లాభాల బాటలో గురుశిష్యుల స్టార్టప్


Sun,July 21, 2019 01:15 AM

Abhishek
తరగతి గదిలో పుట్టిన ఆలోచనలు స్టార్టప్‌లుగా ఎదిగిన విజయగాథలు ఎన్నో చూసి ఉంటాం. వన్ బై టు టీలు తాగే మిత్రులు కలిసి కంపెనీలు ప్రారంభించి కోటీశ్వరులైన కథనాలూ చదివిఉంటాం. ముగ్గురు నలుగురు మిత్రులు కలిసో, లేక ఒంటరిగానో స్టార్టప్‌లు ప్రారంభిస్తుంటారు కొందరు. కానీ గురు, శిష్యులు ప్రారంభించినవి చాలా అరుదుగా ఉంటాయి. బెంగళూరుకు చెందిన రాయల్ బ్రదర్స్ అనే స్టార్టప్‌ను మాత్రం గురుశిష్యులు కలిసి ప్రారంభించారు. సెల్ఫ్ రైడ్ బైక్ రెంటల్ ఫ్లాట్ ఫామ్ అయిన రాయల్ బ్రదర్స్‌కు ఫౌండర్ ఓ లెక్చరర్ అయితే... అందులో పనిచేసే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అతని దగ్గర చదువుకున్న విద్యార్థి.

మంజునాథ్ ఓ ప్రొఫెసర్. మెకానికల్ ఇంజినీంగ్ పూర్తిచేసిన తర్వాత మెషిన్ డిజైన్‌లో పీజీ కూడా చేశారు. ఆ తర్వాత బెంగళూరులో పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీగా పనిచేయడం ప్రారంభించారు. ఎనిమిదేండ్ల్లు టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్న మంజునాథ్ ఆర్వీ ఇంజినీరింగ్ కాలేజీలో పాఠాలు చెబుతున్న సమయంలో అభిషేక్ అనే విద్యార్థి పరిచయం అయ్యాడు. అభిషేక్ కూడా మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మోటార్ బైక్స్‌పై అమితమైన ఆసక్తి కూడా ఉంది. అంతకు మించి ఔత్సాహికవేత్తగా మారాలన్న పట్టుదల కూడా ఉన్నది. అంతేకాదు ఇంజినీరింగ్ మూడో ఏడాదిలో ఉన్నప్పుడే మిత్రునితో కలసి కార్డ్ డిజైనింగ్ స్టార్టప్‌ను నెలకొల్పిన అనుభవం కూడా ఉన్నది. మంజునాథ్ ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్‌ను మెరుగుపరిచేసేలా ఓ కొత్త కాన్సెప్ట్‌తో స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. మాటల సందర్భంలో మంజునాథ్, అభిషేక్ ఇద్దరూ తమ ఆలోచనల్ని పంచుకున్నారు. గురుశిష్యులిద్దరూ కలిసి రాయల్ బ్రదర్స్ స్టార్టప్‌ను ప్రారంభించారు. అలా జూలై 2015లో రాయల్ బ్రదర్స్ స్టార్టప్ ప్రారంభమయింది.
Abhishek1

అవసరమైన సలహాలు తీసుకుని....

ఇది సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి ఆర్టీవో ఆథరైజేషన్ అందుకున్న మొట్టమొదటి సెల్ఫ్ రైడ్ బైక్ రెంటల్ ఫ్లాట్ ఫామ్. ఈ స్టార్టప్‌ను ట్రాక్‌లోకి తీసుకెళ్లడానికి వీరు చాలా క్లిష్టమైన పరిస్థితుల్నే ఎదుర్కోవాల్సి వచ్చింది. అందులో మొదటిది.. మంచి నాణ్యతతో కూడిన రెంటల్ బైక్స్ ను పొందడమే. అది వారికి మొదటి సవాల్ గా మారింది. రమేష్ బాబు దగ్గర సలహాలు తీసుకుని కొన్ని అడ్డంకులు అధిగమించారు. ఇంతకీ ఈ రమేష్ బాబు ఎవరో కాదు. బార్బర్... రోల్స్ రాయిస్ సహా లగ్జరీ కార్ల యజమాని. వాటిని రెంట్ కి ఇచ్చే బిజినెస్ లో కోట్లు గడిస్తున్న వ్యక్తి కూడా. బెంగళూరులో ఫోర్ వీలర్స్‌ను అద్దెకిచ్చే పర్మిట్‌ను ఆర్టీవో నుంచి పొందిన మొట్టమొదటి వ్యక్తి రమేష్. రమేష్ చెప్పిన సంగతులు ఈ గురుశిష్యులకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయి. అలా రాయల్ బ్రదర్స్ స్టార్టప్ నడిపేందుకు కావల్సిన సలహాలూ, సూచనలు సేకరించారు.

అనతి కాలంలోనే ఆదరణ: రాయల్ బ్రదర్స్‌లో ప్రస్తుతం ఐదుగురు సభ్యుల బృందం ఉన్నది. వీరిలో మంజునాథ్, అభిషేక్ ఇద్దరు. శంషుద్దీన్ అనే మరో టీమ్ మేట్ మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకుంటారు. నిఖిల్ రాజ్, ఆకాష్ సురేష్ అనే మరో ఇద్దరు టెక్నాలజీ విషయాలను డీల్ చేస్తుంటారు. ప్రారంభమయిన ఏడాది కాలంలోనే రాయల్ బ్రదర్స్ ఏడు వేల మంది కస్టమర్లకు సేవలు అందించింది. రాయల్ బ్రదర్స్ నుంచి అద్దెకు తీసుకున్న ద్విచక్రవాహనాలు 1.3 మిలియన్ కిలోమీటర్లు తిరిగాయి.

వాహనాలపై నిఘా: బైకులు అద్దెకు ఇవ్వడమే కాదు.. తీసుకున్నవారి సెక్యూరిటీని కూడా ఎప్పుడూ పట్టించుకుంటుంది రాయల్ బ్రదర్స్. అందుకోసమే ప్రత్యేకంగా ఓ నిఘా వ్యవస్థనే ఏర్పాటు చేశారు. రాయల్ ఎన్ ఫీల్ బైక్‌కు 90 కిలోమీటర్ల వేగం, హోండా యాక్టివా బైకులకు అరవై కిలోమీటర్లు మాత్రమే వేగాన్ని నిర్ణయించారు. ఈ బైకులకు గ్లోబల్ పొజీషినింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను అనుసంధానించారు. దాని ద్వారా వాహనం ఎక్కడ ఉందో కనిపెడతారు. వేగంగా వెళితే వెంటనే వార్నింగ్ ఇస్తారు. అంతే కాదు బరడ్స్ ఐ టెక్నాలజీ ద్వారా అద్దెకిచ్చిన బైకుల తాజా పరిస్థితిని అంచనా వేసుకుంటారు. డిమాండు, సప్లయ్‌లను సమన్వయం చేసుకుంటారు.
Abhishek2
లాభాల బాట పట్టింది: సెల్ఫ్ బైక్ రెంటింగ్ సంస్థలకు బెంగళూరు డ్రీమ్ మార్కెట్. మంగళూరు, ఉడిపి, మణిపాల్‌లలో కూడా మంచి బుకింగ్స్ నమోదవుతుంటాయి. అయితే అభిషేక్ మొదట ఒక్క బెంగళూరుకే పరిమితమవ్వాలనుకున్నాడు. ఈ విషయంపై కో ఫౌండర్ అయిన గురువుతో వాదన కూడా పెట్టుకున్నాడు. కానీ మంజునాథ్ ఇతర నగరాల్లో ఉన్న మార్కెట్‌ను వివరించి అభిషేక్‌ను ఒప్పించగలిగాడు. ఆ తర్వాత అభిషేక్ గురువును అభినందించకుండా ఉండలేకపోయాడు. ఎందుకంటే ఇతర నగరాల్లోనూ రాయల్ బ్రదర్స్ సేవలకు బాగా ఆదరణ పెరిగి ఏడాదిలోనే లాభాల బాట పట్టింది.

అద్దెకు బైక్ కావాలంటే యాప్...

ప్రస్తుతం రాయల్ బ్రదర్స్ పలు నగరాల్లో సేవలు అందిస్తున్నది. బెంగళూరు, మణిపాల్, ఉడిపి, మంగళూరు, మైసూర్, హైదరాబాద్, గుంటూరు, గోవాల్లో సొంత బైక్ లేకపోయినా... అటూ ఇటూ తిరగాలనుకునేవారు రాయల్ బ్రదర్స్ యాప్ ఓపెన్ చేసి బైక్ బుక్ చేసుకుంటే చాలు. రాయల్ ఎన్ ఫీల్డ్, సుజుకి యాక్సెస్, హోండా యాక్టివా లాంటి బైకుల్ని రాయల్ బ్రదర్స్ గంటలు లేదా రోజుల లెక్కన అద్దెకిస్తుంది. రాయల్ బ్రదర్స్‌లో బైకుల్ని అద్దెకు తీసుకోవాలంటే వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేదా ఆయా నగరాల్లో ఉన్న ఆఫ్ లైన్ స్టోర్లలోనూ అద్దెకు తీసుకోవచ్చు. నెలకు ప్రస్తుతం 1300 బుకింగ్స్ వస్తున్నాయి.

191
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles