సాక్ష్యం


Sun,July 21, 2019 01:44 AM

CRIME-STORY
అతను కిటికీలోంచి ఫైర్ ఎస్కేప్ మెట్లమీదికి వెళ్ళి కిందికి దిగాడు. కొద్ది దూరంలో పార్క్ చేసిన కారు దగ్గరకి వెళ్ళి ఎక్కాడు. టై, హేట్, జాకెట్ విప్పి వెనక సీట్లో పడేసాడు. అక్కడినించి 110 మైళ్ళ దూరంలోని డైసన్ ఇంటివైపు కారుని పోనిచ్చాడు.

గిల్బర్ట్ పోలీసులకి పరిచితమైన నేరస్థుడే. అనేక కేసుల్లో అతను వారి ముందు హాజరయ్యాడు. కొన్ని కేసుల్లో శిక్షలు కూడా పడ్డాయి. అతను హింసకి పాల్పడడు. చదువుకున్న వాడిలా కనపడే గిల్బర్ట్ మోసగాడు. అలా మూడు లక్షల డాలర్లు సంపాదించి ఉంటాడని పోలీసుల అంచనా. అతని తోడుదొంగ డైసన్.
వారిద్దరిలో గిల్బర్ట్ తెలివైన వాడు కాబట్టి పథకాలను రచిస్తుంటాడు. డైసన్ హింసాత్మకంగా ప్రవర్తించకుండా అపుతుంటాడు. కారణం గిల్బర్ట్‌కి హింస పడదు. ఐతే, ఆ రోజు గిల్బర్ట్ తన హోటల్ గదిలోని మంచం మీద పడుకుని హింస విషయంలో తన నియమాన్ని సడలించాలని నిశ్చయించుకున్నాడు. ఇటీవల వారు మోసపూరితంగా సంపాదించిన లక్షా ఇరవై వేల డాలర్లలో డైసన్ తొంభై వేలు తీసుకుని ముప్పయి వేలే గిల్బర్ట్‌కి ఇచ్చాడు. జూదంలో పోగొట్టుకోగా మిగిలింది ముప్పయి వేలే అని చెప్పాడు. డైసన్ అబద్ధం చెప్తున్నాడని, ఆ డబ్బుని ఎక్కడో దాచాడని గిల్బర్ట్ నమ్మాడు. తన డబ్బు తనకి ఇవ్వమని గట్టిగా అడిగినా డైసన్ అదే పాట పాడసాగాడు.
గిల్బర్ట్ తన పథకాన్ని రూపొందించుకున్నాక మంచం దిగి తన పాకెట్ బుక్‌లోని చిరునామాని ఓసారి చదువుకున్నాడు. మిషిగన్ బుల్ వార్డ్‌లోని రన్‌కార్న్ అపార్ట్‌మెంట్స్‌కి చేరుకున్నాడు. గ్లోరియా అని రాసున్న పేరుకింది బటన్‌ని నొక్కాడు.
ఎవరది? ఆమె కంఠం వినిపించింది.

గిల్బర్ట్. నిన్ను అర్జెంట్‌గా కలవాలి.
గ్లోరియా మీట నొక్కి తలుపు తెరవగానే మేడ మెట్లెక్కి ఆమె అపార్ట్‌మెంట్‌కి చేరుకున్నాడు. నైట్ క్లబ్‌లో డ్యాన్సర్‌గా పని చేసే ఆమెకి డబ్బు పిచ్చి. తక్షణం డబ్బుగా మార్చుకోగల వజ్రాలు, ముత్యాలు, బంగారం లాంటివంటే ఇష్టం.
ఏమిటంత అర్జెంట్ పని? ఆమె ఓ గ్లాసులో విస్కీ పోసి అతనికి అందిస్తూ అడిగింది.
వెయ్యి డాలర్లు సంపాదించడం మీద నీకు ఆసక్తి ఉందా? అడిగాడు.
చాలా. ఏం చెయ్యాలి? ఆసక్తిగా ముందుకి వంగి అడిగింది.
రెండు చిన్న పనులు. రేపు రాత్రి నేను ఓ పనిమీద బయటికి వెళ్తాను. కాని, రేపు రాత్రి ఎనిమిది నించి తెల్లారు ఝామున రెండు గంటల దాకా నీ అపార్ట్‌మెంట్‌లో ఉన్నానని ఎవరడిగినా చెప్పాలి.

