ఈ కోటీశ్వరుడు..ఒకప్పుడు రిక్షా కార్మికుడు!


Sun,June 16, 2019 12:31 AM

Dharam-Veer-Sing
అనుకోకుండా జరిగిన ప్రమాదం ఈ వ్యక్తి జీవితాన్ని మార్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఓ పారిశ్రామిక వేత్తగా మార్చి, కోటీశ్వరుడ్ని చేసింది. కారణం ఒక ఆలోచన.. అందుకు తగిన ఆచరణ. ఎలాగైనా నిలదొక్కుకోవాలన్న కసి. తోటి రైతులను ఆదుకోవాలన్న తపన ఇతన్ని ఉన్నత స్థితిలో నిలబెట్టాయి.

అది 2003వ సంవత్సరం. రాజధాని ఢిల్లీ అప్పుడప్పుడే అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నది. ఢిల్లీ, హర్యానా సరిహద్దు ప్రాంతం నుంచి ఢిల్లీకి వలస వచ్చింది ధరమ్ వీర్‌సింగ్ కుటుంబం. ఐదుగురు తోబుట్టువుల్లో చిన్నవాడు. బతుకుబండిని లాగేందుకు రిక్షా తొక్కడం ప్రారంభించాడు. రాత్రనక పగలనక మోకాళ్లు అరిగే వరకూ మూడు చక్రాల బండిని నడిపాడు. జీవితం సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో పెద్ద కుదుపు. అప్పుడప్పుడే పరుచుకుంటున్న చీకటిలో ప్రమాదం జరిగింది. ధరమ్ వీర్ కాలు విరిగింది. దీంతో వారి కుటుంబాన్ని కష్టాల చీకట్లు కమ్మేశాయి. మళ్లీ ఢిల్లీ నుంచి హర్యానాకు మూటముల్లె సర్దుకొని వచ్చేశారు. కలబంద వైద్యంతో కాలు నయం చేసుకున్నాడు ధరమ్‌వీర్. తర్వాత ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం మొదలు పెట్టాడు. ఆదర్శ రైతుగా ఎంపికై, హర్యానా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని పంటల క్షేత్ర పరిశీలనకు ఎంపికయ్యాడు.

జీవితాన్ని మార్చిన రోజలవి

2004లో స్థానిక రైతులతో కలిసి రాజస్థాన్‌లో పంటల పరిశీలనకు పయనమయ్యాడు ధరమ్ వీర్. అక్కడ అలొవెరా, ఉసిరికాయ ప్రాసెసింగ్ యూనిట్ అతన్ని ఎంతగానో ఆకర్షించింది. భవిష్యత్‌లో కలబంద, ఉసిరికి మంచి డిమాండ్ ఉంటుందని అప్పుడే పసిగట్టాడు ధరమ్. వాటి లాభనష్టాల గురించి స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నాడు. పంట పండించడం ఒక ఎత్తయితే.. వాటిని ప్రాసెసింగ్ చేసి, అమ్మడం మరొక ఎత్తని గ్రహించాడు. అప్పట్లో ఉసిరి, కలబంద వ్యాపారం చాలా లాభదాయకంగా ఉండడంతో దానిపై ఆసక్తి కలిగింది. ప్రాసెసింగ్ యూనిట్ ధర చాలా ఎక్కువగా ఉండడంతో ఒకడుగు వెనక్కి వేశాడు.
Dharam-Veer-Sing1

వంద అడుగులు ముందుకు..

ధరమ్ వీర్‌సింగ్ ఆ రోజు ఒక్క అడుగు వెనక్కేసినా.. తన సొంత ఆలోచనతో వందల అడుగులు విజయంవైపు వేశాడు. కలబంద, ఉసిరి ప్రాసెసింగ్‌కు తక్కువ ఖర్చుతో ఓ యంత్రాన్ని స్వయంగా తయారు చెయ్యాలనుకున్నాడు. ఒక్క కలబంద, ఉసిరి ప్రాసెసింగే కాకుండా.. అన్ని రకాల పంటలకు ఉపయోగపడే యంత్రం కోసం రేయింబవళ్లు ఆలోచన చేశాడు. పాత యంత్రాలను పరిశీలించాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడడు. చివరికి అద్భుతమైన యంత్రాన్ని కనుగొన్నాడు. ఏప్రిల్ 2006 నాటికి ధరమ్ వీర్ ప్రధానంగా కలబంద రసం తీయడానికి ఉపయోగ పడే ఒక యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చాడు. ఆ తరువాత అదే యంత్రాన్ని ఆధునీకరించి అనేక మూలికలు, వ్యవసాయ ఉత్పత్తులు ప్రాసెస్ చేసే విధంగా తయారు చేశారు. కనుగొన్నది ఒక్కటే యంత్రమైనా అది బహుళ ప్రయోజనాలు ఇవ్వాలని ఆ రోజు నిర్ణయించుకున్నాడు ధరమ్ వీర్‌సింగ్.

ఎన్నో ప్రయోజనాలు!

ధరమ్ వీర్ తయారు చేసిన బహుళ ప్రయోజన యంత్రం పోర్టబుల్ మెషిన్ సింగిల్ ఫేజ్ మోటార్‌తో నడుస్తుంది. అనేక రకాల పళ్ళు, మూలికలు, విత్తనాలు ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనిలో ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే ఫీచర్ కూడా ఉన్నది. వైద్య పరమైన మొక్కలు, పూలు గుజ్జు చేసి.. రసాన్ని, గుజ్జును వేరుచేసే ఫీచర్ కూడా ఉన్నది. ఇది ఎలక్ట్రిక్ మోటారు సహాయంతో నడుస్తుంది. ఈ యంత్రానికి ఒక ఆయిల్ జాకెట్ కూడా ఉంటుంది. దీనివల్ల మూలికలు వేడి కాకుండా ఉంటాయి. అనేక రకాల కూరగాయలు, పండ్లు ఎలాంటి డామేజ్‌కు గురి కాకుండా ప్రాసెస్ చేసే సమర్థత దీనికి ఉంది. ఈ యంత్రం ద్వారా మామిడి, ఉసిరి, కలబంద, తులసి, అశ్వగంధ, గులాబీ, చమేలి, లావెండర్ పూలు ప్రాసెస్ చేయవచ్చు. ప్రస్తుతం మూడు రకాల్లో ఈ యంత్రాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి.

ఏటా రూ.40 లక్షల టర్నోవర్

తన కష్టంతో, స్వయంకృషితో రిక్షా కార్మికుడిగా ఉన్న ధరమ్ వీర్‌సింగ్ విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. ఏటా రూ.40 లక్షల టర్నోవర్ కలిగిన పరిశ్రమను నెలకొల్పాడు. ప్రస్తుతం తానే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు. వచ్చిన పంటను తానే ప్రాసెసింగ్ చేసి, నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్‌లో విక్రయిస్తున్నాడు. ఈ ప్రయాణంలో ఎన్నో అవార్డులు అందుకున్నాడు ధరమ్ వీర్‌సింగ్. కొత్త ఆవిష్కరణలకు గాను హర్యానా ప్రభుత్వం ఇచ్చే నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అవార్డు అందుకున్నాడు. తన యంత్రానికి పేటెంట్ రావడంతో ఏటా 50 యంత్రాలు అమ్ముతున్నాడు. ఒక్కో యంత్రం రూ. లక్షన్నర ఖరీదు చేస్తుంది. ఎలాంటి ప్రచారం చేయకుండానే ఇతర దేశాలకు తన యంత్రాలను అమ్ముతున్నాడు ధరమ్ వీర్‌సింగ్. తన గ్రామంలో మహిళలకు ఈ ప్రాసెసింగ్ యంత్రం ద్వారా ఉపాధి చూపిస్తున్నాడు. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుట్టినరోజు సందర్భంగా 11 డిసెంబర్ 2013 న ప్రారంభించిన ఇన్వెంటర్ ఇన్ రెసిడెన్స్ కింద అవార్డు పొందిన ఐదుగురిలో ధరమ్ వీర్ ఒకడు. ఈయన 2014 జూలై 1 నుంచి జూలై 20 వరకూ రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి భవనంలో ఉన్నారు. ఇదీ రిక్షా కార్మికుడి నుండి వ్యాపారవేత్తగా ఎదిగిన ధరం వీర్‌సింగ్ స్ఫూర్తిదాయక కథ.

334
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles