అద్భుత చిత్రకారుడు క్లాడ్!


Sun,July 14, 2019 01:33 AM

PAINTING
ఒక్క చిత్రం కొన్ని లక్షల పదాలకు సమానం అంటారు. ఏ భాషా, యాసా అవసరం లేకుండానే భావాన్నంతటినీ తెలియజేసేలా క్లాడ్ మోనెట్ చిత్రాలుండేవి. ఇప్పటి వరకూ ఆయన గీసిన ఎన్నో పెయింటింగ్స్ అత్యంత ఖరీదు పలికాయి. క్లాడ్ వేసే చిత్రాలన్నీ ఇంప్రెషనిజం శైలిలోనే ఉంటాయి. చెప్పదలుచుకున్న అంశాన్ని తన చిత్రకళా నైపుణ్యంతో వర్ణించడాన్నే ఇంప్రెషనిజం అంటారు. ఈ విభాగంలో అధిక రేటు పలికిన కళాఖండాలు ఈయన గీసినవి కావడం విశేషం.

క్లాడ్ అసలు పేరు ఆస్కార్ క్లాడ్ మోనెట్. ఆయన ఫ్రాన్స్‌లోని పారిస్‌లో నవంబర్ 14న 1840 జన్మించాడు. ఇంప్రెషనిజం అనేది చిత్రకళా రంగంలో 19వ శతాబ్దంలో వచ్చిన ఓ కళా ఉద్యమం. దీని ద్వారా సమాజంలో ఉండే అసాధారణ అంశాలను వర్ణించడంతోపాటు చక్కగా అర్థవంతంగా ప్రతిబింబింప చేసేవాడు ఆయన. రచయితలు తమ రచనలతో సమాజాన్ని ఏవిధంగా మేలుకోలిపేవాళ్లో అదే విధంగా తన కుంచెతో గీసిన చిత్రాల ద్వారా సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు క్లాడ్‌మోనెట్. ఇటాలియన్ చిత్రకారులైన మచియాయి ఒలి, విన్స్‌హోమర్ వంటి వారు యునైటెడ్ స్టేట్స్‌లో ప్లెయిన్ ఎయిర్ చిత్రలేఖనం గురించి కనుగొన్నారు. ఈ సమయంలోనే ఇంప్రెషనిజం ఫ్రాన్స్‌లో మరింత ఆదరణ పొందింది. ఇంప్రెషనిజం పెయింటింగ్‌లో ఆర్టిస్ట్ తన భావాలను చిత్రలేఖనం ద్వారా చాలా స్పష్టంగా సూటిగా చెప్పేవాడు. దీంతో అప్పట్లో సమాజంలో అత్యంత వేగంగా ప్రభావం చూపడానికి ఉపయోగపడింది. అంతేకాకుండా పలు సామాజిక రుగ్మతలపై పోరాడడానికి ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాలకూ ఇంప్రెషనిజం కళాఖండాలు ఊపిరి పోశాయి. సమస్యే కాదు పరిష్కార మార్గాన్ని కూడా చూపే విధంగా ఈ ఆర్ట్స్ ఉండడం వల్ల జనాల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు చిత్రలేఖన రంగంలోనే అత్యంత శక్తవంతమైన మాధ్యమంగా ఇది మారింది.
PAINTING1
కొంతమంది చిత్రకారులు గీసిన పెయింటింగ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. కవి హృదయం ఉన్న వారే కవితలను ఆస్వాదించగలుగుతారు. అదేవిధంగా ఒక చిత్రకారుడు గీసిన పెయింటింగ్‌లో దాగిన అర్థం, పరమార్థం వాటిని ఆస్వాదించే ప్రేమికులకే బాగా తెలుస్తుంది. పెయింటింగ్ వేసిన ఆర్టిస్ట్‌ను బట్టి దాని గొప్పతనం ఉంటుంది. వారి గొప్పతనాన్ని బట్టే ఆయా కళాఖండాలకు డిమాండు, విలువ మారుతూ ఉంటాయి. ఇప్పుడు క్లాడ్ మోనెట్ ఆర్టిస్ట్ వేసిన కళాఖండం విలువ కోట్లలో పలికింది. ఆ పెయింటింగ్ ధర ఎంతో తెలుసా? రూ.778 కోట్లు. ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎన్నో పెయింటింగ్స్ ఇలా ఎక్కువ ధర పలికి వార్తల్లోకి ఎక్కాయి. ఫ్రాన్స్‌కు చెందిన ఇంప్రెషనిస్ట్ ఆర్టిస్ట్ క్లాడ్ మోనెట్ ఎన్నో అద్భుత చిత్రాలను గీశాడు. ఆయన కుంచె నుంచి జాలువారిన కళాఖండాన్ని ఇటీవల జరిగిన వేలంలో ఓ అజ్ఞాతవాసి అన్ని కోట్లకు కొనుగోలు చేశారు.
PAINTING2
ఫ్రాన్స్‌లో క్లాడ్ వేసిన కళాఖండాలు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యేవి. పెయింటింగ్స్ మ్యూజియానికి తరలించక ముందే మధ్యలోనే ఆయా చిత్రాలను కొనుక్కునేవారట. ఇప్పటి వరకూ క్లాడ్ గీసిన చిత్రాలు కోట్ల రూపాయలు పలికాయి. 1890లో ఆయన వేసిన అద్భుతమైన పెయింటింగ్ తాజాగా బయటపడింది. దానిని వేలం వేయగా అత్యంత ధరకు అంటే రూ.778కోట్లకు అమ్ముడు పోయింది. మోనెట్ వేసిన వాటిల్లో అధిక మొత్తాన్ని చేజిక్కించుకున్నది ఈ చిత్రకళాఖండమే. ఈ పెయింటింగ్‌ను సోతెబి అనే సంస్థ వేలం వేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ధర పలికిన పెయింటింగ్స్ జాబితాలోనే తొమ్మిదో స్థానంలో ఉన్నది. ఇదే కళాఖండాన్ని 1986లో రూ.17కోట్లకు ఓ యజమాని కొనుగోలు చేశాడు. ఈ చిత్రాన్ని వేలం వేసిన సమయంలో దానిని దక్కించుకునేందుకు ఏడుగురు వ్యక్తులు పోటీపడ్డారు. విశేషమేమిటంటే దీనిని గీయడానికి క్లాడ్ మోనెట్ పలు ప్రదేశాలు తిరిగాడు. ఆయన తిరిగిన ప్రదేశాలు, ఆయా వాతావరణం ప్రతిబింబించేలా సరికొత్తగా చిత్రించాడు. అందుకే ఆయన ఎన్నో చిత్రాలు గీసినా, దీనికి అంతటి విలువ దక్కింది.