దీనికి వెయ్యి డాలర్లా?
అవును. ఇది నీకు అత్యంత తేలికైన పని.
ఆ సమయంలో ఎక్కడ ఉంటావు? గ్లోరియా ప్రశ్నించింది.
మన మధ్య ఒప్పందంలోని రెండో చిన్న పని ప్రశ్నలు అడక్కపోవడం గిల్బర్ట్ నవ్వుతూ అన్నాడు.
సరే. ఎప్పుడు ఇస్తావు?
ఇప్పుడు సగం. మిగిలింది పనయ్యాక.
ఆమె ఒప్పుకున్నాక అతను వెయ్యి డాలర్లు చూపించి సగం ఇచ్చి చెప్పాడు-
ఎల్లుండి ఉదయం మిగతాది ఇస్తాను.
సరే. కానీ, నువ్వు నన్ను నమ్మవా గిల్బర్ట్? గ్లోరియా అడిగింది.
కొంత దాకానే. అనవసరపు రిస్క్ తీసుకోను. రేపు రాత్రి ఎనిమిదికి నీ దగ్గరకి వస్తాను. ఎనిమిది నించి తెల్లారు ఝామున రెండుదాకా నీ దగ్గర ఉంటానని నీ ఫ్రెండ్స్ అందరితో కూడా చెప్పు కోరాడు.
***

మర్నాడు సాయంత్రం గిల్బర్ట్ గోధుమరంగు హేట్, చెక్స్ జాకెట్ వేసుకొని గ్లోరియా ఇంటికి బయలుదేరాడు. తనను చూసిన వాళ్లు గుర్తుంచుకొనే గాడీ డ్రెస్ అది. తను బస చేసే హోటల్ రిసెప్షనిస్టుతో బయటికి వెళ్తూ చెప్పాడు-
రాత్రి తొమ్మిదికి డెట్రాయిట్ నుంచి నాకో ముఖ్యమైన ఫోన్ కాల్ రావచ్చు. వాళ్లకు మాత్రం నేను రన్‌కార్న్ అపార్ట్‌మెంట్స్‌లోని మిస్ గ్లోరియా అపార్ట్‌మెంట్ 112లో ఉన్నానని చెప్పండి. ఇంకెవరు అడిగినా బయటకు వెళ్లానని మాత్రమే చెప్పండి. గుర్తుంటుందా? కన్ను కొట్టి ఇరవై డాలర్ల నోటును టిప్‌గా ఇచ్చాడు.
తర్వాత హోటల్ లాబీలోని ఫ్లవర్ షాప్‌లోకి వెళ్లి పొడుగాటి కాడలుగల ఏడు డజన్ల అమెరికన్ బ్యూటీ రోజెస్‌ను కొన్నాడు.
కార్డ్‌మీద టు గ్లోరియా విత్ లవ్-గిల్బర్ట్ అని రాయండి కోరాడు.
ఇంతదాకా ఎవరూ ఏడు డజన్ల గులాబీలని ఒక్కసారి కొనలేదు. ఆమెని మీరు బాగా ప్రేమిస్తూండాలి షాపతను వాటిని ఇస్తూ నవ్వుతూ చెప్పాడు.
హోటల్ బయట టేక్సీ ఎక్కి అమె అపార్ట్‌మెంట్ అడ్రస్ చెప్పాడు. గమ్యం చేరుకున్నాక టేక్సీ దిగి అతనికి ఏభై డాలర్ల నోట్ ఇచ్చి చెప్పాడు, చిల్లర ఉంచుకో. కర్టెసీ. మిస్టర్ గిల్బర్ట్.
తనకి కొంత ఖర్చయినా హోటల్ రిసెప్షనిస్ట్, ఫ్లోరిస్ట్, టెక్సీ డ్రైవర్... ముగ్గురూ తనని గుర్తుంచుకుంటారని భావించాడు. అది కనీస ఖర్చు అనుకున్నాడు.
అతను తెచ్చిన గులాబీలని చూసిన గ్లోరియా సంతోషంగా అడిగింది.

నా కోసమేనా?
అవును.
ఇవి తెచ్చే బదులు దీని కోసం ఖర్చు చేసిన డబ్బుని కవర్లో పెట్టి ఇస్తే బావుండేది అయిష్టంగా చెప్పింది.
గిల్బర్ట్ మౌనంగా జేబులోంచి ఓ పెట్టె తీసి ఆ రోజు తను తాగిన సిగరెట్ పీకలని అందులోంచి తీసి ఆ అపార్ట్‌మెంట్‌లోని అన్ని గదుల్లోని ఏష్ ట్రేలలో పోసాడు. గ్లోరియాని విస్కీ ఇవ్వమని ఆ గ్లాస్‌మీద వేలిముద్రలు వేసాడు. ఆ తర్వాత అనేక చోట్ల తన వేలిముద్రలు పడేలా చేసాడు. తన పేరు మోనోగ్రామ్‌ని చేసిన ఓ గ్లవ్‌ని బాత్‌రూమ్‌లో అద్దం ముందు ఉంచాడు.
గిల్బర్ట్. నువ్వు మేథావివి ఆమె మెచ్చుకోలుగా చెప్పింది.
నువ్వు గుర్తుంచుకోవాల్సిందల్లా నేను ఇక్కడ ఉన్నానని ఎవరడిగినా చెప్పడం. అది బుర్రలోకి ఎక్కించుకో. దీన్ని ఎవరూ ఖండించే పని మాత్రం చేయకు. గుడ్ నైట్.
అతను కిటికీలోంచి ఫైర్ ఎస్కేప్ మెట్లమీదికి వెళ్ళి కిందికి దిగాడు. కొద్ది దూరంలో పార్క్ చేసిన కారు దగ్గరకి వెళ్ళి ఎక్కాడు. టై, హేట్, జాకెట్ విప్పి వెనక సీట్లో పడేసాడు. అక్కడినించి 110 మైళ్ళ దూరంలోని డైసన్ ఇంటివైపు కారుని పోనిచ్చాడు. పది ముప్పావుకి అక్కడికి చేరుకున్నాడు.

తలుపు కొట్టి అతన్ని నిద్ర లేపాడు. గిల్బర్ట్‌ని చూసి డైసన్ హృదయపూర్వకంగా లోపలకి ఆహ్వానించాడు.
ఏమిటిలా వచ్చావు? అడిగాడు.
బార్‌కి వెళ్తే విసుగు పుట్టి ఇక్కడో రెండు గంటలు గడుపుదామని వచ్చాను చెప్పాడు.
అలాగా? ఏం తాగుతావు?
తాగాలంటే బార్‌కే వెళ్ళేవాడ్ని. నా కడుపు అప్‌సెట్ అయ్యింది.
అతని ఇంట్లో ఏదీ ముట్టుకోకూడదని గిల్బర్ట్ ముందే నిర్ణయించుకున్నాడు. వాళ్ళిద్దరూ కొద్దిసేపు తాము ఎవర్ని ఎలా మోసం చేసిందీ మాట్లాడుకున్నారు. తర్వాత డైసన్ అడిగాడు.
నువ్వు నాతో పిచ్చాపాటి మాట్లాడటానికి ఇంత దూరం వచ్చావంటే నమ్మను. నువ్వు కొద్దిగా ఆందోళనగా కూడా కనిపిస్తున్నావు. ఏమైంది?
అది నిజమే. నాకు నచ్చిన ఓ అపార్ట్‌మెంట్ ఖరీదు లక్ష డాలర్లు. నిన్ను అడగడానికి ఇష్టం లేదు. కానీ, నాకో లక్ష అప్పు కావాలి గిల్బర్ట్ అడిగాడు.

ఇంతదాకా నువ్వు సంపాదించింది ఏమైంది?
నీకు తెలుసుగా. గుర్రాలు, ఆడాళ్ళు, జూదం.
మళ్ళీ ఓ కొత్త పథకం వేస్తే సంపాదిద్దాం. నాలాగా కనీస అవసరాలతో జీవించడం నేర్చుకోవచ్చుగా? ఐదు వేలు మించి ఇవ్వలేను.
డైసన్ లేచి వంటగదిలోని అల్మారా తెరచి, అందులోంచి ఓ కార్న్ ఫ్లెక్స్ అట్టపెట్టెని బయటికి తీసాడు. వెంటనే తన తలమీద దేంతో దెబ్బ పడిందో, మళ్ళీ మళ్ళీ ఏది తనని కొట్టిందో తెలీకుండానే డైసన్ మరణించాడు. డైసన్ కాళ్ళు, చేతులు కొట్టుకోవడం ఆగాక గిల్బర్ట్ ఒంగుని పరీక్షించి, అతను మరణించాడని తృప్తి పడ్డాడు.
తర్వాత కార్న్ ఫ్లెక్స్ డబ్బాలోని డబ్బు లెక్కపెడితే తొంభై వేల డాలర్లు! దాన్ని జేబులో ఉంచుకుని ఓసారి తన చేతి గుర్తులు ఏమైనా పడ్డాయా అని పరిశీలించి, తను ఉపయోగించిన ఇత్తడి విగ్రహాన్ని బాత్‌రూంలోకి తీసుకెళ్ళి వేలిముద్రలు పోయేలా కడిగి యథాస్థానంలో అలంకారంగా ఉంచాడు. ఆ డబ్బుని కారులోని గ్లవ్ కంపార్ట్‌మెంట్‌లో ఉంచి కారుని పోనిచ్చాడు.
రాత్రి పదకొండు ముప్పావైంది. చికాగో దగ్గరయ్యే కొద్దీ అతనిలో భయం తగ్గసాగింది. రెండుకి పది నిమిషాలు ఉందనగా నగర శివార్లకి చేరుకున్నాడు. సరాసరి గ్లోరియా ఇంటికి వెళ్ళి తన ఎలిబీ సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవాలని అనుకున్నాడు. గ్లోరియా డబ్బుకి కక్కుర్తి పడి నైట్‌క్లబ్‌కి వెళ్ళిందా? లేక విటుడ్ని పిలిచిందా? తెలుసుకోవాలని అనుకున్నాడు. కారుని వేగంగా పోనిస్తుంటే అతని కారుని ఓ పోలీస్ స్క్వేడ్ కారు ఆపింది. వారితో వాదించకుండా మంచి పౌరుడిలా వాళ్ళిచ్చిన చలాన్ తీసుకోవాలి అనుకున్నాడు.

కిటికీలోంచి లోపలకి చూసిన పోలీస్ సార్జెంట్ పెట్రోల్ కారులోని తన భాగస్వామిని పిలుస్తూ చెప్పాడు.
ఈ కారులో ఉంది ఎవరో తెలుసా? గిల్బర్ట్!
నేను పరిమితి మించని వేగంతోనే కారు నడుపుతున్నానని అనుకుంటాను. లేదా చలాన్ ఇస్తే వెళ్తాను గిల్బర్ట్ చెప్పాడు.
అది ఎటూ తప్పదు. కానీ, నువ్వు కనిపిస్తే పట్టుకోమని మా అందరికీ సూచన అందింది.
ఎందుకు? గిల్బర్ట్ ఆశ్చర్యంగా అడిగాడు.
నాకు తెలీదు. హోమిసైడ్ డిటెక్టివ్ లెఫ్టినెంట్ మార్టిన్ నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు.
ఎందుకు? నాకు అర్థం కావడం లేదు. నేను ఎవర్నీ చంపలేదు.
పోలీస్ సార్జెంట్ కారులోకి చేతిని పోనిచ్చి ఇగ్నీషన్ కీని తీసుకుని చెప్పాడు-
నీ కారుని ఉన్నచోటే ఉంచుదాం. అమాయకుడా! మా వెంట రా.
ఎందుకు? తనకి బేడీలు వేస్తూంటే గిల్బర్ట్ ఆశ్చర్యంగా అడిగాడు.

ఇది రూల్. పోలీస్ కారులో ఎక్కే ప్రతీ అనుమానితుడికీ సంకెళ్ళు వేయాలి.
అనుమానితుడా? నా మీద నేరారోపణ ఏమిటి?
లెఫ్టినెంట్ మార్టిన్ అన్ని విషయాలూ చెప్తాడు. మాకు తెలీదు.
డైసన్ శవాన్ని ఇంత త్వరగా ఎలా కనుక్కున్నారు? తను అతని ఇంటి లైట్లని ఆర్పలేదా? తలుపు సరిగ్గా మూయలేదా? తను ఏ ఆధారాన్నీ వదల్లేదు, కాబట్టి ధైర్యంగా ఉన్నాడు.
పోలీస్ స్టేషన్లో లెఫ్టినెంట్ మార్టిన్ అతన్ని అడిగాడు.
కొన్ని రొటీన్ ప్రశ్నలు గిల్బర్ట్.
తప్పకుండా. నేను దాచాల్సిందేం లేదు.
ఈ రాత్రి పదిన్నర నించి అర్ధరాత్రి దాకా ఎక్కడ ఉన్నావు?
నేను నా గర్ల్‌ఫ్రెండ్‌తో ఆమె అపార్ట్‌మెంట్‌లో ఉన్నాను.

ఎవరితో?
ఆ పేరు ఆమె అనుమతి లేకుండా చెప్పలేను.
విషయం సూటిగా చెప్తాను గిల్బర్ట్. ఓ హత్య జరిగింది. అందులో నువ్వు పీకల దాకా ఇరుక్కున్నావు.
మీరు సరైన పరిశోధన చేయకుండా నన్ను హత్యానేరంలో ఇరికించడం సబబు కాదు. హత్య జరిగిన సమయంలో నేను ఎక్కడ ఉన్నానో మీకు ఋజువు చేయగలను. చాలామంది సాక్షులు ఉన్నారు.
నువ్వు ఆ సమయంలో గ్లోరియా ఇంట్లో ఉన్నావని నేను కూడా ఋజువు చేయగలను. నిన్ను గ్లోరియా హత్యానేరం మీదే అరెస్ట్ చేస్తున్నాను. రాత్రి పదిన్నర-పన్నెండున్నర మధ్య అమె హత్యకు గురైంది. ఆమె అపార్ట్‌మెంట్‌లో దోపిడీ కూడా జరిగింది లెఫ్టినెంట్ మార్టిన్ చెప్పాడు.
(రూఫస్ బక్లోర్ కథకి స్వేచ్ఛానువాదం)

- మల్లాది వెంకట కృష్ణమూర్తి

549
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles