నాన్నకు ప్రేమతో.. ప్రత్యేక బహుమతి!


Sun,June 16, 2019 12:55 AM

Fatherdayy
నాన్న.. ఈ రెండక్షరాల పదం.. ఒక తియ్యనైన అనుబంధం.. అమ్మాయిలకు ఒక గైడ్‌లా.. అబ్బాయిలకు ఒక స్నేహితుడిలా ముందుండి నడిపిస్తాడు.. అలుపెరుగని శ్రమజీవి ఆయన.. కుటుంబం కోసం కష్టాలనోర్చి..తన సంతోషాలను పక్కన పెట్టేస్తాడు.. మరి ఈ ఫాదర్స్ డే సందర్భంగా.. నాన్నకోసం ప్రత్యేక బహుమతుల లిస్ట్ ఇచ్చాం.. మీరు ఏది ఇచ్చినా అపురూపంగా భావించే తండ్రికి...ఈ రోజును మరింత ప్రత్యేకంగా జరుపండి..

ఫిట్‌నెస్ కోసం..

fit
నాన్న ఎక్కువగా నడువడం, పరుగెత్తడంలాంటి పనులు చేస్తాడా? ఆయనకు ఏమైనా ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్నాయా? అయితే.. ఆయనకు ఫిట్‌నెస్ ట్రాకర్‌లను కొనివ్వండి. ఫిట్‌బిట్, ఎమ్‌ఐలాంటి కంపెనీలు ఈ బ్యాండ్‌లు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఇవి గుండె స్పందన, ఎన్ని అడుగులు వేశారు, ఆ రోజుకు ఆయన శ్రమను గుర్తించి మరీ చెబుతాయి. ఇందులో కొన్ని వాటర్‌ప్రూఫ్‌లో కూడా వస్తున్నాయి. పడుకునేటప్పుడు కూడా దీన్ని ఉంచుకుంటే.. వారు ఎంతసేపు సరైన నిద్రపోతున్నారని కూడా గుర్తిస్తుంది. దీనివల్ల నాన్నకి సరైన విశ్రాంతి ఎలా ఇవ్వాలో ప్లాన్ చేయొచ్చు.

కలం.. బలం..

swiss-army-pen
తెల్లని చొక్కా వేసుకొని.. జేబులో ఒక పెన్నుతో కొందరు తమ నాన్నని చూసిన గుర్తులుంటాయి. మరీ ముఖ్యంగా ఊళ్లల్లో ఇలాంటి తండ్రులు ఎక్కువ మంది కనిపిస్తుంటారు. ఎన్నోసార్లు ఆ పెన్నును మనం తీసుకొని వాడుకున్న సందర్భాలు ఉంటాయి. మళ్లీ నాన్న అదే జేబులో మరో కొత్త పెన్నుకు స్థానం ఇచ్చినది కూడా గుర్తే ఉంటుంది. కానీ వయసుపడ్డాక పెన్ను గురించి ఆలోచించే తండ్రులు తక్కువే. అందుకే అలాంటి తండ్రులకు అందమైన ఒక పెన్నును గిఫ్ట్‌గా ఇవ్వండి. దాంతోపాటు ఒక నోట్ ప్యాడ్ కూడా చేతికిస్తే వారికంటే సంతోషించే వారు ఇంకెవ్వరూ ఉండరేమో! చిన్న బహుమతే అయినా.. ఎంతో సంతోషాన్ని ఇవ్వడం మాత్రం ఖాయం.

పజిల్ ప్రేమికులు..

crossword-gift-card
కొంతమందికి సండే పుస్తకాలలో పజిల్స్, సుడోకు వంటివాటిని పట్టుకొని గంటలు గంటలు గడిపేస్తారు. మీ నాన్న కూడా అదే కోవకు చెందిన వారే? ఇప్పటికీ ఆ ప్యాషన్ పోకపోతే మార్కెట్‌లో బోలెడ్ క్రాస్‌వర్డ్, సుడోకు పుస్తకాలు దొరుకుతాయి. అలాంటివి ఇవ్వొచ్చు. అలాగే ఫిక్షన్, నాన్ ఫిక్షన్‌కి చెందిన పుస్తకాలు కూడా తెలుగు, ఇంగ్లిష్ ఇలా వాళ్లకు నచ్చిన రచయితల పుస్తకాలయితే మరింత బెటర్. ఆ విధంగా ఆలోచించి బుక్‌ని మంచి ప్యాకింగ్ చేసి ఇవ్వండి. మీ నాన్న చాలా సంతోషిస్తారు.

డిన్నర్ డేట్..

Dinner-Date
చిన్నప్పుడు మీ నాన్న మిమ్మల్ని హోటల్స్‌కి తీసుకెళ్లి మీకు కావాల్సింది తినిపించుండొచ్చు. మీరు పెద్దయ్యాక కూడా ఎన్నోసార్లు వీకెండ్స్‌లో తీసుకెళ్లొచ్చు. కానీ ఈ రోజున ప్రత్యేకంగా ఒక టేబుల్ బుక్ చేసి డిన్నర్‌ని కేవలం నాన్నను తీసుకెళ్లి తిని చూడండి. తనకు నచ్చిన ఫుడ్, తనకు నచ్చిన రెస్టారెంట్‌లో పార్టీ ఇస్తే ఆయన కళ్లల్లో ఆనందం వెలకట్టలేనిదని చెప్పొచ్చు. వీలైతే తినడం అయ్యాకో.. అవ్వకముందో ఒక సినిమా కూడా చూపించండి. మీ నాన్న సంతోషం రెట్టింపవడం ఖాయం.

ప్రత్యేకంగా..

flowers
బహుమతంటే వస్తువు రూపంలోనే ఇవ్వాలని లేదు. ఒక చిన్న పువ్వు కూడా మీ నాన్నకు అపురూపం కావొచ్చు. ఎప్పుడూ మీకు తెలిసి ఒక్కసారైనా పువ్వు ఇవ్వకపోతే ఈసారి చిన్న బొకేని తయారు చేయించి ఇవ్వండి. అది కూడా తనకు నచ్చిన రంగు పూలను అందులో ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఈ పూలతో పాటు నాన్నకు నచ్చిన వైన్ బాటిల్ పెట్టిస్తే కచ్చితంగా ఆయన సంతోషానికి హద్దులండవు. దాంతోపాటు మీకు నాన్న మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పేలా ఒక లెటర్ జతచేయండి.

శ్రావ్యమైన సంగీతం..

Wireless-Speakers
మీ నాన్న టెకీనా? అయితే ఆయనకు స్పీకర్స్ కొనివ్వడం మంచి ఆప్షన్. ఐప్యాడ్, ఐపాడ్‌లాంటి కాస్లీ గిఫ్ట్‌లను కూడా బహుమతులుగా ఇవ్వొచ్చు. బడ్జెట్ ఎక్కువ అనుకుంటే మార్కెట్‌లో చిన్న చిన్న స్పీకర్లు వస్తున్నాయి. అలాగే గ్రామ్‌ఫోన్‌లాంటి టేప్‌రికార్డులు దొరుకుతున్నాయి. ఆ పాత మధురాలను వినడానికి పెద్ద పెద్ద క్యాసెట్లను తెచ్చి ఇవ్వచ్చు. లేదా మూలపడిన ఇలాంటి టేప్ రికార్డులను రిపేర్ చేయించి పాత జ్ఞాపకాలను కూడా తట్టి లేపొచ్చు. వారికి వాటితో ఎంతో అనుబంధం ఉండి ఉంటుంది కాబట్టి ఎంతో సంతోషపడుతారు.

ఇవి కూడా..

premium-blends-classic
కొన్ని వస్తువులు మనకు బహుమతులా అనిపించొచ్చు. కానీ మనం ఏది ఇచ్చినా నాన్నకు అది అపురూపమే అవుతుంది. అలా కొన్ని నాన్నకు ఇచ్చే బహుమతుల లిస్ట్ ఉంది. ఏదైనా ఒక ఊరికి టికెట్స్ బుక్ చేసి సర్‌ప్రైజ్ చేయొచ్చు. షేవింగ్ కిట్, రిస్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు ఇవ్వొచ్చు. ఇవికాకుండా షర్ట్‌లు, సంప్రదాయంగా ఉండేలా కుర్తాల గురించి ఆలోచించండి. నాన్నకు గడ్డం ఉందా? అయితే.. గడ్డం దువ్వుకోవడానికి సపరేట్‌గా బ్రష్‌లు వస్తున్నాయి. వాటిని కూడా బహుమతుల లిస్ట్‌లో చేర్చొచ్చు. సాయంత్రం పూట అలా వాకింగ్ తీసుకెళ్లి.. చల్లని ఐస్‌క్రీమ్ తినిపించొచ్చు. మనసుంటే ఎన్నో మార్గాలుంటాయి.

పాత జ్ఞాపకాలు

Cameo-detail
నాన్న ఒక అపురూపం. ఆయనతో గడిపిన క్షణాలు మనకు ఎంతో మధురం. ఆయనకు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నాన్నతో దిగిన ఫొటోలను ఒక దగ్గర చేర్చండి. వీలైతే మంచి ఆల్బమ్‌ని తయారు చేయండి. దాంట్లో ఆ ఫొటో ఎప్పుడు, ఏ సందర్భంలో దిగారో రాయండి. మీ స్వహస్తాలతో ఆ ఆల్బమ్ తయారు చేస్తే బెటర్. అంత సమయం లేదనుకుంటే ఆ ఫొటోలను మంచి ఆల్బమ్ తీసుకొని అందులో పెట్టేయండి. కోలార్జ్ చేసి కూడా ఇవ్వొచ్చు.

కూల్ ఫాదర్ కోసం..

ray-ban
మీ నాన్నకు ఇప్పటిదాకా ఫ్యాషన్ గురించి పెద్దగా తెలియదా? అయితే మీరు పరిచయం చేయండి. కలర్‌ఫుల్ టీషర్టులు, క్యాప్స్ అలాంటివి షాపింగ్ చేయండి. వాటితో పాటు కూలింగ్ గ్లాసులు కూడా తీసుకోండి. వీలైతే పార్లర్‌కి తీసుకెళ్లి మేకోవర్ చేయండి. సింపుల్ ఫాదర్‌ని.. చిల్ అయ్యేలా చేయండి. వాటితో పాటు నాన్నకు నచ్చిన కాఫీ మగ్, ఇతర పాత్రలను కూడా మార్చేయండి. కొంతమంది చాలాకాలం ఒకే వస్తువులను వాడుతుంటారు. వాటన్నిటినీ వీలైతే మార్చేయండి.

- సౌమ్య పలుస

783
Tags

More News

VIRAL NEWS