ఈ పెయింటింగ్‌ను వేయడానికి క్లాడ్ మోనెట్ ఏడాది కాలం పాటు ఎంతో శ్రమించాడు. ఆయన గీసిన పలు చిత్రాలు న్యూయార్క్‌లోని ఆర్ట్ మ్యూజియం, చికాగోలోని ఆర్ట్ ఇనిస్టిట్యూట్, ప్యారిస్‌లోని మ్యూస్డ్ ఒర్సే వంటి మ్యూజియాల్లో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. ఇంప్రెషనిస్ట్ ఆర్ట్ వర్క్‌లో ఇంత పెద్ద మొత్తం దాటిన ఆర్ట్ ఇదే. గతంలో ఆయన వేసిన పెయింటింగ్స్ కంటే ఈ పెయింటింగ్ కాస్త భిన్నంగానూ, సరికొత్తగానూ అనిపించడం వల్లే ఇంత రేటు పలికిందని వేలం సంస్థకు చెందిన ప్రతినిధి తెలిపారు. ఇటువంటివి మరికొన్ని పలు మ్యూజియాల్లో ప్రదర్శన కోసం ఉంచారని, వాటిలో అరుదైన కళాఖండాలను ప్రతి ఏటా ఒకటి చొప్పును వేలం వేయనున్నట్లు ఆయన వెల్లడించాడు.

223
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles