విప్లవాన్ని శ్వాసించిన ధిక్కారస్వరం చేగువేరా


Sun,June 16, 2019 12:59 AM

గెరిల్లా యుద్ధానికి ఆద్యుడైన వాడు. మిలిటరీ యుద్ధ వ్యూహ నిపుణుడు, సైన్యాధిపతి, మిక్కిలి డాక్టరు, గొప్ప రచయిత కూడా. నిద్ర పోతున్న జాతిని జాగృతం చేసి జన చైతన్యం తెచ్చినవాడు. ప్రపంచ విప్లవపటంపై చెక్కుచెదరని ఎర్రసంతకం, ఉద్యమానికే ఉద్యమం నేర్పిన నిలువెత్తు రూపం, తన శ్వాసలో.. ధ్యాసలో.. బానిస సంకెళ్లను తెంచాలన్న ఆకాంక్షలే అధికం. ఎక్కడ సామాజిక విప్లవం పురుడు పోసుకోవాలన్నా ఆయన మాట తలవకుండా ఉండలేదు ప్రపంచం. అర్జెంటీనా క్యూబా గుండెల కొండల నడుమ ఉదయించిన విప్లవ సూర్యుడు. డాక్టర్ చదువు చదివి, క్యూబా విముక్తి పోరాటంలో ఫిడెల్ కాస్ట్రోతో పనిచేసి, మంత్రి బాధ్యతలు చేపట్టి, ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన చేగువేరా.. తను నమ్మిన సిద్దాంతానికి, విప్లవ ఉద్యమాలకు ప్రాణం పోసిన వీరాధివీరుడు. పదవులు తృణప్రాయంగా వదిలి బొలివియా విముక్తి పోరాటం చేస్తూ అమెరికా చేతిలో హత్యకు గురైన చేగువేరా చివరిపేజీ.
CheHigh
చావు అతినికెదురుపడ్డా.. అతను చావుకు ఎదురు పడ్డా ఆ చావే భయంతో చచ్చిపోతుంది. భయమెరుగని ఆయన పోరాటానికి ప్రపంచమే సలాం చేసింది. ప్రపంచ విప్లవ సాహసిగా అతని పేరు చెక్కుచెదరనిది. అతనే చేగువేరా. ఈ పేరు చాలామందికి ఒక విప్లవకారుడిగానే తెలుసు. కానీ ఆయన గొప్ప రచయిత కూడా. ఆయన పుట్టింది అర్జెంటీనాలోనైనా క్యుబా విముక్తికోసం పోరాడినవాడు. సామాన్యుడి బాధలు తీరాలంటే విప్లవం ఒక్కటే మార్గమని నమ్మినవాడు అందుకే తనను తాను ప్రపంచ విప్లవకారుడిగా మలుచుకున్నాడు. ఒక్క ప్రాంతానికి, ఒక్క వర్గానికీ పరిమితం కాకుండా ప్రపంచ విముక్తి కోసం ఉద్యమించినవాడు.

అది 1956, క్యూబా

అప్పటి క్యూబా అధ్యక్షుడు బాటిస్థా క్రూర విధానాలతో ప్రజలు విసుగెత్తి పోయారు. అదే సమయంలో యువన్యాయవాది అయిన ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలో యువత, సాయుధ పోరాటానికి సిద్ధపడుతున్న రోజులు. విప్లవం నిరంతరం శ్రమించే వారితో జత కూడాడు . తను క్యూబా జాతీయుడు కాకున్నా వారి స్వేచ్ఛ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని పోరాటతత్త్వం కలిగి ఉండటాన్ని చూసి చేగువేరాను బాగా ఇష్టపడ్డాడు ఫిడెల్ కాస్ట్రో.
అదే ఏడాది నవంబర్ 25న గువేరా, కాస్ట్రో మరో 81 మంది యోధులు మెక్సికో నుంచి క్యూబాకు చేరారు. 1958 డిసెంబర్ 30న క్యూబాను వశం చేసుకొన్నారు విప్లవవీరులు. 1959, జనవరి 1న క్యూబా స్వాతంత్రదేశంగా ఆవిర్భవించినట్లు ప్రకటించారు. కాస్ట్రో క్యూబా అధ్యక్షుడిగా పదవి చేపట్టాడు. 1959 జనవరి రెండున కాస్ట్రో గువేరాను మిలిటరీ కమాండర్‌ను చేశాడు. 1959 ఫిబ్రవరి 7న చేగువేరాకు పౌరసత్వం ప్రదానం చేశాడు. అంతేకాదు, వ్యవసాయ సంస్కరణల జాతీయ సంస్థకు డైరెక్టర్‌గా నియమించాడు. ఆ తర్వాత క్యూబా జాతీయ బ్యాంక్‌కు అధ్యక్షుడిని చేశాడు. వెంటనే తన మంత్రివర్గం లో పరిశ్రమల మంత్రిగా తీసుకొన్నాడు. దీనితో బాటు క్యూబా ఆర్థికశాఖకు ఇంచార్జినీ చేశాడు. కానీ అక్కడ కమ్యూనిస్టు యోధుడు కాస్ట్రో ఉన్నాడు కనుక తన అవసరం క్యూబాకు లేదని చే భావించాడు.

