యోగం ఒక భాగ్యం!


Sun,June 16, 2019 12:59 AM

Yoga
యోగా.. ఒక కళనా? వ్యాయామమా? ధ్యానమా? శాస్త్రమా? సాంప్రదాయమా? యోగ్యమా? భాగ్యమా? ఏంటీ యోగా? అసలిది ఎందుకు? అంటే.. జీవాత్మ.. పరమాత్మ ఏకత్వాన్ని అనుభవంలోకి అందించే సాధనమే యోగా అంటున్నారు నిపుణులు.యోగా అంటే ఏ ఒక్కటో కాదు అనీ.. యోగా కళ.. శాస్త్రం.. సాంప్రదాయం.. వ్యాయామం అన్నీ అని పేర్కొంటున్నారు. యోగా చేస్తే.. జీవితం ఆనందమయ స్థితిలోకి వెళ్తుంది అంటున్నారు? అది ఎలా? సామాన్య స్థాయి నుంచి సాయుజ్య స్థాయి దాకా వెళ్లొచ్చు అంటున్నారు? అదీ ఎలా సాధ్యం? మనసును ఏకాగ్రతగా ఎలా ఉంచొచ్చు? ఏ ఆసనాలు వేస్తే ఏం ప్రయోజనం? వంటివన్నీ మరోసారి తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగభాగ్యంపై ముఖచిత్ర కథనం!

- దాయి శ్రీశైలం
Yoga1
సంపూర్ణ ఆరోగ్యం కోసం.. సంతోషకర జీవితం కోసం మన ఇంట్లోనే.. మనవల్లే లభించే ఏకైక సాధనం యోగా. అందుకే ఇప్పుడు పాశ్చాత్యదేశాలతో సహా.. ప్రపంచం మొత్తం యోగాకు దాసోహం అంటుండటంతో ప్రపంచ యోగా దినోత్సవం అని ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకున్నాం. యోగా ఒక వ్యాయామం మాత్రమే కాదు.. అదొక శాస్త్రం.. సాంప్రదాయం కూడా. మంచి జీవనశైలిని.. ఆయుష్షును అందించే ఏకైక సాధనం యోగా. దీనిని అనుసరిస్తే జీవితం ఆరోగ్యంగానే కాదు.. అర్థవంతంగానూ ఉంటుంది. కాబట్టి రోగాలను తరిమేసి యోగభాగ్యాలను అనుభవించండి.
Yoga14

ప్రయోజనం ఏంటి?


మనసును.. శరీరాన్ని ఏకం చేసి ఒత్తిడిని.. ఆందోళనను.. భయాన్ని దూరం చేసే అవకాశం యోగా కల్పిస్తుంది. దీనినే జగద్గురు శంకరాచార్యులు 27 శ్లోకాలతో యోగా తారావళీ గ్రంథంలో వివరించారు. యోగాను లయ యోగా.. హఠ యోగా.. రాజ యోగా అనే మూడు విధానాల్లో పేర్కొన్నారు. వీటిని లయ యోగం, హఠ యోగం, కేవల కుంభక యోగం, రాజ యోగం, మనోన్మనీ యోగం, ఉన్మనీ యోగం, అమనస్క యోగం, యోగ నిద్ర అనే ఎనిమిది ప్రక్రియలుగా విభజించారు. మనసును ఏకాగ్రం చేసేందుకు ఎన్నో సాధనాలు ఉన్నప్పటికీ వాటిలో సులభమైంది.. సురక్షితమైంది యోగా మాత్రమే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ఆసనాలే యోగా సాధనా పరికరాలుగా ఉపయోగపడుతాయి.

తీరొక్క ఆసనం


యోగాసనాలే సాధనా పరికరాలు అని చెప్పుకున్నాం కదా.. దీంట్లో రకరకాల ఆసనాలు ఉంటాయి. ఒక్కో ఆసనం ఒక్కో విశిష్ఠతను కలిగి ఉంటుంది. ఒక్కో ఆసనం ఒక్కో అర్థాన్ని.. ఆవశ్యకతను కలిగి ఉంటుంది. యోగా శాస్త్రంలో చెప్పిన రేచక.. పూరక.. కుంభక.. ప్రక్రియలతో శరీరంలో ఉండే నాడులున్నీ శుద్ధి అవుతాయి. నాడులన్నీ శుద్ధి అయితే శరీరం లోపల.. మనసు లోపల దానంతట అదిగా ఒక నాదం బయలుదేరుతుంది. దీనినే అనాహత నాదం అంటారు. ఇది రకరకాల ధ్వనులతో వినిపిస్తూ మననసును ఏకాగ్రం చేస్తుంది. ఇలాంటి ఆసనాలు ఇంకా చాలా ఉన్నాయి. ముందుగా.. ఏ ఆసనం వేస్తే ఏం ప్రయోజనమో? ఆధునిక జీవనశైలితో వచ్చే సమస్యలను యోగాతో ఎలా అధిగమించొచ్చో? యోగాసనాలు ఎలా వేయాలో తెలుసుకొందాం.

సర్వరోగ నివారిణి


ఆధునిక జీవనశైలి వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటిని ఎలా అధిగమించాలో అర్థం కాక ఏవేవో అనుసరిస్తుంటారు. మందులనీ.. నివారణోపకరణాలు అనీ మార్కెట్లోకి వచ్చిన ప్రతీ దానిని టచ్ చేస్తుంటారు. కానీ వాటన్నింటికంటే యోగా ఉత్తమం అనేది చాలా తక్కువమంది గ్రహిస్తున్నారు. యోగా ఏ ఔషధమూ కాదు.. ఏ చికిత్సా కాదు. ఇదొక మనో సమతుల్య ప్రక్రియ. దీనికి సమయం కూడా పెద్దగా అవసరం లేదు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చేయాల్సిందల్లా ఒక్కటే.. మనసును లగ్నం చేసి శరీరానికి ఆసనాలను అలవాటు చేయడమే. అలా చేయడం వల్లనే మధుమేహం.. హైబీపీ.. ఒత్తిడి.. స్థూలకాయం.. హార్ట్ ఫెయిల్యూర్.. క్యాన్సర్ వంటివి కూడా తగ్గిపోతాయని నిపుణులు చెప్తున్నారు.

శలభాసనం


దీనివల్ల మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. ఈ ఆసనం పొట్ట దగ్గర ఒత్తిడి పెంచి ఉదర భాగాలైన కాలేయం, క్లోమం సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. గ్రంథుల పనితీరు క్రమబద్ధమై సక్రమంగా జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి. ఇలా రక్తంలో గ్లూకోజ్ శాతం ఎప్పుడూ సమతుల్యంగా ఉండేట్లు చేస్తుంది ఈ ఆసనం. దీనివల్ల డయాబెటీస్‌కు దూరం కావచ్చు. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి.

యోగా ఒక్కటే మార్గం


Yoga2
ప్రస్తుతం పంచభూతాలన్నీ కలుషితమవుతున్నాయి. ఫలితంగా లెక్కలేనన్ని ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ.. ఫలితం ఉండటం లేదు. అలాంటి సమయంలో మన పూర్వీకుల నుంచి వారసత్వంగా.. సాంప్రదాయంగా యోగాను మనం పొందాం. అంటే సకల సమస్యలకు యోగా ఒక్కటే మార్గం. మామూలుగా హార్మోన్‌ల అసమతుల్యత వల్ల ఒత్తిడి పెరిగి థైరాయిడ్, ఆస్తమా, మధుమేహం, బీపీ వంటి సమస్యలు దరిచేరుతున్నాయి. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల అలాంటి వాటిని రాకుండా చేసుకోవచ్చు.
- నిహారికా కన్నన్

యోగాతో కెరీర్ ప్లానింగ్


Yoga3
గతంలో ఉన్న పరిస్థితుల వల్ల ఒత్తిడి తక్కువగా ఉండది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యువత సోషల్‌మీడియా ప్రెజర్ అనే కొత్త సమస్యను తెచ్చుకుంది. ఇలాంటి వాటివల్ల కెరీర్ పట్టాలు తప్పుతుంది. కాబట్టి కెరీర్‌ను పట్టాలెక్కించాలంటే ప్రతి ఒక్కరు విధిగా యోగా చేయాల్సిందే. ముఖ్యంగా సూర్య నమస్కారాలు.. ప్రాణాయామాలు. యోగా చేయడం వల్ల జీవితానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆక్సీజన్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. టీనేజ్ నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తే కెరీర్ బాగుంటుందని ఎన్నోసార్లు నిరూపితమైంది కూడా. అయితే ఒక్క విషయం గుర్తించుకోవాలి. 13 ఏండ్ల లోపు వాళ్లు మాత్రం చెయ్యకూడదు. మెంటల్లీ, ఫిజికల్లీ ఆ వయసులో ఇది అపాయం.
- సంగీత అంకత

సర్వాంగాసనం


Yoga5
దీని ద్వారా మధుమేహం నియంత్రణలో పెట్టుకోవచ్చు. దీనిని ఎలా వేయాలంటే.. ముందుగా వెల్లకిలా పడుకోవాలి. గాలి పీల్చుకుని వదిలేస్తూ ఒక నిమిషం రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు గాలి పీల్చుకుని రెండు కాళ్లనూ 90 డిగ్రీల వరకు పైకి లేపాలి. ఇప్పుడు గాలి వదలివేస్తూ నడుము భాగాన్ని, పొట్టభాగాన్ని భూమ్మీద నుంచి పైకి లేపాలి. రెండు చేతులతో నడుము వద్ద సపోర్ట్ తీసుకుంటూ మొత్తం శరీర భాగాన్ని నేలకు లంభకోణంలో నిటారుగా నిలపాలి. మోకాళ్లనూ వంచకూడదు. దృష్టిని కాలి వేళ్లమీద నిలపాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సమయం ఊపిరి మామూలుగా పీల్చుతూ ఉండాలి. నెమ్మదిగా వెన్నెముకను భూమ్మీదకు తెస్తూ ముందుగా వీపు, నడుము, చివరగా కాళ్లు భూమిని తాకేలా చూడాలి. తరువాత శవాసనంలో రిలాక్స్ అవ్వాలి.

ఉపయోగం:


- శరీరంలో శక్తిని ఇనుమడింపచేస్తుంది. జుట్టు రాలడం నివారిస్తుంది.
- థైరాయిడ్ గ్రంథి ఉత్తేజితం అవుతుంది.
- ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
- మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది.

హలాసనం


Yoga6
మధుమేహాన్ని నయం చేసే ఆసనాల్లో హలాసనం కూడా ఒకటి. ముందుగా వెల్లకిలా నేలమీద పడుకోవాలి. గాలి పీల్చుకొని నెమ్మదిగా గాలి వదులుతూ రెండు కాళ్ళను సమాంతరంగా లేపి తలమీదుగా వెనక్కి తీసుకెళ్ళి భూమిమీద ఆన్చాలి. మొదట చేసేటప్పుడు నడుము దగ్గర చేతుల సపోర్టు తీసుకోవచ్చు. సపోర్ట్ అవసరం లేదనుకుంటే చేతులు కింద పెట్టవచ్చు. రెండు మోకాళ్ళు వంచకుండా ఉండాలి. ఆసన స్థితిలో నెమ్మదిగా గాలి పీల్చుకుని వదులుతూ ఉండాలి. ఇలా ఉండగలిగినంత సమయం ఉండి నెమ్మదిగా యథాస్థితికి రావాలి. కాళ్ళు రెండూ నేలకు ఆనేవరకు మోకాళ్ళు వంచకూడదు. ఆసనం తర్వాత శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. మొదట 20 సెకన్ల నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా ఆసనస్థితిలో ఉండే సమయం పెంచాలి. మొదట కాళ్ళు నేలకు ఆనకున్నా ప్రయత్నం మీద సాధించవచ్చు.

ఉపయోగం:


- కాలిలోని అన్ని కండరాలు, లిగమెంట్లు బాగా స్ట్రెచ్ అవ్వడం వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
- లెగ్ క్రాంప్స్‌తో బాధపడే వారికి ఇది చాలా ఊరటనిస్తుంది.
- పొట్ట భాగం కుంచింపబడడం వల్ల ఆసనస్థితి నుంచి బయటికి వచ్చినప్పుడు ఒక్కసారిగా రక్తప్రసరణ పెరుగుతుంది.
- టాక్సిన్లు బయటికి విడుదలవుతాయి. ఇదే స్థితి మెడ వద్ద, ఊపిరితిత్తుల వద్ద కూడా జరుగుతుంది.
- నిద్రపోయినపుడు వెన్నెముక కంప్రెస్ అయినట్లు, స్టిఫ్ అయినట్లు అనిపిస్తే ఉదయం లేవగానే వార్మ్ అప్ తర్వాత హలాసనం ప్రాక్టీస్ చెయ్యవచ్చు.
- థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపడుతుంది.
- లివర్, కిడ్నీలను ఉత్తేజితం చేస్తుంది.

ప్రాణాయామం


Yoga7
హైపర్‌టెన్షన్ అనేది సైలెంట్ కిల్లర్. ప్రాథమిక దశలో దీనిని గుర్తించినట్లయితే చాలా మంచిది. ప్రాణాయామాలు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే హైపర్ టెన్షన్ తగ్గిపోతుంది. ముఖ్యంగా నాడీశోధ ప్రాణాయామం.

నాడీశోధ ప్రాణాయామం: పద్మాసనంలోకానీ, సిద్ధాసనంలోకానీ, సుఖాసనంలోకానీ కూర్చొని కుడిచేతి బొటనవేలితో కుడినాసికా రంధ్రం మూసి.. ఎడమ నాసికా రంధ్రంతో నెమ్మదిగా, దీర్ఘంగా, సులువుగా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు ఎడమనాసికా రంధ్రాన్ని ఉంగరం వేలు, చిటికెనవేలుతో మూసివుంచి, బొటనవేలు వదిలేసి కుడి నాసికారంధ్రం నుంచి గాలి వదిలేయాలి. కుడిచేతి బొటన వేలితో ఎడమ నాసికారంధ్రం మూసేయాలి. ఇప్పుడు కుడి నాసికా రంధ్రంతో నెమ్మదిగా, దీర్ఘంగా, సులువుగా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు కుడి నాసికా రంధ్రాన్ని చిటికెన వేలుతో మూసి ఉంచి, బొటనవేలు వదిలేసి ఎడమ నాసికా రంధ్రం నుంచి గాలి వదిలేయాలి.

ఉపయోగం:


- ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు చేయాల్సిన అద్భుతమైన ప్రాణాయామం ఇది.
- దీనిద్వారా రక్తం శుద్ధి చేయడానికి కావాల్సిన ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది.
- రక్తనాడులను శుద్ధి చేస్తుంది.
- మెదడును శాంతిపజేస్తుంది.
- స్ట్రెస్, యాైంగ్జెటీని తగ్గిస్తుంది.
- మెదడులోని కుడి, ఎడమ భాగాల మధ్య సమన్వయం చేకూర్చి ఆలోచనా పద్ధతిని క్రమబద్ధం చేస్తుంది.

పర్వతాసనం


Yoga8
ఈ ఆసనం ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సూర్యనమస్కారంలో అశ్వచాలాసనం తరువాతిది పర్వతాసనం. దీనిలో శరీరం రివర్స్ వి ఆకారంలో ^ ఇలా ఉంటుంది. ఓం మరీచియేనమః అనే మంత్రం ఉచ్ఛరిస్తూ పర్వతాసనం చేయాలి. శ్వచాలనాసనంలో నుంచి ఎడమపాదాన్ని కూడా వెనక్కి తీసుకెళ్ల కుడిపాదం పక్కన ఉంచాలి. తలను రెండు చేతుల మధ్యనుంచి లోపలికి తీసుకురావాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉండి. తిరిగి యథాస్థితికి రావాలి.

ఉపయోగం:


- పొట్ట తగ్గుతుంది
- మడమలు, మోకాళ్లు బలపడతాయి.
- చేతులు మంచి ఆకారాన్ని సంతరించుకుంటాయి.

వశిష్ఠాసనం


Yoga9
దీనిద్వారా కొవ్వు కరిగిపోయి పొట్ట తగ్గుతుంది. పొట్టతోపాటు నడుము, వెన్నెముక శక్తివంతమై శరీరం దృఢంగా ఉంటుంది.

ఎలా వేయాలి?: మొదట నిటారుగా నిలబడాలి. ఇప్పుడు కుడిచేతిని నెమ్మదిగా నేలకు ఆన్చాలి. శరీరం బరువు మొత్తం చేతిమీద ఉంటుంది. పాదాలు, చేతిమీద పాదాలు, చేతిమీద మొత్తం శరీరం బ్యాలెన్స్ చేయాలి. రెండు పాదాలు ఒకదానిమీద ఒకటి ఉండాలి. మోకాళ్లు వంచకుండా నిటారుగా ఉండాలి. ప్లాంక్ పొజిషన్ నుంచి శరీరం మొత్తం బరువు చేతి మీదకు షిఫ్ట్ చేయబడుతుంది. ఇది మొదట చేసేవారికి కష్టమవుతుంది. ప్రాక్టీస్‌మీద అలవాటవుతుంది. రెండుకాళ్లను నిలువుగా ఉంచడం కష్టం కాబట్టి ముందుగా ఒక కాలుపై సపోర్టు తీసుకున్న తరువాత దానికి సమాంతరంగా మరో కాలును జతచేయాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండి యథాస్థితికి రావాలి.

ఉపయోగం:


- చేతులు, మడమలు బాగా శక్తివంతమవుతాయి.
- బ్యాలెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది.
- కాళ్లు బలపడతాయి.
- వెన్నెముక శక్తివంతం అవుతుంది.
- పొట్టచుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది.

జాను శీర్షాసనం


Yoga10
ఇది మోకాళ్లు.. కీళ్ల సమస్యను పరిష్కరింపజేస్తుంది. జాను అనగా మోకాలు. ఈ ఆసనంలో తలను మోకాలు దగ్గరకు తీసుకొస్తాం కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది.

ఎలా వేయాలి?:

రెండుకాళ్లనూ ముందుకు చాచి వెన్నెముక నిటారుగా ఉంచి దండాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు కుడికాలిని మడిచి కుడిపాదం ఎడమకాలి తొడదగ్గర ఆన్చి ఉంచాలి. రెండు చేతులనూ పైకి చాచి గాలి పీల్చుకుని, శరీరాన్ని ఎడమవైపుగా తిప్పాలి. గాలి వదులుతూ రెండు చేతులనూ ముందుకు వంచి ఎడమ పాదాన్ని పట్టుకోవాలి. రెండు చేతులూ పాదం చుట్టూ పెనవేయాలి. పొట్టలోపలికి లాగిపట్టి ఉంచాలి. ఇలా 5 నుంచి 8 సెకెన్లపాటు ఉన్న తరువాత గాలి పీల్చుకుంటూ తల, శరీరం, చేతులు పైకి తీసుకురావాలి. ఇలా 5 సార్లు ఎడమకాలితో, 5 సార్లు కుడికాలితో చేయాలి.

ఉపయోగం:


- వెన్నెముక చుట్టుపక్కల రక్త ప్రసరణను పెంచుతుంది.
- బ్యాక్‌పెయిన్‌ను తగ్గిస్తుంది.
- లివర్, స్ప్లీన్ (చేదు)ల పనితీరును మెరుగుపరుస్తుంది.
- ఉదరాంగాలకు మంచి మసాజ్ అవుతుంది.
- ఊపిరితిత్తులను శక్తివంతం చేస్తుంది.
- నాడీవ్యవస్థను బాగా ఉత్తేజితం చేస్తుంది.

సర్పాసనం


Yoga11
అష్టాంగ నమస్కారాసనం నుంచి సర్పాసనంలోకి వెళ్తారు. రెండు అరచేతులు, రెండు కాళ్ల వేళ్లమీద శరీరం బరువు బ్యాలెన్స్ చేయాలి. గాలిని పీల్చుకుని ఈ స్థితిలో కొన్ని సెకన్లపాటు ఉండాలి. మొదటిసారి ప్రయత్నించేవాళ్లు మోకాళ్లను భూమిమీద ఆన్చాలి. ప్రాక్టీస్ కొద్ది మోకాళ్లను పైకెత్తే ప్రయత్నం చేయాలి.

ఉపయోగం:


- వీపు భాగం శక్తివంతమవుతుంది.
- సర్పాసనం ఊపిరితిత్తులకు బలం చేకూరుస్తుంది
- ఆస్తమా ఉన్నవారికి చాలా మంచిది.
- భుజాలు, చేతులు మంచి ఆకారాన్ని సంతరించుకుంటాయి.
- పొట్టలోని అన్ని భాగాలకూ మంచి మసాజ్ అవుతుంది.
- రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది.
- డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది.

అర్ద శలభాసనం


Yoga13
బ్యాక్ పెయిన్ ఇంతకు ముందు వృద్ధాప్యంతో ముడిపడి ఉండేది. కానీ ఇప్పుడు యుక్తవయసు వారిని కూడా బాధపెడుతున్నది. దీనికి చాలా కారణాలున్నాయి. ఏ విధమైన ఎక్సర్‌సైజ్ శరీరానికి లేకపోవడం, ఒకేచోట కూర్చుని పనిచేయటం, ఇంట్లో పనులకు విపరీతంగా మెషీన్లను వాడటం వల్ల శరీరానికి కావాల్సిన వ్యాయామం కలగకపోవడం వంటివి. దీని నుంచి ఉపశమనం పొందడానికి ఈ ఆసనం వేయాలి.

ఎలా వేయాలి?: బోర్లా పడుకుని చుబుకం నేలకు ఆన్చాలి. పిడికిలి బిగించి చేతులు శరీరానికి సమాంతరంగా కాళ్లకిందుగా ఉంచాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుని కుడికాలును వీలున్నంతపైకి లేపి 5 నుంచి 8 సెకన్లపాటు ఆ స్థితిలో ఉంచాలి. గాలి వదులుతూ నెమ్మదిగా కాలు కిందికి తీసుకురావాలి. కాలు పైకి లేపి ఉంచినప్పుడు మోకాలి వద్ద ఉంచకుండా ఉండాలి. ఇలా మూడుసార్లు చేయాలి. ఇదే విధంగా ఎడమకాలితో కూడా మూడుసార్లు చేయాలి.

ఉపయోగం:


- కాళ్లను, కాలి కండరాలను శక్తివంతం చేస్తుంది.
- రుతు సంబంధమైన సమస్యలను నివారిస్తుంది.
- బ్యాక్‌పెయిన్, సయాటికా నొప్పిని తగ్గిస్తుంది.
- వెన్నెముకను దృఢంగా ఉంచుతుంది.
- జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది.
- మూత్రాశయం శక్తివంతంఅవుతుంది.
- ప్రసవం తరువాత మహిళల్లో వచ్చిన నడుంనొప్పి నివారణకు బాగా ఉపయోగపడుతుంది.

ప్లాంక్ ఫోజ్


Yoga12
శరీరంలో పొట్ట భాగంలో కొవ్వును తగ్గిస్తూ ఉదర కండరాలను శక్తివంతం చేయడానికి వశిష్టాసనం బాగా ఉపకరిస్తుంది. మనం రోజూ చేసే ఆసనాలతో పాటు... రోజు విడిచి రోజు వీటిని చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

ఎలా వేయాలి?: బోర్లా పడుకోవాలి. రెండు అరచేతులు, రెండు పాదాలమీద శరీరాన్ని పైకిలేపాలి. అరచేతులు భుజాలకిందుగా సమాంతరంగా ఉండాలి. ఉదర కండరాలు కుదించి ఉండాలి. ఇప్పుడు గాలి పీల్చుతూ కుడికాలుని పైకి ఎత్తాలి. తిరిగి గాలి వదులుతూ కాలు కింద పెట్టాలి. మరలా గాలి పీల్చుతూ ఎడమకాలును పైకి ఎత్తాలి. తిరిగి గాలి వదులుతూ కాలు కింద పెట్టాలి. ఇలా కుడికాలుతో పదిసార్లు, ఎడమకాలుతో పదిసార్లు చేయాలి. కొద్ది సమయం బోర్లా పడుకుని రిలాక్స్ అవ్వాలి. మళ్లీ ఒకసారి పై మాదిరిగా రిపీట్ చేయాలి.

ఉపయోగం:


- మొత్తం శరీరంలోని అన్ని భాగాలకు మంచి ఎక్సర్‌సైజ్ అందుతుంది.
- శరీరం బ్యాలెన్స్ పెరుగుతుంది.
- ఉదర కండరాలను శక్తివంతం చేస్తుంది.
- మణికట్టు, భుజాలు దృఢంగా తయారవుతాయి.

712
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles