మెగాఫోన్ పక్కనపెట్టి.. తెరపై కనిపించి..


Sun,June 16, 2019 12:58 AM

Movie
కెమెరా.. యాక్షన్.. అంటూ మెగాఫోన్ పట్టుకుని చెప్పే డైరెక్టర్లు కొందరు ఇప్పుడు తెర వెనుక నుంచి.. తెర మీదకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు ఎస్.వి.కృష్ణారెడ్డి.. తనే దర్శకత్వం వహించి.. నటించేవారు.. ఇప్పుడు వేరే దర్శకులైనా పర్వాలేదు.. మేం నటనకు రెడీ అని చెప్పేస్తున్నారు ఈతరం దర్శకులు.. చిన్న చిన్న సీన్లల్లోనే కాదు.. కథను మలుపు తిప్పేలా..అవసరమైతే హీరో.. విలన్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానైనా.. ప్రేక్షకుల మెప్పు పొందేందుకు సిద్ధం అంటున్నారు.

క్రిష్

krish
తెర వెనుక ఉండి.. తెరపై ఎన్నో అద్భుతాలు చేయగల దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ. ఆయననే ముద్దుగా క్రిష్ అని పిలుచుకుంటారు. గమ్యం సినిమాతో వెరైటీ కాన్సెప్ట్ దర్శకుడు వచ్చాడని అనుకున్నారంతా. ఆ సినిమాలో తను కనిపించకుండా ఉండే ఒక రోల్‌ని చేశాడు. కానీ ఆ తర్వాత మహానటి సినిమాలో కె.వి.రెడ్డి పాత్రలో అద్భుతంగా నటించి ఆ నాటి దర్శకుడిని మరొక్కసారి గుర్తు చేశాడు. అదే పాత్రను తాను దర్శకత్వం వహించిన కథానాయకుడులో కూడా పోషించి మెప్పించాడు. మరి ఈ దర్శకుడు ఇంకెన్ని సినిమాల్లో కనిపించి తన నటనతో మెప్పిస్తాడో వేచి చూడాల్సిందే.

వి.వి.వినాయక్

VV-Vinayak
స్టార్ డైరెక్టర్‌గా పేరుంది వినాయక్‌కి. చిరంజీవి చాలా రోజుల తర్వాత సినిమా ఎంట్రీకి కూడా వినాయక్‌నే దర్శకుడిగా ఎంచుకున్నాడంటే అతడి స్టార్‌డమ్ ఊహించొచ్చు. ఠాగూర్, ఖైదీనంబర్ 150 సినిమాలో అలా వచ్చి, ఇలా వెళ్లిపోతాడు. ఫుల్‌లెంగ్త్ రోల్ ఇప్పటివరకు ఏ సినిమాలోనూ చేయలేదు. కానీ, ఇటీవల దిల్ రాజు ప్రొడక్షన్‌లో వి.వి.వినాయక్ హీరోగా పరిచయం కాబోతున్నాడని అనౌన్స్ చేశాడు. ఈ మాటలు నిజమేనని వినాయక్ కూడా ఒప్పుకొన్నాడు. త్వరలోనే ఆ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అదే కనుక నిజమైతే ఈ స్టార్ దర్శకుడు.. స్టార్ హీరోగా మారడం ఖాయమేనంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

ఎస్.జె.సూర్య

s-j-surya
ఖుషీతో ఒక ప్రభంజనాన్ని సృష్టించిన దర్శకుడు ఎస్.జె.సూర్య. ఆ తర్వాత నాని సినిమాతో తెలుగు తెరకు కొత్త కాన్సెస్ట్‌ని తీసుకొచ్చాడీ తమిళ దర్శకుడు. తెర వెనుకే కాదు.. తెర మీద కూడా తన సత్తా ఏంటో చూపిస్తానని నటుడిగా అవతారం ఎత్తాడు. అప్పుడప్పుడు తన సినిమాలో గెస్ట్ అప్పీరియరెన్స్ ఇచ్చిన ఈ దర్శకుడు ఇప్పుడు విలన్‌గా నటించేందుకు కూడా సిద్ధమైపోయాడు. మహేశ్‌బాబు స్పైడర్‌లో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇప్పుడు దర్శకత్వం చేయడం కంటే నటుడిగానే ఎక్కువ గుర్తింపు వస్తుందని, కొంతకాలం నటుడిగానే కొనసాగాలనుకుంటున్నాడు.

కాశీ విశ్వనాథ్

kasi-viswanath
ఈ నటుడు కూడా దర్శకుడేనా అని డౌటు వచ్చింది కదా నువ్వు లేక నేను లేను, తొలి చూపులోనే అనే సినిమాలు తీసి టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఏమైందో ఏమో కానీ.. నువ్విలా సినిమాతో రవిబాబు ఈ దర్శకుడిని కాస్త నటుడిని చేశాడు. ఆ తర్వాత ఈయనకు ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి. దాంతో దర్శకత్వాన్ని పూర్తిగా వదిలేసి నటుడిగా స్థిరపడిపోయాడు. ఎన్నో మంచి క్యారెక్టర్‌లు చేసి ప్రేక్షకుల మెప్పు సంపాదించాడు.

తరుణ్ భాస్కర్

tarun
తీసింది రెండు సినిమాలే. ఒక సినిమాకి జాతీయ స్థాయిలో గుర్తింపు. మరో సినిమాకి ప్రశంసల వెల్లువ. తరుణ్ భాస్కర్ మంచి దర్శకుడు అనే ముద్ర వేశారు ప్రేక్షకులు. తన నుంచి మరో సినిమా కోసం వేచి చూస్తున్న తరుణంలో నాలో నటుడు కూడాఉన్నాడు అని చెప్పేందుకు వచ్చాడీ దర్శకుడు. ఫలక్‌నుమాదాస్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. త్వరలో విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్‌లోని సినిమాలో కూడా నటుడిగా చేయబోతున్నట్లు సమాచారం. అదే కనుక జరిగితే ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడే కాదు.. మంచి నటుడు కూడా వచ్చాడని చెప్పుకోవాల్సిందే.

574
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles