తిరిగొచ్చిన పానం


Sun,July 21, 2019 01:40 AM

MAIN_STORY
ఒక పెద్ద బండ మీద కూసున్నం. అందరూ డబ్బలిప్పిండ్రు. ఉప్పుడువిండి, అటుకులు, ప్యాలాలు, అన్నం కూరలు, పులిహోర, అప్పాలు, కారప్పూస, సర్వపిండి... ఇష్టమచ్చినట్టు లటలట తిన్నం. నీళ్ళల్ల ఎగిరినం. దుంకినం. అందరికి ఈతస్తది. గోదావరి నది ఖానాపూర్కు దగ్గర్నే! చిన్నప్పుడే నేర్సుకొన్నం మేమంతా. మిగిలింది కూడా తిని డబ్బాలన్నీ ఖాళీజేసినం. మంచిగా కడుక్కున్నం.

మీకు మొదట్లనే నిజం చెబుతా. ఇప్పటిమాట గాదు మరి. యాభైఏండ్ల కిందటి ముచ్చట. అప్పుడు మా ఈడు పొల్లగాల్లం ఖానాపూర్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి సదువుతున్నం. మీకు తెలని ఊరు కాదు. చిన్నది. పేరుకి తాలుఖ గని బగ్గ చిన్నది. ఆదిలాబాద్ జిల్లాలున్నది. అడవిలే అడవిలు. ఏం దొరకయ్. అన్నింటికి నిర్మలుర్కాల. ఒక డొక్కు సినిమ్మ టాకీస్. వర్షం పడ్తే ఉరుస్తది. కరెంటువోతే ఆట ఆగిపోతది. పాసులిస్తరు. తెల్లారచ్చి మల్ల మొదటికెళ్ళి సూసుడు. రెండురోజులంగడి. బుధవారం, ఆదివారం. మా అందరికి పండగ. ఊర్లే తాగుడు దుమ్ముగా. నల్లది, తెల్లది. బాగా పైసలున్నోళ్ళు బ్రాండీలు, బీర్లు. వీటితోపాటు బీడీలు, సుట్టలు. తాగుడే తాగుడు. గిసుంటి ఖానాపూర్ల ఓ పదిహేను మంది బడి పొల్లగాల్లం ఒకసారి కడెం డ్యామ్ సూద్దామని ప్లాన్ ఏసుకొన్నం. అందరు కూసోని మీటింగ్ వెట్టుకొని అచ్చే ఆదివారం పోదమని అనుకొన్నం. సైకిళ్ళు కిరాయ తీసుకోవాల. టిఫిన్లు ఎవల్లదాల్లు దెచ్చుకోవాల. అన్ని మాటలు పక్క చేసుకొన్నం.

సూడంగా సూడంగా ఆదివారం సర్రునచ్చింది. పొద్దుగాల్ల లేసి మస్తుగా తయారైనం. సైకిల్ స్టాండుకి చేరుకొని మంచి సైకిళ్ళు సూసుకొన్నం. టైర్లల్ల గాలి ఒత్తి సూసినం. గంట కిణకిణ మంటున్నదా లేదో అని కొట్టినమ్. టిఫిన్ డబ్బల్ని సైకిళ్ళకు కట్టుకున్నం. ఒక పెబ్బను ఎన్నుకొన్నం. ఆయన ఒకటి, రెండు, మూడు అనంగనే పైడిల్ కొట్టినమ్. ఈ పొల్లగాండ్లు యాడికి పోతున్నారో అని ఊర్లే అందరు మాదిక్కే సూసుడు. మేము ముందుకు సూసుకుంటా స్పీడ్‌గా తొక్కినం.
నిర్మల్-కడెం ఖానాపూర్ రోడ్లు కలిసే చౌరస్తా చేరుకొన్నం. పేరుకు చౌరస్తా గాని ఇది తీన్ రస్తానే! గట్లనే పిలుస్తరు. కుడికి మల్గినం. ఇది సర్రాసు కడెం తీస్కవోతది. అందరు మస్తు ఖుషీగా సైకిళ్ళను తొక్కుతుండ్రు. ఒకళ్లతో ఒకళ్లు పోటివెట్టినట్టు దాటుకుంట వొతున్నరు. నవ్వుకుంటున్నరు. బాలెన్స్ తప్పుతున్నరు. పడుతున్నరు. లేస్తున్నరు. పెబ్బ రోడ్‌కు ఎడమదిక్కే ఉండుండ్రి అని మొత్తుకుంటుండు. ఎట్లచ్చినోళ్ళు గట్లనే వాపస్ తీస్కరావాలని పెద్దోల్లు ఆయనకి జిమ్మెదారి చెప్పిండ్రు మరి. ఊర్లు దాటుకుంటా హుషారుగా కడెం జేరినం. అక్కడినుంచి ఎడమదిక్కుకు మలిగి డ్యామ్ దిక్కు పోవుడు. చమటలచ్చినయ్. డ్యామ్ కనవడ్తున్నది. ఇంకేం. జోష్ తోని అందరం మల్ల పైడిల్ గొట్టినం.
సముద్రం మేమెవ్వలం సూ డలే. కుంటా సూపిచ్చుకొనుడు. ఆ కొనకెల్లి ఈ కొనకు దిరిగినం. డ్యామ్ నుంచి కిందికి పోయినం. బెస్తోల్లు వలలతోని జిమ్మలు వట్టుడు సూసినం. ఆకలి మస్తుగైతున్నది. పదిహేను కిలోమీటర్లు సైకిల్ తొక్కినం. ఆకలి గాదా మరి!

ఒక పెద్ద బండ మీద కూసున్నం. అందరూ డబ్బలిప్పిండ్రు. ఉప్పుడువిండి, అటుకులు, ప్యాలాలు, అన్నం కూరలు, పులిహోర, అప్పాలు, కారప్పూస, సర్వపిండి... ఇష్టమచ్చినట్టు లటలట తిన్నం. నీళ్ళల్ల ఎగిరినం. దుంకినం. అందరికి ఈతస్తది. గోదావరి నది ఖానాపూర్కు దగ్గర్నే! చిన్నప్పుడే నేర్సుకొన్నం మేమంతా. మిగిలింది కూడా తిని డబ్బాలన్నీ ఖాళీజేసినం. మంచిగా కడుక్కున్నం.
అందరం సైకిళ్లమీద రెడీ. వన్... టు... త్రీ... పెబ్బ నడుండ్రి అన్నడు.
అప్పటికే పిక్కలు, పిర్రలు నొస్తున్నయ్. ఊర్లే సైకిల్ తొక్కినం గాని గిట్ల దూరం ఊర్లకు ఎప్పుడు పోలే. బగ్గ తిన్నం. పైడిళ్ళు మెల్లగా కదుల్తున్నయ్. ఆయాసం అస్తున్నది. ఖాళీ డబ్బాలు సైకిళ్ళకి అటుఇటు కొట్టుకొంట సప్పుడు సేస్తున్నయ్. సైకిళ్ళ పయ్యలు ముందుకు ఉరుకుతున్నయ్. తీన్ రస్తా అందాజకు కిలోమీటర్ దూరంలో ఉంది. ఏమైందో ఏమో ఒక దోస్తు సటుక్కున సైకిలాపిండు. భూమ్మీద కూలవడ్డడు. అందరం ఆగి ఆయన సుట్టు నిలవడ్డం.
నాకు బాగ దూప ఐతున్నది. జల్ది నీళ్ళు గావాల. ఆగిన దొస్తు ఆయాసంతో అన్నడు. కండ్లు ఎట్లనో తిప్పిండు.
ఎవల్ల దగ్గరన్న నీళ్ళున్నయ? పెబ్బ అడిగిండు. అందరి దిక్కుల సూసిండు.

డబ్బాలన్నీ ఖాళీ. ఒక్కల్లు గూడ నీళ్ళు నింపుకోలే.
దూపతో ఉన్నతను విలవిలలాడుతున్నడు. పెబ్బ ఆయన దగ్గరికి పోయి, నీళ్ళు ఎవ్వళ్లదగ్గర లేవు. కొంచం ఓపికతో ఉండు. మెల్లమెల్లగా పోదం నడు అన్నడు.
అంతల్నే ఒకతను తీన్ రాస్తా దగ్గర నూతున్నది. అక్కడికివోతే సల్లటి నీళ్ళు దొరుకుతై. అన్నడు.
నిజమేరా. అక్కడొక నూతున్నది. ఇద్దరు ముగ్గురు ఒక్కసారే అన్నరు.
గాలయ్య నూతి గదరా? ఇంకొకడు.

