వయసు 57 వేగం 80


Sun,July 21, 2019 01:37 AM

Gv-Prasad
అతడు కుర్రాడు కాదు. కానీ.. బైక్ రైడింగ్‌లో కుర్రాళ్లు సైతం అతడితో పోటీ పడలేరు. ఇంటి గడప దాటలేని వయసు అతనిది. కానీ.. బైక్‌పై ప్రపంచాన్నే చుట్టేస్తున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు ఖండాలు చుట్టేసి నిత్య యవ్వనుడిగా రయ్‌మంటూ రైడ్ చేస్తున్నాడు. అతడే హైదరాబాద్‌కు చెందిన జీవీ ప్రసాద్.

అభిరుచికి వయసు అడ్డురాదని నిరూపిస్తున్నాడు జీవీ ప్రసాద్. అతను వృత్తిరీత్యా వ్యాపారి. పాత్‌ల్యాబ్ ప్రసాద్‌గా ఫేమస్. ఇంటి ముందర రకరకాల ఖరీదైన కార్లు ఉంటాయి. వర్కింగ్ ప్లేస్ నుంచి కాలు బయటకు పెట్టలేనంత బిజీ. కానీ.. ఇదంతా యాంత్రిక జీవితమని అతని అభిప్రాయం. అందుకే ఎక్కడికి వెళ్లాలన్నా బైక్ మీదే వెళ్తుంటాడు.

రైడింగే ఎందుకు?: బైక్ రైడింగ్ అంటే జీవీ ప్రసాద్‌కు ప్యాషన్. రకరకాల బైక్‌లు మారుస్తుంటాడు. మామూలుగా ఓ యువకుడికి ఇలాంటి ప్యాషన్ ఉండటం చూస్తుంటాం. కానీ జీవీ ప్రసాద్ దానికి పూర్తి విరుద్ధం. ప్యాషన్‌కు, వయసుకు సంబంధం లేదని అంటాడతను. అందుకే బైక్‌పైనే ప్రపంచాన్ని చుట్టేయాలని సంకల్పించాడు. వాస్తవానికి బైక్ రైడింగ్ అతడి యంగేజ్ అభిరుచి. అప్పట్లో బైక్‌తో చక్కర్లు కొడుతూ అందరితో వావ్ అనిపించుకునేవాడట. కానీ కెరీర్ తర్వాత పెండ్లి ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు మీద పడటంతో రైడింగ్ ఆగిపోయింది. జీవితంలో మళ్లీ బైక్ రైడింగ్ చేయను అనుకున్నాడు. వ్యాపారంలో స్థిరపడి పాత్ కేర్ ల్యాబ్స్ స్థాపించిన తర్వాత జీవితం మరో మలుపు తిరిగింది. అందరినీ సెట్ చేశాడు. పాత్‌కేర్ ద్వారా ఎందరికో ఉపాధి కల్పిస్తున్నాడు. ఇక కావాల్సింది రిటైర్‌మెంట్. అనుకున్నవన్నీ సాధించా.. కానీ బైక్ రైడింగ్ ద్వారా ప్రపంచాన్ని చుట్టేయాలనే కోరిక తీరలేదు అనుకొని అందరికీ చెప్పేసి రైడింగ్ వైపు గేర్ మార్చి 80 వేగంతో వెళ్తున్నాడు.

హార్లీ డేవిడ్‌సన్ సోపతి: 2015లో ప్రసాద్ కొడుకు కోసం బుల్లెట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ సమయంలో సరదాగా కొంతసేపు ఆ బైక్ నడిపాడు. ఇదే వాహనంపై ఫ్రెండ్స్‌తో కలిసి గోవా చుట్టి వచ్చారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. అదే సంవత్సరంలో హార్లీ డేవిడ్‌సన్ బైక్ కొనుక్కుని చాలాకాలంగా హార్లీ ఓనర్స్ గ్రూప్ హైదరాబాద్ చాప్టర్‌కు నేతృత్వం వహిస్తున్నారు.
Gv-Prasad2
మియా టు మియామీ: గోవా ట్రిప్ తర్వాత అమెరికాలో హార్లీ డేవిడ్‌సన్ బైక్ కొన్నాడు. 2015 అక్టోబర్‌లో అమెరికాలోని మియా నుంచి మియామీ వరకు 28 రోజుల పాటు 16,400 కిలోమీటర్ల దూరం రైడింగ్ చేశాడు. ఇదే అతని తొలి పెద్ద రైడ్. తర్వాత అమెరికాలోనే ఐరన్ బట్ బైక్ రైడింగ్ ఛాలెంజ్‌లో 1610 కిలోమీటర్ల దూరాన్ని 20 గంటల 30 నిమిషాల్లో చేరుకొని రికార్డు సృష్టించాడు. ఇండియాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మోటరబుల్ రోడ్‌గా పిలిచే ఖర్దూంగ్‌లా నుంచి కన్యాకుమారి వరకు 9,400 కిలోమీటర్లు.. హైదరాబాద్- భూటాన్ మళ్లీ హైదరాబాద్ వరకు 7 వేల కిలోమీటర్ల దూరాన్ని చుట్టేసి రికార్డు సృష్టించాడు.

హైదరాబాద్ టు లండన్: 2018లో కొడుకు రక్షిత్‌తో కలిసి చేసిన హైదరాబాద్ టు లండన్ పర్యటించాడు. చైనా సరిహద్దుల వైపు వెళుతుండగా -10 డిగ్రీల చలిలో 250 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల వల్ల అవస్థలు పడాల్సి వచ్చినా.. కిర్గిస్థాన్‌లో ప్రతికూల వాతావరణం ఎదురైనా రైడింగ్‌కు మాత్రం పుల్‌స్టాప్ పెట్టలేదు. లండన్ పర్యటన మొత్తం 55 రోజుల్లో రెండు ఖండాలు, 16
దేశాలు దాటి పూర్తి చేశారు. ప్రతీ రైడ్‌లో దాదాపు ఆయనకు తోడుగా భార్య ఉంటుందట.
Gv-Prasad1
ఫ్యూచర్ రైడ్స్: భవిష్యత్‌లో చేయబోయే రైడింగ్‌లపై ప్రసాద్ పక్కా ప్లాన్‌తో ఉన్నాడు. 2020లో యూఎస్‌లోని అలస్కాలో ఓ పెద్దరైడ్ చేయనున్నారు. 2021లో కైరో నుంచి కేప్‌టౌన్ వరకు 27వేల కిలోమీటర్ల దూరాన్ని 3 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ఖండాలను చుట్టేసిన అనుభవం ఉన్న అతను ఇక ఆఫ్రికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా ఖండాలను చుట్టేసే ఆలోచనలో ఉన్నాడట.

చక్కటి బైక్ కలెక్షన్: బైక్‌లు కొనుగోలు చేయడమే కాదు.. వాటిని జాగ్రత్తగా కాపాడుకునేందుకు అవసరమైన మరమ్మతులు స్వయంగా చేసుకుంటారు ప్రసాద్. తనదగ్గర అత్యుత్తమమైన 10 బైక్‌లు ఉన్నాయని చెబుతారు. తన వద్ద యూఎస్‌కు చెందిన ఇండియన్‌చీఫ్ వింటేజ్ 1, హార్లీ డేవిడ్‌సన్ బైక్‌లు 6, బీఎండబ్ల్యూ 2, యూకెకు చెందిన ట్రయంఫ్ 1 ఉన్నాయని, వీటికి అవసరమైన మరమ్మతులు తానే స్వయంగా చేపడతానని చెప్పారు. ఇక బైక్ రైడింగ్ సమయంలో ప్రమాదాల బారిన పడకుండా అత్యుత్తమమైన రైడింగ్ సూట్, షూస్, హెల్మెట్స్ వాడతామని, ఉదయం 4 గంటలకు రైడింగ్ ప్రారంభిస్తే చీకటి పడే వరకు యాత్ర కొనసాగుతుందని.. ఎక్కడ యాత్ర నిలిపివేస్తే అక్కడే బస చూసుకుంటామని చెప్పారు. ప్రణాళిక కుదరని పక్షంలో అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకంటామని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 95 వేల కి.మీ లు మూడ ఖండాల్లో చేపట్టారు.

మర్రిపల్లి శ్రీనివాస్‌రెడ్డి
అమీర్‌పేట్, నమస్తే తెలంగాణ

483
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles