ఇది ఇంతేనా?


Sun,June 16, 2019 12:51 AM

చిన్నప్పటి నుండి నేను గమనించిన విషయాలు చాలా మంది పెళ్లి కాగానే తల్లిదండ్రులను పట్టించుకోరు అని అత్తింటి వారి వైపే ఉంటారని అలా ఉండటం తప్పని నేను అలా కాకూడదు అని, ఎలాగైనా అమ్మానాన్నలను మంచిగా చూసుకోవాలి అని ఇతరులు మనల్ని వేలెత్తి చూపకుండా బతకాలని ఆలోచించి ఊర్లోనే అమ్మానాన్నలకు ఇష్టం లేకున్నా ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. ఊర్లో ఉన్నన్ని రోజులు (సుమారు 8 సంవత్సరాలు) ఇంట్లో గొడవలు రాకుండా ఉండాలి అని ఎంత ప్రయత్నించినా, గొడవలు రాకుండా ఆపడం నా వల్ల కాలేదు. తల్లీ వినేది కాదు, భార్యా వినేది కాదు. ఇద్దరు చెప్పినవి వేరు వేరుగా న్యాయమే అనిపించినా సర్దుకోవాలే అంటే అట్లనా..! ఇయ్యాల.. నీ పెళ్ళాం చెప్పింది అని నన్నే సర్దుకో అనే కాడికి వచ్చినవా..! అంతేలే, పెళ్లి కాగానే పెళ్ళాం బెల్లం, తల్లి దయ్యం అని ఉండనే ఉండే..!! అని తల్లి అంటే.
Edi-inthena
ఆ..!! చెప్పినవ్ కాని తియ్యి.. అసొంటోనివి పెళ్లి ఎందుకు చేసుకున్నావ్..? తల్లి ఏది అంటే అది పడాలి అనా..? ఆమె ఎన్ని మాటలు అన్నా పర్వాలేదుగని నేను ఒక్కమాట అంటేనే వచ్చిందా..? అని భార్య అనేది.
సరే ఎలాగోలా సర్దుకుంటారు అనుకునేలోపే ఆడపడుచులు వచ్చినప్పుడల్లా ఏదో వంకపెట్టి అమ్మ తిట్టడం అది విని పక్కింటి వాళ్ళు మా అత్తగారికి చెప్పడం.. మా అత్తగారు గొడవ చెయ్యడం, ఆ గొడవ దృష్టిలో పెట్టుకుని నా భార్యని సాధించడం, అన్నం దగ్గర, పని దగ్గర చీటికి మాటికి ఏదోలా సతాయించి మానసిక క్షోభకు గురిచెయ్యడం. వీరిద్దరికీ చెప్పలేక నేను సతమతం అవ్వడం రోజు రోజుకూ సమస్య జఠిలం కావడంతో మిత్రుల సలహా మేరకు పట్నానికి వచ్చినం.
వచ్చినాక కొన్ని రోజులు గడిచినాక ఇద్దరిలో మార్పు వచ్చి మంచిగానే ఉన్నారు.
కాలం ఆగదు కదా..!! 20 సంవత్సరాలు గడిచి మా నాన్న గారు కాలంచెయడం. అమ్మ వృద్ధాప్యంలోకి వెళ్ళడం..
పట్నం రారాదే.. అంటే
నాకు శాతన అయినంత వరకూ ఇక్కడే ఉంట బిడ్డ.. అనడం. గత అనుభవం దృష్ట్యా నాకు కూడా దూరం ఉండటమే మంచిది అని అక్కడే ఉంచడం జరిగింది.
ఇప్పుడు సరిగ్గా 25 సంవత్సరాలు అయినాక అసలు సమస్య మొదలైంది. ఈ మధ్యనే ఊరు వెళ్లొచ్చిన మా మేనమామ నన్ను పిలిచి అరే బాబూ, ముసల్ది ఒక్కతే అక్కడ ఎలా ఉంటది అనుకున్నావ్ రా? మొన్న నేను పోతే ఏడవ పట్టింది. పోయి తీసుకరాపో.. ఎవడన్నా తల్లిని చూడరార బై..! అని అన్నాడు.
వాళ్ళకి(భార్య, తల్లి) అసలే పడదు మామయ్యా..!!
ఏ ఉర్కొరా బై, అత్తాకోడలు అన్నాక అనుకుంటరూ, కలిసిపోతరు. అవన్నీ పట్టించుకోవద్దు. పో.! పోయి తీసుకురాపో అని అన్నాడు.
నాకు కూడా నిజమే అనిపించి ఇంటికి వచ్చి ఇగో.! రేపు మా అమ్మని తీసుకుని వస్తున్నా..
అంటే. ఇన్ని రోజులు నేను వద్దు అంటేనే తీసుకుని రాలేదా..? నాకు చెప్తున్నావ్.!
ఎహే..! కాదు నేను డ్యూటీకి వెళ్తే ఇంట్లో ఉండేది మీరే కదా. అందుకని ముందుగా చెప్పి తీసుకుని వద్దాం అని.
కలిసి ఉండకపోతే ఎవల్ని అన్నా కొట్టినమా, తిట్టినమా..? నీ కథ ముద్దుగానే ఉన్నదీ..!!
అలా కాదు, ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. మొత్తమే చాతనకాకుండా ఉన్నదీ కాబట్టి అందరూ అనకముందే మనమే చూసుకోవాలే, మంచిగా చూసుకోవాలే. అట్లా అంటుంది ఇట్లా అంటుంది అంటే కలవది.
నువ్వు చెప్పేది ఎట్లున్నదంటే.. ఈ లోకంల అత్తకి గంజి పోయని దానిని నేనొక్కదాన్నే ఉన్నట్టు, నా అంత అజ్జకారిది లేనట్టుమాట్లాడుతున్నవ్.. పోపోయి తీసుకురాపో ఎట్లా అయితే గట్లా అయితది అని ఆ రోజు నుండే పక్కింట్లో వాళ్ళు పోతున్నారు అని డ్యూటీ చూసుకున్నది. నేను ఊరికి పోయి అమ్మని తీసుకుని వచ్చిన.
రెండు మూడు రోజులు మంచిగానే గడిచినాయి ఏ గొడవ లేకుండా. నాలుగో నాడు, డ్యూటీ నుండి వచ్చేసరికి అమ్మ పడుకుని ఉంది పక్కనే అన్నం కూర అలానే ఉన్నది. అది చూసి నేను అమ్మా.! అన్నం తినలేదానే? అని అడగగానే.
ఆ ! ఎందుకు తినలేదు, తింట గతి లేక నీ ఇంటికి వచ్చిన కదా. తినక సత్తనా..

అట్లంటవ్ ఏందే ! ఇది నీ ఇల్లు కాదా?
వామ్మో! నీ బాంచన్ బిడ్డో ! నా ఇల్లట నా ఇల్లు. గంత మంచిగా ఉంటె బాగానే ఉండు.
అరె ఏమైందే అసలు? అన్నం ఎక్కడిది అక్కడే ఉన్నదీ. తినబుద్ధి ఐతలేదా.
ఎందుకు తినబుద్ధి గాదు. ఓ బిచ్చపుదాన్ని వచ్చిన కదా! ఆడ పడేసిపోతే తినడానికి.
అదేమన్నా అన్నదానే?
నన్నేం అంటది.! మూతిట్లా ముక్కిట్లా పెట్టుకుని సప్పుడుజేకుండా ఆడ పెట్టి పోయింది. అత్తా ఇగో తిను. అంటేదాని బంగారం ఏమైనా కరిగిపోయినాది? హవ్వ ఎంత పాపపు బతుకాయె నాది. సావేట్లా ఒత్తదో గదా అని ఏడవ పట్టింది.
నీ యవ్వ నీకు అన్నీ తప్పులే కనపడుతాయి. తినమంటే ఏంది? అనకుంటే ఏంది? ఆకలైనప్పుడు తినాలెగని. దానిమీద అలిగితే నీకేమి లాభం!
నేనే అలిగిన్నా.దిక్కులేని దాని లెక్క తినాల్నా, నువ్వు కూడా అట్లనే అనబడితివి.
మరేం చేస్తావ్ చీటికి మాటికి లొల్లి అయతది అని నేనే మాట్లాడకు అని చెప్పిన.
అట్లానా, నువ్వు మాటే మాట్లాడకే దాన్ని కొట్టక, తిట్టక సావ గొడదాం ఎట్లా సత్తదో అని తీసుకొచ్చినావ్.?
సరే అది వచ్చినాక అడుగుతా కాని తిను అని అనగానే తిన్నది.
సాయంత్రం నాభార్య రాగానే, ఏమైంది! ఏమో తినమని చెప్పకుండానే పోయినవట.
అన్నీ అక్కడ పెట్టిన కదా ఇంకేం వచ్చింది?
అక్కడ పెడితే సరిపోతదా. చెప్తే నీకేమైనా ప్రాబ్లమా?
ఇప్పుడు మీరిద్దరూ కలిసి నన్నేం చెయ్యదలుచుకున్నరు?
అంటే, అడిగిన పాపానికి నిన్నేమైనా చేసుడేనా?
మరి ఇంకేంది నా అంత మంచిగా ఎవలర్సుకుంటరో సూపిద్దువు పా..!
బయట వాళ్ళకి ఏం తెలుస్తది ఇంట్లో నువ్వు సతాయించేది.

Edi-inthena1
మరి నేను చెప్తే నమ్మవైతివి మీ అమ్మకెల్లె మాట్లాడవడితివి, నిన్న శనివారం నేనట గుడ్డుకూర వండి పెట్టిన్నట. నా అసొంటి అమ్మ నీకు లేదానే అని నా శనివారం చేడగొట్టాలని చూసినావ్ అని ఏదో ఏదో ఒక్క తీరుగా తిట్టవట్టింది. ఇంతలో ఆ నిర్మలక్క ఇంకా భారతి వచ్చి ఓ పెద్దవ్వా.. అది గోబి పువ్వు కూర.

వామ్మో! నేను సతాయిస్తున్ననట పొద్దటి నుండి అవ్వ కొడుకు ఇంటి దగ్గరే ఉండి ఏం ఏం అనుకుంటాల్లో.!! ఏది పక్కింటి నిర్మలని అడుగుదాం పదా? నేను సరిగ్గా చూస్తలేను అనిపియ్యి నువ్వేం అంటే అది చేస్తా.
పక్కింటోల్లు, గిక్కింటోల్లు ఎవళ్ళు చెప్పరు. మనసులో ఉండాలి, ఎలా చూస్తున్నాం అనేది మన ఆత్మకి తెలవాలి.
అంటే నేను మంచిగా చూస్తలేను అనే కదా.! ఓ నిర్మలక్క, ఓ భారతి ఇగ రాండ్రి, నేనట మా అత్తను ఏమో చేస్తున్ననట జర చెప్పుదు రాండ్రి.
వాళ్ళు వస్తుంటే, ఎవ్వలీడోల్లు వాళ్లకు సపోర్ట్ చేస్తారు గని మీరేం చెప్పొద్దు. ఏదో యాల్లకు గింత ముసల్దానికి పెడితే అయిపోయేదానికి గింత అవసరమా?
అగొ! వాళ్ళోస్తుంటే వద్ధాంటవ్. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. నేను అర్సుకుంటలేనని ఎవైరితోనైనా అనిపియ్యు..?
సరే, మీ వదిన, మీ అమ్మా నాన్నలను సరిగ్గా అర్సుకుంటలేదు అంటివి కదా.? ఒక్కసారి అక్కడికి పోయి మీ ఇంటి పక్కన వాళ్ళతోటి అనిపిద్దువు పా..!
దాని ముందల ఎవరు చెప్తారు.? దాని నోరుకు భయపడి ఎవతి రాదు. వచ్చినా సెప్పదు. అయినా మా వదిన ముచ్చట నీకెందుకు.? మనం మనం అనుకోవాలి కాని.
మరి మనింటి విషయం కూడా మనం మనం అనుకోవాలి కానీ ఎవరెవరో చెప్తారు అని అనడం ఏంది?
మరి నేను చెప్తే నమ్మవైతివి మీ అమ్మకెల్లె మాట్లాడవడితివి, నిన్న శనివారం నేనట గుడ్డుకూర వండి పెట్టిన్నట. నా అసొంటి అమ్మ నీకు లేదానే అని నా శనివారం చేడగొట్టాలని చూసినావ్ అని ఏదో ఏదో ఒక్క తీరుగా తిట్టవట్టింది. ఇంతలో ఆ నిర్మలక్క ఇంకా భారతి వచ్చి ఓ పెద్దవ్వా.. అది గోబి పువ్వు కూర. కోడిగుడ్డు కాదు, కావాలి అంటే నీ కొడుకు వచ్చినంక అడుగు అన్నాక ఊకున్నది. అందుకే వాళ్ళని అడగమంటున్న.
ఓ బిడ్డా ! నేనుండరా? నన్ను తోలొద్దువుపార.! ఏదో శాతనయిన కాడికి వండుకుంట శాతగాన్నడు ఏ అవ్వనన్న గింతేయుండ్రని బతిలాడతా. నేనుండ బిడ్డ అని ఏడుపు అందుకుంది.
మరి అదేం కూరో తెల్సుకోకుండా ఎట్లా బడితే అట్లా నువ్వెందుకు తిట్టినవే..
ఏమో నా నోట్లే మన్నుబడ బిడ్డో.! నాది పొరపాటయిందని ఓ నవ్వబట్టిరి.. వాళ్ళ నవ్వులు గాదుపో ! నాకు ఉండబుద్ధి ఆయితలేదురా. నీ గురించి ఏమి చెప్ప, నా కొడుకు కోడలు మంచోళ్ళు నాకే ఉండబుద్ధి కాక వచ్చినని చెప్తా అని ఒక్కటే తీరుగా ఏడుస్తుంటే ఎంత ఖర్చు అయినా పర్లేదు అని అమ్మకి ఇష్టమైన ఊర్లోనే ఉంచడానికి సర్దుబాటు చెయ్యాలని నిర్ణయం తీసుకుని ఊర్లోదిగబెట్టి వచ్చా. ఎంత ఊర్లో దిగబెట్టి వచ్చినా, ఎంత దగ్గరి బంధం అయినా లోన దూరమైపోయింది అనే ఆవేదన అక్కడే మొదలైంది. అది అలానే మిగిలిపోయింది.

-మినుముల బిక్షపతి గౌడ్
-సెల్: 9290445146

497
Tags

More News

VIRAL NEWS