ఎట్లనన్నజేసి సైకిల్ మెల్లమెల్లగా దొక్కురా అందరు బుదిరికిచ్చిండ్రు. ఆయన్ని సైకిల్ ఎనక సీట్ మీద తీస్కపోదమనుకున్నరు. మరి, ఆయన సైకిల్ ఎక్కడవెట్టాలన్న పరేషాన్.
అప్పటికే తగ్గిన స్పీడ్, ఇంకొంచెం తగ్గింది. మెల్లగా గాలయ్య నూతికి చేరుకొన్నం. తొంగి సూసిండ్రు. నీళ్లు మస్తుగున్నయ్ గాని తాడు, బొక్కెన లేదు. ఏంజేసుడు?... ఇంకో పరేషాన్. అటూ ఇటూ చూసిండ్రు. ఏం కనవడలేదు.
మన్న జెయ్యుండ్రిరా... పానం బోతున్నదిరా.. దూపాగుతలేదు.. మూలుగుతున్నడు. పిసపిస జేసిండు.
అందరూ సుట్టంతా సూసిండ్రు. ఏం జేసుడు. ఎట్ల నీళ్ళు తోడుడు. పెబ్బకొక ఇక్మత్ అచ్చింది.
ఆరేయ్... నేను జెప్పేది ఇనుండ్రి. అందరు మీ మొలతాళ్లని తెంపుండ్రిరా పెబ్బ హుకుం.
పటపట అందరు నడుముకున్న తాళ్ళను తెంపిండ్రు. పెబ్బ ఎందుకడిగిండో తెల్సింది. పెబ్బ అందరి డబ్బలదిక్కు చూసిండు. ఒక అల్యూమినియం డబ్బ కంట్లే వడ్డది.
ఆరేయ్. నీ డబ్బ ఇటుయ్యిరా. నీది ఆల్కగుంటదిరా. మొలతాళ్లని ఒకదానికొకటి కట్టుండ్రి.
నిమిషాల్లో సన్నని పెద్ద తాడు తయ్యార్. ఒక కొనకు డబ్బ జల్ది జల్ది కట్టిండ్రు. అందరు సప్పట్లు గొట్టిండ్రు.
పెబ్బ దారాన్ని పదిలంగా పట్టుకొని డబ్బాని మెల్లగా నూతిలకి దించిండు. నీళ్ళు బుడుక్కున నిండినయ్. నిండిన డబ్బని పైకి లాగిండు. డబ్బ చేతికందంగనే తీసి దోస్తు చేతిల పెట్టిండు. అందరూ జూస్తుంటే గుటగుట సల్లని నీళ్లని తాగిండు.
అరేయ్... ఒక్కసారే లటలట తాగకురా... బాగా దూపమీదున్నప్పుడు మెల్లమెల్లగా తాగాల్ర... ఒక దోస్తు చెప్పిండు.
సల్లని నీళ్లని మెల్లమెల్లగా తాగంగనే ఉషారయ్యిండు. గుల్కోస్ ఎక్కిచ్చినట్టయ్యిందేమో.
ఐదు నిమిషాలయినంక అందరు పైడిల్ తొక్కిండ్రు. ఎట్లున్నోలట్ల అందరు ఖానాపూర్ చేరిండ్రు.
ఈ కథ కతమ్.

(యాభై ఏళ్ల క్రితం నిజంగా జరిగిన సంఘటనపై అల్లిన కథ ఇది. గాలయ్య నూతి ఇంకా ఉంది. కాని శిథిలావస్థలో. దూప మనిషి వ్యాపారస్తుడయ్యాడు. పెబ్బ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయ్యాడు. మిగతా వారిలో కొందరు వ్యాపారస్తులు, వ్యవసాయదారులయ్యారు. మరి కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు చేసి విరమించారు. ఈ కథా రచయిత ఢిల్లీలో ఉద్యోగం చేసి నిర్మల్‌లో స్థిరపడ్డాడు.)

డా. టి. సంపత్ కుమార్
సెల్: 9810402895

738
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles