సత్యాన్వేషి సంతోషం!


Sun,July 21, 2019 01:28 AM

MARMIKA-KATHA
ఒక ఊళ్లో గొప్ప భూస్వామి ఉండేవాడు. సౌమ్యుడు, సహృదయుడు. అనుకూలవతియైన భార్య, వినయం కలిగిన కొడుకు. గౌరవించే ఇరుగుపొరుగు. అతని జీవితం ఎంతో ఆనందంగా ఉంది. ఎక్కడా ఎటువంటి సమస్యలు లేవు. ఇంద్రభవనంలాంటి ఇల్లు. నిత్య వ్యాయామంతో దృఢమైన శరీరం. అతను ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు. అనుకున్నవన్నీ అర క్షణంలో అందుకోగలిగిన అనుకూలం. నిజానికి మనిషికి ఇంతకన్నా ఏం కావాలి? ఎవరూ అతనిలో అంతులేని అశాంతి లోలోపల దాగి ఉందని ఎప్పుడూ అనుకోలేదు. నిత్యం అతను జనాల్ని కలుస్తూ వాళ్ల సమస్యల్ని సరి చేసుకుంటూ సందడిగా ఉండేవాడు.

కానీ ఆ భూస్వామి మనసు ఏదో ఎప్పుడూ కోరుకునేది. ఇది కాదు యింకేదో కావాలి అని ఆశించేది. అనుకూలమైన అన్ని భౌతిక ఆనందాలు అతడికి ఎంతో అవసరమైనవిగా కనిపించాయి.
అవ్యక్తమయిన దానిని అన్వేషిస్తూ ఒక రాత్రి అతను ఇంటి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా బయల్దేరాడు. ఎన్నో మైళ్లు నడిచిన తరువాత ఒక పర్వతం దగ్గరికి వచ్చాడు. అక్కడ ప్రకృతి పరవశిస్తున్నది. ఉషోదయం, పక్షుల కిలకిలరావాలు విచ్చుకున్న పూల సోయగం. స్వచ్ఛమైన నిర్మలమయిన గాలి. ప్రతి అణువులో దైవత్వం నిండినట్లు ఉందా పరిసరం.

అతను చుట్టూ చూశాడు. రకరకాల పళ్లతో చెట్లు నిండుగా ఉన్నాయి. దగ్గరే జలపాతం. కింద పచ్చని లోయ, అతను వెంటనే అక్కడ గుడిసె కట్టడం మొదలు పెట్టాడు. ఒక్క రోజులో చిన్న గుడిసెను తనకు సరిపోయేట్టుగా కట్టుకున్నాడు. సమీప పరిసరాల్లో సంచరిస్తూ పళ్లు, కంద మూలాలు తింటూ సంతోషంతో గడుపుతూ వీలు చిక్కనప్పుడల్లా ధ్యానం చేస్తూ గడిపేవాడు.

మనసు పొరల్లో గతపు ఛాయలు కలత పెట్టేవి. కానీ మనో నిగ్రహంతో వాటిని అదుపు చేశాడు. ఉదయాస్తమయాల్ని, పచ్చని చెట్లని, నక్షత్రాలని, నీలాకాశాన్ని, జలపాతాన్ని చూస్తూ ఆనందభాష్పాలు రాలుస్తూ ప్రకృతిలో భాగమైపోయాడు.
వర్షాకాలం వచ్చింది. తుఫాను గాలి మొదలైంది. అతని గుడిసె గాలికి అటూ ఇటూ కదిలింది. అతను, మొదటి సారి ఆకాశంలోకి చూసి భగవంతుడా! ఇది నా గుడిసె దాన్ని రక్షించు అని వేడుకున్నాడు. దేవుడు అతడి మాటల్ని పట్టించుకున్నట్లు లేడు. విపరీతమైన గాలి వచ్చి అతడి గుడిసె కూలిపోయింది. కొట్టుకుపోయింది. చెట్ల కొమ్మలు విరిగి పడి అతను స్పృహ తప్పాడు. కళ్లు తెరిచి చూస్తే చుట్టూ అపరిచితులు సేవ చేస్తున్నారు. లోయలో ఉన్న గ్రామంలోని జనం పైన గుడిసెలో ఉన్న సన్యాసికి ప్రమాదం దాపురించిందని పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే స్పృహ తప్పిన అతన్ని మోసుకొని కిందికి తీసుకొచ్చి సేవ చేశారు. అతను కోలుకునే దాకా అతడికి సపర్యలు చేసి అతడి బాగోగులు చూశారు.
అతను ఆలోచనల్లో పడ్డాడు. ఉన్న దానిలో లేనిది ఇంకెక్కడో ఉంటుందని పొరపాటు పడ్డాను నేను. ఇక్కడికి వచ్చాను. ఏకాంతంలో దైవం ఉంటుందని భ్రమపడ్డాను. లేనిదానిలో ఏదో వెతికాను. ఈ ఏకాంతవాసమే కాదు. జనావాసం కూడా దైవత్వంలో భాగమన్న విషయం నేను గుర్తించలేకపోయాను. మనుషుల్లోనే ఉండాలి. అప్పుడప్పుడు ఏకాంతంలోకి రావాలి అని గ్రహించాడు. తనకు సేవ చేసిన గ్రామస్తులకు కృతజ్ఞతలు చెప్పి తన గ్రామంకేసి కదిలాడు.

తుఫాను గాలి మొదలైంది. అతని గుడిసె గాలికి అటూ ఇటూ కదిలింది. అతను, మొదటి సారి ఆకాశంలోకి చూసి భగవంతుడా! ఇది నా గుడిసె దాన్ని రక్షించు అని వేడుకున్నాడు. దేవుడు అతడి మాటల్ని పట్టించుకున్నట్లు లేడు. విపరీతమైన గాలి వచ్చి అతడి గుడిసె కూలిపోయింది. కొట్టుకుపోయింది. చెట్ల కొమ్మలు విరిగి పడి అతను స్పృహ తప్పాడు.

ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్ నంబర్‌లో తెలియజేయండి.

- సౌభాగ్య

219
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles