వర్షారవిందం


Sun,July 21, 2019 01:55 AM

rain
లోయలు, సెలయేర్లు, పచ్చదనాన్ని నింపుకొన్న ప్రదేశాలు. వాన చినుకులు ఆ ప్రాంతాలతో ప్రేమలో పడ్డాయా అన్నట్టుగా కనిపించే ప్రాంతాలు. మబ్బులను ముద్దాడే గ్రామాలు, ప్రకృతి రమణీయతను కడుపులో దాచుకున్న వర్షారవిందాలు . ఏడాదంతా ముసురు దుప్పటి కప్పుకొని తడిసిపోయే ఈ ఊర్లలో ఊహకు అందని ప్రకృతి రమణీయత కనిపిస్తుంటుంది. ఎంత వర్షం పడినా సతమతం అవుతున్న పరిస్థితులే కనబడవు. ప్రకృతి వైవిధ్యానికి, పర్యాటక ప్రాంతాలకు, శ్రమైక జీవన సౌందర్యానికి నెలవుగా ఉంటాయి. నిత్య వానాకాలంగానే అనిపించే ఆ ప్రాంతాలు పర్యాటకులకు సాదర స్వాగతం పలుకుతాయి..

వినోద్ మామిడాల
సెల్: 7660066469


మన దేశంలో అత్యధిక వర్షపాతం కలిగిన ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేకత, ఒక్కో జీవనశైలితో అద్భుతమైన అనుభూతుల్ని కలిగిస్తాయి. వానజడిలో తడిసిముద్దయ్యే ఈ ప్రాంతాల ప్రకృతి రమణీయతకు మనసు కొట్టుకుపోవడం ఖాయం. వాతావరణ తీవ్ర పరిస్థితులతో మనుగడకు సవాలు విసిరే ప్రాంతాల్లోను జనజీవనం యధేచ్ఛగా సాగిపోతుంది. దేశపు మాన్‌సూన్ గేట్‌వేలుగా ఈ ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి. పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల్లో ఎక్కువ వర్షంతో తడిసి ముద్దవుతాయి. ఈ ప్రాంతాల నుంచే రుతుపవనాలు దేశంలోకి వస్తాయి. కేవలం రుతుపవనాల సమయంలోనే కాదు దాదాపు ఏడాదంతా ముసురుతోనే ఈ ప్రాంతాల్లో తెల్లవారుతుంది. మాన్‌సూన్‌లో మేఘాలన్నీ మామూలుగా వర్షించినా నైసర్గిక పరిస్థితుల రీత్యా ఈ ప్రాంతాల్లో ఏడాదంతా ముసురు దుప్పటి కప్పుకొనే ఉంటుంది. చిరాపుంజీ, మాసిన్‌రామ్, అగుంబె, అంబోలీ, సితార్‌గంజ్, చాంద్‌బాలి, బుక్సా, నెరియమంగళం, చిన్న కల్లార్ వంటి ప్రాంతాలపై వర్షం తన ప్రేమను ఎక్కువ గా చూపిస్తుంది. ఏడాదంతా ఈ ప్రాంతాల్లో వర్షఛాయలే కనిపిస్తాయి. ఎప్పుడూ చిరు జల్లులతో తడుస్తూ పచ్చదనంతో వర్షారవిందాలను విరబూయిస్తాయి. ఎప్పుడూ తడారని ప్రాంతాలుగా పేరు తెచ్చుకున్న ఈ ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి.

నెరియమంగళం..

ఇండియా మున్నార్‌కు గేట్‌వేగా నెరియమంగళాన్ని పిలుస్తారు. కేరళలోని ఎర్నాకులంలో ఉండే ఈ ప్రాంతంలో ఆ రాష్ట్రంలోని అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. కొండల పక్క నుంచి పెరియార్ నది ప్రవహిస్తుంది. దక్షిణ భారత్‌లో తొలిసారిగా ఇక్కడే ఆర్చ్ బ్రిడ్జిని కట్టారు. 1935లోనే కట్టిన ఈ వంతెన ఇప్పటికీ అక్కడి ఎత్తు ప్రాంతాలకు అనుసంధానం చేస్తుంది. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి నిర్మించిన రాణికల్లు కట్టడం కూడా ఇక్కడ ఉంది. చిన్నపాటి టౌన్ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. 16 వేలకు పైగా జనాభా ఉంటుంది. జవహర్ నవోదయ పాఠశాల కూడా ఉంది. ఇక్కడి ప్రజలు వ్యవసాయ ప్రధాన వృత్తులు చేస్తుంటారు. అక్కడి ప్రకృతికి సరితూగేలా ఉంటుంది వారి జీవనశైలి. ఇళ్లు పెద్ద పెరళ్లతో అందంగా ఉంటాయి. పలు రకాల పూలు, కూరగాయలను ఇళ్లలోనే పెంచుకుంటారు. అయితే ఎప్పుడు ముసురు పట్టినట్టు ఉండకపోవడం ఒక అనుకూలత. దట్టమైన అటవీ ప్రాంతంలోను వేరే ప్రాంతాలకు కలిపే దారులు ఉంటాయి. ఇక్కడ ప్రధాన ఆకర్షణ చీయప్పర జలపాతం. ఏడు మెట్లుగా జాలువారే ఈ జలపాతం ఆకాశం నుంచి నేలకు దిగుతున్నట్టు ఉంటుంది.
rain2

అగుంబె

దక్షిణ చిరపుంజిగా అగుంబెకు పేరుంది. ఇది కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణిలో మాల్నాడ్, శరావతి లోయల మధ్య కనిపిస్తుంది. పర్యాటకులకు స్వర్గధామమైన ఈ ప్రదేశం పాము మెలికలు తిరిగే ఘాట్ రోడ్డులు, ఎక్కడో లోయల్లో చెల్లాచెదరుగా కనిపించే గ్రామాలు, ఎటుచూసినా మబ్బుల్ని తాకే కొండలు, భూమిలోకి చొచ్చుకుపోయినట్టుండే లోయలతో ఓ వింతైన ప్రయాణ అనుభూతిని కలిగిస్తుంది ఈ ప్రాంతం. అంతా దట్టమైన అడవి విస్తరించి ఉంటుంది. ఎన్నో సుందర జలపాతాలతో నిండిన ఈ ప్రాంతంలో నల్లతాచులు ఎక్కువ ఉంటాయి. కింగ్ కోబ్రా జన్మస్థలంగా కూడా అగుంబెను పిలుస్తారు. భూమధ్య రేఖకు సమీపంగా ఉండే దక్షిణ భారత్‌లో అత్యంత చల్లనైన ప్రదేశాల్లో ఇది ఒకటి. స్థానికులు ఈ పరిస్థితులకు అలవాటు పడి జీవిస్తున్నారు. అయితే ప్రధాన నివాస ప్రాంతమంతా వర్షారణ్యానికి ఆనుకొని ఉంటుంది. అరణ్యంలో కొన్ని సమూహాలు మాత్రమే కనిపిస్తాయి. వారు వర్షాకాలంలో ప్రధాన గ్రామంలో తలదాచుకుంటారు. అటవీ ఉత్పత్తులతో పాటు వ్యవసాయాధారిత ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తారు. రోడ్డుకిరువైపులా పెంకు కప్పుకున్న ఇండ్లు ఉంటాయి. ఇవి ప్రత్యేక నిర్మాణ శైలిని కలిగి ఉంటాయి. అన్నీ తక్కువ ఎత్తు నిర్మాణాలే. రెండంతస్తుల ఇండ్లు అరుదుగా ఉంటాయి. ఈ జనావాసాల్లోకి వెచ్చదనం కోసం నల్లతాచులు తరచూ చొరబడుతుంటాయి. వీటిని స్థానికులు దైవంగా కొలుస్తుంటారు. వీటి మనుగడ తేలికవడానికి ఇదే ప్రధాన కారణం. దీంతో పాటు ఇక్కడ పర్యాటకులకు, పరిశోధకులకు తక్కువ రుసుముకే వసతి దొరుకుతుంది. కుంచికల్, బార్కానా, ఒనాకె అబ్బి, జోగి గుండి, కూడ్లు తీర్థం వంటి జలపాతాలు అబ్బురపరుస్తాయి.
rain1

అంబోలి

మహారాష్ట్రలోని బెల్గామ్ నుంచి గోవా జాతీయ రహదారిలో అంబోలిని చేరుకోవచ్చు. ప్రకృతిలోకి మార్గం వేసిన ఈ జాతీయ రహదారి ప్రయాణాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఓ స్వచ్ఛమైన పల్లెటూరిని చూడాలనుకుంటే అంబోలి చూడాల్సిందే.. మనోహరమైన కొండల మాటున, పచ్చని అడవి కిందున అంబోలి గ్రామంలో కచ్చితంగా ఆగాల్సిందే. వ్యవసాయాధారిత జీవన విధానంలోని అద్భుతం ఇక్కడ సాక్షాత్కరిస్తుంది. అక్కడక్కడ విసిరేసినట్టుండే ఇండ్లు, విశాలమైన వాకిళ్లు, పాడి సంపద, గడ్డివాములు.. దట్టమైన అడవి, పొగమంచులా పరుచుకునే ముసురు కనువిందుచేస్తాయి. జీవితాంతం వదలని జ్ఞాపకాలు ఆ విహారం నుంచి వెంటవస్తాయి. సహ్యాద్రి శ్రేణుల్లో విలాసాన్ని ఒలికే ఈ ప్రాంతం జలపాతాల స్వర్గధామం. ఘాట్ల వెంటే చాలా చిన్నచిన్న జలపాతాలు పారుతుంటాయి. ఇక్కడ అడుగిడగానే ఎదురయ్యే అనుభూతి... ఎటుచూసినా పొగమంచు తప్ప మరేమి కనిపించదు. ఒక్కసారిగా మబ్బులు అలముకుని చీకట్లు కమ్ముకోవడం ఇక్కడ సర్వసాధారణం. లెక్కలేనన్ని జలపాతాలున్న ఈ ప్రాంతంలో ఆర్కిడ్ పూలు మనల్ని సమ్మోహితుల్ని చేస్తాయి. పచ్చగా మెరిసే నాచు చెట్లను కూడా వదలదు.
rain3

మాసిన్‌రామ్, చిరపుంజి

మేఘాలయలోని ఖాసీ కొండల్లో మాసిన్‌రామ్, చిరపుంజిలు పర్యాటక ప్రాంతాలు. చాలా సమీపంలో విస్తరించి ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత అధిక వర్షపాతం నమోదయ్యే కేంద్రంగా మాసిన్‌రామ్ పేరు గాంచింది. ఆరు నెలలు వర్షంతోనే పడిశం పట్టినట్టు తడిసి ముద్దవుతాయి ఈ ప్రాంతాలు. భీకర స్థాయిలో కుంభవృష్టిలా వర్షం తన ప్రతాపాన్ని చూపిస్తుంది.కొన్ని రోజులు సూర్యుడు కూడా కనిపించడు. ఇంటి వాకిళ్లు పాడైపోవడం ఇక్కడ సర్వసాధారణం. మేఘాల గర్జన వినబడకుండా ఇంట్లో ఏర్పాట్లు చేసుకుంటారు. ఇంటి పైకప్పు పాడవకుండా టార్ఫాలిన్ పట్టాలతో, గడ్డితో కప్పుతారు. ఆరు నెలలకు సరిపడా సరుకులు అన్నీ ముందే నిల్వచేసుకుంటారు ఇక్కడి ప్రజలు. వర్షారణ్య ఉత్పత్తులను అమ్మి ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తారు. ఇక్కడి నుంచే చీపుళ్లు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. క్నప్ అనే వెదురు గొడుగులు ఇక్కడ వాడకంలో ఉంటాయి. పనికి వెళ్లే వారు వీటిని ధరించి వెళ్తారు. శరీరాన్ని అంతటినీ కప్పేసి వర్షం నుంచి రక్షిస్తాయి. వర్షాకాలంలో ఇళ్లలోనే ఉండిపోయే మహిళలు ఇక్కడి సాంప్రదాయ టార్టాన్ శాలువాలు నేస్తారు. షిల్లాంగ్‌కు దగ్గర్లో ఉండే ఈ ప్రాంతంలో మాజింబుయిన్ గుహలు సందర్శనీయం.
rain4

చిన్నకల్లార్

తమిళనాడు కోయంబత్తూర్ దగ్గరలో చిన్నకల్లార్ ఉంటుంది. ఈ ప్రాంతంలో జనసాంద్రత అత్యల్పం. స్థానికుల ప్రధాన ఆదాయ వనరు తేయాకు తోటల పెంపకం. కొండ వాలున ఉండే ఈ తోటలు అడవికి చాలా దగ్గరగా ఉంటాయి. చాలా వరకు గ్రామస్థులు చిన్న చిన్న గడ్డి ఇళ్లలో నివసిస్తుంటారు. అవి కూడా కొండ లోయల్లో అక్కడక్కడ చిన్న చిన్న సమూహాలుగా కనిపిస్తుంటాయి. ఆధునిక ఛాయలు అంతంత మాత్రమే. వ్యవసాయం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నది. ఆర్గానిక్ ఫార్మింగ్ అనే మాటను వాడకుండానే ఇక్కడ సేద్య పద్ధతులు అవలంభిస్తారు. వర్షాకాలంలో రహదారులపై కూడా చిన్నపాటి వాగుల్లా నీరు కదులుతుంది. ఎక్కువగా వేరే ప్రాంతాల నుంచే తేయాకు తోటలకు పనులకు వస్తారు. ట్రెక్కింగ్ కోసం వచ్చే పర్యాటకులకు ఖాళీ ఇళ్లే దర్శనమిస్తాయి. ఓ రకంగా వింతైన అనుభవం ఎదురవుతుంది. ఎన్నో ప్రకృతి అందాలను ప్రోది చేసుకున్న ఈ ప్రాంతంలో ప్రయాణమే ఓ మధురానుభూతిని మిగులుస్తుంది. చిన్నకల్లార్ మీదుగా సాగే మార్గంలో పరాంబికులమ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఎగువ నిరార్, షోలయార్ డ్యామ్‌ల కనువిందు చేస్తాయి. అనైమలై కొండల్లో ఉండే ప్రాంతంలో తేయాకు తోటలు విస్తారంగా కనిపిస్తాయి. ఇక్కడ జలపాతాల నీరు చాలా వడిగా పడుతుంది. సింహగర్జనలా ఉంటుంది వాటి శబ్దం.
rain5

690
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles