సేంద్రియ అన్న ప్రసాదం!


Sun,June 16, 2019 12:43 AM

పరబ్రహ్మ స్వరూపమైన అన్నం కలుషితమవుతున్నది. రసాయనాలతో పండిన పంటలు ఆరోగ్యాన్ని బుగ్గి చేస్తున్నాయి. కలుషితమవుతున్నదని తెలిసినా తినక తప్పని పరిస్థితి మనది. ఒక ఇంట్లో రసాయనాలతో పండించిన ఆహారం తింటే ఆ ఇంట్లోని వారు మాత్రమే అనారోగ్యం పాలవుతారు. అదే అన్నసత్రంలోనో, ఉచిత అన్నదాన కార్యక్రమంలోనో రసాయనాలతో పండిన ఆహారం పెడితే? తిన్నవారంతా అనారోగ్యం పాలవుతారు. అందుకని రోజుకు లక్ష మంది చేతులు కడిగే చోట సేంద్రియ ఉత్పత్తుల భోజనం పెడుతున్నది ఓ ఆలయం. ఆ ఆలయ కమిటీ తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది రైతులు ఉపాధి పొందుతున్నారు. ఆ ప్రసాదం తిన్న వారు ఆరోగ్యాన్ని కూడా పొందుతున్నారు. ఆ దేవాలయంలోని సేంద్రియ అన్న ప్రసాదం, రైతులకు ఉపాధి తదితర ముచ్చట్లు ఇవి..
golden
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో రోజూ లక్షమంది వరకు భోజనం చేస్తారు. ఇదివరకు వంటలకు కావాల్సిన కూరగాయలు, బియ్యం అమృత్‌సర్ సమీపంలోని పల్లెల నుంచి తీసుకొచ్చేవారు. పుచ్చిపోయిన, పాడైపోయిన కూరగాయలు ఏరి పారేయడానికి ఎక్కువ సమయం పట్టేది. కూరగాయలు కట్‌చేయగా, వండగా మిగిలిన అవశేషాలతో కూడా పర్యావరణానికి హాని జరిగేది. రైతులకు ఎన్నోసార్లు పంటల్లో రసాయనాలు వాడొద్దని చెప్పినప్పటికీ సాగులో రసాయనాల వాడకం తగ్గలేదు. 2016లో ఆలయ ఆవరణలో జరిగిన ఓ సమావేశంలో ఎస్‌జీపీసీ, ఆలయ కమిటీ, ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నది. ఎక్కడెక్కడో రసాయనాలతో పండించే పంటల వల్ల నష్టం తప్ప లాభం లేదని కమిటీ చర్చించింది. ప్రసాదాన్ని పూర్తి సేంద్రియ ఆహారంతో భక్తులకు అందించాలని నిర్ణయం తీసుకున్నది. వారం తర్వాత స్థానికంగా ఉన్న రైతులందరినీ సమావేశపరిచి తమ ఆలోచనను రైతులతో పంచుకుంది. కమిటీ నిర్ణయానికి రైతులు అంగీకరించడంతో సేంద్రియ సాగు మొదలైంది.

ఆచరణ ఇలా..

సిఖ్ వర్గీయులకు చెందిన శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ(ఎస్‌జీపీసీ) పంజాబ్‌తో పాటు హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లో ఉండే అన్ని గురుద్వారాలను పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీ అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ బాధ్యతలను కూడా చూస్తుంది. ఈ కమిటీ నిర్ణయం మేరకు 40 ఎకరాల విస్తీర్ణంలో పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు, పండ్లను పండిస్తున్నారు. మరో 300 ఎకరాల్లో రైతులతో సేంద్రియ సాగు చేయిస్తున్నారు. ఎస్‌జీపీసీ వారు రైతులకు పెట్టుబడి నుంచి మొదలుకొని పంట వేసినప్పటి నుంచి పంట కోత, రవాణా వరకు అన్ని పనులూ దగ్గరుండి చూసుకుంటారు.
Vonta

రైతులకు ఉపాధి, అవగాహన

ఆలయానికి సంబంధించిన భూములు బీడు పడడం ఇష్టం లేని ఆలయ కమిటీ స్థానికంగా కొంతమందికి ఉపాధి కల్పించాలనుకున్నది. భూమి లేని, ఉపాధి లేని రైతులను కమిటీ సభ్యులు గుర్తించారు. వారికి వ్యవసాయ నిపుణులతో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. 2016 జూన్ నుంచి ఆలయ భూముల్లో సేంద్రియ సాగును ప్రారంభించారు. ఆలయానికి సంబంధించిన 40 ఎకరాల్లో సేంద్రియ సాగు చేస్తున్నారు. స్థానిక రైతులకు చెందిన మరో 300 ఎకరాల్లో సేంద్రియ సాగు చేయిస్తున్నారు. గోమూత్రం, వేప ఆకులు, పేడతో సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేయాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఏమేం పండిస్తున్నారంటే?

క్యారెట్లు, క్యాబేజీ, పాలకూర, మెంతి ఆకులు, కొత్తిమీర, కీర దోస పండిస్తున్నారు. దాదాపు 20 క్వింటాళ్లకు పైగా ఆహారపదార్థాలను ప్రతి రెండు రోజులకు ఒకసారి గోల్డెన్ టెంపుల్ గురుద్వారాకు ఎస్‌జీపీసీ అధికారులు పంపిస్తున్నారు. పంజాబ్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఏఐసీ) ఎస్‌జీపీసీ ఆధ్వర్యంలో రైతులకు కృత్రిమ క్రిమిసంహారకాలకు బదులుగా ఆర్గానిక్ పద్ధతిలో సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. వేప ఆకు, ఆవు మూత్రం వంటి సహజ సిద్ధమైన పదార్థాలతో ఎరువులను తయారు చేయడంపై అవగాహన కల్పిస్తున్నారు.

సేంద్రియ బాటలో..

సేంద్రియ ఉత్పత్తులతో వంట చేసి భక్తుల ఆకలి తీర్చాలనే ఆలోచనలో దేశంలోని మరిన్ని ప్రముఖ ఆలయాలున్నాయి. ఆలయ భూములు అన్యాక్రాంతమవుతుండడం, వృథాగా ఉంటుండడంతో సేంద్రియ బాటలో నడవాలనే ఆలోచనలో ఈ ఆలయాల కమిటీ మెంబర్లు ఆలోచన చేస్తున్నారు. పూర్తి సేంద్రియ ఉత్పత్తులతో అక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తే పర్యావరణానికి, రైతులకు మేలు చేసినట్లు అవుతుందని భక్తులూ పేర్కొంటున్నారు.
Food

రోజుకు లక్ష మంది చేతులు కడుగుతారు..

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ గురుద్వారా అత్యంత పెద్ద వంటశాలగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. అక్కడ కుల, మత, వర్గ, ప్రాంత భేదాలు లేకుండా నిత్యం లక్షమందికి పైగా సందర్శకులకు ఉచితంగా భోజనం వడ్డిస్తున్నారు. ఇందుకోసం రోజూ 7 వేల కిలోల గోధుమ పిండి, 1200 కిలోల బియ్యం, 1300 కిలోల పప్పులతో పాటు ఆహారపదార్థాలను వాడుతారు. 450 మంది సిబ్బంది ఉన్నప్పటికీ వెయ్యి మందికి పైగా వలంటీర్లు సేవలందిస్తుంటారు. గోల్డెన్ టెంపుల్ సమీపంలో పది అన్న సత్రాలు ఉన్నాయి. అన్ని సత్రాల్లోనూ పంక్తి భోజనాలే ఉంటాయి. అందరూ కింద కూర్చొనే తినాల్సి ఉంటుంది. వీటిల్లో రోజుకు దాదాపు లక్ష మంది వరకు భోజనం చేస్తారు. మొత్తం వెయ్యికి పైగా సేవాదరులు రోజూ భక్తులకు సేవ చేస్తుంటారు.

302
Tags

More News

VIRAL NEWS