నెట్టిల్లు


Sun,July 21, 2019 12:55 AM

చుట్టూ ఎంతమంది ఉన్నా పలుకరించడానికి మనిషి ఉండకపోవడం ఒంటరితనం.. ఎవరూ లేకున్నా నీకు నేను ఉన్నా అని భరోసా ఇచ్చేది బంధం. ఇట్లాంటి బంధాలను అర్థం చేసుకొని సాగిపోయేవారు కొంతమంది. అవసరాల రీత్యా కలిసి ఉన్నా విడిపోయినట్టు ఉండే వారు ఇంకొంత మంది. ఈ బంధాల పుస్తకాన్ని తెరిచి చూస్తే ప్రతిదీ ఓ అంతులేని కథే.. అలాంటి వివిధ రూపాల్లో ఉండే కథలే షార్ట్‌ఫిల్మ్‌లుగా కిందటి వారం వచ్చాయి..


పెళ్లిచూపులు

దర్శకత్వం: జీవీ ఐడియాస్
నటీనటులు : అదిత్య, జాను, సాయి, చైత్ర, మహేశ్, మమత.

పెండ్లి చూపులు మొదటిసారైతే ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ ఫస్ట్ మీటింగ్‌లోనే ఇరువురి గురించి తెలుసుకోవాలను కుంటారు. అయితే వివిధ రకాల మనుషుల మధ్య జరిగే పెడ్లిచూపులు ఎలా ఉంటాయి? వారి అభిప్రాయాలు ఎలా పంచుకుంటారు? ఒకరికొకరు ఫీలింగ్స్ ఎలా తెలుసుకుంటారు? అనే థీమ్‌తో ఈ లఘుచిత్రం ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడే అమ్మాయి, తనకు మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలని కోరుకునే అమ్మాయి ఇలా వేర్వేరు యాటిట్యూడ్‌లతో ఉన్న అమ్మాయిలు పెళ్లి చూపులను ఎలా ఎదుర్కొంటారో అలాగే చిత్రీకరించారు. ఈ ఎలిమెంట్‌తోనే మూడు వేర్వేరు పెండ్లి చూపులకు కామెడీ జోడించి తీశారు. కార్పొరేట్ ఉద్యోగుల మధ్య , నల్లగా ఉండే అబ్బాయికి, మ్యాట్రీమొని ద్వారా పెండ్లిచూపులు ఇలా డిఫరెంట్ క్యారెక్టర్లతో కామెడీ పండించారు. మొదటి నుంచీ ఫన్నీగా ఉంటుంది. మేకింగ్, యాక్టింగ్ బాగున్నాయి. ఆదివారం కదా సరదాగా నవ్వుకోవాలంటే పనిలో పనిగా ఈ లఘు చిత్రం చూసి నవ్వుకోండి.

Total views 148,281+ (జూలై 13 నాటికి) Published on July 8, 2019


మేరీ జాన్

దర్శకత్వం: భాను శంకర్ బొమ్మసాని
నటీనటులు : భాను శంకర్, చైత్ర శెట్టి
ఆకాంక్ష.. కాలేజీలోకి తొలిరోజు అడుగుపెడుతుంది. వచ్చిరాగానే వైష్ణవ్‌ను చూసి క్షణాల్లో ఇంప్రెస్ అవుతుంది. అతనూ కనెక్ట్ అవుతాడు. వీరిద్దరి మధ్య చూపుల ప్రేమ వారం రోజులు సాగుతుంది. ఈ క్రమంలో.. తను ఒక రోజు కనిపించకపోతే వైష్ణవ్ ఎలా ఉంటాడో చూద్దాం అనుకుంటుంది ఆకాంక్ష. ఇలా వైష్ణవ్‌కు కనిపించకుండా దూరం నుంచి గమనిస్తుంది. వైష్ణవ్ యాటిట్యూడ్ నెగెటివ్‌గా ఉంటుంది. కాలేజీలో ర్యాగింగ్ చేయడం, అమ్మాయిలను ఏడిపించడం అన్నీ గమనిస్తుంది. ఇవ్వన్నీ ముందే తెలుసుకోకుండా ప్రేమ పెంచుకుంటుందామె. అయినా మనసుకు నచ్చిన వాడు ఏం చేసినా బాగుంటుందనే ఫీలింగ్‌తో ఉంటుంది . అవ్వన్నీ పట్టించుకోకుండా ఓ రోజు ప్రపోజ్ చేయడానికి వెళ్తుంది. అలా వెళ్లేసరికి వైష్ణవ్ వేరే అమ్మాయితో కలిసి ఉంటాడు. ఆకాంక్ష చాలా బాధపడుతుంది. కానీ అక్కడే కథను మలుపు తిప్పే ప్రయత్నం చేశారు దర్శకులు. వైష్ణవ్ యాటిట్యూడ్ అది కాదనీ, అతనిది పాజిటివ్ ప్రొఫైల్ అని తెలుసుకుంటుంది. అదెలాగో తెలియాలంటే యూట్యూబ్‌లో చూడాల్సిందే..

Total views 72,555+ (జూలై 13 నాటికి) Published on July 5, 2019


అశ్రువు

దర్శకత్వం: రాకేశ్ మాధవన్
నటీనటులు : అక్షయ క్రిష్ణ, సింహ, శ్రావణ్

పిల్లలకు సమస్యలు వస్తే తల్లిదండ్రులకు చెప్పుకుంటారు. అదే తల్లిదండ్రులే పిల్లలకు సమస్య అయితే పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ల మానసిక స్థితి మీద తల్లిదండ్రుల ప్రవర్తన చెడు ప్రభావాన్ని చూపుతుంది కదా!. పిల్లలు కుమిలిపోయి, ఏదైనా చేసుకొనే ప్రమాదం ఉంది. ఈ లఘు చిత్రంలో అలాగే జరుగుతుంది. ప్రేమించి పెండ్లి చేసుకున్న ఓ జంట పెండ్లి తర్వాత తరచూ గొడవలు పడుతూ ఉంటుంది. పిల్లలే దీనికి కారణం అని భర్త, భార్యను చేయి చేసుకుంటాడు. దీన్ని అంతా కూతురు చూసి బాధపడుతుంది. ఏమీ తోచని స్థితిలో అమ్మా, నాన్నకు ఉత్తరం రాస్తుంది. తన వల్లే అన్నీ సమస్యలు అనే తండ్రి మాటలు విన్న ఆ పాప కన్నవాళ్లకు దూరంగా వెళ్లిపోయే నిర్ణయం తీసుకుంటుంది. తెలిసీ తెలియని వయస్సులో ఇలా చేయడానికి కారణం తల్లిదండ్రులు ఇంట్లో నడుచుకునే తీరే అనీ, పిల్లల ముందు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోకపోవడమే అని లఘుచిత్రం చూస్తున్నంత సేపూ అర్థం అవుతూ వస్తుంది. కథకు తగ్గటుగా తల్లిదండ్రుల పాత్రలో నటీనటుల ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. కూతురుగా చిన్న పాప యాక్టింగ్ మొత్తం లఘుచిత్రానికి హైలెట్. మొదటి నుంచీ ఒకే ఫీల్‌తో చేయగలిగింది.

Total views 16,117+ (జూలై 13 నాటికి) Published on July 12, 2019


క్షణకాలం

దర్శకత్వం: సాయి సంకల్ప్
నటీనటులు : తారక్ సతీశ్, సయంతిని భద్ర , జేసెఫ్.

లోయర్ మిడిల్ క్లాస్ ప్రేమకథకు ఓ సందేశాన్ని జోడించి తీసిన లఘుచిత్రం క్షణకాలం. కథ విషయానికి వేస్తే.. రాజు అనాథ. రోడ్లమీదే తన జీవితాన్ని గడుపుతాడు. ఈ క్రమంలో రమ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె ఒక ఇంట్లో చిన్న పని చేస్తుంది. అంతిమంగా రాజు ప్రేమను రమ్య ఒప్పుకుంటుంది. పెండ్లి చేసుకొని జీవితాన్ని కలలు కంటారు. రాజు ఓ సెక్యూరిటీ ఉద్యోగంలో చేరతాడు. అట్లాగే తను రోజు వేళ్లే మార్కెట్‌లో కుమారులు విడిచి పెట్టిన ఇద్దరు వృద్ధదంపతులను గమనిస్తాడు. వాళ్లను అక్కున చేర్చుకొని మొత్తం నలుగురూ కలిసి ఆనందంగా ఉంటారు. కానీ అనుకోని ప్రమాదం జరుగుతుంది అదేంటో యూట్యూబ్‌లో చూడండి. దీన్ని తట్టుకోలేక రాజు మతిస్థిమితం కోల్పోతాడు. ఆనందంగా గడవాల్సిన రాజు జీవితం ఒక్కసారిగా అల్లకల్లోలం అవుతుంది.. అందుకే రోడ్డు ప్రయాణం అంటే మన జీవితాలే కాదు ఇతరుల జీవితాలు కూడా మన చేతిలోనే ఉన్నాయని దర్శకులు సందేశాన్ని ఇస్తారు. బాగుంది. మీరూ చూడండి.

Total views 7,635+ (జూలై 13 నాటికి) Published on July 11, 2019

- వినోద్ మామిడాల, సెల్: 7660066469

182
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles