వీసా లేకుండా ఎగురవచ్చు!


Sun,July 21, 2019 01:18 AM

FLIGHTS
వివిదేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి. ఇందుకు ఎన్నో దరఖాస్తులు, ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అందుకే, చాలామంది విదేశాలకు వెళ్లాలంటే జంకుతారు. ఆ కోరిక ఉన్నా.. ఈ తతంగాలన్నీ పూర్తి చేసేందుకు ఇష్టం లేక వెనక్కి తగ్గుతుంటారు. అయితే, వీసాతో పని లేకుండా స్వేచ్ఛగా మా దేశానికి రండని కొన్ని దేశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇండియాకు పొరుగున ఉన్న నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులకు వెళ్లేందుకు వీసాతో పని లేదు. భారతీయులకు ప్రత్యేకంగా ఈ దేశాల్లో నిబంధనలేమీ ఉండవు. కొన్ని దేశాలు వీసాకు సంబంధించిన కొన్ని నిబంధనల్లో తాత్కాలిక వెసులుబాటును కల్పించాయి. మరికొన్ని దేశాలు గడువులు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చంటే..

మకా(macau): ఇక్కడ ఇరుకైన మార్గాలు, రంగు రంగుల గృహాలు, వెదురు తోటలు ఆకట్టుకుంటాయి. ప్రపంచంలోనే సంపన్న దేశాల్లో ఒకటైన ఈ దేశానికి భారతీయులు వీసా లేకుండా వెళ్లొచ్చు.
హాంక్‌కాంగ్: డిస్నీ లాండ్, ఒషేన్ పార్క్ అనేక సందర్శనీయ ప్రదేశాలున్నాయి. ఈ దేశానికి వెళ్లడానికి వీసా అక్కర్లేదు. 14 రోజులు మాత్రమే గడువు.
బొలీవియా: ఇక్కడ సముద్రంలో ఉప్పుతయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది.
ఇండోనేషియా: నీటి మధ్యలో విల్లాలు, ఆకట్టుకునే బీచ్‌లు, సుందరమైన ప్రారనా మందిరాలు ఆకట్టుకుంటాయి. ఈ దేశానికి వెళ్లగానే 30 రోజులకుగాను వీసా ఇస్తారు.
ఆండోరా: మంచుకొండలు, పర్వత శ్రేణులు ఈ దేశాన్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. ఈ దేశానికి భారతీయులు వీసా లేకుండా వెళ్లి ఎన్ని రోజులైనా ఉండవచ్చు.
మారిషస్: వాటర్‌ఫాల్స్, దట్టమైన అడవులు, బ్ల్యూ బే మెరీనా పార్క్, పీటర్ బోత్ కొండలు, నేచుర్ పార్క్ చూడదగిన ప్రదేశాలు. ఈ దేశంలో వీసా లేకుండా 90 రోజులు ఉండవచ్చు.
కేప్ వెర్డే: నీటి మధ్య ఉండే ఈ ద్వీప దేశంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ తక్కువగానే ఉంటాయి. ఈ దేశానికి వెళ్లగానే వీసా ఇస్తారు. ఎలాంటి గడువు లేదు.
జోర్డాన్: పురాతన కట్టడాలకు జోర్డాన్ ప్రసిద్ధి. ఎడారి ప్రాంతం కాబట్టి నీటి వనరులు తక్కువగా ఉంటాయి. ఒంటెలపై ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. ఈ దేశానికి వెళ్లగానే రెండు వారాలకు వీసా ఇస్తారు. కానీ చేతిలో 3000 అమెరికన్ డాలర్లు ఉండాలనే నిబంధన ఉంది.

కెన్యా: ఇక్కడి అడవుల్లో అన్ని జాతుల వన్యప్రాణులు ఉన్నాయి. వీటిని చూసేందుకు ప్రత్యేకంగా ఇక్కడి ప్రభుత్వం సఫారీలను ఏర్పాటు చేసింది. ఈ దేశానికి చేరిన తర్వాత వీసా పొందవచ్చు. మూడు నెలలు అక్కడే ఉండవచ్చు.
ఫిజీ: ఇక్కడ అరటి తోటలు ఎక్కువగా ఉంటాయి. నీటి మధ్యలో చిన్న చిన్న గుడిసెలను ఏర్పాటు చేసుకుని ఇక్కడి వారు జీవిస్తుంటారు. ఈ దేశానికి వీసా లేకుండా వెళ్లవచ్చు. నాలుగు నెలలు ఉండవచ్చు.
కుక్ ఐలాండ్స్: మౌరీ బీచ్, కొబ్బరి తోటలు, బీచ్‌లు ఇక్కడ ప్రత్యేకం. ఈ దేశానికి వీసా అక్కర్లేదు. 31 రోజులు ఇక్కడ ఉండొచ్చు.
పిట్కైర్న్ ఐలాండ్స్: ఇక్కడ చిన్న చిన్న ద్వీపాలు ఉంటాయి. ఇక్కడ సాహసక్రీడల్ని సాధన చేస్తుంటారు. దేశంలో 14 రోజుల పాటు ఉండేవారికి వీసా అక్కర్లేదు.
సోమాలియా: ఇక్కడి మసీదులు ప్రపంచంలోనే ప్రత్యేకం. ఈ దేశానికి చేరుకోగానే వీసా ఇస్తారు. ఇక్కడికి వెళ్లడానికి రెండ్రోజుల ముందుగానే మిమ్మల్ని ఆహ్వానించిన వారు అక్కడి విమానాశ్రయంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
పలావ్: జెల్లీ ఫిష్ లేక్, బెలావ్ నేషనల్ మ్యూజియం ఇక్కడ ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్. ఈ దేశానికి వెళ్లగానే 30 రోజులకు వీసా ఇస్తారు.
సీషెల్స్: ఇక్కడ వందకు పైగా దీవులు ఉన్నాయి. నీటి మధ్య జనావాసాలు ఏర్పాటు చేసుకుని ప్రజలు జీవిస్తుంటారు. సముద్రపు ఉత్పత్తులే ప్రధాన ఆహారం. ఈ దేశానికి వెళ్లగానే 30 రోజులకు అనుమతిస్తారు.
హైతీ: ఇక్కడ రంగు రంగుల ఇండ్లు, కొయకే బీచ్ ఆకట్టుకునే ప్రదేశాలెన్నో ఉన్నాయి. ఈ దేశంలో వీసా లేకుండా 3 నెలలు ఉండవచ్చు.
గునియా బిస్సవ్: తక్కువ జనాభా గల దేశం. ఉద్యానవనాలు, ఓడరేవులు, పార్కులు పుష్కలంగా ఉన్నాయి. ఈ దేశానికి వెళ్లగానే 90 రోజులకు వీసా ఇస్తారు.
డామినికా: చెట్లపై రిసార్టులు, నదీ తీరాలను ఆనుకుని ఉండే ఊళ్లు ఇక్కడ ప్రత్యేకం. ఈ దేశానికి వెళ్లగానే 6 నెలలకు వీసా ఇస్తారు.

నౌరూ: వెండిని ఎగజిమ్మినట్లు ఇసుక, నీలం రంగు కలిపిన నీళ్లతో బీచ్‌లు ఇక్కడ ఆకట్టుకుంటాయి. ఈ దేశానికి చేరిన తర్వాత వీసా పొందవచ్చు. గడువు లేదు.
జమైకా: ప్రసిద్ధ గాయకుడు జమైకా రెగె జన్మస్థలం. ఇక్కడ నీటి మధ్యలో ఇండ్లు కట్టుకుని జీవిస్తుంటారు. ఈ దేశానికి వీసా అక్కర్లేదు. గడువు కూడా లేదు.
ఈ సల్వడార్: ఇక్కడ అడుగడుగునా జలపాతాలు, ఎత్తైన ప్రదేశాల్లో ఇండ్లు, పచ్చని పొలాలు కనువిందు చేస్తాయి. ఈ దేశంలో వీసా లేకుండా 90 రోజులు ఉండవచ్చు.
సెయింట్ లూసియా: అగ్నిపర్వత బీచ్‌లు, కలప శిల్పాలు తయారు చేసి అమ్ముతుంటారు. ఈ దేశానికి చేరిన తర్వాత వీసా పొందవచ్చు. 6 వారాల గడువు.
మడగాస్కర్: ఒక భారీ ద్వీపం ఇది. ఇక్కడ అనేక జంతు జాతులు ఉన్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత 90 రోజుల గడువుతో వీసా ఇస్తారు.
సమో: పగడపు దీవుల మడుగులు, అగ్ని పర్వత శిఖలు, లావా క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఈ దేశంలో వీసా లేకుండా 30 రోజులు ఉండవచ్చు.
మైక్రోనేషియా: బీచ్‌లు, శిలాజాల మ్యూజియం ప్రత్యేకం. వెళ్లగానే వీసా ఇస్తారు. 30 రోజుల గడువు.
టాంజానియా: అన్ని రకాల జంతు జాతులు ఉన్నాయి. సఫారీలపై ప్రయాణిస్తూ వన్యప్రాణులను వీక్షించవచ్చు. ఇక్కడికి చేరిన తర్వాత వీసా పొందవచ్చు. గడువు లేదు.
కంబోడియా: పురాతన బౌద్ధ ఆలయాలు, కోటలు,బ బురుజులు ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడికి వెళ్లిన తర్వాత 30 రోజుల గడువుతో వీసా ఇస్తారు.
FLIGHTS1

ఇండియా పొరుగు దేశాలు

శ్రీలంక: ఇక్కడి ప్రకృతి అందాలు ఆకర్షిస్తాయి. సముద్ర తీర ప్రాంతాలు, దట్టమైన అడవులు ఈ ప్రాంతానికి పేరు తెస్తున్నాయి. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ అనే పద్ధతిలో ఈ దేశంలోకి రావడానికి అనుమతిస్తారు. గడువు 30 రోజులు ఉంటుంది.

నేపాల్: హిమాలయాలలో ఉన్న నేపాల్ ప్రకృతి అందాలకు నెలవు. ఇక్కడి లేక్ టేబుల్ ల్యాండ్ పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ దేశానికి వెళ్లాలంటే పాస్‌పోర్టు కూడా అవసరం లేదు. ఏదైనా గుర్తింపు పత్రం చూపిస్తే సరిపోతుంది. భారతీయులకు ఎలాంటి షరతులు విధించరు.

భూటాన్: ఈ దేశం సంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంది. కలుషితం కాని ప్రకృతి సౌందర్యాన్ని ఇక్కడ చూడవచ్చు. ఇక్కడి కట్టు, బొట్టు అన్నీ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఇక్కడకు వెళ్లాలంటే వీసా అక్కర్లేదు. గడువు కూడా లేదు.
మాల్దీవులు: ఇక్కడి ఆర్థిక వ్యవస్థ మత్స్య పరిశ్రమ, సముద్ర ఉత్పత్తులపై ఆధారపడి ఉంది. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది.

295
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles