింటిలోనూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. కేవలం రాయడమే కాదు తమ కళకు పుస్తకరూపమిచ్చి రేపటి సాహితీ ప్రతినిధులుగా తమను తాము నిరూపించుకునే ప్రయత్నమూ చేస్తున్నారు.
books1
పిల్లలకు తమ సొంత వ్యక్తిత్వం ఉంటుంది. వయసుతో పాటు వ్యక్తిత్వమూ పెరుగుతూ వస్తుంది. కుటుంబ పరిస్థితులు, వాతావరణమే పిల్లల స్థితిగతులను మారుస్తుంది. కోపం, ద్వేషం, సంతోషం అన్ని భావనలు వారి దగ్గరే ఉంటాయి. పిల్లలేమీ నిర్జీవ వస్తువులు కాదు. నేటి బాలలే రేపటి పౌరులు. పుస్తకం పిల్లల భవిష్య త్తును తీర్చిదిద్దేదిగా ఉంటుంది. కాబట్టి పిల్లలతో పుస్తకం అనుబంధం నిరంతరంగా సాగాలి. ప్రస్తుత సమాజంలో ఎంతసేపు చదువు చదువు అంటూ బాలలను యంత్రాలుగా మార్చేస్తున్నారు. చిన్నతనం నుండే నువ్వు డాక్టర్ కావాలి, ఇంజినీరు కావాలి అంటూ పెద్దలు తమ ఇష్టాయిష్టాలను పిల్లలపై రుద్ది, వారికి విచక్షణా జ్ఞానాన్ని, వివేకాన్ని రానివ్వకుండా చేస్తున్నారు. వారికి కళల్లో ప్రవేశం కల్పించాలంటే కేవలం అశ్లీల పాటలకు పిల్లలతో నృత్యాలు చేయించడం తప్ప మరో మార్గాన్నే ఎంచుకోవడం లేదు. ఇది ఎంతో బాధాకరమైన అంశం. శాస్త్రీయ జ్ఞానానికి దూరం చేసేలా అభూత కల్పనలను బోధిస్తూ వారికి వారిపైనే అపనమ్మకాన్ని , అభద్రతా భావాన్ని పెంచి పోషిస్తున్నారు. ప్రస్తుత సమాజం బాలలకు ఏమాత్రం సురక్షితంగా లేదు. ఆంగ్ల మాధ్యమ ప్రాధాన్యం పెరిగిన తర్వాత అసలు పిల్లల్లో సృజనాత్మక కార్యకలాపాల పట్ల అవగాహన కల్పించడమే మానేశారన్నది వాస్తవం. వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్, పాటలు, శాస్త్రీయ నృత్యాలు, ఆటలు, కథ, కవిత వంటివి పిల్లల్లో సామాజిక సృజనను పెంపొందించే అంశాల ఊసే లేదన్నది నిర్వివాదాంశం. అయితే అదే సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం ఉండడం స్వాగతించాల్సిన అంశం. గడచిన ఏడెనిమిదేళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సాహిత్యపరిమళాలను వికసింపజేయడంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విరివిగా కృషిచేస్తున్నారు.

2 వేల ఏండ్ల కిందటే..

బాలసాహిత్యం చరిత్రకు పూర్వమే వర్థిల్లింది. తొలుత మౌఖికంగా పాటలు, గాథలు, దేవతా కథల రూపంలో ప్రారంభమైంది. మన దేశంలో రెండువేలయేళ్ళకు పూర్వమే పంచతంత్ర, భేతాళ కథల్లాంటి పిల్లల కథలు ప్రాంతీయ భాషల్లో నీతికథలుగా గుర్తింపు పొంది ఆ తరువాతి కాలంలో సంస్కృత భాషలోకి అనువాదం పొందినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. పదిహేడో శతాబ్దం వరకూ ఐరోపాలో పిల్లల కథల్ని వారికి మతసంబంధైన నైతిక క్రమశిక్షణ నేర్పడానికి వినియోగించారు. ఇంగ్లండులో క్రీ.శ. 1690 ప్రాంతాల్లో జాన్‌లాక్, 1740లో ఫ్రాన్స్‌లో రూసో తెచ్చిన భావ విప్లవంతో పిల్లలను ప్రత్యేకంగా చూడటం, వారి ఆనందం కోసమూ మానసిక అభివృద్ధి కోసమూ తగిన బాల సాహిత్యం సృష్టించడం మొదలైంది. ఆ తరువాత గ్రిమ్ సోదరులు జర్మనీలో శ్రమకోర్చి పిల్లల కోసం విస్తృతంగా జానపదకథలని సేకరించి ప్రచురించాక వాటి రూపశిల్పాల ప్రయోజకత్వాన్ని గుర్తించడం జరిగి అవి బాలసాహిత్యంలో మౌలికంగా స్థిరపడ్డాయి. ఈ పద్ధతినే అనుసరిస్తూ నాగిరెడ్డి, చక్రపాణి 1947లో చందమామను తెలుగులోనూ, తమిళంలోనూ ప్రారంభించారు. తరువాత కుటుంబరావు ఈ జానపదరీతిని సంస్కరించి ఒక ప్రామాణిక శిల్పంగా అభివృద్ధి పరచి ఉన్నత శిఖరాలకు చేర్చారు. అనాదిగా వస్తున్న జానపద కథలు, పాటలను మినహాయిస్తే తెలుగులో ఉన్నతస్థాయి బాలసాహిత్యానికి కుటుంబరావు రూపొందించిన చందమామే చిరునామా. మిగతా పిల్లల పత్రికలు కూడా ఆ రూపాన్నే అనుసరించాయి.
books2

పుస్తకాల్ని మింగేసిన టెక్నాలజీ

ఆధునిక యుగం ఆరంభంలో టెక్నాలజీ పెరిగి పుస్తకానికి ఆదరణ తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా ఇంటర్నెట్ రాకతో ప్రపంచమంతా గుప్పిట్లో బంధీయై పుస్తకాల ఉసురుతీసింది. పిల్లలకు నీతికథలు, సాహిత్యాన్ని అందించిన పుస్తకాలన్నీ కనుమరుగయ్యాయి. ఉరుకులు పరుగుల జీవి తం, పోటీతత్వ విద్యవిధానం వెరసి ర్యాంకుల చట్రంలో పిల్లలు బందీలై పుస్తకానికి దూరమయ్యారు. కంప్యూటర్ గేములు, వీడియోగేములు, చాటింగ్‌లు, చిట్‌చాట్‌లు, ముఖపుస్తకాలు బాలలను ఆకర్షించి చిట్టిచిలకమ్మా, అమ్మ కొట్టిందా అని పాడుకోవాల్సిన వారిని ఓ లమ్మీ తిక్కరెగిందా? ఓళ్లంతా తిమ్మిరెక్కిందా అంటూ కుప్పిగంతులవైపు పరుగెట్టిస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని డాన్స్ బేబీ డాన్స్, జబర్దస్త్, పటాస్ వంటి డబుల్ మీనింగ్ ఆటపాటల్లో చూడాలని అనుకుంటున్నారే కానీ వారిలోని సృజనశీలతను గుర్తించి తగిన విధంగా ప్రోత్సహించాలని అనుకోకపోవడం ఆధునిక కాలపు జాఢ్యం. నిజానికి పిల్లల్ని పిల్లలుగా చూడడం కాదు. వారిని జూనియర్ సిటిజన్స్‌గా చూడాలి. ఇప్పటి పిల్లలకు ఎన్నో చిన్న చిన్న విషయాలను చెప్పేవారే లేరు. మొబైల్ వారిని అసామాజిక మనుషులుగా మార్చేసింది. చూస్తుండగానే పిల్లలు మనముందే విగతజీవులుగా మారుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది.
books3

ఆలోచింపజేయాలి

బాలల్లో విచక్షణను పెంచేందుకు, వివేకాన్ని అభివృద్ధి చేసేందుకు బాల సాహిత్యం తోడ్పడాలి. పిల్లల్లో పెరిగిపోతున్న హింసాప్రవృత్తికి సమాజమే కారణం. పిల్లలది ఎదిగీ ఎదగని వయసు. ఆ వయసులోనే మంచేదో, చెడేదో వివరించేలా సాహిత్యం ఉండాలి. బాలలకు సాహిత్యం ద్వారా మార్గదర్శనం చేసే బాధ్యత బాల సాహితీవేత్తలపై ఎక్కువగా ఉంటుంది. ఆ దిశగా చాలావరకు ప్రయత్నాలు జరిగాయనే చెప్పాలి. తెలుగులో పలువురు బాలసాహితీవేత్తలు పిల్లలకోసం కథలు, కవితలు, పొడుపుకథలు వంటివి రాయడంతో పాటు పుస్తకాలుగా తీసుకువచ్చారు. అయితే అన్ని వర్గాలకు చెందిన బాలల గురించి, వారిని ఆలోచింపజేసే సాహిత్యం బాగా పెరగాలి. బాలల హృదయాలు అక్షరాలతో మమేకం కావాలి. పరిస్థితులకు అనుగుణంగా మారేలా ఉండాలి. చెడు నుంచి పక్కకు తప్పుకునేలా ఉండాలి. జీవితంలోని ప్రతి కోణాన్ని ఎదురించేలా ఉండాలి. ఇదే బాలసాహిత్య ఉద్దేశం. కేవలం పిల్లల్ని మనోరంజకంగా చేసేది మాత్రమే కాదు. పిల్లల జీవితాన్ని ఓ కొత్త దిశలో నడిపేలా ఉండాలి.

పిల్లలూ రాస్తున్నారు

బాల సాహిత్యం అంటే కేవలం బాలల కోసం రాసేది మాత్రమే కాదు. బాలలు తమకోసం తాము రాసేది అని. ఇప్పుడు మన తెలంగాణలో అదే జరుగుతున్నది. చాలామంది పిల్లలు ఇప్పుడు ఏకంగా పుస్తకాలు రాస్తున్నారు. కథలు, కవితలు, సామెతలు, శతకాలు ఇలా అనేక ప్రక్రియల్లో తమను తాము నిరూపించుకుం టున్నారు. ఆ దిశగా ఇప్పుడు వందలాది పుస్తకాలు వచ్చాయి, వస్తున్నాయి. ఇంకా రావాలి కూడా.
books4

జక్కాపూర్ బడిపిల్లల కథలు

ఈ ఏడాది మార్చిలో సిద్దిపేట జిల్లా జక్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జక్కాపూర్ బడిపిల్లల కథలు పేరుతో కథల పుస్తకాన్ని తీసుకువచ్చారు. పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు బైతి దుర్గయ్య సంపాదకులుగా వచ్చిన ఈ పుస్తకంలో 32 కథలు కొలువుతీరాయి. ఈ కథలన్నీ కూడా నీతిని బోధించేవి, దైర్యాన్ని నూరిపోసేవి, కష్టపడితే ఫలితం దక్కుతుందని తెలిపేవి, ఎదుటివారికి మేలు చేయమని చెప్పేవే. ఈ పుస్తకాన్ని మణికొండ వేదకుమార్, పత్తిపాక మోహన్‌లు ఆవిష్కరించగా 500 ప్రతులు ముద్రించారు. వాటిలో 300 ప్రతులు విక్రయించగా, 50 ప్రతులు అమెరికాకు పంపారు. మరో 200 ప్రతులు ఆర్డర్ ఉన్నాయి. దీంతో మూడు నెలల్లోనే వెయ్యి ప్రతులతో రెండవ ముద్రణకు వెళుతుండడం విశేషం.

తడపాకల్ సాహిత్య కృషి

నిజమాబాద్ జిల్లా తడపాకల్ జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులు అలుపెరుగని సాహిత్యకృషి చేస్తున్నారు. వారు 2013 నుండే పద్య, వచన, కథ ప్రక్రియల్లో విశేషమైన ప్రతిభను కన పరుస్తున్నారు. శతక ప్రక్రియలో 3 పుస్తకాలు, వచన కవిత్వంలో 4 పుస్తకాలు, 1 కథా పుస్తకాన్ని వెలువరించారు. 2013లో బాల కవితా తరంగాలు, 2014లో చిగురుబాలశతకం, 2016లో బుడత శతకం, చిగురు కొమ్మ, 2019లో చెట్టుశతకం, 2018 లో నవకవనం, నేను కథరాసానోచ్, 2019లో పాదార్చాన పేరుతో పుస్తకాలు వచ్చాయి. వీటిలో కొన్ని జాతీయ స్థాయిలో ఉత్తమ బాలల పుస్తకాలుగా గుర్తింపు పొందగా, పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో బహుమతులు అందుకున్నారు. ఈ పాఠశాలలో 25 మంది విద్యార్థులు 500లకు పైగా పద్యాలు కంఠస్థం చేయడమే కాకుండా వందమందికి పైగా విద్యార్థులు పద్య, కవిత, కథలు రాయడంలో రాణిస్తున్నారు.

మాణిక్యాలను వెలికితీసి...

ఖమ్మం జిల్లా కలకోటలో ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న వురిమళ్ల సునంద సాహితీలోగిలి పేరుతో తను ఎక్కడ పనిచేసినా అక్కడి పిల్లల్ని సాహిత్యంలో ప్రోత్సహిస్తున్నారు. తను పనిచేసిన పాఠశాల విద్యార్థు ల్లోని సృజనాత్మకతను వెలికితీసి ఆయా ప్రక్రియల్లో పుస్తకాలు తీసుకువస్తున్నారు. 2015లో లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో చిరుఆశల హరివిల్లు కవితా సంకలనం, 2017లో ఆళ్లపాడు పాఠశాల విద్యార్థులతో ఆళ్లపాడు అంకురాలు బాలకవుల కవితా సంకలనం, 2018లో పూలసింగిడి బాలల కథా సంకలనం తీసుకువచ్చారు.

ఉపాధ్యాయుల చేయూత, పిల్లల రాత

సిద్దిపేటకు చెందిన గుండ్లరాజు అనే ఉపాధ్యాయుడు 2013లో బాలల కవితామకరందం కవితా సంపుటి, చిన్నకోడూరు జిల్లాపరిషత్ పాఠశాల విద్యార్థిని పిట్లకావ్య కావ్యమాలపేరుతో శతకాన్ని తీసుకు వచ్చారు. డా॥ వి.ఆర్.శర్మ సంపాదకత్వంలో 1996లో ఆకాశం పేరుతో బాలసాహిత్యం, బంగారు నెలవంకలు, డా॥ వాసరవేణి పరుశురాం నేతృత్వంలో చిఱ్ఱగోనె పిల్లల పాటలు, నల్లగొండ జిల్లా వట్టిమర్తి జిల్లాపరిషత్ పాఠశాల విద్యార్థులు తాము సందర్శించిన ప్రాంతాలను అభివర్ణిస్తూ రెక్కవిప్పినబాల్యం పేరుతో యాత్రాస్మృతుల పుస్తకాన్ని తీసుకువచ్చారు. కరీంనగర్ జిల్లా గంగారం పాఠశాల విద్యార్థులు కూకట్ల తిరుపతి సంపాదకత్వంలో నల్లాలపూలు కవిత్వం, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఆదర్శపాఠశాల విద్యార్థులు తీరొక్కపూలు కవితా సంకలనం, జనగామ జిల్లా పెద్దమడూర్ విద్యార్థులు భావన కవితా సంపుటి, కుమరం భీం జిల్లా రాస్పల్లి విద్యార్థులు రాస్పల్లి బాలసుధ, మిర్యాలగూడ విద్యార్థులు మిణుగురులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థులు పసిడి తెమ్మెరలు పద్యసంకలనం, సిద్దిపేట విద్యార్థులు చిట్టికలాలు- చిన్ని గళాలు బాలగేయాలు, వైరాగ్యం ప్రభాకర్ బాలప్రభలు (బాలల దినోత్సవం) ,ఒక్క అడుగు ముందుకు, జనగామ జిల్లా ధర్మకంచ ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు అమ్మ కవితా సంపుటి, సిద్దిపేట జిల్లా నర్సయపల్లి విద్యార్థులు గుళ్లపల్లి తిరుమల కాంతి కృష్ణ సంపాదకత్వంలో కాంతికిరణాలు, ఇల్లంతకుంట బడిపిల్లలు సోపాల కవిత్వం, బెగ్గారి నిర్మల గేయ తోరణము, ఖమ్మం జిల్లా బాల కవుల కవితా సంకలనం మారాకుల సవ్వడి, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ విజయలక్ష్మీ జహీరాబాద్ పిల్లల కథలు పేరుతో ఇప్పటికే మూడు సంకలనాలు తీసుకువచ్చారు.

నిజామాబాద్ జిల్లా గుండారం పాఠశాల విద్యార్థులు కాసర్ల నరేష్‌రావు, జి .ఇందిర సంపాదకత్వంలో గుండారం గువ్వలు కవితా సంక లనం వేయగా జిల్లా కలెక్టర్ రామ్మోహన్‌రావు ఆవిష్కరించారు. ఖమ్మం ఎస్‌ఆర్ డిజి స్కూల్ అక్షరసైనికులు రంగినేని సుజాతా మోహన్‌రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో కతల వాగు కతల సంకలనం, కవితల సింగిడి, పత్తిపాక మోహన్ పొడుపుకథలు గరిపల్లి అశోక్ వంటి వారు బాలసాహిత్యానికి ఎనలేని సేవలు అందిస్తున్నారు. ములుగు జిల్లాకు చెందిన తెలుగు అధ్యాపకులు వెలిదె ప్రసాదశర్మ గిరిజన విద్యార్థుల ప్రాజెక్ట్‌పనులు- పుస్తక సమీక్షలు, వారు రాసిన కవితలతో గిరిజన బాలల కవితా కౌముది పేరుతో సంకలనం తీసుకువచ్చారు. మరోవైపు బాలమనోవిజ్ఞానం తన పని తను చేసుకుపోతున్నది. దాని పరిణామం ప్రత్యక్షంగా మనమిప్పుడు చూస్తున్నాం.

మన పిల్లగాడి కథ మహారాష్ట్ర పుస్తకంలో..

మహారాష్ట్రలోని తెలుగు మాధ్యమం, ఇతర మాధ్యమాలైన ఆంగ్లం, మరాఠీ భాషల్లో విద్యనభ్యసించే తెలుగు పిల్లల కోసం అక్కడి పాఠ్య పుస్తక నిర్మి తి సమితి రెండవ భాషగా తెలుగు పుస్తకాలను సరళభారతి పేరుతో ప్రచురిస్తున్నది. ఈ పుస్తకాల్లో వ్యాస రచన బాల గీతాల తో పాటు, తెలంగాణాలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి లోకం భానుప్రసాద్ రాసిన కథకు స్థానం లభించింది. పాఠశాలలో విద్యార్థిగా పాఠాలు చదువుకుంటున్న ఒక విద్యార్థి రచన మరో ప్రాంతంలోని పాఠశాల విద్యార్థులకు పాఠంగా ప్రవేశపెట్టడం బహుశా ఇదే మొదటిది కావచ్చు. తెలుగును రెండవ భాషగా నేర్చుకుంటున్న ఎనమిదవ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన తెలుగు సరళ భారతిలో భానుచందర్ రాసిన కథను పాఠ్యాంశంగా ఉంచారు. సేంద్రియ వ్యవసాయం నేపథ్యంగా సాగిన ఈ కథలో వ్యవసాయ, గ్రామీణ నేపథ్యం ఇతివృత్తంగా కనపడుతుంది.

కవితాసక్తిని పెంచుతున్న కార్యశాలలు

ఒకవైపు సాహిత్యాభిరుచి కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థులతో వివిధ ప్రక్రియల్లో పుస్తకాలు తీసుకువస్తుంటే కేంద్ర సాహిత్య అకాడమీ, తెలంగాణ సాహిత్య అకాడమీ, బాలచెలిమె, రంగినేని ట్రస్ట్, సాహితీకౌముది, మాడభూషి రంగాచార్య స్మారక కమిటీ వంటి పలు సాహితి సంస్థలు విద్యార్థుల కోసం కథా, కవితా కార్యశాలలు నిర్వహించి వారిని ప్రోత్సహిస్తున్నాయి. రంగినేని ట్రస్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ సహకారంతో కవితల వాగు, కతల వాగు పేరుతో కార్యశాల నిర్వహించి సంకలనాలను తీసుకువచ్చింది. ఈ సంస్థ ప్రతి సంవత్సరం వివిధ ప్రక్రియల్లో రెండు రోజుల పాటు కార్యశాలలు నిరంతరం నిర్వహిస్తున్నది.ఈ ఏడాది కరీంనగర్‌కు చెందిన శ్రీ లక్ష్మీనారాయణ యువ సేవా సమితి కథ, కవితా కార్యశాల నిర్వహించింది. మిర్యాలగూడ సాహితీ కౌముది తెలంగాణ సాహిత్య అకాడమి సహకారంతో గత నెలలో బాలల కథా కార్యశాలను నిర్వహించింది. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన మంచిపుస్తకం రాష్ట్రస్థాయిలో బడిపిల్లల కథలపోటీని నిర్వహించగా 386 కథలు వస్తే అందులో 59 కథలను ఎంపిక చేసి తెలంగాణ బడిపిల్లల కథలు పేరుతో పుస్తకంగా తీసుకురావడంతో పాటు పిల్లలకు ఒక్కొక్కరికీ రూ.500 గౌరవంగా అందించారు. గోదావరిఖనికి చెందిన వసుంధర విజ్ఞాన వికాస మండలి రాష్ట్రస్థాయి బడిపిల్లలకు కవితల పోటీ నిర్వహిస్తే 200 కవితలు వచ్చాయి. వాటిలో ఐదు ఉత్తమ కవితలను ఎంపిక చేసి ఒక్కొక్కరికీ రూ.500 లతో పాటు మొమెంటో, సర్టిఫికెట్, శాలువాతో సత్కరించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రాంతాల్లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధీనంలోని నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా పిల్లల కోసం సృజనాత్మక రచనా కార్యశాలలు నిర్వహించింది. తెలంగాణలో నిజామాబాద్, అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముస్తాబాద్‌లో ఈ కార్యశాలలు జరిగాయి. ఈ సందర్భంగా బాల సాహితీవేత్త డాక్టర్ వి.ఆర్. శర్మ బంగారు నెలవంకలు పేరుతో కథల పుస్తకంగ ప్రచురించాడు. శర్మ ప్రధాన సంపాదకులుగా, బాల సాహితీవేత్త భూపాల్, పత్తిపాక మోహన్‌లు గౌరవ సంపాదకులుగా, గరిపల్లి అశోక్ సంపాదకులుగా తెలంగాణ బాల సాహిత్య పరిషత్ ప్రచురణగా ఈ బాలల కథా సంకలనం వెలువడ్డది. శర్మ నేతృత్వంలో 2000 సంవత్సరంలో చుక్కలు పేరుతో హైకూలు కూడా వెలువరించారు.

జీవన నైపుణ్యాల వేదిక బాలసభ

విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరాలంటే వారికి విద్యాబుద్దులతో పాటు అనేక నైపుణ్యాలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో వందేమాతరం ఫౌండేషన్ బాలసభను నిర్వహిస్తున్నది. ప్రతీనెలా మొదటి శనివారం ఈ సభను నిర్వహిస్తారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న వారి జీవిత చరిత్రలను, ప్రతిభలను పిల్లలకు చెప్పి వారిలో స్పూర్తినినింపడం చేయాల్సి ఉంటుంది. పాఠశాల అంటే కేవలం విద్యాబోధన మాత్రమే కాదని పిల్లల్లో జీవన నైపుణ్యాలను వెలికితీయడం కూడా అనేది ఈ సభ ఉద్దేశం. నేటి బాలలు రేపటి మహోన్నత వ్యక్తులుగా మారడానికి ఇదో గొప్ప అవకాశం. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించి, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునే సామర్థ్ధ్యాన్ని పెంపొదించడం ఈ సభ ఉద్దేశం. పిల్లల్లో ఆలోచించడం, ప్రశ్నించడం, అచరించ డం, అనేక నైపుణ్యాలను వెలికితీసే అద్భుత వేదిక బాలసభ.

అకాడమీ పురస్కారం పిల్లలకిస్తే...

బాలసాహిత్యాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ 2010నుండి బాల సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నది. ప్రతీ ఏడాది గుర్తించిన భాషల్లో వచ్చిన అత్యున్నత స్థాయి బాల సాహిత్యానికి ఈ పురస్కారం లభిస్తుంది. కొన్ని సందర్భాలలో రచయిత బాలసాహిత్యానికి చేసిన సేవ, బాలసాహిత్యరంగంలో వారి కృషిని మొత్తంగా పరిగణనలోకి తీసుకుని పురస్కారాన్ని అందిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పెద్దవాళ్లు రాసిన బాలసాహిత్యానికే పురస్కారాలు లభించాయి. ఇక మీదట వీటిని బాలలకు ఇవ్వగలిగితే వారిలో రాయలన్న ఆకాంక్ష మరింత పెరుగుతుందన్నది సాహితీవేత్తల అభిప్రాయం.

బాల సాహిత్యం ఒక సామాజిక ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది. అయితే ఈ బాలసాహిత్యం పట్టణ ప్రాంతాల్లో అంతగా ఆదరణకు నోచుకోవడం లేదన్నది నిజం. ఆంగ్లమాధ్యమ ప్రభావం, టెలివిజన్‌లు, స్మార్ట్‌పోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ల మాయలో పట్టణ ప్రాంత విద్యార్థుల్లో సృజనాత్మకత కరువై ఆయా కమ్యూనికేషన్ వ్యవస్థవారిని అడ్డదారుల్లోకి నెడుతుంటే గ్రామీణ ప్రాంతాల బాలలు ఎక్కువగా బాల సాహిత్యాన్ని ఇప్పటికీ ఆభిమానిస్తున్నారు. వారికి దానిని మరింత అందుబాటులోకి తీసుకెళ్లాలి. అప్పుడే ఆ సాహిత్య ప్రయోజనం నెరవేరినట్టు.
books5

ప్రోత్సహించేవారుండాలి

పిల్లల్ని ప్రోత్సహించే టీచర్స్ ఉంటే క్రియేటివిటీకి ఆస్కారం ఉంటుంది. ఒకప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు కథలు పిల్లలకు కథలు చెప్పేవారు. దానివల్ల వారిలో నేర్చుకోవాలనే ఆసక్తి ఉండేది. నేటి పిల్లలకు ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో పిల్లలు సోషల్‌మీడియావైపు చూస్తున్నారు. మంచిని నేర్చుకోవలసిన వయస్సులో చెడు లక్షణాలను అలవర్చుకుంటున్నారు. ఎక్కడైతే ఎంకరేజ్ ఉంటుందో అక్కడే పిల్లలు కొంత వరకు సాహిత్యంలో రాణించగలుగుతున్నారు. అయితే ఇప్పటికీ జరగాల్సినంత అభివృద్ధి మాత్రం జరగలేదనే చెప్పాలి. మేం గడచిన పదేళ్లుగా మన లైబ్రరీ పేరుతో ప్రతి ఏడాది విద్యార్థులకు కార్యశాల నిర్వహిస్తున్నాం. మాది సరిహద్దులో ఉండడం వల్ల ఇక్కడి పిల్లలు రాసిన కథలను వారి కోసం తెలుగు, ఉర్ధూ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో పుస్తకాలు వేస్తున్నాం. ఇప్పటికీ జహీరాబాద్ పిల్లల కథల పేరుతో మూడు సంకలనాలు తీసుకువచ్చాం.
- డా॥ ఏ. విజయలక్ష్మి, ప్రముఖ వైద్యురాలు, మన లైబ్రరీ వ్యవస్థాపకురాలు. జహీరాబాద్
books6

బాలలతోనే రాయించాలి

బాలసాహిత్యం అంటే నా ఉద్దేశం బాలలతోనే రాయించేదే బాలసాహిత్యం. వాళ్ల ఆలోచన విధానానికి పెద్దవారి ఆలోచన విధానానికి చాలా తేడా ఉంటుంది. అందుకే పిల్లలను ఎంకరేజ్ చేసి వారిచేత రాయించాలన్నదే నా అభిప్రాయం. మాడభూషి రంగాచార్య స్మారక కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పిల్లలకు వర్క్‌షాపులు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా కథ అంటే ఏంటీ? ఎలా రాయాలి? వంటి అంశాల మీదా శిక్షణనిస్తున్నాం. తర్వాత వారు ఎంతవరకు నేర్చుకొన్నారో తెలుసుకునేందుకు వారి అనుభవంలో జరిగిన సంఘటనలను కథా రూపంలో రాయమని ప్రోత్సహిస్తున్నాం. దీనివల్ల వాళ్లలోని క్రియేటివిటీని భయటకు తీసుకురావచ్చు. 2003 నుంచి ఈ ప్రక్రియను నిరంతరాయంగా నిర్వహిస్తున్నాం. మనం 100మందికి శిక్షణనిస్తే వారిలో కనీసం పదిమైందైన మంచి కథా రచయితలుగా ఎదిగివస్తారని ఆశీస్తున్నాం.
- మాడభూషి లలితాదేవి, కన్వీనర్, మాడభూషి రంగాచార్య స్మారక కమిటీ
books7

సర్కారు బడులు సాహితీ గనులు

బాలసాహిత్యానికి ఆదరణ తగ్గుతుంని అనుకుంటున్న దశలో బాలసాహిత్యంలో ఒక సృజనాత్మక విప్లవం ప్రవేశించింది. ఇన్నాళ్లు పిల్లలకోసం పెద్దలు రాసిన సాహిత్యం మాత్రమే మనం చదివాము. ఈ దశాబ్దిలో వచ్చిన గొప్పమార్పు పిల్లలకోసం పిల్లలే సాహిత్యాన్ని సృష్టించుకోవడం. దీనికి ప్రభుత్వ పాఠశాలలు వేదిక కావడం గొప్ప మార్పు. అలా ఇప్పటివరకు రెండు రాష్ర్టాల్లో కలపి సుమారు 148 వరకు బాలల పుస్తకాలు వివిధ ప్రక్రియల్లో పురుడుపోసుకున్నాయి. మరో రెండు ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నాయి. 2018లో 18 పుస్తకాలు, 2019లో 22 పుస్తకాలు రాగా వాటిలో 2018లో 13, 2019లో 12 పుస్తకాలు తెలంగాణ నుండే వచ్చాయి. మరో ఐదు ప్రింటింగ్‌దశలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పిల్లలు తమకోసం తాము రాసుకున్న పుస్తకాలే. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఆర్థిక వనరులను సమకూర్చడం లేదా అచ్చువేయించడం మూలంగా ఉపాధ్యాయులే సంపాదకులుగా ఈ పుస్తకాలన్నీ రూపుదిద్దుకున్నాయి. మరికొన్ని వివిధ సామాజిక, సాహితీ సంస్థలు, సాహిత్యాభిలాష కలిగిన వ్యక్తులు అచ్చువేయించినవి.
books8

కార్యశాలలు నిర్వహించాలి

మునుపు బాలసాహిత్యం అంటే పెద్దలు పిల్లలకోసం రాసే సాహిత్యం. కానీ ఇప్పుడు దాని అర్థం మారిపోయింది. ఇప్పుడు బాలలే గొప్ప సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. వారిలో కలిగే గొప్ప ఆలోచనలకు అక్షరరూపం ఇస్తున్నారు. నేర్చుకునే దశ నుండి తమను తాము ఆవిష్కరించుకునే దిశగా ప్రయాణిస్తున్నారు. ఎంతో చక్కటి కథలు, కవితలే కాదు, శతకాలు రచిస్తున్నారు. ఇది నిజంగా గొప్ప పరిణామం. తమలోని ప్రతిభను గుర్తించి ముందడుగేస్తున్న ఈ కొత్త తరాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ప్రభుత్వం వారి ప్రతిభను గుర్తించి, అన్ని విధాలుగా చేయూతనందించాలి. వీరిలోని ప్రతిభను వెలికితీసేందుకు వారి సామర్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు కథా కార్యశాలలు నిర్వహించాలి. అప్పుడు ఈపసిడికలాలు తమ సాహిత్యంతో ఈ నేలను సాహిత్యానికి చిరునామాగా మారుస్తాయనడంలో సందేహం లేదు.
- డా॥ సిరి, బాలసాహితీవేత్త, మిర్యాలగూడ.
books9
books10

మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

790
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles