చైతన్యపు స్వరాలు.. మేరీ జిందగీ


Sun,June 16, 2019 12:37 AM

వారి పాటలో చైతన్యపు లయలు ఉంటాయి. ఉద్యమాల సెగలుంటాయి. వారి సప్త స్వరాల్లో ఉత్తేజాన్ని నింపే విద్వత్తుంటుంది. ఆ సరిగమల్లో పొదిగిన ఉద్వేగపు మాధుర్యం కనిపిస్తుంది. స్టేజీ మీద నుంచో, వీధుల్లో నుంచో వినిపించే వారి గొంతుల్లో ఆర్ధ్రత మనసుని మెలిపెడుతుంది. నిజజీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను అర్థవంతపు అక్షరాలుగా మలిచి ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లో ఆమోదయోగ్యమైన కళారూపం రాక్ బ్యాండ్ ద్వారా సమాజంలో ముఖ్యంగా మహిళల్లో నిత్య చైతన్య దీప్తిని వెలిగిస్తున్నారు. వారే మేరీ జిందగీ- ఫిమేల్ రాక్ బ్యాండ్ బృందం సభ్యులు.
Singer
వేదిక : అరాయిల్ ఘాట్
సందర్భం : కుంభమేళా సంగీత
కార్యక్రమం
ప్రాంతం : ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్.
అంతా సిద్ధంగా ఉంది. సుమారు 300 మందికి పైగా ఆడిటోరియంలో వేచి చూస్తున్నారు. కుంభమేళా వద్ద పూజారుల మృదువైన పఠనం. వెంటనే మైక్ చెక్‌లు. ఆలస్యంగా వచ్చిన వారంతా నిల్చుని ఉన్నారు. స్టేజీ మీదకు వస్తున్న టీం పేరు అనౌన్స్ అయింది. ప్రేక్షకులంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ అరుపుల మధ్య నుంచి ఒక గిటార్ చప్పుడు, స్ట్రోబ్ లైట్ ఫ్లాష్, డ్రమ్ రోల్స్ ఒక్కసారిగా మార్మోగాయి. స్టేజీకి రెండు వైపులా ఉన్న పెద్దపెద్ద ఎల్‌సీడీల్లో, వేదిక మీద నిల్చున్న టీం స్పష్టంగా కనిపించడం ప్రారంభమైంది. కెమెరాలు రోల్ అవుతున్నాయి. ప్రేక్షకులు వేచి ఉండడం పూర్తి అయింది. ఎలక్ట్రానిక్ గిటార్లు, సింథసైజర్, డ్రమ్స్, ఒకే రకమైన రంగు దుస్తులు... అందరూ మహిళలే.. మేరీ జిందగీ - ఉమెన్స్ రాక్ బ్యాండ్ దాని పనితీరును ప్రారంభించింది.

ఇదొక సాధారణ పర్ఫామెన్స్ కాదు. సాధారణ బ్యాండ్ అంతకన్నా కాదు. అంతాపూర్తయే సరికి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. మేరీ జిందగీ ఇది మహిళల రాక్ బ్యాండ్. ఉత్తరప్రదేశ్‌లో పేరు గాంచిన టీమ్. కేవలం మహిళల కోసం, మహిళా చైతన్యం కోసం ఈ రాక్‌బ్యాండ్ పాడుతుంది. లింగ వివక్ష రూపు మాపడానికి కృషి చేస్తున్నది. సమానత్వం కోసం కొట్లాడుతుంది. కుంభమేళాలో వారి ప్రదర్శనలో ప్రధానంగా బాల్యవివాహాల నివారణ గురించి అవగాహన పెంచడంపై దృష్టి పెట్టింది. ఉత్తరప్రదేశ్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరు వధువు. చిన్న వయస్సులో వివాహం జరిగితే ఆమె ఆంక్షలు, కలలు అన్నీ మరణిస్తయి. కాబట్టి మా పాటల ద్వారా, మా బ్యాండ్ ద్వారా అవగాహన కల్పిస్తాం, ఈ తీరును ప్రశ్నిస్తాం అంటున్నారు మేరీ జిందగీ వ్యవస్థాపకురాలు జయ తివారి.

అలా ప్రారంభం

జయ తివారి సంగీతంలో పీహెచ్‌డీ చేసింది. ఐదేండ్లు రేడియో జాకీగా పని చేసింది. ఉత్తరప్రదేశ్‌లో మహిళల సాధికారత, బాల్య వివాహాలు ఆమె మనసును మెలిపెట్టాయి. సమాజానికి తన మ్యూజిక్‌ను అంకితం ఇవ్వాలనుకుంది. 2010లో మేరీ జిందగీ ప్రారంభించింది. కానీ అది మొదట్లో పడిపోయింది. తొలుత తోడు వచ్చిన వారంతా వెనుకడుగు వేశారు. చివరికి అది కొనసాగించలేని పరిస్థితులు వచ్చాయి. కానీ అనేక సంఘర్షణల తర్వాత దీన్ని మళ్లీ ప్రారంభించాలనుకుంది జయ. 2013లో మరో ముగ్గురి అమ్మాయిలతో ప్రారంభించింది. వ్యక్తిగత కారణాలు, కుటుంబం నుంచి ఒత్తిడి వారిని వేధించాయి. చివరకు వారూ మానేశారు. కొన్నాళ్లకు మరో నలుగురు మహిళలు టీంలో చేరారు. జయతో పాటు కొనసాగుతున్నారు. వారిలో నిహారికా సింథసైజర్ ప్లే చేస్తుంది. పూర్వీ యువతి గిటార్ మీటుతుంది. అనామిక డ్రమ్ ప్లేయర్, సౌభాగ్య వోకలిస్ట్. అందరూ కలిసి అద్భుతమైన సంగీతాన్ని రూపొందిస్తారు. పింక్ కుర్తాలు, చీరలు వారికి ఆకర్షణీయ వస్త్రధారణ.
band1

ఇలా సాగుతున్నది..

టీమ్‌లో నలుగురు సభ్యులున్నారు. అందరికీ జయనే దగ్గరుండి సంగీతంపై నేర్పుతుంది. వీరితో పాటు సంగీతం ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరినీ ఆమె ఆహ్వానిస్తుంది. మేరీ జిందగీలో అందరికన్న చిన్న వయస్కురాలు నిహారికా. అమెకు పదిహేడేండ్లు. స్కూల్‌కు వెళ్తుంది. ఎనిమిదేండ్ల వయస్సు నుంచే ఆమెకు సంగీతం అలవాటు. ఆమెను గుర్తించిన జయ టీమ్‌లోకి ఆహ్వానించింది. అట్లాగే నిహారికా యువతి జయ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్న విద్యార్థిని.
ఇట్లా అవాంతరాలను తొలగించుకుంటూ మేరీ జిందగీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకూ 70 పాటలకు పైగా కంపోజ్ చేశారు. వందకు పైగా షోలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని రూరల్, అర్బన్ ప్రాంతాల్లోనూ వీరు ప్రదర్శనలిస్తారు. ఆల్‌ఇండియా రేడియో, ఉత్తరప్రదేశ్ మహిళా పోలీస్, గురుగావ్ కి అవాజ్, ఉమెన్ పవర్ లైన్ వంటి కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారు. అట్లాగే తాము సొంతంగా సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ధుమపాన వ్యతిరేకం, వరకట్న నిషేధం వంటి క్యాంపెయిన్‌లు నిర్వహిస్తున్నారు.
మేము లేవనెత్తుతున్న సమస్యలు కేవలం మహిళలనే కాదు. పురుషులనూ ప్రభావితం చేస్తున్నాయి. అందుకే మాకు పురుషుల నుంచి కూడా మద్దతు వస్తుంది. చివరగా లింగ వివక్ష తొలగించడం మా కర్తవ్యం. వివక్ష అనేది ఒక వర్గం నుంచి ఒక వర్గానికి వెళ్లడం కాదు దాన్ని పూర్తిగా రూపు మాపాలి అంటున్నది జయ..

291
Tags

More News

VIRAL NEWS