నెట్టిల్లు


Sun,June 30, 2019 12:25 AM

జీవితంలో అనుభవం వచ్చే కొద్దీ జ్ఞాపకాలు పెరుగుతాయి. జ్ఞాపకాలు పెరిగాక జీవితం పూర్తవుతుంది. కథలు జ్ఞాపకాలు, అనుభవం, జీవితం నుంచే పుట్టుకొస్తాయి. ఇప్పుడు లఘు చిత్రాలుగా రూపొందుతున్న అన్ని కథలు అనుభవాలు, ఆలోచనల నుంచి పుట్టుకొస్తున్నవే. ఈ వారం యూట్యూబ్‌లో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన కొన్ని లఘు చిత్రాల సమీక్ష.

అనగనగా ఒక నాన్న కథ


దర్శకత్వం: దీప్తి గంట
నటీనటులు : బేబీ వన్షిక, టీఎన్‌ఆర్, సీమా చౌదరి

anaganaga-nanna
నాన్న నిజ జీవితంతో పాటు సినిమాల్లోనే విరోధిలా కనిపిస్తాడు. తొమ్మిదేండ్ల చిన్నారి ప్రియ. స్కూల్ టీచర్ సలహా మేరకు ఒక కథ రాయడం కోసం దీర్ఘ ఆలోచనలో పడుతుంది. కాన్సెప్ట్ ఏంటని అడిగిన తల్లికి నాన్న గురించి స్టోరీ రాయమన్నారని, నా నాన్న గురించి కాకుండా మీ నాన్న గురించి చెప్పు మమ్మీ అని కోరుతుంది. తన తండ్రి ఒక ఫాదరే కానీ గ్రేట్ ఫాదర్ కాలేకపోయారని చెప్పింది. తనను ఎలా నిర్లక్ష్యం చేశారో వివరిస్తుంది. ఆమె జీవితంలో తండ్రి వల్ల ఎదురైన వైషమ్యాన్ని కూడా చెప్తుంది. ఇక్కడి వరకు కథ రొటీన్‌గానే సాగుతుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. అదే అసలు కథకు, జీవం. ఇంతకీ ప్రియ తన తాతని హీరోని ఎలా చేసిందో ఈ షార్ట్ ఫిలిమ్‌లో చూడొచ్చు. ఒక చిన్నారి ఆలోచన నాన్నపై పెంచిన మమకారమే ఈ లఘుచిత్రం. ప్రతి కూతురికి ఒక మేల్కొలుపు అవుతుంది. తండ్రి, గొప్ప తండ్రి ఇద్దరి మధ్య తేడా ఎక్కడో తెలియజేసే ప్రయత్నమే దర్శకురాలు చేసింది.

Total views 631,983+ (జూన్ 22 నాటికి) Published on Jun 16,2019

చెలిమి


దర్శకత్వం: సంపత్ ధనుంజయ్
నటీనటులు : ఎనోజ్ తేజ్, సాహిత్య, వినయ్ మహేష్, వరుణ్ వెంకటేష్

CHELIMI
బీటెక్ కొన్ని వేలమంది విద్యార్థుల కలలు, కథల సమ్మోహనం. అందులో ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఒక్కొక్కరిది ఒక్కో కల. లక్ష్యం సాధిద్దామని ఒకడు, పక్కోడిని సాధిద్దామని ఒకడు. అందరినీ కలుపుకొనిపోయేవాడు ఒకడు, కలిపి ఇచ్చిన కప్పుల్ని ఖాళీ చేసే వాడు ఇంకొకడు. జోలపాడే వాడు ఒకడు, గోల పెట్టేవాడు ఒకడు. అమ్మాయిల్ని పడేసేవాడు ఒకడు, పటాయించేవాడు ఒకడు.. ఇలా ఎన్నో ఎన్నెన్నో. ఏదేమైనా ప్రతిఒక్కరికీ కాలేజ్ లైఫ్‌లో ఒక బ్యాచ్ ఉంటుంది. అది చదువు కోసం పుట్టిన సరస్వతీ పుత్రుల కోసం అయినా కావచ్చు, వైన్‌ని పోషించడానికి పుట్టిన ముద్దుబిడ్డలు అయినా కావచ్చు. చెలిమికి అర్థం చెప్పే ఇలాంటి బ్యాచ్ అయినా కావొచ్చు. అందులో ప్రేమకథలుంటాయి. ప్రేమ వ్యథలుంటాయి. బీటెక్ బ్యాచ్‌మేట్స్ కథ ఇది. నిజాయితీగా తీసిన ప్రయత్నం బాగుంది. నిడివి చా.....లా ఎక్కువనిపించింది. చివరకు పెట్టిన ట్విస్ట్ మంచిగనిపించింది. జీవితమంటే కేవలం జీవించడం కాదు. మన గురించి మనం తెలసుకోవడం అన్న సందేశాన్నిచ్చారు.

Total views 81,813+ (జూన్ 22 నాటికి) Published on Jun 17, 2019

ద ఫేమ్


దర్శకత్వం: సుబాష్, సాయిరాం
నటీనటులు : అనన్య నాగల్ల, రోహిత్ కృష్ణ వర్మ

fame
జీవితంలో ఏదైనా సాధించాలని, గమ్యాన్ని చేరాలని అందరికీ ఉండకపోయినా కొందరికి మాత్రం కచ్చితంగా ఉంటుంది. కెమెరామేన్ కావాలన్న ఆశ ఒకరిది, నటి కావాలన్న కల ఇంకొకరిది. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక అక్క, తమ్ముడు చేసిన ప్రయోగాలే ఈ లఘుచిత్రం. మధ్యలో కొంత బోర్ అనిపించింది. ఈ లఘచిత్రంలో నటించిన అనన్య మల్లేశం బయోపిక్‌లో పద్మగా నటించింది. నటనలో తన ప్రతిభను వెండితెపై ఇప్పటికే ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. పాపులర్ కావాలన్న లక్ష్యంతో అమ్మాయి పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. ప్రయత్నం ఎప్పటికైనా విజయం సాధించే దిశకు తీసుకెళ్తుందన్న నమ్మకాన్ని కలిగిస్తుంది.

Total views 12,545+ (జూన్ 22 నాటికి) Published on Jun 15, 2019

హార్ట్‌బీట్


వాడు వెంటాడుతాడు. వేధిస్తాడు. ప్రేమిస్తాడు. ద్వేషిస్తాడు. ఇష్టపడి ఇరిటేట్ చేస్తాడు. అవును వాడొక ఎమోషనల్ శాడిస్ట్ బాయ్‌ఫ్రెండ్. కండిషన్స్ పెట్టి గేమ్స్ ఆడతాడు. తనంటే పడి చస్తాడు. ఎందుకు ప్రేమించానురా అనేంత టార్చర్ పెడతాడు. నిన్నే ఇష్టపడుతున్నా అంటాడు. తాగుతాడు. తంతాడు. తనే కావాలని తపన పడతాడు. దర్శకుడు ఎంపిక చేసుకున్న కథా వస్తువు కొంత భిన్నమైంది. అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించేవాళ్లే ఇలాంటి కథను ఎంపిక చేసుకునే అవకాశం, ఆస్కారం ఉంటుంది. బీరు వేసి బోరు కొడుతుంది అంటాడు. అర్ధరాత్రి రాత్రి కాల్ చేసి ఆలింగనం చేసుకో అని అడుగుతాడు. అమ్మాయి అతడిలో ఒక సైకోని చూస్తుంది. అబ్బాయి ఆమె ఒక వీర ప్రేమికురాలిని స్వప్నిస్తున్నాడు. ఒకరి వైపు నుంచి ఇది టార్చర్‌లా అనిపిస్తుంది. మరొకరికేమో తన ప్రేమ తన నుంచి విడిపోతే జీవితకాలం ఎలా బతకాలనే ప్రశ్నార్ధకం ఉత్పన్నమవుతుంది. కొన్నిచోట్ల ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది.
herat-beart

Total views 8,713+(జూన్ 22 నాటికి) Published on Jun 21, 2019

అజహర్ షేక్, సెల్: 9963422160

398
Tags

More News

VIRAL NEWS