క్యూబాలో విప్లవం విజయవంతం అయ్యాక దక్షిణాఫ్రికాలో కాంగో సంక్షోభం గువేరాను కదిలించింది.1963 లో గెరిల్లా వార్ ఫేర్‌అనే క్లాసిక్ పుస్తకాన్ని రాశాడు చేగువేరా. సామ్రాజ్యవాద ప్రభావం అంతగా లేని ఆఫ్రికాలో విప్లవోద్యమం ఖచ్చితంగా విజయవంతమవుతుందని గువేరా అభిప్రాయం. అందులో భాగంగానే 1965లో క్యూబాలో తన అత్యున్నత స్థానాలను, దేశాన్ని వదిలి కొద్దిమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికాలోని కాంగోలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఆ దేశ తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించాడు. స్థానికులను తీసుకొచ్చి గెరిల్లా శిక్షణ ఇచ్చి విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్లాలనుకున్నాడు. అయితే గువేరా అనుకున్నది ఏదీ జరగలేదు. కాంగో ఉద్యమకారులు బలంగా పోరాడలేక పోవడం, ఆఫ్రికా ఆర్మీకి అమెరికా ఇంటిలెజెన్స్ సంస్థ సిఐఎ సహకారం అందించడంతో గువేరా ముందుకు పోలేకపోయాడు. అప్పటికే ఆరుగురు మరణించారు. మరోపక్క అనారోగ్యం గువేరాను చాలా ఇబ్బందులకు గురి చేసింది. గెరిల్లా యుద్ధం గురించి వివరించే తన రచనలలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మాణం కావాలని ఆకాంక్షించాడు. జీవితంలోఏదైనా సాధించాలంటే అన్నింటినీ, అందరినీ వదులుకోవటానికి సిద్ధంగా ఉండాలి అంటూ పేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తి చేయాలనుకున్నాడు.

కాంగో కమ్యూనిస్టుల అసమర్థత, అత్యాధునిక అమెరికా ఆయుధాల బలం, వెంటాడిన అనారోగ్యం కారణాలు ఏదైతేనేమి కాంగోలో చెగువేరా గురి తప్పింది. అయినా నిరాశ చెందలేదు. మళ్లీ ఉద్యమాన్ని బొలివియా వైపు మళ్లించాడు. బోలీవియాలో విప్లవోద్యమ అవసరం ఎంతైనా ఉందని భావించాడు. కాంగోలో పరాభవం ఎదురైనప్పటికీ ఆ అపజయాన్ని మరచిపోయి బొలివియా చేరాడు గువేరా. బొలీవియా సైన్యానికి మిలిటరీ ట్రైనింగ్‌లో అంతగా అనుభవం లేదన్నది గువేరా అంచనా. వాళ్ల దగ్గరున్న ఆయుధ సంపత్తి అంతంత మాత్రమేనని గువేరా అంచనా వేశాడు. బొలివియాలో విజయం ఖాయమనే ధీమాలో ఉన్నాడు గువేరా. అయితే వాస్తవాలు వేరే విధంగా ఉన్నాయి. బొలివియా ఆర్మీకి అమెరికా సైన్యం శిక్షణ ఇచ్చి రాటుదేల్చింది. ఆధునిక ఆయుధాలను సమకూర్చింది. అవి చాలవన్నట్లు తమ సైన్యాన్ని బొలీవియాకు అండగా పంపింది. అమెరికా ఇంటిలిజెన్స్ సంస్థ సిఐఎను కూడా రంగంలోకి దించింది.

అమెరికా టార్గెట్ ఒక్కటే చేగువేరాను పట్టుకోవడం, విప్లవాన్ని అణిచివేయడం. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే శక్తులకు గుణపాఠం చెప్పడం. ఆ క్రమంలో అమెరికా కొంత మేర విజయం సాధించిదనే చెప్పాలి. బొలివియా ఆర్మీ రెట్టించిన ఉత్సాహంతో దూసుకువచ్చింది. చేగువేరా దళం సంఖ్య అంతకంతకూ తగ్గిపోయింది. చివరకు దళం బలం యాభైకి పడిపోయింది. బొలివియా కమ్యూనిస్టు పార్టీ నుంచి ఏ మాత్రం సాయం అందలేదు. చిలీ, అర్జెంటీనా, పరాగ్వే సరిహద్దుల్లో గెరిల్లా స్థావరం ఏర్పరచుకున్న చే బొలివియా సైనిక ప్రభుత్వంపై 11 నెలలపాటు అలుపెరుగని పోరాటం సాగించారు. అంతకంతకూ అనుచరులు మరణించడం, స్థానిక ప్రజలు కానీ, కమ్యూనిస్టు పార్టీ కానీ సహకారం అందించకపోవడంతో సైన్యానిదే పై చేయి అయ్యింది.

ఒక దశలో బొలివియా సైన్యం గువేరాను చుట్టుముట్టింది. ఎటు వెళ్లడానికి అవకాశం లేదు. అమెరికన్ గూఢచార సంస్థ CIA ప్రతినిధి రోడ్రిగ్జ్ ఫిలిప్స్ నేత్రుత్వంలోని బృందానికి పట్టుబడ్డాడు చే. బొలివియా సైనికుడు గువేరా వైపే చూస్తున్నాడు. అది చూసిన గువేరా సింహంలా గర్జించాడు. నన్ను షూట్ చేయకు. నేను గువేరాను. నేను చావ డం కన్నా బతికుంటేనే మీకు లాభం అని తూటాల్లాంటి మాటలు వదిలాడు. ఆర్మీ వచ్చి గువేరాను బంధించింది. ఆ సమయంలోనూ గువేరా తలదించలేదు. నిర్లక్ష్యపు చూపులను విసురుతూ సింహంలానే ముందుకు కదిలాడు. పై అధికారుల ఆదేశాల కోసం ఆర్మీ ఎదురు చూస్తున్నది.

మృత్యువుకు అడుగు దూరంలో ఉన్నా బెదురు లేదు. తుపాకీ గుండెలవైపు చూస్తున్నా అదురులేదు. బుల్లెట్లు, తుపాకులు విప్లవాన్ని ఆపలేవన్న ధీమా. చివరి శ్వాస వరకు విప్లవ పోరాటాన్ని సాగించాలన్న జీవిత లక్ష్యం వెరసి చెగువేరా మృత్యువును నిర్లక్ష్యంగానే చూశాడు.
CheHigh2

1967 అక్టోబర్ 7రాత్రి బాగా చీకటిగా ఉన్న సమయం.

గువేరాను బంధించి ఓ స్కూల్ బిల్డింగ్‌లోకి తెచ్చారు. బొలివియా అధికారులు ఇంటరాగేట్ చేయడానికి చెగువేరా ఒప్పుకోలేదు. అయితే బొలివియా సైనికులతో మాట్లాడానికి మాత్రం గువేరా అభ్యంతరం చెప్పలేదు. తనను బంధించి తీసుకువస్తుంటే గువేరా ప్రతిఒక్కరి వైపు చూశాడు. చిరుత కళ్లల్లా గువేరా చాలా తీక్షణంగా చూశాడు. గువేరా కళ్లల్లోకి సూటిగా చూడ్డానికే సైనికులు చాలా భయపడ్డారు. ఎవరినీ లెక్క చేయని గువేరా తనకు కాస్తా పొగాకు కావాలని అడిగాడు. గువేరాకు పొగాకు అందివ్వాలని బ్యాగును అందించిన మారియో టెరాన్ అనే సైనికుడు అతని కళ్లల్లోకి సూటిగా చూసి పొగడ్తలతో ముంచెత్తాడు. బోనులో ఉన్నా సింహం సింహమేనని ఆ సైనికుడు అన్నాడు. మొత్తానికి గువేరాను ఓ చోటకు తెచ్చి నిలబెట్టారు. దేని గురించైనా ఆలోచిస్తున్నావా అని ఆ సైనికుడు చేగువేరాను అడిగాడు. దానికి గువేరా సైనికుడు బిత్తరపోయేలా సమాధానం ఇచ్చాడు. నేను విప్లవం గురించి తప్ప దేని గురించి ఆలోచించనని గర్జించి చెప్పాడు.

అది 1967 అక్టోబరు 9.. మధ్యాహ్నం.. ఒంటిగంటా పదినిమిషాలు.. బొలివియాలోఒక స్కూలులో చేగువేరాను బంధించి అప్పటికీ రెండు రోజులు. మరణందేహానికేకానీ, ఆలోచనలకు కాదు అని, చనిపోయే ముందు కూడా తనను కాల్చడానికి వచ్చిన వాడ్నిచూసి.. చంపాలని తహతహలాడుతున్నావా? పిరికిపందా కాల్చు. నువ్వు నన్ను మాత్రమే కాల్చగలవు కాని నాలోని విప్లవాన్ని, సిద్ధాంతాన్ని ఏమి చేయలేవని తుపాకీకి తన గుండెల్ని చూపించాడు. ఆ సైనికుడు వణికిపోయాడు. ఎందుకంత అవస్థపడుతున్నావ్..చంపడానికొచ్చావ్.. దమ్ముంటే చంపు పిరికిపందా అంటూ గర్జించిందాయోధుడిగళం. మారియో టెరాన్ అనే బొలివియాన్ సార్జం ట్ చేగువేరాను కాల్చి చంపాడు. కాళ్లలోరెండూ, మోకాళ్లలోరెండూ, ఛాతీలోరెండు, పక్కటెముకలో ్లరెండు, గుండెలో ఒకటీ.. మొత్తం తొమ్మిది బుల్లెట్లు శరీరంలో దిగబడ్డాయి. విప్లవ సింహం నేలకొరిగింది. సామ్రాజ్యవాదుల గుండెల్లో ప్రకంపనలు , భుకంపాల్ని సృష్టించిన విప్లవయోధుడు శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు.

చేగువేరాను కాల్చి చంపిన తరువాత.. హెలికాఫ్టర్‌లో సమీప పట్టణమైన వ్యాలీ గ్రౌండ్ కు తరలించారు. అక్కడి ఆసుపత్రిలో ఉంచి విలేకరులకు ప్రదర్శించారు. మూడు రోజులు అక్కడే ఉంచి, చే రెండు చేతులూ తొలగించారు. ఆ తరువాత ఆయన భౌతిక కాయాన్ని గుర్తు తెలియని ప్రదేశానికి పంపారు. అక్టోబరు 15న చే మృతి గురించి ఫిడెల్ కాస్ట్రో అధికారికంగా ప్రకటించారు. దాదాపు మూడున్నర దశాబ్ధాల తరువాత వ్యాలీగ్రౌండ్ ప్రాంతంలో చేతులు లేని అస్థిపంజరం ఒకటి బయటపడింది. పరీక్షలు జరిపిన ఫోరెన్సిక్ నిపుణులు అది చేగువేరాకు చెందినదేనని తేల్చారు. చివరకు 1997లో క్యూబాలోని శాంతాక్లారాలో ప్రభుత్వం సైనిక లాంఛనాలతో చేగువేరాకు అంత్యక్రియలు జరిపి అక్టోబర్ 17న గువేరాను క్యూబా శాంతాక్లారాలో గౌరవంగా సమాధి చేశారు. ఆ సందర్భంగా కాస్ట్రో మాట్లాడుతూ . Che is fighting and winning more battles than ever ..thank you Che for your birth ,your life ,and your example .thank you for coming to re inforce us in difficult struggle in which we are engaged to day to preserve the ideas for which you fought so hard అని ప్రశంసించాడు.

CheHigh1
చే అసలు పేరు ఎర్నస్తో గువేరా. పుట్టింది 1928 జూన్ 14న అర్జెంటెనాలోని రోజారియో అనే పట్టణంలో. తండ్రి ఎర్నెస్తో గువేరాలించ్, తల్లి సెలియాదలాసెర్నా. ఐరిష్ మూలాలుగల స్పానిష్ ఫ్యామిలీలో పుట్టాడు చే. వామపక్ష భావాలకు ప్రాధాన్యమిచ్చే కుటుంబం చేగువేరాది. తన కొడుకు నరనరాల్లో ప్రవహిస్తున్నది ఐరిష్ తిరుగుబాటుదారుల రక్తం.. అంటాడు చే తండ్రి. తొలినాళ్ళ నుంచే పేదలతో అనుబంధం. రాజకీయాలతో ఎడతెగని సంబంధాలు అధికం. ఆస్తమాతో బాధపడినా అథ్లెట్‌గా అద్భుతంగా రాణించేవాడు. ఈత, సాకర్, గోల్ఫ్, షూటింగ్ వంటి గేమ్స్ ఆడి ఆనందించడం అలవాటు. అలాగే అలుపులేని సైక్లిస్ట్, మంచి రగ్బీ ఆటగాడు కూడా. వీటన్నింటితో పాటు వారానికోసారి స్నానం చేసే అలవాటు అతడి సొంతం. విచిత్రమేంటంటే వారం పాటూ వేసుకున్న చొక్కానే వేసుకుని.. దాన్నెంతో గర్వంగా ఫీలవడం అతడి మేనరిజం. అందుకే పంది అనే అర్థం వచ్చేలా చాంచో అన్న మారు పేరుతో పిలుస్తారతని స్నేహితులు. వీటన్నింటికీ భిన్నంగా కవిత్వమంటే ఎంతో ఇష్టం చూపేవాడు.

- మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

656
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles