ప్రమాదం తర్వాత?


Sun,July 7, 2019 01:27 AM

crime
- మల్లాది వెంకట కృష్ణమూర్తి

12 సెప్టెంబర్ 1994లో నేను కాలేజీలో చేరిన రెండోవారం రెసెల్‌ని చంపాను. గత ఎనిమిదేండ్లుగా నేను దాని గురించి ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నానో? ఆరెంజ్ రంగు కోన్స్, తెల్ల షార్ట్స్‌లోని యువతి, పిల్లలు ఆడే శబ్దాలు, ఆ తర్వాత...
ఆ సాయంత్రం ఐదున్నరకి చెరువునించి నేను నా కారులో హాస్టల్‌కి వెళ్తున్నాను. నేను తాగానన్నది వదంతి మాత్రమే. నేను పరిమిత వేగంతో వెళ్తున్నాను. పోలీసులు ఆరోపించినట్లుగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం లేదు.
నేను కొన్ని క్షణాలు రేడియోని ఆన్ చేసి వాల్యూం పెంచాను. పేవ్‌మెంట్ మీది పాదచారులని నేను గమనించలేదు. రోడ్ వర్క్ ఎహెడ్ అనే బోర్డ్‌ని, తెల్ల షార్ట్స్‌లో ఉన్న డేరియాని గమనించాను. ఆమె ఇద్దరు మగాళ్ళతో వెళుతున్నది. రోడ్ నిర్మాణం వల్ల ఆ ముగ్గురూ పేవ్‌మెంట్ మీదకాక రోడ్‌మీద ట్రాఫిక్ కోన్స్‌కి అవతల నడుస్తున్నారు. తర్వాత నేనా చోటికి వెళ్ళి చూస్తే పాదచారులు పసుపు పచ్చ టేప్‌ని దాటి వెళ్ళొద్దనే పోలీసుల హెచ్చరిక బోర్డ్‌లు కనిపించాయి.

ఇదంతా ఆలోచిస్తూంటే నేనా కాలానికి తిరిగి వెళ్ళి బ్రేక్‌ని నొక్కితే రెల్ క్షేమంగా ఉండేవాడు అనిపిస్తున్నది. అప్పుడు నా కారు గంటకి 40ై మైళ్ళ వేగంతో వెళ్తున్నా 35 మైళ్ళ వేగంతోనే వెళ్తున్నదని పోలీసులకి అబద్ధం చెప్పాను. ఆ వేగంలో కారు క్షణానికి 59 అడుగుల దూరం ప్రయాణిస్తుంది. ఏదైనా చూసి రియాక్ట్ అయ్యే లోపలే కారు 240 అడుగుల దూరం ప్రయాణిస్తుంది.

క్షణానికి 59 అడుగుల వేగంతో ప్రయాణించే 3500 పౌన్ల బరువుగల నా కారు ఖాకీ షార్ట్ ్స, నీలం రంగు టి.షర్ట్‌లోని రెసెల్‌ని గుద్దుకుంది. రెసెల్ గాల్లో పైకి ఎగిరి కారు బోనెట్‌మీద పడ్డాడు. అతని తల విండ్ షీల్డ్‌కి తగిలి హైవేమీద పడిపోయాడు. విండ్ షీల్డ్‌మీద రక్తం. నేను సడన్ బ్రేక్ వేసి కారు ఆపాను. ఓ మై గాడ్! ఓ మై గాడ్! అని డేరియా అరవడం విన్నాను. నా కారు అతన్ని గుద్దాక 50 గజాల దూరం ప్రయాణించింది. అతని తల అసాధారణ కోణంలోకి తిరిగి ఉంది. నేనో మనిషిని చంపానని చాలా ఆలస్యంగా గ్రహించాను.

అంబులెన్స్, పోలీస్ వాహనాలు వచ్చాయి. డేరియా, ఆమె అన్న క్రిస్ ఏడుస్తున్నారు. క్రిస్‌తో నేను గతంలో ఫుట్‌బాల్ ఆడటంతో గుర్తు పట్టాను. రెసెల్ అమెరికన్ లీగ్ బేస్‌బాల్ టీం కోచ్. హోలేండ్ కాలేజ్‌లో కెమిస్ట్రీ ప్రొఫెసర్ కూడా. నేను చదివిన కాలేజే అది.
నా చొక్కామీది రక్తపు మరకల్ని చూసి పేరామెడిక్ అడిగాడు.

మీకేం కాలేదుగా?
అది పగిలిన అద్దం లోంచి వచ్చిన రెసెల్ రక్తం తప్ప నాది కాదు చెప్పాను.
ముగ్గురు వేర్వేరు పోలీస్ ఆఫీసర్లకి నేను నా స్టేట్‌మెంట్ ఇచ్చాను. మూడోవాడైన డేవ్ నన్ను చాలాసేపు ప్రశ్నించాడు. క్రిస్, డేరియాలని కూడా. తన సోదరుడి ముందు నడిచే డేరియా జరిగింది తను చూడలేదని చెప్పింది.
నేను, మా నాన్న నడుస్తూండగా కాలు మెలిక పడిందేమో కాని ఆయన తూలాడు. నేనాయన చేతిని పట్టుకుని ఆపే లోపలే కారు వచ్చి గుద్దింది. డ్రైవర్‌కి కూడా ఆపేంత సమయం లేకపోయింది. అది అతని తప్పు కాదు క్రిస్ బాధగా చెప్పాడు.
పోలీసులు రెండోసారి బ్రీత్ ఎనలైజర్‌తో నాకు పరీక్ష చేసాక క్రిస్ నా దగ్గరకి వచ్చాడు. అతను నన్ను కొడతాడని భావించాను. కానీ, అనునయంగా చెప్పాడు.
crime1
మీరు చేయగలిగిందేమీ లేదు. అంతా వేగంగా జరిగింది. అది భయంకరమైన ప్రమాదం మాత్రమే
అతని సోదరి డేరియా కళ్ళల్లో మాత్రం నా మీద కోపం, ద్వేషం స్పష్టంగా కనిపించాయి.
నీ మీద ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం లేదు. అందరి స్టేట్‌మెంట్స్ నీకే మద్దతు ఇస్తున్నాయి డిటెక్టివ్ డేవ్ చెప్పాడు.
మా నాన్న వచ్చి నన్ను కారులో ఇంటికి తీసుకెళ్తూంటే పదే పదే చెప్పసాగాను.
అది అనుకోకుండా క్షణాల్లో జరిగిపోయింది. నేనేం చేయలేకపోయాను.
* * *

తర్వాతి కొద్ది రోజులు నేను నా గదిలోనే గడిపాను. ఆకలి, నిద్ర లేవు. మా అమ్మానాన్నలు అది నా తప్పు కాదని, ప్రమాదవశాత్తు జరిగిందని, నన్ను నేను నిందించుకోవద్దని చెప్పారు.
నువ్వు రెసెల్ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించు మా నాన్న సలహా ఇచ్చారు.
వెళ్ళి, వాళ్ళ నాన్నని చంపినందుకు క్షమాపణ వేడుకోనా? వాళ్ళని నేను మళ్ళీ చూడదలచుకోలేదు. ముఖ్యంగా డేరియాని.
వాళ్ళకి జరిగిన నష్టానికి వెళ్ళి సారీ చెప్పిరా మా అమ్మ కూడా చెప్పింది.
కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ వారు బాధితుల కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండకూడదని చెప్పడంతో నేను వెళ్ళలేదు.
నేను తిరిగి కాలేజ్‌కి వెళ్ళాక తోటి విద్యార్థులు నా వంక అదో మాదిరిగా చూడసాగారు. నవంబర్‌లో నేను కాలేజ్ మానేసి న్యూయార్క్ సిటీకి మారాను. అక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని ఉపయోగించసాగాను. నా 21వ ఏట నా డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైర్ అయింది. నేను దాన్ని రెన్యూ చేయలేదు. పదేళ్ళపాటు పీడకలలు వచ్చేవి. చాలా సంవత్సరాలు నేను నిద్రలో పళ్ళు కొరుక్కోకుండా ఆర్థోడాంటిక్ అనే పరికరాన్ని ధరించాను.

నేను చిన్నచిన్న విసుగు పుట్టే ఉద్యోగాలతో కాలక్షేపం చేసాను. నేను ఇక చదువుని పూర్తి చేయలేనని గ్రహించాక మా నాన్న నాకో 50,000 డాలర్లు ఇచ్చి చెప్పాడు.
ఇది నీ చదువుకి ఖర్చు చేద్దామనుకున్న డబ్బు. దీంతో ఏదైనా వ్యాపారం చెయ్యి.
వెస్ట్ విలేజ్‌లో ఓ ఫ్రోజెన్ యోగర్ట్ షాప్‌ని కొన్నాను. అది నా జీవనానికి సరిపోయింది. నేను పెళ్ళి చేసుకోలేదు. ఏ అమ్మాయితో డేటింగ్ చేసినా నా సైకాలజీ వాళ్ళకి నచ్చలేదు.
ఆ రోజు ఆ ప్రమాదంలో బాధితుడు ఒక్కరు కారు. ఇద్దరు. రెసెల్, నేను. అది జరక్కపోతే నా జీవితం ఎలా సాగేదో అలా సాగక పోవడంతో నేనూ బాధితుడ్నే.
* * *

ఏప్రిల్ 2011లో మొదటి శవాన్ని కనుగొన్నారు. రెసెల్ భార్య తమకున్న లేక్ సైడ్ కేబిన్‌ను అమ్మేసింది. రెసెల్ సెలవుల్లో ఆ కేబిన్‌లో వంటరిగా గడిపేవాడు. కొత్తగా కొన్న వాళ్ళు సెప్టిక్ టేంక్ కోసం తవ్వుతూంటే ఓ అస్థిపంజరం బయటపడింది.
కొన్ని వారాల్లోనే పోలీసులు అక్కడ తవ్వి ఎనిమిది అస్థిపంజరాలని వెలికి తీసారు. ఎనిమిది మగ, ఓ ఆడ అస్థిపంజరాలు. వారిలో నలుగురు ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు. వాళ్ళంతా పంతొమ్మిది, ఇరవై మూడు ఏళ్ళ మధ్య వయసు గలవారు అవడం ఒక్కటే పోలిక.
గ్రాండ్ జూరీ రెసెల్ వాళ్ళని చంపారనే అభిప్రాయానికి వచ్చింది. నా కారు గుద్ది చంపబడ్డ ప్రొఫెసర్ రెసెల్ సైకో కిల్లర్.
* * *

తర్వాతి వేసవిలో ఓ వేడి రోజు నా ఫోన్ మోగింది, డేరియా నించి.
గుర్తున్నానా? మీ వాళ్ళు నీ నంబర్ ఇచ్చారు. నీతో ఆ ప్రమాదం గురించి మాట్లాడాలి. ఫోన్‌లోకంటే నీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని అనుకుంటున్నాను.
స్టార్‌బక్స్ కాఫీ షాప్‌లో కలుద్దామని అనుకున్నాం. ఆమెని కలవడానికి నేను భయపడ్డాను.
పిలవగానే వచ్చినందుకు థాంక్స్ ఆమె చెప్పింది.
డేరియా ఇప్పుడు సెక్సీ టీనేజర్ కాదు. 28 ఏండ్ల అవివాహిత.
ముందుగా నీకు క్షమాపణ చెప్పాలి. అప్పుడే చెప్దామనుకున్నాను కాని... కారణం వివరించాను.
డేరియాకి నేను పడ్డ మానసిక వేదన గురించి చెప్పాను. ఆ ప్రమాదం జరిగిన తర్వాత దాని విషయంలో మరోసారి సారీ చెప్పి, ఏడ్చాను. నేను చెప్పేది ఆమె మౌనంగా విన్నది. నేను కుదుట పడ్డాక చెప్పింది.
అది నీ తప్పు కాదు. నీకు స్పందించేందుకు సమయం లేదు. కాబట్టి, నువ్వు దాన్ని ఆపలేకపోయావు. నిజానికి నేనే నీకు క్షమాపణ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మా నాన్న చంపిన వారి కుటుంబసభ్యులందరినీ కలిసి క్షమాపణ వేడుకున్నాను.
క్రిస్ ఎలా ఉన్నాడు? అడిగాను.

పోయాడు.
సారీ! ఎలా?
రోడ్ ప్రమాదంలో. ఆరిజోనాలో. ఆల్కహాల్ తాగి దేన్నో గుద్ది.
మేం కొద్దిసేపు మౌనంగా ఉన్నాక చెప్పింది.
ప్రమాదవశాత్తు మా నాన్నని చంపడం వల్ల చాలామంది యువతీ యువకులు చంపబడకుండా నువ్వు కాపాడావు.
అది నిజం కావచ్చు, కాని నేను ఎన్నడూ అలా గర్వపడలేదు.
దానికి కృతజ్ఞతలు. మా అన్న క్రిస్‌లో కూడా కొన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయి. ఇది నేను చెప్పకూడదు కాని క్రిస్ లేడు కాబట్టి చెప్తున్నాను. క్రిస్‌కి మా నాన్న సైకో కిల్లర్ అని ఎలాగో తెలిసింది. దాన్ని ఆపాలని అనుకుని, అది తెలిసిన రోజే వేగంగా వచ్చే కారుని చూసి మా నాన్నని దాని ముందుకి నెట్టాడు.

ఎందుకని?
ఓసారి తాగినప్పుడు చెప్పాడు. హిట్లర్‌ని ఎందుకు చంపాలనుకున్నారో అందుకే. నీ పిల్లల్ని రక్షించుకోవడానికి నువ్వు నాన్న లాంటి భర్తని చంపవా? అని అడిగాడు. మా మధ్య చాలాసేపు నిశ్శబ్దం.
అంటే తప్పు నాది కాదు. మీ నాన్నని చంపింది క్రిస్ అని చెప్తున్నావా? అడిగాను.
అవును. తమ కారు కింద మనిషి పడి మరణించిన కారు డ్రైవర్ల గురించి ఇటీవల నేనో వ్యాసం చదివాను. అందులో గ్రూప్ థెరపీలో పాల్గొన్న వారిలో నీ పేరు కూడా చూసాను. నీలోని అపరాధ భావం నిన్ను హింసిస్తున్నదని తెలిసాక, మా నాన్నని చంపింది ఎవరో తెలుసుకునే హక్కు నీకు ఉందని అనిపించి నీ దగ్గరకి వచ్చాను.
థాంక్ యు నా కళ్ళమ్మట నీళ్ళు కారుతూంటే చెప్పాను.
నువ్వు చేసింది చెడ్డపని కాదు. అంతకు ఎన్నో రెట్లు మంచి పనని జీవితాంతం గుర్తుంచుకో. ఇక నించి నీకు పీడకలలు రావని ఆశిస్తాను.
డేరియా నాతో కరచాలనం చేసి లేచింది. కొంత దూరం వెళ్ళాక ఆగి, వెనక్కి తిరిగి చూసి, చిన్నగా కన్ను కొట్టి చెప్పింది.
నా భర్త ఈ ప్రపంచంలోని అత్యంత మృదువైన, దయామయుడైన వ్యక్తి. అలాంటి వాడిని ఇప్పుడే చూస్తున్నాను.
(బ్రియాన్ టోబిన్ కథకి స్వేచ్ఛానువాదం)

ముందుగా నీకు క్షమాపణ చెప్పాలి. అప్పుడే చెప్దామనుకున్నాను కాని... కారణం వివరించాను. డేరియాకి నేను పడ్డ మానసిక వేదన గురించి చెప్పాను. ఆ ప్రమాదం జరిగిన తర్వాత దాని విషయంలో మరోసారి సారీ చెప్పి, ఏడ్చాను. నేను చెప్పేది ఆమె మౌనంగా విన్నది. నేను కుదుట పడ్డాక చెప్పింది.

634
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles