పద్య రత్నాలు-12


Sun,July 21, 2019 01:02 AM

Poems

బాధ్యత తెలియక పోతే..?

తాలిమి తోడ గూరిమి గృతఘ్నున కెయ్యడ నుత్తమోత్తము
ల్మేలొనరించిన గుణము మిక్కిలి కీడగు బాము పిల్లకున్
బాలిడి పెంచిన న్విషము పాయగ నేర్చునె దాని కోఱలం
జాలంగ నంతకంతకొక చాయను హెచ్చునుగాక భాస్కరా!

- భాస్కర శతకం

తాత్పర్యం:
కృతఘ్నులకు ఎంత సహాయం చేసినా వ్యర్థం. పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది? దానితోపాటు విషమూ పెరుగుతుంది. చెరువులో నీరు కూడా ఇంతే. పొలాలకు పారుతుందే తప్ప, వాడనంత మాత్రాన అందులో నిల్వ వుండదు కదా. ఇదే పద్ధతిలో బాధ్యత తెలియని యజమానికి ఎంత ధన సహాయం చేసినా అది వ్యర్థమే అవుతుంది.
Poems1

ఆర్భాటానికి కాదు దైవసేవ!

చిత్తశుద్ధిగ నీకు సేవ జేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు
జన్మ పావనతకై స్మరణ జేసెదగాని, సనివారిలో బ్రతిష్ఠలకు గాదు
ముక్తికోసము నేను మ్రొక్కి వేడెదగాని దండిభాగ్యము నిమిత్తంబుగాదు
నిన్ను బొగడ విద్య నేర్పితినే కాని, కుక్షి నిండెడు కూటి కొరకు గాదు
పారమార్థికమునకు నే బాటుపడితి
గీర్తికి నపేక్ష పడలేదే కృష్ణవర్ణ!
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార!నరసింహ! దురితదూర!

- నరసింహ శతకం

తాత్పర్యం:
నల్లనయ్యా! చిత్తశుద్ధితోనే నీకు సేవ చేశానే కానీ, లోకం మెప్పుకోసం కాదు. జన్మపావనం కావాలనే నీ నామస్మరణ చేశాను కానీ, పేరు ప్రతిష్ఠల కోసం కాదు. ముక్తికోసమే నిన్ను వేడుకొన్నానే తప్ప, భోగభాగ్యాలకు ఆశపడలేదు. విద్య నేర్పుతూ నిన్ను పొగడొచ్చు అనుకొన్నా కానీ, కూటికోసమైతే కాదు. పారమార్థికం కోసమే నా ఆరాటమంతా, కీర్తికోసం కాదు!
Poems2

గోపాలుని సేవలో..!

గోపాల దొంగ మురహర
పాపాలను పారద్రోలు ప్రభుడవు నీవే
గోపాలమూర్తి దయతో
నా పాలిట గలిగి బ్రోవు నమ్మితి కృష్ణా!

- కృష్ణ శతకం

తాత్పర్యం:
ఓ శ్రీ కృష్ణా! నువు స్వర్గలోకాన్ని పాలించిన వాడవు. లీలామానుష రూపుడివి. మురుడనే రాక్షసుడిని సంహరించిన వాడివి. పాపాలను పోగొట్టే రాజువు కూడా నీవే. అన్నీ నువ్వే, సర్వమూ నీ మయమే. అందుకే, నేను కూడా మనసా వాచా కర్మనా నిన్నే నమ్ముకున్నాను. నువ్వు నా పట్ల దయ వుంచి నన్ను రక్షించుమయ్యా!
Poems3

మోహపాశంలోంచి

బయటపడే మార్గం!
ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం
బేలా నామెడ గట్టినాడవిక నిన్నే వేళంజింతింతు, ని
ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మహాబ్దిలో గ్రుంకి యీ
శీలామాలపు జింత నెట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వరా!

- కాళహస్తీశ్వర శతకం

తాత్పర్యం:
భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు, ధనార్జన.. వీటి మోహబంధనంలో పడిపోయిన నేను నీ నామ స్మరణను సైతం విస్మరించాను కదా. ఈ బంధాలను కలిగించిన నువ్వే వాటినుంచి నన్ను విడగొట్టాలి సుమా. ఆ మోహపాశంలోంచి నన్ను బయటపడేసి, నీ నామస్మరణామృతాన్ని ఆస్వాదించే అవకాశం ఇవ్వు ఈశ్వరా!

ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్ నంబర్‌లో తెలియజేయండి.

205
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles