అద్దెకు ఆత్మీయత!


Sun,June 16, 2019 12:40 AM

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని కారల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడు. ఇప్పటి పరిస్థితులను అంచనా వేసి, ఆ కాలంలోనే చెప్పాడు ఆయన. మానవ సంబంధాల కంటే ఆర్థికపరమైన అంశాలకే మనుషులు ప్రాధాన్యం ఇస్తున్నారు. నేటి తరంలో ప్రేమానురాగాలు కనుమరుగవ్వడమేకాకుండా, వారి మధ్య సంబంధాలు బలహీన పడుతున్నాయి. ఒకప్పుడు బంధాలు, అనుబంధాలకు మనుషులు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు ఎక్కువగా మేకప్ ప్రేమలే కనిపిస్తున్నాయి. జపాన్‌కు చెందిన ఓ సంస్థ ఆత్మీయతను పంచేందుకు వినూత్న ప్రయత్నం చేస్తున్నది. ఆప్యాయంగా పలుకరించే బంధువులను, స్నేహితులను అద్దెకు ఇస్తున్నది.
dada
జపాన్‌లో ఫ్యామిలీ రొమాన్స్ పేరుతో ఇషీ యుచి ఒక సంస్థను నడుపుతున్నాడు. తల్లిదండ్రులను, స్నేహితులను, బంధువులను ఆ సంస్థ అద్దెకు ఇస్తుంది. ఈ సంస్థలో 2,200 మంది ఉద్యోగులు ఉన్నారు. వారు ప్రమాదాలలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు, కుటుంబ కలహాలతో విడిపోయిన వారికి, ఇతర కారణాలతో ఆత్మీయులను కోల్పోయిన వారికి ఆయా ప్రేమలను పంచుతారు. తల్లి, తండ్రి, తమ్ముడు, సోదరి, సోదరుడి, బాబాయి, మామయ్య, అత్త, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ ఇలా ఏ పాత్ర కావాలంటే ఆ పాత్రను పోషిస్తారు. కుటుంబంలోని ఎటువంటి పాత్రలోనైనా లీనమై ఆ పాత్రకు సంబంధించిన ప్రేమను పంచుతారు. అలా వ్యవహరించినందుకు డబ్బులు తీసుకుంటారు.

ప్రొఫెషనల్‌గా సేవలు అందించేందుకు..

ఫ్యామిలీ రొమాన్స్ సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన నాకు 14 ఏండ్ల క్రితం వచ్చింది. అందుకు కారణం ఇషీ స్నేహితురాలికి ఎదురైన ఒక సమస్యే. ఓసారి ఇషీ స్నేహితురాలు తన కొడుకుని ఓ ప్రైవేటు స్కూల్లో చేర్పించేందుకు తీసుకెళ్లింది. అయితే, పిల్లవాడితో పాటు అతని తల్లిదండ్రులు ఇద్దరూ రావాలని ఆ స్కూలు వాళ్లు చెప్పారు. ఆమె ఒంటరి మహిళ. దాంతో తప్పని పరిస్థితిలో తనకు భర్తగా నటిస్తూ మొదటిసారిగా ఇషీ వెళ్లి ఆ అబ్బాయికి నాన్నగా నటించాడు. ఆ సమయంలో ఆ బాలుడు ఇషీ ఒకే కుటుంబసభ్యులుగా సరిగా నటించలేకపోయారు. అప్పుడే ఇటువంటి ఇబ్బందులు పడేవారికి ప్రొఫెషనల్ సేవలు అందిస్తే బాగుంటుందనే ఆలోచన ఇషీకి కలిగింది. ఆ ఆలోచన నుంచే ఫ్యామిలీ రొమాన్స్ సంస్థ పుట్టుకొచ్చింది. ఈ సంస్థలో అద్దెకు దొరికే పాత్రలు పేరుకే నకిలీ బంధువు, కానీ ఆ నాలుగు గంటల పాటు సొంత కుటుంబ సభ్యుడిగా, ఒరిజినల్‌గా ఆత్మీయతను పంచుతుంటారు. ప్రాణస్నేహితుడిగా వ్యవహరిస్తారు.
yushi-sing
ఆయా పాత్రల్లో లీనమయ్యేలా ఫ్యామిలీ రొమాన్స్ సంస్థలో పనిచేసే వారికి శిక్షణ ఇస్తున్నాడు ఇషీ. కొందరు తమకు జీవిత భాగస్వామిగా నటించే వ్యక్తి కావాలంటూ వస్తారు. అందుకు వారి ఎత్తు, వయసుకు తగ్గట్టుగా ఉండే పురుషుడు లేదా మహిళను ఈ సంస్థ ఎంపిక చేసి పంపిస్తుంది. తమకు స్నేహితులు లేరని బాధపడేవారు కూడా ఈ సంస్థ నుంచి స్నేహితులను అద్దెకు తీసుకోవచ్చు. స్నేహితులుగా ఉండేవారు కూడా వారికి ఎంతో కాలంగా స్నేహితులం అన్నట్లుగా నడుచుకుంటారు. కలిసి షాపింగ్‌కు వెళ్తారు. సరదాగా చాటింగ్ చేస్తారు. నైట్ పార్టీల్లో కూడా పాల్గొంటారు. కొందరు వృద్ధులు తమకు కొడుకులు, కోడళ్లు, బిడ్డలు, మనవలు, మనవరాండ్లు అద్దెకు కావాలంటూ ఫ్యామిలీ రొమాన్స్ సంస్థను ఆశ్రయిస్తారు. ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో ఒక్కో వ్యక్తి గరిష్ఠంగా ఐదు కుటుంబాల్లో సభ్యుడిగా ఉండొచ్చు.

కానీ, ఇషీ తానే ఆ సంస్థను స్థాపించారు కాబట్టి ఆయన 25 కుటుంబాలలో అద్దె సభ్యుడిగా నటిస్తున్నాడు. ఆ 25 కుటుంబాలకు చెందిన మొత్తం 35 మంది పిల్లలు ఇషీని తమ సొంత తండ్రిగా భావిస్తారు. ఆ కుటుంబాల తరఫున ఆయనకు 69 నకిలీ బంధుత్వాలు ఉన్నాయి. ఒక్కో కుటుంబం వద్దకు వెళ్తున్నప్పుడు ఇషీ ఆ కుటుంబ సభ్యుల వివరాలన్నీ రాసి ఉన్న నోట్‌బుక్‌ను వెంట తీసుకెళతాడు. అప్పుడప్పుడు కొందరు పిల్లల ముద్దు పేర్లను మరచిపోతుంటాడు. అలాంటప్పుడు వెంటనే బాత్రూంలోకి వెళ్లి నోట్‌బుక్‌లో చూసుకుని వారితో కలిసిపోతాడు ఇషీ. ఈ నకిలీ బంధుత్వాల కారణంగా తన సొంత బంధుత్వాలపై ఎలాంటి ప్రభావం లేదని ఆయన అంటున్నాడు. విశేషమేమిటంటే ఇషీ అసలు వివాహమే చేసుకోలేదు.
yuichi-ishii
ఇకముందు వివాహం చేసుకోనని చెబుతున్నాడు. తాను పెళ్లి చేసుకుని సొంత కుటుంబాన్ని ప్రారంభిస్తే, ఆ 25 కుటుంబాల పిల్లలతో తనకున్న అనుబంధం దెబ్బతింటుందేమోనని పెండ్లి మానేశాడు. ఈ సంస్థ ఉద్యోగులతోపాటు వినియోగదారులకు కొన్ని కఠినమైన షరతులు ఉంటాయి. వారు చేతిలో చేయి వేయొచ్చు. కానీ, ముద్దు పెట్టుకోకూడదు, శృంగారంలో పాల్గొనకూడదు. ఈ సంస్థ మొత్తం 30 రకాల సేవలు అందిస్తుంది. అందులో ఒక్కో సేవకు ప్రత్యేకంగా నియమ నిబంధనలు ఉంటాయి. వినియోగదారులు నాలుగు గంటలకు రూ. 12,800 ఉంటుంది. ప్రయాణం, ఆహార ఖర్చులు అదనం. జపాన్‌లో ఏటా దాదాపు 2 లక్షల జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. తండ్రి లేదా తల్లి ఎవరో ఒకరు మాత్రమే కలిగిన కుటుంబాలు ఏటా భారీగా పెరిగిపోతున్నాయి. అటువంటి వారికి ఇప్పుడు ఫ్యామిలీ రొమాన్స్ సేవలందిస్తున్నది.

ఎంత నటించినా, సొంత కుటుంబ సభ్యుడు లేని లోటును మాత్రం ఎవరూ పూడ్చలేరు. కొద్దిసేపు నటించినా, ఆ పాత్ర కు సంబంధించిన ఒరిజినల్ ప్రేమనే పంచుతారు. అందుకే తక్కువ సమయంలో వారు పంచే ఆప్యాతకు చాలామంది కనెక్ట్ అయిపోతుంటారు.

282
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles